చిత్రలిపి

-మన్నెం శారద

ఆ ఇల్లు
తరతరాల తాతలనాటి వైభవం
రెండు వీధుల నాక్రమించుకుని
వీధంతా విశాలం గా పరచుకుని పరచుకుని
నెమరువేస్తున్న మృగరాజులా
మారుతున్న తరాలను మత్తుగా చూస్తుండేది .
కానీ ఇప్పుడా ఇల్లు పూర్తిగా శిధిలం !

పసుపు కొమ్ము వీరి విరిచినట్లు ఐదడుగుల ఆరంగుళాల అమ్మ మ్మ
ముదురురంగు జరీ నేత చీరల్లో
అడ్డిగా ,.కంటె ఆభరణాలతో
మా చిరు సైన్యం ఆకళ్ళు తీరుస్తూ
అటూ ఇటూ తిరుగుతుంటే
ఆ ఇంటిలో వెలసిన అమ్మవారే అనిపించేది
ఇప్పుడా దేవత లేదు

ఇంటి ముందున్న అరెకరం పచ్చికలో
వెన్నెలలో ఎన్నెన్ని ఆటలు !
ఎన్నెన్ని సరదాలూ
అలసి సొలసిన మేము
మామయ్యా తెచ్చిన
కోటయ్య కాజాలు, తీబూందీ తిని
మూతులు కడుక్కుని మంచాలేక్కేవాళ్ళం
కానీ ఇప్పుడాఇల్లు శిధిలం

మండువా ఇంటికి వున్నా లావాటి స్థంభానికి
అమ్మ పొడవాటి జుట్టుని చుట్టి జడ అల్లుకునేది
అని అత్త చెబితే అల్లావుద్దేన్ కథలా విని ఆశ్చర్యపోయాం

అలాంటి దేవాలయం లో అకస్మాత్తుగా
చీకట్లు కమ్మాయి
చేసిన పుణ్యం ఇంటిని పరులపాలు చేసింది
దాయాదుల దావాల్లో దగాపడి
తరతరాలు గా నలుగుతూ
పెచ్చులువూడి ,రంగులు మారి
నేలలోకి క్రుంగి
బిచ్చగాళ్ల నెలవయి
దిక్కుమాలి దీనం గా చూస్తుంది
తీతువొకటి అర్దరాత్రి దీనం గా అరుస్తూ
ఆ ఇంటిమీదుగా సాగిపోతుంది
చిన్ననాటి జ్ఞాపకాలతో ఉలిక్కిపడి లేచి
అటుతిరిగి పడుకుంటాను నేను !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.