వెనుకటి వెండితెర-9

చక్రపాణి (1954)

-ఇంద్రగంటి జానకీబాల

            మనిషి జీవితంలో హాస్య రసానికి ఒక ప్రధానమైన పాత్ర ఉంది. రకరకాల సమస్యలతో బాధలతో, ఇబ్బందులతో విసిగి పోయినపుడు, కాస్తంత హాయిగా నవ్వుకుంటే బాగుండుననిపిస్తుంది  ఎవరికైనా. కానీ అది తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు అలవోకగా వచ్చి, ఆనందంగా నవ్వుకునేలా చెయ్యాలి. అలా సహజంగా ఉన్నన్నప్పుడే అది మనసుల్ని తేలిక పరుస్తుంది.

            భరణీ వారి మొదటి చిత్రం రత్నమాల. తర్వాత లైలామజ్ను, ప్రేమ, చండీరాణీ లాంటి చిత్రాల నిర్మాణం అయ్యాక భానుమతికి హాస్యరసభరితమైన సినిమా తీయాలనీ ఆలోచన వచ్చింది. ఆమెకి స్వభావంగా హాస్యం, వ్యంగ్యం, వేళాకోళం చేసి పారేయడం లాంటి సన్నివేశాలు యిష్టం. అందుకే ఆమె హాస్యం రచించటంలోనూ ఎంతో ప్రతిభ చూపారు. అతి కొద్ది మంది తెలుగు హాస్య రచయిత్రులలో నంబర్ వన్ గా నిలిచారు. భానుమతి ప్రధానంగా గొప్ప సంగీతజ్ఞురాలు, గొప్ప గాయకురాలు. తర్వాత నటి, అందగత్తె —, మరీ ముందుకు నడిచాక దర్శకురాలు—సంగీత దర్శకురాలు నిర్మాత కూడా అయ్యారు.

            ఆమె భరణీపిక్చర్ బ్యానర్ మీద చక్కని హాస్యచిత్రం నిర్మించాలని నిర్ణయంచుకున్నారు—దానిపేరు ‘చక్రపాణి ’—ఈ సినిమాకి కథ మాటలు శ్రీరావూరి సత్యనారాయిణరావు వ్రాశారు —దర్శకత్వం—స్క్రీన్ ప్లే పి.  రామకృష్ణ తయారు చేసుకున్నారు—ప్రధాన పాత్రలు పి. భానుమతి, అక్కినేని నాగేశ్వరరావు, చక్రపాణిగా     సి. ఎస్.ఆర్ ఆంజనేయులు నటించారు. ఇంకా ఇందులో వంగర, టి.జి.కమలాదేవి, అమర్ నాథ్—సూర్యకాంతం, ఛాయాదేవి, శివరామకృష్ణయ్య మొదలైన ఆనాటి మేటి నటులందరూ ఉన్నారు. అంతా సినిమాలో నవ్వులుపువ్వులు పూయించారు. సంగీతం నిర్వహించిన భానుమతి చక్కని శాస్త్రీయ సంగీతకృతులు పాడారు. ఒకటి త్యాగరాజకీర్తన ‘పక్కల నిలబడి’, రెండోది దీక్షితుల వారి కీర్తన మీనాక్షీమేముదం— 

            కథలో సమస్య కాస్త గంభీరమైనదే అయినా కథనం నడిచే తీరు హాస్యంతో ఆహ్లాదంగా ఉంటుంది —   చక్రపాణి గారికి చెట్టంత కొడుకుపోయి, కోడలు, ముగ్గురు మనవరాళ్లు, ఒక మనవడు మిగులుతారు. వీరి పోషణ భారం ఆ ముసలితాత మీద పడుతుంది. స్వభావంగా డబ్బు గట్టి మనిషి. మనవలు ఆయన పిసినారితనం వల్ల చిరాకుపడుతూ ఉంటారు. ఒక లక్ష రూపాయలు కూడబెట్టి మునిమనవడికి ఇచ్చి ముక్తి పొందాలని ఆయన ఆశ. అయితే ఎవ్వరికీ వివాహాలు కాలేదు. పిల్లలు లేరు. రెండో పిల్ల మాలతి(భానుమతి) గడుసు, ధైర్యం, లెక్కలేనితనం గల అమ్మాయి. మొదటి పిల్లకి రెండో పెళ్లివాడినీ,—మాలతికి డబ్బుగల మూగవాడినీ నిశ్చయించి పెళ్ళి చేయిబోతే, మాలతి పెళ్ళికూతురుగా పారిపోయి రైలెక్కేస్తుంది. అందులో ఛాయాదేవీ, భర్త కలిసి, ఆమెని ఆదరించి వారి తో తీసుకుపోతారు. ఆ ఛాయాదేవి తమ్ముడిగా నాగేశ్వర్రావు పరిచయం—కథ నడుస్తుంది.

            సినిమాలో చక్కని నవ్వు తెప్పించే మాటలు—చెవులకు ఇంపైన సంగీతం ప్రేక్షకుల్ని అలరిస్తాయి— ఎదురింటి పిల్లాడ్ని చూపించి తను లక్ష రూపాయలు తీసుకుందామని ప్లాన్ వేసిన మాలతి—ఆ ఎదురింటి పిల్లాడు అన్నగారి కొడుకని  గ్రహించి నాటకం రాణింపజేస్తుంది—సినిమా టైటిల్స్ ని ‘రఘువంశ సుదాంబుది’—వాయింపజేసి భానుమతి  తనకుగల శాస్త్రీయ సంగీతాభిరుచి నిరూపించాలనుకున్నారు—   ఇందులో—ఓ ప్రియురాల—ఓ జవరాలా(A.M.రాజా) నన్ను చూసి ఇంత జాలి ఏలనమ్మా(భానుమతి) అన్నింటికీ మించి భానుమతి పాడిన ఉయ్యాలజంపాల లూగ రావయ్యా అధ్బుతంగా అమిరాయి. ఇందులో భానుమతీ—సి.ఎస్.ఆర్ పోటానుపోటీగా నటించారు.  ఏ.ఎన్.ఆర్ ఎంతో అందంగా వుంటారీ సినిమాలో.

            పి. భానుమతి గాయనిగా, నటిగా, రచయిత్రిగా, నిర్మాతగా దర్శకురాలిగా చక్కగా నిరూపించుకున్న చిత్రం ఇది. అయితే ఇందులో రచయిత్రిగా పాత్రలేకపోయినా, మంచి రచనను తీసుకోగలిగిన శక్తి కనిపిస్తుంది —

            పి.రామకృష్ణ తన దర్శకత్వ ప్రజ్ఞను నిరూపించుకున్నారు. 1954లో ఇది వచ్చింది. ఇలాంటి చక్కని హాస్యంతో నవ్వుకునే చిత్రాలు ఇప్పుడు వస్తున్నాయా అంటే జవాబు చెప్పడం కష్టమే—

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.