ఉప్పు నీరు
-జయశ్రీ అట్లూరి
ఎండి పొడారిన కనుగవ
చెలరేగే తుఫానుల తాకిడి
కుమిలి కదలి చెమ్మారిన అలికిడి
ఆరని జ్వాల కరిగిన కల విరిగిన అల
చేరేసిన తట్టా బుట్టా మట్టిపాలు
కనిపెంచిన పిల్లా జెల్లా నిన్నటి మురిపాలు
కసాయికన్ను పడితే కడదేరిపోయే జీవితాలు
ఆశలు ఆశయాలు కొడిగట్టిన దీపాలు
తరతరాలుగా ఎత్తుతున్న తలల అణచివేత
యుగయుగాలుగా ఎవరూ వినని ఆత్మఘోష
దినదినపు సుడిగుండాల గుండెకోత
నాకు నేను నాది..నాకుండకూడని భాష
కోటానుకోట్ల మగువల తీరని దుఃఖం
గుండె సెగకు కరిగిన వ్యథ రుధిరాక్ష స్రవంగా
బాధా సాంద్రపు రక్తకన్నీటి చుక్కలుగా
లక్షల కోట్ల కన్నీటి చుక్కల సాకారం సాగరం
లవణం సాగర జల లక్షణం
కన్నీటి రుచి లక్షణం లవణం
భూగోళం మీద భూదేవి సహనాన్ని మించిన
సప్తసముద్రాలు ఉప్పురికిన శోక సముద్రాలు
*****