చిత్రం-34

-గణేశ్వరరావు 

ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణించాక కూడా తలపైన టోపీని , నల్ల కళ్ళద్దాలని ఉంచేశారు. కారణం ఊహించగలరు. చనిపోయాక కూడా పార్థివ శరీరం చూడాటానికి బాగానే వుండాలన్న ఆలోచనలో తప్పులేదు.

జగదేక సుందరి క్లియోపాత్రా శత్రురాజుకి చిక్కకుండా ఉండటం కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంటుంది, ఆ మరణం అనాయాసంగా ఉండాలని మరణించాక కూడా తన అందం చెక్కు చెదరకుండా ఉండాలని ముందుగా మరణ శిక్ష పొందిన ఖైదీలపై పరిశోధనలు జరిపిస్తుంది, ఒక అంగుళం పొడుగు ఉన్న మిన్నాగు అనే పాము కరిచిన మరుక్షణం ఒక ఖైదీ మరణిస్తాడు, కాని మొహం మీద మృత్యు చాయలు లేవు, పెదాల పైన చిరునవ్వు చెదరలేదు. ఆ పాముని ఒక భరణిలో వుంచి తన పక్కనే పెట్టుకుంటుంది.శత్రు సైన్యం కోటలోకి జొరబబడిందని తెలిసిన వెంటనే ఆ పాము చేత కాటు వేయించుకుంటుంది. సింహాసనం మీద కూర్చొని విగతజీవితురాలైన ఆమె అందాన్ని చూసి రాజు ఆక్టేవియాస్ సీజర్ దిగ్భ్రాంతుడవుతాడు.
షేక్ స్పియర్ ఆ పాత్ర చేత ఇలా అనిపిస్తాడు: Age cannot wither her, nor custom stale/Her infinite variety. Other women cloy/The appetites they feed, but she makes hungry/Where most she satisfies. . .
కౌరూ Izim kAORU) అనే జపనీస్ ఫోటోగ్రాఫర్ కి ఇలాటి ఆలోచనే వచ్చింది. ‘ప్రకృతి ఒడిలో పార్థివ దేహాలు’ అనే శీర్షిక క్రింద ఎన్నో ఫోటోలు తీసాడు. అతను ముందుగా తన మోడల్ ని క్లియోపాత్రా లా మరణం ఎలా వుంటుందో కల్పన చేసుకోమని అంటాడు. తర్వాత మరణించడానికి ముందు ఎటువంటి దుస్తుల్లో తాము కనిపించదలచు కున్నారో వాటిని వేసుకోమని అంటాడు. సౌందర్యరాశులకు ఫాషన్ డ్రెస్ లు వేసి మరణ కాంక్షని అభినయించ మంటాడు. అయితే తాను తీసే చాయా చిత్రాలు మరణానికి, అంతిమ దశకు సంకేతాలు కానే కావని అంటాడు, ఒక కళాత్మక పండుగకు ప్రతీకలని నొక్కి వక్కాణిస్తాడు. దూరం నుంచే ఆ క్షణాన్ని తన కెమెరా కన్నుతో ఒడిసి పట్టుకుంటాడు. ఆ సన్నివేశంలో నిజంగా ఏం జరగబోతున్నదీ అంత స్పష్టంగా తెలిసి రాదు. కౌరూ వస్తువు ను అన్ని కోణాలనుంచి తీసి ఫైనల్ షాట్ ని తయారు చేసిన తర్వాతే మన కళ్ళ ముందు వివరణాత్మకమైన రూప చిత్రం నిలుస్తుంది.
‘మన మరణం ఎలా సంభవించినప్పటికీ .. మనం అంతా ప్రపంచపు అంచులు దాటి ఆకాశంలోకి దూసుకు పోతాం, నింగిలో పయనిస్తూన్నప్పుడు ఈ నేలపై ఎలా జీవితం గడిపామా అన్న ఆలోచనే మనకి రాదు! మరణించే ముందు ఒక వ్యక్తీ తన చుట్టూ పరచుకున్న ప్రకృతి అందాలకు పరవశిస్తాడా? లేక తను వాటికి కొద్ది క్షణాల్లో దూరమవుతున్నానని దు:ఖంలో కూరుకు పోతాడా?’ నేను తీసే చాయ చిత్రాలను చూసి మీకు మీరే ఒక అభిప్రాయo ఏర్పరచుకుంటారు !’ అని తన కళ గురించి అంటాడు కౌరూ.
****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.