నా జీవన యానంలో- రెండవభాగం- 19

-కె.వరలక్ష్మి

          1991లో పెద్ద కొడుకింట్లో జరిగిన అవమానం తట్టుకోలేక మా అమ్మ బట్టలన్నీ సర్దుకుని జనవరిలో హైదరాబాద్ నుంచి జగ్గంపేట వచ్చేసింది.స్కూల్ నడుస్తున్న తన ఇంట్లోనే ఉంటానంది. నేను మా కొత్త ఇంటికి తీసుకు వెళ్లాలని చాలా ప్రయత్నించాను. ఎంత చెప్పినా వినలేదు. అల్లుడు (మోహన్) చేసే గందరగోళాలు అంటే భయం. నాతో పాటు రిక్షాలో తీసుకువెళ్తే పొద్దుపోయేవేళకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది. కుంపటి మీద తన భోజనం తనే వండుకునేది. నేను కేరియర్ ను పట్టుకెళ్తే నా కూరలు నచ్చవనేది. ఎందుకో చాలా మూడీగా, దుఃఖపడుతూ ఉండేది. కొడుకులంటే మహా ప్రాణం. ఆర్థికంగా అర్ధాంతరంగా ఎదిగే కొందరు నియోరిచ్ మెంటాలిటీని బైట పెట్టుకుంటారు. కన్నతల్లి కూడా వాళ్ళ స్టేటస్ కి తగని వ్యక్తిగా కనిపిస్తుంది.

          ఎన్నో ఏళ్ల తర్వాత ఆ సంవత్సరం జనవరి నుంచి మే నెల మొదటి వారం వరకు రోజూ అమ్మతో గడిపినట్లైంది. మే 10 న సెలవుల్లో ఉన్న మా పిల్లలు ముగ్గుర్ని తీసుకుని హైదరాబాద్ ట్రైయిన్ ఎక్కింది. దిగేసరికి హై ఫీవరట. 16న ఈ లోకం నుంచి సెలవు తీసుకుంది. ఇది మరో షాక్ నాకు. మా తండ్రి పోయిన 14 ఏళ్లకు మా అమ్మ కూడా ఆయన లాగానే హఠాత్తుగా మరణించింది.

          భౌతిక కాయాన్ని జగ్గంపేటకే తీసుకు వస్తున్నారు కాబట్టి మా చెల్లెళ్ళ కుటుంబాలు, కాకినాడ నుంచి మా మేనమామల కుటుంబాలు అంతా ఆ రాత్రికే మా ఇంటికి చేరుకున్నారు. మా అమ్మ తనది అనుకున్న ఆ ఇంట్లోనే ముఖ్యమైన కార్యక్రమాలు జరిగినా, ఆ పన్నెండు రోజులూ మా ఇంట్లోనే అందరం కలిసి దు:ఖాన్ని పంచుకున్నాం. ఆ విషాదంలో ఉండగానే మే 21న రాజీవ్ గాంధీ హత్య వార్త మరో షాక్.

          జీవితం వెలుగు నీడల కలనేత. ఊహించని సంఘటనల సమాహారం. మా పెద్ద తమ్ముడు వెళ్తూ వెళ్తూ నేను స్కూల్ నడుపుతున్న ఇల్లు వాళ్లది కాబట్టి వెంటనే ఖాళీ చేయమని ఒక తాఖీదు జారీ చేసి వెళ్ళాడు. ఆడవాళ్ళం చిన్నప్పుడంతా పుట్టిన ఇంటిని మా ఇల్లు అనే చెప్తాం అందరికీ. పెళ్ళయ్యాక, ముఖ్యంగా తల్లిదండ్రులు కాలం చేశాక అన్నదమ్ములు మనల్ని ఎంత ఎడం పెడతారో అప్పుడే తెలిసొచ్చింది. ఆ ఇంటి మీద మనకున్న మమకారం, ఆ మూల మూలల్లో దాగిన మన బాల్యపు జ్ఞాపకాల సమాహారం అలా త్రుంచి పడేసే అహంకారపు ఆజ్ఞల వల్ల ఎలా ముక్కముక్కలౌతుందో తెలిసొచ్చింది.

          సరే,అద్దె ఇస్తున్నప్పుడు ఇది కాకపోతే మరోటి అని దు:ఖం తోనే నాకు నేను నచ్చ చెప్పుకొన్నాను. కాపురానికైతే ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు. స్కూల్ కోసం కాబట్టి చాలా లిమిట్స్ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద ఖాళీ స్థలం తో కూడిన చాలా గదుల ఇల్లు కావాలి. అదీ అనువైన ప్రదేశమై ఉండాలి. సొంతంగా స్థలం కొని స్కూల్ బిల్డింగ్ నిర్మించే ఊహ కూడా రాని పరిస్థితి. అవతల నిర్మించుకున్న ఆ చిన్న నివాసపు ఇంటికే పీకలోతు అప్పుల్లో మునిగి ఉన్న పరిస్థితి. మా గీత ఆ బాధ్యతను భుజాన వేసుకుని మరో టీచర్ని సాయం తీసుకుని ఆ మే నెల ఎండల్లో ఊరంతా వెతకడం మొదలు పెట్టింది. నేను ఓ మెట్టు పై కెక్కితే రెండు మెట్ల కిందికి లాగే మా మోహన్ గారు అదసలు తన సమస్యే కాదన్నట్టు నిర్లిప్తంగా ఉండిపోయాడు. ఏం చెయ్యాలో అర్థం కాక నాకు రాత్రి నిద్ర పట్టేది కాదు. తిండి మీద హితవు పోయింది.

          మా అమ్మ విషాదం జరగడానికి సరిగ్గా తొమ్మిది రోజుల ముందు మే నెల ఏడో తేదీన కాకినాడకు దగ్గర్లో ఉన్న కరపలో శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్య సంస్థ వారు నా ‘చెట్లు మాయమవుతున్నై’ కవితకు ప్రథమ స్థానాన్ని, గీత రాసిన పోయెం కు రెండవ స్థానాన్ని ప్రకటించి గొప్ప సన్మానం చేశారు. కరప కళావేదిక వారు. కృష్ణ శాస్త్రి గారి మీద ఆరాధన కొద్దీ పెద్ద వేదికపైన సింహాసనల్లాంటి ఆసనాల్ని ఏర్పరిచి సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. పెద్ద పూలమాలలు వేసి, శాలువాలు కప్పేరు. నాకైతే Man of the year 1991 అనే పటం కట్టించిన సన్మాన పత్రాన్ని వేదిక మీద చదివి ఇచ్చారు. సాహిత్య పరంగా నేను పొందిన మొదటి సత్కారమది. అద్దేపల్లి రామమోహన రావు గారితోబాటు అంతా మంచి ప్రసంగాలు చేశారు. ఊహించని ఆ సత్కారానికి బిడియంతో కళ్ళు పైకి లేవ లేదు నాకు.

          అక్కడ ఒక తమాషా జరిగింది. జడ్జెస్ గా వ్యవహరించిన ఇస్మాయిల్ గారు, అద్దేపల్లి వారు కళావేదిక వారికి చెప్ప లేదనుకుంటాను. చివర్లో వారు మాట్లాడుతూ “ఒకే ఊరికి చెందిన కవయిత్రులైన మిత్రులిద్దరికి ఈ అవార్డు రావడం ముదావహం” అన్నారు. అప్పుడు చెప్పేరు అద్దేపల్లి వారు గీత, నేను తల్లీకూతుళ్లమని. ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. అద్దేపల్లి వారు సభానంతరం నన్ను, గీతను, మాతో వచ్చిన కవిమిత్రులు ‘డా. మానుకొండ సూర్యకుమారి’ గారిని తన కారులో సూర్యకుమారి గారి ఇంటి దగ్గర దిగబెట్టారు. బాగా పొద్దు పోవడం వల్ల, బస్సులు తిరిగే వేళ దాటిపోవడం వల్ల సూర్యకుమారి గారు మమ్మల్ని తమ ఇంట్లోనే ఉంచేసుకున్నారు. ఆ రాత్రి నాకు కంటి మీదకి నిద్ర రాలేదు. మా నాన్న ఉండి ఉంటే ఎంత సంతోషించేవారో కదా అనిపించింది. ఫర్వాలేదు, అమ్మ ఉంది కదా అనిపించింది. ఉదయం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని రాజమండ్రి బస్సు ఎక్కేము. మా అమ్మ అప్పటికి మా చిన్న చెల్లెలు ఇంట్లో రాజమండ్రి లో ఉంది. పూలదండ మెడలో వేసి, మొమెంటో ఒడిలో పెట్టి, ఆ కాళ్ల దగ్గర చతికిల పడ్డాను. ఇప్పట్లాగా కెమెరాలు అందుబాటులో లేక మా అమ్మ ముఖంలోని ఆనందాన్ని శాశ్వతం చేయలేకపోయాను. అప్పుడు ఏ మాత్రం ఊహల్లోకైనా రాలేదు సరిగ్గా వారం రోజుల్లోనే తను ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోతుందని.

          కరప సన్మానానికి వెళ్లే ముందే “ఒంటరిగా ఆడవాళ్ళు సభలు-సన్మానాలు అని తిరగడం ఏమిటి” అంటూ వ్యతిరేకించిన మోహన్ తిరిగి వచ్చేక పెద్ద గొడవ పెట్టి ఇష్టం వచ్చిన మాటల్తో నన్ను బాధించేడు- “నువ్వు చెడింది కాకుండా బంగారం లాంటి పిల్లను కూడా చెడగొట్టేస్తున్నావు” అంటూ అతడు చేసే ఆగం భరించలేని నేను గీత తోడుగా రాబట్టి ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నాను.

          మే 11 న కాంగ్రెస్ M.L.A సుధీర్ కుమార్ ని, జాయింట్ కలెక్టర్ సుధాకర్ ని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. వాళ్ళ డిమాండ్ ప్రకారం వాళ్ళ కార్యకర్తలు నలుగుర్ని ప్రభుత్వం విడిచిపెట్టింది.

          శతాబ్దాల తరబడి మహాతప జ్వాలల్ని గర్భకుహరాల్లో భరిస్తూండే, మూగ గా కన్పించే అగ్నిపర్వతాలు చివరికొకనాడు ప్రళయ బీభత్స ధ్వనుల్తో పగిలేటప్పుడు ఎవరి ఆజ్ఞలూ, గౌరవాలూ కూడా నిలవవు. సమీపంలో చిక్కుకున్నప్పుడు సృష్టికర్తైనా సృష్టి భర్తైనా ఆ ఉడుకు ముద్దలు మీద పడగా బాధ పడవలసిందే – అంటారు రాగమయి కథ లో కాళీపట్నం వారు. కానీ, స్త్రీల లోపలి అగ్ని పర్వతాలు ఎప్పటికీ జ్వలిస్తూనే ఉంటాయి. నీ ఇష్టానికి నువ్వు కథలు రాస్తున్నావు కాబట్టి నాఇష్టానికి నేను తాగుతాను అంటూ తాగడం ఎక్కువ చేశాడు మోహన్.

          మా అమ్మ నెలకి 200 అద్దె తీసుకున్న ఇంటికి నెలకి వెయ్యి రూపాయలు ఇస్తే మూడు నెలలు ఉండొచ్చని కబురు పంపాడు మా పెద్ద తమ్ముడు. శ్రీరామ్ నగర్ లో కొత్త ఇంటి దగ్గర L.K.G, U.K.G పిల్లలకు ఒక క్లాసు నడిచేది. దాన్ని మా చిన్నమ్మాయి లలిత నడిపేది హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాక ఏమైందో తెలియదుకానీ, తాను ఆ క్లాస్ తీసుకోనని తప్పదు అంటే సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. మెయిన్ స్కూల్ నుంచి ఒక టీచర్ని ప్రత్యేకంగా అక్కడికి పంపవలసి వచ్చింది. ఊళ్లో క్రమంగా కొత్తగా ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతున్నాయి టీచర్స్ దొరకడం కష్టం అవుతోంది. రకరకాల సమస్యల్తో నాకు తల పగిలిపోతుండేది. ఆ ప్రభావం శరీరం మీద పడి విపరీతమైన నీరసం ముంచుకొచ్చేది. బాధ్యతలు మోయటం నావల్ల కాదు అనిపించేది.

          రాజీవ్ గాంధీ స్థానంలో పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. 1991 ఆగస్టు లో గోదావరి పుష్కరాలు జరిగాయి. ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర పోడూరు గ్రంథాలయం లో మాత్రమే ఉందని తెలిసింది. మా అబ్బాయి రవి తన బైక్ మీద తీసుకెళ్ళేడు. పెనుగొండ, మార్టేరు దాటేక ఒక పక్కగా ఉంది పోడూరు. అందమైన ప్రశాంతమైన ఊరు గ్రంధాలయాన్ని నీట్ గా మెయింటేయిన్ చేస్తున్న రుద్రరాజు చిన్న నరసింహ రాజు గారి తండ్రి 1914లో ఆ రామచంద్ర గ్రంథాలయాన్ని ప్రారంభించారట. వెయ్యి జాగ్రత్తలు చెప్పి మళ్ళీ జాగ్రత్తగా తెచ్చి ఇవ్వాలని పుస్తకాన్ని ఇచ్చారు. దారిపొడవునా కన్ను తిప్పుకోనివ్వని గోదారి అందాలు.  వారం రోజుల్లో పుస్తకాన్ని జాగ్రత్తగా పంపించేను. కాశీ యాత్రా చరిత్ర చదవటం అద్భుతమైన అనుభూతి-

*****

Please follow and like us:

2 thoughts on “నా జీవన యానంలో (రెండవ భాగం) -19”

  1. వరలక్ష్మి గారికధలను ఇష్టపడనివారుండరని నా అభిప్రాయం.

  2. వరలక్ష్మి గారి రచనల్లాగే వారిది ప్రత్యేకమైన వ్యక్తిత్వం . కధలు లాగానే చాలా ఓపెన్ గా ధైర్యంగా వారి స్వియచరిత్రను గొప్ప నిజాయితీగా చెపుతున్నారు. ముందు తరాలకు స్ఫూర్తి దాయకమైన వి వారి వ్యక్తిత్వం తో పాటూ రచనాశైలి కూడా. రెండవ భాగం పుస్తక రూపంగా రావడానికి ఎదురుచూస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published.