వ్యాధితో పోరాటం-5

కనకదుర్గ

          ఆయన ఈ రాత్రికి అమెరికా వెళ్తున్నందుకేమో పేషంట్స్ ఎవ్వరూ లేరు. కొన్ని చేయాల్సిన పనులు చేసుకోవడానికి వచ్చినట్టున్నారు.

          “అయిపోయాడు ఈ రోజు ఆ పిఏ. పాపం అతని పేరు చెప్పకుండా వుండాల్సింది.” అన్నాను.

          అయిదు నిమిషాల్లో వచ్చారు డాక్టర్ గారు.

          వచ్చి తన సీట్లో కూర్చున్నారు. “బ్లడ్ వర్క్ లో పాన్ క్రియాటైటిస్ అని వచ్చింది. డా. రమేష్, నేను నిన్న అదే అనుకున్నాము.”

          “అంటే సీరియస్ ప్రాబ్లమా? ఇపుడు ఏం చేయాలి?” అని గబ గబా అడిగాను.

          “పాన్ క్రియాస్ కి ఇన్ఫెక్షన్ వస్తుందమ్మా. అలా అయినపుడు కడుపులో చాలా నొప్పి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు నూనెలు, కొవ్వు పదార్ధాలు పూర్తిగా మానేయ్యాలి. నొప్పి వచ్చినపుడు నాలిక క్రింద పెట్టుకోవడానికి ఒక టాబ్లెట్ ఇస్తాను. నొప్పి వున్నపుడు మంచినీళ్ళు, కొబ్బరినీళ్ళు మాత్రమే త్రాగాలి. నొప్పి తగ్గింతర్వాత మజ్జిగ అన్నం, చారు అన్నం మాత్రం తినండి.” అని చెప్పారు.

          “ఏం పరవాలేదా డాక్టర్ గారు? హాస్పిటల్ లో చేరాలా? మేమెప్పుడు ఈ జబ్బు పేరే వినలేదండీ. అసలు ఎందుకొస్తుంది, ఎలా వస్తుంది?”

          “నేను 2 వీక్స్ కి అమెరికాలో కాన్ఫరెన్స్ కి వెళుతున్నాను. మీకు నొప్పి వస్తే డా.రమేష్ దగ్గరికి వెళ్ళండి ఆయన చూసుకుంటారు. ఎందుకు వచ్చింది తెలియాలంటే కొన్ని పరీక్షలు చేయాలమ్మా. నేను వచ్చాక చేద్దాము అవన్నీ! ఇది చాలా అరుదుగా వస్తుంది. ఎపుడో, ఎక్కడో ఒకరికి వస్తుంది. ఒకోసారి ఈ ఏజ్ లో వస్తే కొన్నాళ్ళ తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. చూద్దాము. ఒక టాబ్లెట్ రోజు బోంచేసాక వేసుకొండి. మరోటి నొప్పి ఎక్కువగా వస్తేనే నాలిక క్రింద పెట్టుకొని హాస్పిటల్ కి వచ్చేయండి. మేము ఐ.వి పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. భయపడాల్సిందేమి లేదమ్మా! రెండు వారాల తర్వాత వస్తాను కదా అపుడు రావడానికి అపాయింట్మెంట్ ఇవ్వమని చెబుతాను రండి.” అని బయటకు తీసుకొచ్చాడు. మాకు ఇంకా ఎన్నో ప్రశ్నలున్నాయి అడగడానికి. కానీ ఆయన తొందరలో వున్నారు.

          “థ్యాంక్యూ డాక్టర్!” అని చెప్పాము.

          ఆయన వెళ్ళిపోయారు పైన హస్పిటల్ లో వుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషంట్స్ ని చూడడానికి వెళ్ళిపోయారు.

          అపాయింట్మెంట్ తీసుకుని ఏదో ట్రాన్స్ లో వున్న మనుషుల్లా బయటకు వచ్చాము.

          శ్రీని ఆటో కోసం చూస్తున్నాడు. నాకేం అర్ధం కావటం లేదు. ఏంటీ జబ్బు? నాకెందుకు వచ్చింది. చాలా భయం వేసింది.

          ఆటో వచ్చింది. ఆటోలో వస్తుంటే ఏం మాట్లాడాలో తెలీలేదు.

          “డిల్లీలో బయట తిన్నాము కదా! అందుకని వచ్చిందేమో? అసలు తగ్గుతుందా ఈ జబ్బు? నాకెందుకు వచ్చింది?”

          “నాకు ఈ నొప్పి రాకముందు ఎలా వున్నానో అలా అయిపోతే బాగుండనిపిస్తుంది. అసలు పాన్ క్రియాస్ కి ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది?” అని కంగారుగా మాట్లాడ సాగాను.

          “ఒక పని చేద్దాము. ఇంట్లో అమ్మా, నాన్న వున్నారు కదా చైతు దగ్గర. మనం మా ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని డా. రమేష్ సాయంత్రం క్లినిక్ కి వస్తారు కదా! ఆయన దగ్గరకు వెళ్ళి అన్ని డిటేయిల్ గా మాట్లాడి వెళ్దాము.” అన్నాడు శ్రీని.

          నేను తల ఊపాను.  జవహర్ నగర్ వెళ్ళాము. మా అత్తగారు శైలుకి టీ, బిస్కెట్స్ తినిపిస్తున్నారు. అమ్మమ్మ గారు కాఫీ త్రాగుతున్నారు.

          శ్రీని డాక్టర్ ఏమన్నాడో చెప్పాడు అత్తగారికి. “తను చాలా భయపడుతుంది.” అన్నాడు నా వైపు చూస్తూ.

          నేను అక్కడే ఈజీ చెయిర్ వుంటే అందులో ముడుచుకొని పడుకున్నాను.

          “ఎందుకమ్మా భయం? మందులిచ్చారు కదా! ఆయన తిరిగొచ్చాక పరీక్షలు చేస్తే తెలుస్తుంది కదా ఎందువల్ల వచ్చిందో? ఏదైనా వుంటే అంత పెద్ద డాక్టర్ లు కదా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు.” అన్నారు అనునయంగా.

          ” శ్రీ నేను వంట చేస్తాను తొందరగా, తినేసి కాసేపు రెస్ట్ తీసుకునేవరకు డా. రమేష్ వచ్చే టైం అవుతుంది.” అని లోపలికి వెళ్తుంటే,

          నేను నీకు సాయం చేస్తాను పద! తొరగా అయిపోతుంది. అయినా త్వరగా లేచి, త్వరగా తినాలి అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు. పదకొండు గంటలకు కాఫీలైతే ఇక భోజనాలు ఏ మూడు గంటలకో, ఆ తర్వాత మధ్యాహ్నం కునుకు 4 నుండి 6 వరకు. అపుడు మళ్ళీ టీ. రాత్రి తిండి ఏ పదకొండో, పన్నెండో! ఇలా అయితే ఆరోగ్యాలు పాడవుతాయమ్మా!”

          “ఏం చేయనురా. నా మాట వినదు శైలు. రాత్రి నాన్న వచ్చి, స్నానం చేసి, తినేదాక పడుకోదు. పొద్దునే త్వరగా లేవదు. నీకు తెలియంది ఏముంది? ఏదో నడుస్తుంది.” అంది నిట్టూరుస్తూ.

          “మీరంతా టైంకి తింటున్నారుగా! అయినా బాబీకెందుకొచ్చింది నొప్పి?” అంది శైలు కొంచెం కోపంగా.

          మేమిద్దరం నిజంగా నోరెత్తలేకపోయాం ఆ ప్రశ్నకి.

          వాధించే ఓపిక కూడా లేక కళ్ళు మూసుకు పడుకున్నాను నేను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.