నా జీవన యానంలో- రెండవభాగం- 18

-కె.వరలక్ష్మి

          అప్పటి వరకూ ఏదో పేదాపోలెం బతుకు బతుకుతున్న మేం ఇల్లు కట్టుకోవడం ఎందరికో  కంటి మెరమెర అయ్యింది. బైటి వాళ్ళు కొంతైనా వంకర నవ్వుల్తో సరిపుచ్చుకున్నారు. బంధువులు అసూయను ఆపుకోలేక ఏదో ఓ రూపంలో వెళ్లగక్కేవారు.  పల్లెల్లో అలాగే నడుస్తుంది మరి!

          కొన్ని కుటుంబాల్లో ఆర్ధికంగా ఎదిగి, అనుకోనంత డబ్బునూ, ఆస్తుల్ని అందుకున్న వాళ్ళు వాళ్ళ బంధువర్గంలో ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఏం కొనుక్కున్నా తామే ఆర్ధిక సాయం చేసేమని చెప్పుకొంటారు.  ఒక వేళ ఎంతో కొంత అప్పు రూపంలో ఇచ్చి ఉంటే వడ్డీ తో సహా వసూలు చేస్తారు. ఇల్లు కట్టగా ఉత్తరం వైపు మిగిలిన స్థలం మూడు వందల గజాల పైనే ఉండిపోయింది.  దాన్ని పునాది కన్నా మీది లెవెల్ కి ఫిల్ చేయించడానికి ట్రాక్టర్లతో చాలా చెరువు మట్టిని వేయించాల్సి వచ్చింది.  మనుషుల్ని పెట్టి లెవెల్ చేయించి మొక్కలు వేయించాను.  మల్లె, గులాబీల్లాంటి పూలు, రకరకాల కూరగాయల మొక్కలు, పాదులు పెట్టేము.  గీత, లలిత వాటికి నీళ్ళు పెట్టి సదుపాయం చెయ్యడం వల్ల విపరీతంగా కాసేవి.  మట్టిలో బలం వల్ల మొక్కలు వెంటనే నాటుకొనేవి. స్కూల్  నుంచి వచ్చేక గబగబా వంట ముగించుకుని పిల్లలూ నేనూ ఆ తోటలోనో, డాబా పైనో ఉండేవాళ్లం.  ముఖ్యంగా రాసుకోడానికి, చదువుకోడానికి విడివిడిగా గదులు, లేదా డాబా మెట్లు కొత్తగా దొరికాయి.  జీవితం లోనే అనుకోని కొత్త మలుపు అది.

          కానీ, మరోపక్క అంతవరకూ స్కూలు – ఇల్లు ఒకే చోట ఉండేది కాస్తా స్కూలు ముగిసేక శుభ్రం చేసి తాళాలు వేసి వెళ్ళమని ఆయాలకు అప్పగించాల్సి వచ్చింది.  ఒక్కోసారి నాకోసం రిక్షా రావడం ఆలస్యమైతే S.C పేట లోంచి నడుచుకుంటూ వచ్చి మెయిన్ రోడ్డు దాటాల్సి వచ్చేది.  ఒకసారి నేనలా రోడ్డు దాటిన మరుక్షణం  కను రెప్ప పాటులో లారీ ఒకటి దూసుకెళ్లింది.  రోడ్డుకివతల ఉన్న ఇళ్ల వాళ్ళంతా భయంతో కళ్ళు ఇంతింతలు చేసుకుని చూస్తూ అరిచేశారు. అప్పటికి ఏడాది క్రితమే అలా రోడ్డు దాటుతున్న టీనేజ్ విద్యార్ధినిని లారీ పొట్టన పెట్టుకుందట.  ఆడవాళ్ళంతా అరుగులు దిగి వచ్చి నన్ను వాటేసుకున్నంత పని చేసారు. చాలా జాగ్రత్తలు చెప్పేరు. 

          మరో ఊహించని ప్రాబ్లెమ్ ఏమిటంటే ఇంటికి దక్షిణం వైపు ఓ వెయ్యి గజాల ఖాళీస్థలం, దాని పక్కన వెంకట రత్నం సినిమాహాలు.  సాధారణంగా దాంట్లోకి అన్నీ డిష్షుమ్ డిష్షుమ్ సినిమాలే వచ్చేవి. పగలంతా అలసిపోయి వచ్చి రాత్రులు పెందలాడే నిద్రపోవాలనుకున్నా వీలు పడేది కాదు. సెకెండ్ షో ముగిసే వరకు డైలాగ్స్, పాటలు, ఫైట్స్ తో చెవులు హోరెత్తి పోయేవి.

          కాకినాడ నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన ఒంటరి విడో లక్ష్మీ కాంతం మా స్కూల్లో ఆయాగా పని చేస్తూ మా ఇంట్లో నే ఉంటూ స్కూల్లో మిగిలిన ఆయాల చేత పనులు సక్రమంగా చేయిస్తూ, ఉదయం ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉండేది.

          1989 నవంబరు 22 న ఆంధ్రా లోనూ, మరికొన్ని రాష్ట్రాల లోను ఎన్నికలు మొదలయ్యాయి.  రాష్ట్రంలో అధికార పక్షం తెలుగుదేశం, మ్కుఖ్యమైన ప్రతిపక్షం కాంగ్రెస్. అటు కేంద్రం లో 12 పార్టీలు కలిపి ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రతిపక్షం గా నిలిచింది.  దానికి అధ్యక్షుడు N.T.రామారావు.  కానీ ఆయన పార్లమెంటుకి పోటీచేయ్యలేదు, 22 న పోలింగ్ సరిగా జరగ లేదని, బాంబు ప్రేలుళ్ల వల్ల 14 మంది మరణించారని పేపర్లో వచ్చింది.  నవంబర్ 25 న 425 స్థానాలకి తిరిగి ఎలక్షన్స్ జరిగాయి.  ఈ ఎన్నికల్లో అనుకోని మార్పులొచ్చి కేంద్రంలో కాంగ్రెస్ తగినంత మెజారిటీ సంపాదించ లేకపోయింది. 194 సీట్లు సంపాదించిన కాంగ్రెస్ ప్రతిపక్షాల కూటమికి పరిపాలన అప్పగించి పక్కకి తప్పుకొంది. డిసెంబర్ 2న జనతాదళ్ నాయకుడు V.Pసింగ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసాడు.

          ఇల్లు-అప్పుల సందట్లో 89లో పెద్దగా ఏమీ రాయలేదు. 89 ఏప్రెల్ వనితాజ్యోతి లో ‘చక్రగతి’, నవంబర్10 ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘వేణ్ణీళ్లు’ కథలు; వనిత జూన్ మంత్లీ లో ‘నేనూ-నా విద్యాలయం’స్కెచ్ మాత్రం ప్రచురింపబడ్డాయి.

1990 లో మాత్రం-

3.1.90 ఆంధ్రప్రభ వీక్లీ లో ‘చెవిలో పువ్వు’–

6.7.90 స్వాతివీక్లీ  లో ‘కుక్క కరిచింది’ (కామెడీ కథ)-

ఫిబ్రవరి 90 సాక్షి మంత్లీ లో ‘పరాజితులు’–

మే 90 వనిత మంత్లీ లో ‘పిన్ని’–

2.11.90 స్వాతి లో ‘అశాంతికి ఆహ్వానం’-

ఆగష్టు 90 కలువబాల మంత్లీ లో ‘సమిధ’–

4.11.90 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ‘ఓ అశాంతి వేళ’–కథలు

17.11.90 ఆంధ్రభూమి డైలీ లో ‘కాలకేతువు’–

14.12.90 ఆంధ్రభూమి ఆమె లో ‘ఆమె’-

2.8.90 ఆంధ్రజ్యోతి స్త్రీ లో ‘కళ్ళు’

          2.11.90 ఆంధ్రభూమి ‘ఆమె’ లో ‘దౌర్జన్యం’- కవితలు వచ్చాయి. ఆమె పోయెమ్ తర్వాత స్త్రీ వాద కవిత్వాల సంకలనం ‘నీలిమేఘాలు’ లోనూ, ఐ.ఎఫ్.టి.యు 4వ రాష్ట్ర మహాసభల సావనీర్ లోనూ, 11.7.91 ఆంధ్ర జ్యోతి డైలీ స్త్రీలోను పునర్ముద్రించారు. 

          15.6.90 ఆంధ్రజ్యోతి వీక్లీ లో నామిని సినబ్బ కథల మీద నా సమీక్షణం వచ్చింది.

          పెద్దాపురం ప్రగతి సాహితీ సమాఖ్య సంస్థ శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ప్రకటించిన కవితల పోటీలో నా‘వ్యధార్త గీతం’ కవితకు బహుమతి వచ్చింది. అదే నేను మొదటి సారిగా పోటీకి కవిత పంపడం, సమాఖ్య వారు ఇంటి కొచ్చి తప్పకుండా రమ్మని ఆహ్వానించేరు.  జూన్ 15న స్కూలు ముగిసేక గీత, నేను బస్సులో పెద్దాపురం వెళ్ళేము.  మా ఊరు నుంచి 20 నిమిషాల ప్రయాణం, అదే నేను మొదటి సారి అలాంటి సభకు అటెండ్ కావడం.  అద్దేపల్లి రామ మోహనరావు గారు, పెద్దాపురం మునిసిపల్ కమిషనర్, ఓ స్టేజ్ ఆర్టిస్ట్, మహారాణీకాలేజ్ ప్రిన్సిపాల్ చిరంజీవులు గారు ఉపన్యసించగా సభ చాలా బాగా జరిగింది. 

          90 అక్టోబర్ 30 న నేనిలా రాసుకున్నాను. ‘ దేశం లో రాజకీయ పరిస్థితి ఘోరంగా ఉంది. మతం ప్రముఖ పాత్ర వహించి మానవ మేధస్సుని వెనక్కి నడిపిస్తోంది. అయోధ్యలోని బాబ్రీ మసీదును పడగొట్టి రామాలయం నిర్మించాలని ప్రస్తుతం కేంద్రం లో అధికారంలో ఉన్న నేషనల్ ఫ్రంట్ కి మద్దతునిస్తోన్న బి.జె.పి తలపెట్టింది. ఈ రోజే ప్రారంభం. చంపుకోవడాలు, రక్తపాతం.. ఇంకా ఎన్ని దినాలో!..’

          ఆ సంవత్సరం మా స్కూలు పిల్లల్ని విహారయాత్రకు ద్రాక్షారామం, మామిడాడ, బిక్కవోలు తీసుకెళ్ళాం. ద్రాక్షారామ ఆలయ విశాల ప్రాంగణంలో పిల్లలు, టీచర్లు ఒక్కలాగే ఎంజాయ్ చేశారు.  డిసెంబర్లో బొమ్మూరు తెలుగు యూనివర్సిటీ లో తెలుగు వచన కవిత్వం మీద చర్చా సదస్సు జరిగింది. మా గీతను ఆ సభలో కవిత్వం చదవడానికి అతిథిగా ఆహ్వానించారు. కథకురాలిగా  నన్ను కూడా రమ్మని ఎండ్లూరి సుధాకర్  ఇన్విటేషన్ పంపించారు. 

          డిసెంబర్ 27 నుంచి 29 వరకు సదస్సులు జరిగాయి.

          శివారెడ్డి గారికి ‘మోహనా! ఓ మోహనా’ కవిత్వ సంపుటి కి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది. ఆ మూడురోజుల సభల్లో ప్రముఖులెందర్నో కలవడం జరిగింది. సుధాకర్ వెంట ఉండి నన్ను, గీతను కవులకు, ప్రొఫెసర్లకు పరిచయం చేశారు, అప్పటికి అఫ్సర్, సాదనాల, సీతారాం, అయిలయ్య, యాకూబ్, లక్ష్మి, ప్రసేన్ వంటి వారంతా విద్యార్ధులని గుర్తు. పొనుగోటి కృష్ణారెడ్డిని అదే చూడడం. ప్రముఖులు శ్రీ ఆవంత్స సోమసుందర్, కె.శివారెడ్డి, కేతు విశ్వనాధ రెడ్డి, పాపినేని శివశంకర్, అత్తలూరి నరసింహారావు, హరి పురుషోత్తమరావు, కోవెల సంపత్కుమార, అద్దేపల్లి, శ్రీకాంత శర్మ, కె.కె.రంగనాధాచార్యులు, ఆర్వీయస్ సుందరం, జి.వి.సుబ్రహ్మణ్యం, ముదిగొండ వీరభద్రయ్య, ఎన్. గోపి, చేకూరి రామారావు, కాత్యాయనీ విద్మహే వంటి వారి పేపర్ సమర్పణ- ప్రసంగాలు వినడం ఒక కొత్త అనుభవం. ఆ సదస్సులు నాలో కొత్త ఆలోచనా ధోరణికి దారి చూపాయి. మార్గదర్శనం మస్తిష్కానికి బలాన్ని చేకూర్చింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.