నా జీవన యానంలో- రెండవభాగం- 17

-కె.వరలక్ష్మి

          1988 జనవరి 25 సోమవారం ఉదయం గౌతమీ దిగి మా పెద్ద తమ్ముడి ఇంటికి వెళ్లేం. పది దాటాక H.D.F.C హౌసింగ్ లోన్ సంస్థ ఆఫీస్ కి వెళ్లేం.  అక్కడా అదే ఎదురైంది. లోన్ మోహన్ కే ఇస్తామన్నారు.  ఇంతదూరం వచ్చాం కదా ఒప్పుకోమని మోహన్ ని చాలా బ్రతిమలాడేను.  తను ససేమిరా అనేసరికి చేసేది లేక తిరిగి వచ్చేసాం.

          మధ్యాహ్నం భోజనాల దగ్గర మా తమ్ముడికి విషయం అంతా చెప్పేను, చాలా నిరాశగా. నా మొహం చూసి మా తమ్ముడికి ఏమనిపించిందో “సరే, మా ఫ్రెండ్ కి చెప్పి అప్పు ఇప్పిస్తాను.  నూటికి రూపాయి పావలా వడ్డీ. ఏనెలకా నెల కట్టేస్తానంటే చెప్తాను” అన్నాడు.  ఒక్కసారిగా నా నెత్తిన పాలుపోసినట్టైంది.  వెంటనే వొప్పేసుకున్నాను.

          నోటు మీద సంతకాలు పెట్టేక పాతికవేలు తెచ్చి ఇచ్చాడు.  అవి అయిపోయాక ఇంకా కొంత అలా ఇస్తానన్నాడు. 26 రాత్రికి గౌతమి ఎక్కి తిరిగి వచ్చాం. ఆంధ్రాబేంక్ లో నా సేవింగ్స్ 1250 ఉంటే అవి కూడా డ్రా చేసేసాను.

          కొమరపాలెం ఇటుక నెంబర్ వన్ క్వాలిటీ అంటే  వెయ్యి 322 రూ. చొప్పున తాపీ మేస్త్రికి చెప్పి ఆర్డరు ఇప్పించేను.  జనవరి29 భీష్మ ఏకాదశి రోజు కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించేరు.  ఇంటి పనికి పాతిక, ముప్పై వేలు ఏమూలకి? పిల్లల సేవింగ్స్ తీసేసాను. జనవరి ముప్పైన మరో విడత డబ్బులు కావాలని మా తమ్ముడికి ఉత్తరం రాసేను.  అప్పటి వరకు అప్పు గా నైనా ఎవర్నీ ఆలా అడక్క చాలా గిల్టీ గా అన్పించ సాగింది.  మరో పక్క దు:ఖం వచ్చేసేది, ఫిబ్రవరి 1stన ‘ఆశాజీవులు’ కథ కి స్వాతి నుంచి వంద రూపాయలు M.O వస్తే అదెంతో పెద్ద మొత్తం లా కన్పించింది.

          రోజుకి 20మంది పని చేస్తూ సరిగ్గా వారం రోజుల్లో గుమ్మాల లెవెల్ వరకూ కట్టేసారు. పని జరిగినంత తొందరగానూ డబ్బులు కూడా ఖర్చైపోయాయి.  అప్పటికి మా ఇంట్లో ఫోన్ లేదు.  మా అబ్బాయి బైటి నుంచి ఫోన్ చేస్తే మా తమ్ముడు రమ్మన్నాడట.  

          అప్పటికి ఇప్పట్లాగా బేంకింగ్ సౌకర్యాలు లేక మా అబ్బాయి వెళ్ళేడు.  ఈ సారి 30 వేలు తెచ్చాడు. ఎన్ని ఖర్చులున్నా కరెక్ట్ గా నెల అయ్యేసరికి మా తమ్ముడి ఆంధ్రాబేంక్ ఎకౌంటులో వడ్డీ డబ్బులు వేసెయ్యడం మొదలుపెట్టేను.  ఏప్రెల్ నాటికి వర్క్ శ్లాబ్ లెవెల్ కి వచ్చింది.  కొందరు లింటర్ వర్క్ చేస్తూ, మరికొందరు కాంపౌండ్ వాల్ కడుతున్నారు.  అసలైన శ్లాబ్ ఖర్చు ముందుంది. ఏం ఇబ్బంది కలిగిందో మా తమ్ముడు ఇక తను డబ్బు సర్దలేనని ఫోన్ చేసేడు. ఒక్కసారిగా నా నెత్తిన పిడుగు పడినట్టైంది.

          నేనున్నానని ధైర్యం చెప్పేవాళ్లు లేక, ఏం చెయ్యాలో తోచక కృంగి పోయాను.  తిండి సహించదు.  నిద్ర రాదు. ఒక్కటే గాభరాతో మెడ పట్టేసింది.  డాక్టరు దగ్గరకి వెళ్తే టెస్ట్ చేసి హైబీపీ హైలెవెల్లో ఉందని చెప్పి మందులిచ్చాడు.  అసలే దేన్ని తట్టుకోలేని శరీరానికి ఇదొక కొత్త ఉపద్రవం.

          పని ఎందుకు ఆగిపోయిందో తాపీ పని వాళ్ళకి అర్ధం కాలేదు.  శ్లాబ్ వర్కర్స్ అప్పట్లో జగ్గంపేటలో ఎవరూ ఉండేవారు కారు.  మల్లేపల్లి వర్కర్స్ కి అడ్వాన్స్ ఇచ్చేం.  పెద్ద మేస్త్రి చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాడు.  నాలుగు రోజుల తర్వాత అతను “అమ్మా! మీరలా గాభరా పడకండి.  ఇది మన ఊరు. అందరూ మీకు తెలిసిన వాళ్ళు.  ఇప్పటి వరకూ డబ్బు ముందే ఇచ్చి కొన్న సిమెంటు, ఐరను అమ్మే షావుకార్లని అప్పుగా ఇవ్వమని అడగండి.  తర్వాత తీర్చుకోవచ్చు” అని సలహా ఇచ్చేడు.  నేను ఇంకా సంశయిస్తూ ఉండడం చూసి తనే వెళ్ళి మాట్లాడివచ్చాడు.  ఆ వ్యాపారస్తులందరి పిల్లలు నా దగ్గర చదువుతున్నారు.  అందుకో ఏమో వాళ్ళంతట వాళ్ళే వచ్చి  “మేడమ్ మీ మీద మాకు గుడ్ విల్ ఉంది.  మీకెంత కావాలో అప్పు గా పట్టుకెళ్ళండి.  మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి” అంటూ ఆటోల మీద వేసి పంపించేరు.  అప్పు సరే, తీర్చడం ఎలా? అప్పటి మా ఊరి సర్పంచి చిట్టబ్బాయి రెడ్డి గారు, ఆయన్ని నేను బాబాయ్ అనే దాన్ని – స్వయంగా మా ఇంటికి వచ్చేరు.  ఆయన ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడానట.  L.I.C లో హౌసింగ్ లోన్ పాలసీ తీసుకోమని, ఎన్ని లక్షలు అవసరమైతే అన్ని లక్షలకి తను పాలసీ చేయించి ఒక ఇన్ స్టాల్ మెంటు కట్టేక లోన్  వచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పేరు.  నేను వెంటనే ఒప్పేసుకున్నాను.  నా కష్టంలో ఇంతమంది ఆదుకునే వాళ్లు ఉన్నారని ఆనందంగా అనిపించింది.

          చెవి దుద్దులు తప్ప ఇంట్లో నగలు, పిల్లలవీ నావీ బేంకులో తాకట్టు కెళ్ళి పోయాయి. లోన్ వచ్చే వరకూ అతి ముఖ్యమైనవి తప్ప ఇంటి ఖర్చులు బాగా తగ్గించవలసొచ్చింది. 

          లోన్ మొదటి ఇన్ స్టాల్ మెంటు రాగానే మొదట మా పెద్ద తమ్ముడికి ఇచ్చేసాను. ఎందుకంటే తను ఇచ్చి ఉండకపోతే ఇల్లు కట్టుకోవడం అనేది కలగానే ఉండిపోయేది అప్పటికి. రెండో ఇన్ స్టాల్ మెంటు రాగానే  షావుకార్లకీ, ఐదేశివేలుసర్దిన, మాఅమ్మకీ, చిన్న తమ్ముడికీ ఇచ్చేసాను.

          లోపలి గదుల్లో ఫ్లోరింగు(సిమెంటు గచ్చు),  ప్లాస్టింగు చేయించి ఆగష్టు  లో గృహప్రవేశం కానిచ్చి బైట గుమ్మాల ఫ్లోరింగ్ తో సహా తర్వాత చేతిలో డబ్బున్నప్పుడల్లా ఒక్కొక్కటి చేయించాను.  సన్నాయి వాయిద్యాలతో ఆనందంగా గృహప్రవేశం ఏర్పాటు చేసుకుంటే ఆ ఆనందం లేకుండా చేసాడు మోహన్. కొత్త ఇంటికి వెళ్ళే వేళకి బాగా తాగేసి స్పృహ లేకుండా పడి ఉన్నాడు.  అతని తరపువాళ్ళు, నా తరపువాళ్ళువచ్చిన చుట్టాలందరి ముందు అవమానంతో, దు:ఖంతో విలవిలలాడి పోయాను.  ఇద్దరు మనుషులు పట్టుకుని నడిపించుకుని రావాల్సివచ్చింది.  అంతచేసిన ఆ మనిషి తర్వాత నుంచి తనకు తెలిసినవాళ్లందర్నీ తీసుకొచ్చి ఇల్లు చూపించి, డాబా పైకి ఎక్కించి చూపించి మురిసిపోతూ ఉండేవాడు. 

          అంతా బాగానే ఉంది కానీ, లోన్ వచ్చిన మరుసటి నెల ఒకటో తేదీకి తాఖీదు వచ్చింది LIC నుంచి.  7 వ తేదీన వడ్డీ కట్టమని.  ఒక క్రమబద్దమైన లెక్కల జీవితం అలవాటైన నేను ఎన్ని ఇబ్బందులున్నా వడ్డీ మాత్రం డేట్ లోపల కట్టేస్తూ వచ్చాను.  అలా కాబట్టే ఇంటిని జారిపోకుండా కాపాడుకోగలిగేను.  నాతో బాటు లోన్స్ తీసుకుని కట్టిన చాలా మంది వడ్డీయే కదా అని నిర్లక్ష్యం చేసి తర్వాతెప్పుడో పెద్ద పెద్ద మొత్తాలు కట్టి ఇంటిని కాపాడుకున్నారు కొందరైతే ఆక్షన్ వరకూ తెచ్చుకుని ఇళ్లను పోగొట్టు కున్నారు.  అందుకే జీవితంలో సంపాదించుకున్న ఒకే ఒక ఆస్తి ఆ ఇంటి మీద నాకు మమకారం.

          అంతటి సంక్షోభం లోనూ నా రచనా వ్యాసంగం కొనసాగుతూనే వచ్చింది.

          ‘పునీత’ నవలిక (తర్వాత జ్యోతి మంత్లీ లో ‘కిడ్నాప్’ పేరు తో వచ్చింది);

          ‘పున: పున:’, వ్యత్యాసం’ చీకటి’,‘అసలురంగు’,‘పరాజితులు’,‘శతాయుష్మాన్ భవ’,‘హత్య’‘తప్పెవరిది?’కథలు స్వాతి, ఆంధ్రజ్యోతి,వనిత, ఆంద్రప్రభ, విజయ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి.

          బాలరంజని లో ‘బాధ్యత కి పరీక్ష’ బాలల కథ వచ్చింది.‘పూల పలుకరింత‘,‘మా ఊళ్ళో గోదారి’,‘కిటికీ లో ఉషోదయం’,‘విలయాద్వైతం’,‘ ఆ ఇంట్లోనే ‘   కవితలు ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ ల్లో వచ్చాయి. 

          మేం ఇల్లు కట్టుకున్న శ్రీరామ్ నగర్ ఏరియా అంతా ఒకప్పుడు వర్షం వస్తే ఏ అపరాలో పండే మెట్టభూమి. క్రమంగా బైటి ఉళ్ళ నుంచి వచ్చిన భూస్వాములు ఆ భూములు కొని బోర్లు వేయించి వరి, చెరకు పండించడం ప్రారంభించేరు.  అప్పటికీ నీరు పెట్టకపోతే తొండలు గుడ్లు పెట్టే నేలగా మారిపోయేది.  1988 ఆగష్టులో మేం గృహప్రవేశం చేసేసరికి అక్కడో డాబా ఇల్లు ఇక్కడో పెంకుటిల్లు అన్నట్టు ఉండేది.  కాలనీ లో కూడా ఇంకా అమ్ముడు పోని నేలలో పంటలు వేస్తూ ఉండేవారు.  మా ఇంటి చుట్టూ ఖాళీ స్థలాలు, వాటిలో పెద్ద పెద్ద పుట్టలు, పట్టపగలే నిర్భయంగా తిరుగాడే బారెడేసి పాములు ఉండేవి.  మొదట్నుంచీ నాకూ పిల్లకీ జగ్గంపేట ఊళ్ళో అలవాటైపోయి  ఈ శ్రీరామ్ నగర్ కొత్తగా ఉండేది.  ఒక రోజు ఇంట్లో అందరం స్కూల్స్ కి, కాలేజీస్ కి వెళ్ళొచ్చేసరికి బాత్ రూమ్స్ లో ఉన్న బకెట్లు, విడిచిన బట్టలూ పట్టుకుపోయేరు.  ఇంకా ఇంటిపని పూర్తి కాక ఏదైనా బైటవదిలేసి వెళ్తే మాయమైపోయేవి.  ఈ దొంగతనాల్తో భయంగా కూడా ఉండేది.  కానీ, ఇల్లు నిర్మాణానికి ఖర్చైపోయి ఇంట్లో డబ్బు, నగలు ఏవీ లేకపోవడం వల్ల వాకిట్లో మంచాలు వేసుకుని నిశ్చింత గా నిద్రపోయేవాళ్లం. 

          మా అయిదుగురితో బాటు మా చిన్న చెల్లి పిల్లలిద్దరిని మా స్కూల్లో చదివిస్తూండడం వల్ల ఇల్లంతా సందడి గా ఉండేది.  దానికి తోడు మోహన్ తోబుట్టువులో, నా తోడబుట్టినవాళ్ళో తరచుగా వచ్చి వెళ్తూ ఉండడం తో అదో సందడి. శ్రీ రామ్ నగర్ లోనే ఇల్లు కట్టుకుని అద్దెకిచ్చిన మా పెద్ద ఆడపడుచు రాణి వాళ్ళు మరీ తరచుగా వచ్చేవాళ్ళు. 

          మా ఇంటి వెనక ఖాళీ స్థలాలకవతల ఉండే నా బాల్య స్నేహితురాలు మీనాక్షీ వాళ్ళ తోటను వేరే వాళ్ళు  కొనుక్కుని పెంకులమిల్లు కట్టేరు.  దాంట్లో  రెండు బట్టీలు నిరంతరం మండుతూ ఉంటే నల్లని ఊకబూడిద డాబాల నిండా పరిచినట్టు పడేది.  కనుచూపు మేరలో ఉన్న ఫేక్టరీలవల్ల వేడి భరించలేనంతగా ఉండేది. అప్పటికి ఊళ్లో 40 పెంకుల మిల్లులు దిగ్విజయంగా నడుస్తూ ఉండేవి.  మేం స్కూలుకి పరుగెత్తినట్టే, చుట్టుపక్కల చాలా ఇళ్ళల్లో చిన్నా పెద్దా ఉదయాన్నే పనులు ముగించుకుని ఫేక్టరీలకి పరుగులెత్తేవారు.

          హైవేకి ఆనుకుని ఉన్న శ్రీరామ్ నగర్ నుంచి ఉత్తరాన దూరంగా ఉన్న జటాద్రి గుట్టవరకూ నేలను రాగంపేట జమీందారు నీలాద్రి రావు తనని ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉండే  నీలాచలంకి ఈనాముగా రాసి ఇవ్వడం వల్ల ఆ నేల మొత్తాన్ని గ్రాంట్ భూమి అనేవారు.  ఆ నీలాచలం సినిమా నటి ఎస్.వరలక్ష్మికి తండ్రి. అతను వచ్చింది వచ్చినట్టే ఎకరం రూపాయికీ అర్ధకీ అమ్మేసుకున్నాడట.  అప్పట్లో ఆ మాత్రం డబ్బులు చేతిలో ఉన్న వాళ్ళు కొందరు గజాలు, కొందరు ఎకరాలు కొనుక్కున్నారు.  ఆలా మేం ఇల్లు కట్టుకునే నాటికి ఆ నేల గజం వంద రూపాయిలు పలుకుతోంది. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.