కనక నారాయణీయం -31

పుట్టపర్తి నాగపద్మిని

          పుట్టపర్తి అన్నారు.’ ఒరేయ్, మన తెలుగు కవుల్లో పది మంది కవుల పేర్లే తెలియవు మీకు!! వీణ్ణి ఎగతాళి చేస్తార్రా మీరు?? ఒరేయ్.. ఎవరైనా పోయి వాట్కిన్స్ ని పిల్చుకుని రాపోండి.’ అన్నారు పుట్టపర్తి.

          తెలుగు కవులకూ, డ్రాయింగ్  సార్ వాట్కిన్స్ కూ ఏమి సంబంధమో అర్థం కాలేదు వాళ్ళెవరికీ?? ఆయనేమైనా తెలుగు కవులగురించి పాఠం చెబుతాడా ఇప్పుడు??’ 

          ఒక కుర్రవాడు లేచి తుర్రున వెళ్ళాడు వాట్కిన్స్ సర్ కోసం!!

          వాళ్ళకేమి తెలుసు, ఒక గొప్ప నూతనాధ్యాయానికి యీ క్షణం నాందీ కాబోతున్నదని!!

***

          పుట్టపర్తి వారి పిలుపు విని వాట్కిన్స్ సార్ అక్కడికి వచ్చాడు. ఆయనది కాస్త భారీ కాయం. కాస్త దూరం నడిచినా ఆయాసం వచ్చేస్తుంది. నుదుట చెమట తుడుచుకుంటూ, పుట్టపర్తి వారి దగ్గరికి చేరుకున్న వాట్కిన్స్, ఆయాసపడుతూనే,పుట్టపర్తికి నమస్సులు అందించి,  వారికి సమీపంలో గడ్డిమీద తన భారీ శరీరాన్ని చేరవేశాడు.

          అతగాని ఆయాసం చూసి, పుట్టపర్తి ఒక కుర్రాడికి పురమాయించారు, అతనికోసం, తోటలో ఉన్న మంచినీళ్ళ కొళాయి నుండీ, వాటర్ బాటిల్లో నీళ్ళు పట్టుకు రమ్మని!! 

          ‘అరే వాట్కిన్స్, అందుకే చెబుతూ ఉంటానురా, కాయ (శరీర) భారం తగ్గించుకుంటే, నీ కుంచె నాణ్యత పెరుగుతుందని. వింటేనా?? చూడు, యెంత ఆయాస పడుతున్నావో??’

          వాట్కిన్స్ నున్నటి నిగనిగలాడే నల్లని ముఖంలో తేట నవ్వు!!

          పైకి తిట్టినట్టున్నా, పుట్టపర్తి మాటల్లో తొణికిసలాడే ఆప్యాయత అంటే ఇష్టంలేని వారెవరు, రామకృష్ణా హైస్కూల్ లో?? 

          ఇంతలో ఆ కుర్రాడు మంచినీళ్ళు పట్టుకుని రావటం, వాట్కిన్స్ నీళ్ళు తాగి సేద తీరిన తరువాత, వాట్కిన్స్ అన్నాడు,’పుట్టుకతో వచ్చిన కాయమిది స్వామీ!! పుడకలతోనే పోతుంది. (ఫెళ్ళున నవ్వేశాడు కూడా)

          పుట్టపర్తి పెదవులపై కూడా చిరునవ్వు.

          ‘ఇంతకూ ఎందుకు పిలిపించినట్టు స్వామీ?’

          ‘ఇప్పుడే యీ పిల్లలను మీకు తెలిసిన తెలుగు కవుల పేర్లు చెప్పమని అడిగానురా!! ఒకరిద్దరు తప్ప ఎవరూ జవాబు చెప్పలేదు. అందరూ నీళ్ళు నమిలిన వాళ్ళే!! ఈ పిల్లలు రేపు పెరిగి పెద్దై భావి భారత పౌరులు కాబోతున్నారు. వీళ్ళకు ఇప్పుడైనా  మన కవులూ, సంస్కృతి గురించి చెప్పకపోతే, ఆ  తరువాత, ఎవరు చెబుతారు? ఎందుకు చెబుతారు? ‘

          ‘నిజమే స్వామీ!! ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి. మా చిన్నప్పుడు వీధి బళ్ళో ఎన్నెన్ని పద్యాలు శ్లోకాలు చెప్పేవాళ్ళు!! రోజూ వల్లె వేస్తుంటే, ఆ వయసులో నేర్చు కున్నవి, ఇప్పుడు కూడ మర్చిపోలేదు నేను!! వీళ్ళకు ఇంగ్లీష్ చదువులు ముఖ్యమైపోతున్నాయి. రాబోయే రోజుల్లో తెలుగు బ్రతుకుతుందో లేదో మరి!!’

          ‘అది కాదురా!! ఇంగ్లీష్ కూడ నేర్చుకోనీ!! కానీ తెలుగును, సంప్రదాయాన్నీ గాలికి వదిలేస్తే ఎట్లారా?? ఎంతెంత మంది కవులో స్వార్థరహితంగా కృషిచేసి తెలుగులో ఎన్నెన్ని గొప్ప కావ్యాలు వ్రాశినారో, అటువంటి వాళ్ళ వల్లే, ఇప్పుడు కూడా తెలుగు సజీవంగా ఉంది కదా మరి!! వాళ్ళను యీ తరం వాళ్ళు మర్చిపోకుండా ఉండాలంటే, మనమిద్దరం ఒక పని చేయాలరా!!’

          ‘నేను మీవలె కవిని కాదు కదా స్వామీ!! కుంచె పట్టుకుని, నాకు నా గురువులు నేర్పించిన పద్ధతిలో పెయింటింగ్ పని చేస్తాను. ఏదో, నెమళ్ళు, హంసలు, ప్రకృతి, దేవుళ్ళ బొమ్మలు తప్ప నేను ఇతర బొమ్మలు వేయలేను. నా విద్యనే  డ్రాయింగ్ టీచర్ గా యీ పిల్లలకు నేర్పిస్తున్నా, మన స్కూల్ యాజమాన్యం దయతో, నెలకింత చేతిలో పడే జీతం రాళ్ళతో నేనూ నా సంసారం – నడుపుకొస్తున్నాను.’

          ‘అదేమిరా అట్లంటావు?? మన స్కూల్ స్టేజ్ అలంకరణంతా నువ్వే చేసినావు కదరా ఎంతో బాగా!! ఆ పైన సరస్వతీ అమ్మవారి బొమ్మ ఎంతో బాగా జీవ కళ ఉట్టిపడే విధంగా వేసినావు. నీ విద్య గొప్పదిరా!!’

          ఇంతలో ఒక పిల్లాడు అందుకున్నాడు, ‘ఔను సార్, మన స్కూల్ చూస్తానని మా పెదనాయన వచ్చి, ఆ సరస్వతీ బొమ్మ , చూసి భలే మెచ్చుకున్నాడు సార్, వాట్కిన్స్ సార్ ను!!’

          మరొకడన్నాడు ‘ సార్, వాట్కిన్స్ సార్ లేకపోతే స్కూల్ డే టైం లో మాలాంటి పిల్లలకు మేకప్ ఎవరు వేస్తారు??’

          ఆ అబ్బాయి మాటలకు, పిల్లలంతా ఒకటే చప్పట్లు!!

          ‘చూసినావా?? పిల్లలకు నీవంటే ఎంత ప్రేమో?? ‘

          ‘ఏదో స్వామీ,  చిన్నప్పుడు, వీధి నాటకాలాడేటప్పుడు నేర్చుకున్న విద్య యీ మేకప్ చేసే  విద్య. ఇప్పుడు ఇట్లా పనికొస్తూంది. ఐనా, వాళ్ళకేమి స్వామీ, అట్లానే అంటారు, వాళ్ళకు నేనంటె ఎందుకు ఇష్టమో తెలుసా?? నేను పాఠం కన్నా జోకులు ఎక్కువ చెప్పి నవ్విస్తుంటా కదా క్లాస్ లో??’ ఫెళ్ళున నవ్వు.

          పుట్టపర్తి ముఖంలోనూ చిరునవ్వు తొంగి చూసింది.

          ‘ఎప్పుడూ ముఖం గంటు పెట్టుకుని పాఠాలు చెబుతుంటె, పిల్లలకు బేజారే కదరా మరి!! నువ్వు జోకులు కూడ చెబుతావు కాబట్టే, నాకూ ఇష్టం నువ్వంటే!’

          ‘అదే నాకు మీ దీవెనలు స్వామీ!! ఇంతకూ మీరేమో ఇప్పటికే ఎన్నెన్నో కావ్యాలు వ్రాశారు.తిరువనంతపురం, ఢిల్లీ ఇంకా ఎక్కడెక్కడో పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేసి, వచ్చిన అనుభవం ఉంది. నేను బావిలో కప్పను. మీతో కలిసి టీచర్ గా పనిచేయడమే, నాకు పెద్ద గౌరవం. మీ కలం ముందు, నా కుంచె, ఏమి పనికొస్తుందంటారు??

          ‘అదంతా నేను చెబుతాను కదా!! పద మన హెడ్మాస్టర్ దగ్గరికి పోదాము. ఒరే పిల్లలూ, ఆడుకోండిరా పోయి!!’

          అని, పుట్టపర్తి అనగానే తూనీగలే అయ్యారు పిల్లలంతా!!

***

          పుట్టపర్తి, వాట్కిన్స్ ఇద్దరూ హెడ్మాస్టర్ ముందు కూర్చున్నారు.

          ‘ఆ..ఏమి స్వామీ!! ఈ టైం లో వాట్కిన్స్ తో పాటూ ఇక్కడికి రావటమేమిటి?? బహుకాల దర్శనం!! ఊరక రారు పుట్టపర్తి వారు!!  కాఫీ తాగుతారా??’

          వై.వీ. సుబ్బయ్య హెడ్మాస్టర్ అడిగాడు నవ్వుతూ!!

          ఆయన అన్నదీ నిజమే!! పుట్టపర్తి రోజూ, స్కూల్ కు రావటమే భాగ్యంగా తలచే కరస్పాండెంట్ రంగనాథం గారి కింది ఉద్యోగులైన అందరికీ, పుట్టపర్తి స్వయంగా వచ్చి కలుసుకోవటం, గొప్ప విశేషమే!!

          కాఫీ వద్దని సైగ చేస్తూ పుట్టపర్తి అన్నారు,’              

          ‘ ఇప్పుడే పిల్లలకు పాఠం చెబుతుంటె, ఒక ఆలోచన వచ్చింది సుబ్బయ్య గారు!!ఈ పిల్లలకు తెలుగు కవులూ, భాష , ఇంకా ఇతర రంగాలలోని తెలుగు ప్రముఖుల గురించి ఏ విధమైన పరిజ్ఞానమూ లేదు. నాకొచ్చిన ఆలోచన ఏమంటే, మన స్కూల్ లో ఒక రెండు ఠావుల పేజీ వెడల్పుతో 500 పేజీల పుస్తకం తయారు చేద్దాం.  నేను తెలుగు కవులు, వాళ్ళ రచనల గురించి క్లుప్తంగా సమాచారం రాసి ఇస్తాను.వాట్కిన్స్ వంటి మంచి డ్రాయింగ్ టీచర్ ఉన్నాడు.  మనకు అందుబాటులో ఉన్న ఆయా కవుల కలర్ చిత్రాలు వేయిద్దాము. మన స్కూల్ కు వచ్చే ప్రముఖులకు యీ బుక్ చూపించి, వాళ్ళ అభిప్రాయం వ్రాయమందాము. నాకు తెలిసి, ఇటువంటి బుక్ మరే స్కూల్ లోనూ ఉండి ఉండదు. ఈ విధంగా చేయటం వల్ల, మన స్కూల్ ప్రత్యేకతా నిలుస్తుంది. మన స్కూల్ కు వచ్చే వివిధ పెద్దల మన్ననలు మనకు అందుతాయి. పిల్లలకు కూడా, యీ పనిలో పనులు పురమాయిస్తూ ఉంటే, వాళ్ళ మనసుల్లోనూ యీ పని గొప్పదనం తెలిసి వస్తుంది, మనం పదిలపరుస్తున్న పెద్దల గురించి జ్ఞానం కూడ లభిస్తుంది. ఏమంటారు??’

          వై.వీ.సుబ్బయ్య ముఖం వెలిగిపోయింది.

          ‘భలే ఐడియా వచ్చింది మీకు!! కానీ, ఖర్చుతో కూడుకున్న పని కదా!! కరస్పాండెంట్ గారి ముందు యీ ప్రస్తావన చేద్దాం. వారికి తప్పక నచ్చుతుంది. సందేహం లేదు. వాట్కిన్స్ యీ పనికి సహకరిస్తాడా మరి??

          వాట్కిన్స్ ముఖంలో ఆనందం తాండవిస్తూంది.

          ‘అంతకంటేనా సార్?? గొప్ప పని కదా?? పుస్తకంతో పాటూ, నా పేరు, పుట్టపర్తి వారి పేరు, మన స్కూల్ పేరు నిలిచిపోతుంది, జాగ్రత్తగా భద్రపరచ గల్గితే!! నాకు కావలసిన సరంజామా, ఆయా కవుల వివరాలూ, చిత్రాలూ ఇస్తే, నా శక్తికి మించి యీ గొప్ప పనిలో పాలు పంచుకుంటాను తప్పక!!’ అన్నాడు.

          అలా ఒక గొప్ప చారిత్రాత్మక కార్యక్రమానికి పునాది పడింది, కడప రామకృష్ణా హైస్కూల్ లో ఆ రోజు!!

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.