అలరించిన “నెచ్చెలి” సాహితీ సమావేశాలు – ఆగస్టు7, 2022

-ఎడిటర్ 

          అంతర్జాల వనితా మాసపత్రిక “నెచ్చెలి” ఆధ్వర్యంలో ఆగస్టు 7 2022  ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి సుందరయ్య కళా కేంద్రంలో ఉ.10.30 గం. నుండి రాత్రి 8.30 వరకు జరిగిన సాహితీ సమావేశాలు సామాజిక స్పృహ కలిగి సందేశాత్మకంగా జరిగాయి. ముందుగా…

         

          నెచ్చెలి ప్రచురణల తొలి సంకలనమైన ‘గత ముప్ఫై ఏళ్ల స్త్రీవాద కవిత్వ సంకలనం (1993-2022) – అపరాజిత’ పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత  ఓల్గాగారు ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి డా. కొండపల్లి నీహారిణి గారు అధ్యక్షత వహించిన ఈ సభలో  ఆత్మీయ అతిథులుగా  ప్రముఖ కవయిత్రులు శిలాలోలిత గారు, జూపాక సుభద్ర గారు పాల్గొన్నారు. “1993లో వచ్చిన “నీలిమేఘాల” తర్వాత 2022లో వస్తున్న ఈ  “అపరాజిత” ముప్ఫై సంవత్సరాల తర్వాత వస్తున్న స్త్రీవాద కవయిత్రుల సంకలనంగా చరిత్ర సృషించడమే కాకుండా, పూర్తిగా ఆధునిక స్త్రీ మనోభావజాలాన్ని, చైతన్యాన్ని సుస్పష్టం చేస్తూ ఇప్పటి స్త్రీవాదబలాన్ని తెలియజేస్తుంది” అని  నెచ్చెలి పత్రికా వ్యవస్థాపకురాలు, ‘అపరాజిత’ ప్రచురణకర్త, సంపాదకురాలు డాక్టర్ కె.గీత తెలియజేసారు.

          ‘అపరాజిత’ ఆవిష్కరణలో భాగంగా ఓల్గా గారు తమ సందేశాన్ని అందిస్తూ..

          చరిత్రను మించిన విషయాలను తెలుసుకోవటానికి సాహిత్యం ఒక బలమైన ఆధారం అని అభిప్రాయపడ్డారు. ‘నీలిమేఘాలు’ సంకలనం తరువాత గడిచిన 30 సం.ల స్త్రీవాద ప్రయాణానికి ‘అపరాజిత’ ఒక చారిత్రక సంపుటంగా నిలుస్తుంది అన్నారు. ఈ 30 సం.ల స్త్రీవాదం అనేక విషయాలను తనలో ఇముడ్చుకున్న చందాన ‘అపరాజిత’ కూడా పెరిగిన స్త్రీ చైతన్యాన్ని అంతటిని తనలో ఇముడ్చుకుంది అని ప్రస్తుతించారు. సంపూర్ణ స్త్రీవాద రచయిత్రులమని ధైర్యంగా చెప్పుకోలేని ప్రస్తుత పరిస్థితులలో డా.కె.గీత గారి ‘అపరాజిత’ అనే స్త్రీవాద కవితా సంకలనంలోని కవయిత్రులందరూ స్త్రీవాద కవయిత్రులం అని ధైర్యంగా చెప్పుకో గలిగితే స్త్రీ వాదానికి విజయం చేకూరినట్లే అని భావించారు. అన్ని రకాలైన వివక్షలను మోసే ఒక స్త్రీ శరీరాన్ని గురించి, స్త్రీ ఆత్మను గురించి, స్త్రీల పోరాటాలను గురించి, ఆరాటాల గురించి 30 సం.ల తరవాత మళ్ళీ స్త్రీవాదం, స్త్రీవాద కవిత్వం ఉంది అంటూ ‘అపరాజిత’ వచ్చింది. ఈ అపరాజితను అందరూ చదివి, అర్థం చేసుకోవాలి అంటూ… కొత్త తరం రచయిత(త్రు) లకు అభ్యున్నతిలో ‘విమర్శ’ యొక్క పాత్రను విశ్లేషించారు.

          ప్రఖ్యాత కవయిత్రి కొండపల్లి నీహారిణిగారు మాట్లాడుతూ.. స్త్రీ స్వేచ్ఛ ఒక పవిత్ర భావంతో ఉండేలా రచయిత్రులు, కవయిత్రులు వారి కలాలను మరొక్కసారి ఝళిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. గతంలోని స్త్రీవాద కవితా  సంకలనాలు ‘నీలిమేఘాలు’ ‘ముద్ర’ ‘సంఘటిత’లకు తోడుగా దాదాపు 30సం.ల తర్వాత స్త్రీవాద కవితా సంకలనంగా డా.కె.గీత ‘అపరాజిత’ను తీసుకురావటం గర్వించదగ్గ విషయంగా పేర్కొన్నారు. ముందు ముందు వరకట్న మహమ్మారి పై కూడా రచయిత్రులు, కవయిత్రులు తమ కలాలను సందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పిలుపునిచ్చారు. పితృస్వామ్యం, మాతృస్వామ్యం లను మించి మానవత్వస్వామ్యంగా సమాజం ఎదగాలని అభిప్రాయపడ్డారు.   

          డా.శిలాలోలిత గారు తమ సందేశాన్ని అందిస్తూ.. స్త్రీవాదం వాదన కాదు, వేదన అని ప్రస్తుతిస్తూ.. సమాజంలోని స్త్రీకి దక్కవలసిన గౌరవం, స్థానం దక్కేవరకు స్త్రీవాదం బ్రతికే ఉంటుంది అని అన్నారు. సమాజంలోని స్త్రీవాదం పై ఉన్న చిన్నచూపుకు బాధపడుతూ, మనిషిలోని మానసిక మార్పు కల్గినప్పుడే, సమాజంలోని స్త్రీ గౌరవించబడినప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఇందుకు సమాజంలోని మానవతా విలువలను పెంపొందించే దిశగా రచనలు సాగాలని పిలుపునిచ్చారు. ‘అపరాజిత’ కోసం గీత గారు ఒక వ్యవసాయదారుని వలే కష్టపడ్డారని కొనియాడారు. మార్పు అనేది సంఘర్షణల నుంచే వస్తుంది అని, సాహిత్య పరంగా స్త్రీవాదులుగా ప్రకటించుకోవటానికి గర్వపడాలే గాని, తప్పుగా భావించకూడదని అన్నారు.

          జూపాక సుభద్ర గారు సందేశాన్ని అందిస్తూ.. సాహిత్యంపట్ల, సమాజంలోని స్త్రీల పట్ల ఎంతో కమిట్మెంట్ ఉంటేతప్ప ‘అపరాజిత’లాంటి సంకలనాలు వెలుగు చూడలేవని, అటువంటి కృషి సల్పిన డా.కె.గీత గారికి అభినందనలు తెలియజేసారు. ‘నీలిమేఘాలు’లో కొరవడిన దళిత, బహుజన స్త్రీల లోటును ‘అపరాజిత’ చాలావరకు తీర్చింది అని తన ఆనందాన్ని సభాముఖంగా తెలియచేసారు. దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల పరంగా గృహహింసే కాకుండా సామాజిక హింసను గురించి కూడా మాట్లాడవలసిన ఆవశ్యకతను తెలియచేసారు. ఇందుకు స్త్రీవాద సాహిత్యంలో ప్రత్యేక స్థాన్నాన్ని కల్పించాల్సి ఉంది అని అభిప్రాయపడ్డారు. ఇప్పటికి అక్కడక్కడా ఆచారాల ముసుగులో మిగిలివున్న ‘జోగిని’ లాంటి స్వార్ధపూరిత విశ్వాసాలను సమూలంగా నిర్మూలించే దిశగా స్త్రీవాదం సాగాలని కోరారు.

          చివరిగా ‘అపరాజిత’ సంపాదకురాలు డాక్టర్ కె.గీతగారు మాట్లాడుతూ అంతర్జాల మాధ్యమంగా ప్రపంచమంతటా అపరాజిత ఆవిష్కరింపబడిందని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా స్త్రీవాదంలో ఇంకా మిగిలి ఉన్న  స్త్రీలవేదనను కూడా భాగస్వామ్యంచేస్తూ మరొక సంపుటం కూడా చేయటానికి ప్రయత్నిస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. అపరాజితలో ప్రతి కవితను కూలంకషంగా పరిశీలించి, ఆమోదించటం జరిగిందని తెలియచేసారు. సుమారు 500 మంది కవయిత్రుల కవితల నుండి అర్హమైన 93 మంది కవితలను మాత్రమే ఎంపిక చేశామని తెలియజేసారు. కవితల ఎంపికలో స్త్రీవాదానికే పెద్దపీట వేశారు.

          అపరాజిత ఆవిష్కరణలో అయితేనేమి, నెచ్చెలి సాహితీ సమావేశానికైతేనేమి తన శిష్యులు, కుటుంబ సభ్యులు అందించిన సహాయ సహకారాలను సభాముఖంగా గుర్తుచేసుకుని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేసారు. అపరాజిత గ్రంధస్థం కావటంలో సకుటుంబ సపరివార సమేతంగా పడిన వ్యయప్రయాసలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ, “అపరాజిత ఆవిష్కరణ సభ ఇలా విజయవంతమవటంతో తన మనస్సు ఆనందభరితమౌతోందని” గీత గారు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

          అపరాజితను సమాజంలోని ప్రతి ఒక్కరు చదివి, దానిలోని వేదనను అర్థంచేసుకుని సమాజంలోని స్త్రీ స్వేచ్ఛను, గౌరవాన్ని కాపాడే దిశగా సమాజం పయనించాలని తన ఆశాభావాన్ని వ్యక్త పరిచారు. స్త్రీలు వేదనకు కృంగిపోకుండా స్త్రీవాదం నుండి ధైర్యాన్ని, మానసికస్థయిర్యాన్ని పొంది మానసికంగా బలంగా ఎదగాలని ఆకాక్షించారు. అందుకు “అపరాజిత తనవంతు బలాన్ని అందిస్తుంది” అని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

         చివరిగా గీత గారు జూపాక సుభద్ర గారి సందేశాన్ని ప్రస్తావిస్తూ “ఆధిపత్య మనువాదాన్ని నిర్మూలించాలంటే స్త్రీలు చైతన్యాన్ని పెంచుకోవాలని, మానసిక స్థైర్యంతో నిలబడాలని, ఎటువంటి కష్టాలు ఎదురైనా సగటు స్త్రీ వలే కృంగిపోయి జీవిత పరిసమాప్తం దిశగా ఆలోచించకుండా, చైతన్యంతో జీవిత చరమాంకం వరకూ పోరాడాలని, అందుకు అపరాజిత ఒక సాధనం వలే చేయూతనిస్తుంది” అని అన్నారు.

          ఈ సంకలనంలో మనదేశం నుండే కాక, డయాస్పోరా కవయిత్రులెందరినో కూడా చేర్చటం జరిగిందని అన్నారు. అపరాజిత కవితల సేకరణలో కాత్యాయనీ విద్మహే, శిలాలోలిత, వైష్ణవిశ్రీ గార్ల సహాయ సహకారాలకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియచేసారు.

          ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దాడులను ప్రశ్నిస్తూ…ఆ వేదనను తెలియజేసే సాహిత్యాన్ని అపరాజిత ద్వారా సమాజానికి అందిస్తున్నానని, అది చదివి యువత తమని తాము మార్చుకునే దిశగా ఆలోచన విస్తృతి చెందాలని ఆశాభావం వ్యక్తపరిచారు. ఎక్కడో వనాలలో ఉండి, విప్లవ దిశగా సాగిపోతున్న ఎందరో కవయిత్రులను సేకరించి, అపరాజితకు తనవంతు చేయూతను అందించిన కాత్యాయిని విద్మహే గారికి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.ఇలా ఎన్నో వ్యయప్రయాసలతో, ఎంతో మంది చేయూతతో రూపుదిద్దుకున్న అపరాజిత సంకలనం గ్రంథమే కాదు, తన తనయగా డా.గీత గారు అభివర్ణించారు.

         

          మధ్యాహ్నం 1.30 గం. నుండి జరిగిన నెచ్చెలి రచయిత(త్రు)ల మీట్ & గ్రీట్ కార్యక్రమంలో నెచ్చెలి రచయిత్రు(త)లు కె. వరలక్ష్మి, ఆలూరి విజయలక్ష్మి, తమిరిశ జానకి, వసుధారాణి, సి.బి.రావు  మున్నగువారు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమాన్ని నెచ్చెలి ఉప సంపాదకులు అవసరాల రత్నాకర్ నిర్వహించారు.

    

      మధ్యాహ్నం 3.30 గం.కి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో డా.కె.గీత రాసిన నవల “వెనుతిరగని వెన్నెల” ఆవిష్కరణ & సమీక్షా కార్యక్రమం జరిగింది. సభని శిరోమణి డా.వంశీ రామరాజు, మేనేజింగ్ ట్రస్టీ, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఇండియా చాప్టర్)  ప్రారంభించగా, ముఖ్య అతిథి తెలంగాణా సాహిత్య అకాడెమీ అధ్యక్షులు డా.నందిని సిద్ధారెడ్డి గారు ఆవిష్కరణ చేసారు. ప్రముఖ విమర్శకులు శ్రీ ఎన్.వేణుగోపాల్ గారు అధ్యక్షత వహించగా, డా.నాళేశ్వరం శంకరం గారు, డా.సి.హెచ్. సుశీల గారు వక్తలుగా ప్రసంగించారు. ఈ నవల ప్రతి చిన్న కష్టానికి కుంగిపోయే ఈ కాలపు యువతులు తప్పక చదివి తీరాల్సినదని వక్తలు అభిప్రాయపడ్డారు.

          ఈ సందర్భంగా విప్లవ సాహిత్యానికి చుక్కాని శ్రీ ఎన్.వేణుగోపాల్ గారు అధ్యక్షత వహిస్తూ..ఛలోక్తులూ, చతురోక్తులుతో సభను ప్రారంభించారు.మొదటగా నవలా రచయిత్రి డా.కె.గీత గారితో తన పరిచయాన్ని, సాహితీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా గీతగారి బహుముఖ ప్రజ్ఞని కొనియాడారు.

          తదుపరి ప్రజాకవి, తెలంగాణా ఉద్యమ సారధి నందిని సిద్ధారెడ్డి గారి చేతుల మీదుగా ‘వెనుతిరగని వెన్నెల’ నవలను ఆవిష్కరించారు.

          ప్రముఖ రచయిత్రి సీహెచ్. సుశీల గారు నవల గురించి ప్రస్తావిస్తూ.. ఈ నవలను మొదటిసారి తన ఐపాడ్ లో చదివినట్లుగా తెలియచేసారు. అయినప్పటికీ నవల ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగి ఏకబిగిన 6గం. చదివేటట్లు చేసిందని నవల యొక్క విశిష్టతను కొనియాడారు. కథానాయకి ‘తన్మయి’ పాత్ర తనను 6గం.పాటు కథతోపాటూ ప్రయాణించేలా చేసిందని, అందుకు గీతగారి రచనాపటిమను సభాముఖంగా కొనియాడారు. ఈ సందర్భంలో ‘వెనుతిరగని ధీరవనిత’గా తన్మయి పాత్రను అభివర్ణించారు. కథనం ఎక్కడా అభూత కల్పనలకు తావులేకుండా పాఠకుల జీవితాలకు చాలా దగ్గరగా సహజసిద్ధంగా సాగిందని అన్నారు. 33సం.లు కళాశాల వృత్తిలో ఉన్న తనకు ప్రతిసంవత్సరం ఏదోఒక సమస్యతో ఆత్మహత్యకు పాల్పడే ఎందరో యువతులు తారస పడేవారని… అలాంటి వారికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చి, వారిని విజయపథంలో నడిపించే సాధనం లాంటిది ఈ నవల అని కొనియాడుతూ.. ఆడపిల్లలు అందరూ ఈ నవలను విధిగా చదివి తన్మయి పాత్ర నుండి స్ఫూర్తిని పొందాలి అని పిలుపునిచ్చారు. తాను విధులలో ఉండగా ఈ నవల విడుదలయి ఉంటే కళాశాలలో దీనిపై సెమినార్లు నిర్వహించి ఉండే వారని అభిప్రాయపడ్డారు. సుశీలగారు నవలలోని ప్రతీ పాత్రనూ, ప్రతి కోణాన్ని తనదైన శైలిలో విశ్లేషించి వివరిస్తూ, నవల పై సుదీర్ఘ సమీక్షను సభాముఖంగా ఆవిష్కరించారు. స్ఫూర్తి దాయకమైన తన్మయి పాత్ర ఒక అద్భుతమని,అలాంటి పాత్రను సృష్టించిన గీతగారి రచనా శైలి మహాద్భుతమని అభివర్ణించారు. తదుపరి …

          నాళేశ్వరం శంకరం గారు నవల చదువుతున్నంతసేపూ తన్మయి పాత్ర తనే అయినట్లుగా తాదాత్మ్యం చెందానని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. తెలుగు సాహిత్యంలో గతంలో గురజాడవారి మధురవాణి, చలం గారి రాజేశ్వరి, రంగనాయకమ్మగారి జానకి పాత్రలకు ఏ మాత్రం తీసిపోని పాత్రగా చరిత్రలో నిలిచిపోయే పాత్రగా ‘తన్మయి’ని పేర్కొన్నారు. ఒకానొక సమయంలో ఉప్పెనలా వచ్చిన స్త్రీవాదానికి సమాధానమే ‘వెనుతిరగని వెన్నెల’ అని తన అభిప్రాయాన్ని తెలియచేసారు. పాత్రలు, సంభాషణలలోని గీతగారి టెక్నిక్ నవలను ఆద్యంతం చదివిస్తుంది అని కొనియాడారు.

          సిద్ధారెడ్డి గారు నవల చదువుతున్నపుడు ఒక జీవితాన్నే చదివిన అనుభూతిని పొందానన్నారు. ఈ నవలలోని పాత్రలు రచయితచే మలచబడినవి కాదని, సహజ సిద్ధంగా వచ్చినవి కాగా, అవి నవల విజయం సాధించడంలో ప్రముఖ పాత్రను పోషించాయని అన్నారు. సిద్దారెడ్డిగారు నవలలోని సంభాషణల గురించి ప్రస్తావిస్తూ…

          ‘బాబుకి పాలివ్వడం అంటే, గుండెల్లో ఉన్న అత్యంత ప్రేమను అందచేసే ఒకానొక మార్గం’ అని వ్రాసారు రచయిత్రి. ఆమె తొలుత కవయిత్రి కావటం వలనే వాక్య నిర్మాణంలో కవితా శిల్పాన్ని ఆవిష్కరించగలిగారు అన్నారు. ఇలా అన్ని సంభాషణల లోనూ వాక్య నిర్మాణంలో పట్టుతో నవల ఆద్యంతం రక్తి కట్టిందని అన్నారు. ఈ తరం యువతలో లోపించిన దయ, భావుకత, ప్రేమ లాంటివెన్నిటినో ఈ నవల ద్వారా గీతగారు నేటి తరానికి అందించారని, కాబట్టి యువత అందరూ పఠించదగ్గ నవలగా అభివర్ణించారు. తన్మయిలాగ సమాజంలోని స్త్రీలు అందరు విచక్షణా విస్తృతిని సాధించాలని, పురుషులకి కూడా ఈ నవల ఒక మార్గదర్శకం కాగలదని ఆశాభావం వ్యక్తపరిచారు.

          ఎన్.వేణుగోపాల్ గారు సాధారణ దిగువ మధ్యతరగతి అమ్మాయి జీవిత చరిత్రే ‘వెనుతిరగని వెన్నెల’ అని అభిప్రాయపడ్డారు. నవల గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ..పాత్రల రూపకల్పన, నిర్వహణ చెక్కబడిన శిల్పం వలే రచయిత్రి చాల అందంగా నిర్మించారు అని పేర్కొన్నారు. ఈ నవల ద్వారా గీతగారు ‘సమన్వయ స్త్రీవాదానికి’ మార్గనిర్దేశం చేశారని అన్నారు.

          చివరిగా రచయిత్రి గీతగారు నవల పై తన అంతరంగాన్ని సభాముఖంగా ఆవిష్కరిస్తూ… జీవితం డెస్టినీ లో కాక, జీవన ప్రయాణంలోనే ఉంటుంది అని, ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఎదురయ్యే ఎన్నో అనుభవాల, అనుభూతుల సారమే ఈ ‘వెనుతిరగని వెన్నెల’అని అభివర్ణించారు. ఈ ధారావాహికను కౌముదిలో ప్రచురించిన  కిరణ్  ప్రభ గారికి, కాంతి గారికి సభాముఖంగా రచయిత్రి ధన్యవాదాలు తెలియచేసారు.

          ఈ నవలా రచనలో ఒక విధంగా అక్షరమధనమే చేయాల్సి వచ్చిందని, అకస్మాత్తుగా తనకు ఎదురైన తెగిన గాలిపటం లాంటి ఒక అమ్మాయి జీవితమే ఈ నవల ప్రారంభానికి ఆధారమని, నవల ప్రతి భాగంలోనూ ఉత్కంఠ నింపడానికి చాలా జాగ్రత్త వహించాల్సి వచ్చిందని, ఈ క్రమంలో రచయిత్రిగా తన ఆలోచన విస్తృతి చెందింది అని, ఈ నవల ప్రారంభానికి ముందు వరకూ కవయిత్రిగా ఉన్న తనకు, ఈ నవలతో పాఠకులు నవలా రచయిత్రిగా పెద్దపీట వేశారని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

          రచయిత్రి పాఠకలోకం దృష్టిని ప్రస్తావిస్తూ..ఒక రచయిత్రి రచనకు, వారి జీవితానికి ముడిపెట్టే పాఠకుల దృష్టిని ఎద్దేవా చేశారు.

          సమాజంలో స్త్రీ జీవితంలో ఎదురుదెబ్బలకు క్రుంగిపోకుండా, ధైర్యాన్ని కూడగట్టుకునే దిశగా ఆలోచనలను, ఆచరణలను సాగిస్తూ, ఉన్నతమైన భావిజీవిత మార్గాన్ని సుగమం చేసుకునే ఎన్నో సంఘటనల, సంభాషణల, పాత్రల సమన్వయమే ఈ నవలగా నవలా రచనలోని తన అంతరంగాన్ని రచయిత్రి సభాముఖంగా ఆవిష్కరించారు.

          నవలకు పుస్తకరూపాన్ని కల్పించిన వంగూరి ఫౌండేషన్ చిట్టెంరాజు గారికి, అందమైన ముఖచిత్రం అందజేసిన జావేద్ గారు అందించారని, నవలకు పేరును సూచించిన నాగరాజు రామస్వామి గారికి, నవలకు ముందుమాటను వ్రాసిన ప్రముఖ రచయిత్రి ఓల్గా గారికి సభాముఖం గా రచయిత్రి ధన్యవాదాలు తెలియచేసారు.

  

          సాయంత్రం 6 గం.కి జరిగిన సభా కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు శ్రీ తనికెళ్ల భరణి డాక్టర్ కె.గీతామాధవి (కె.గీత) గారికి “డా.తెన్నేటి లత – వంశీ” జాతీయ పురస్కారాన్ని  ప్రదానం చేసారు.  వంశీ ఆర్ట్స్ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధాదేవి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

         

          ఆ రోజు చివరగా జరిగిన  కార్యక్రమంలో డా.కె.గీత గారి అయిదవ కవితాసంపుటి “అసింట” (కవిత్వం & పాటలు)  పుస్తకాన్ని శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ కె.శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా  విచ్చేసారు. ఆత్మీయ అతిథులుగా  ప్రముఖ కవులు శ్రీ కందుకూరి శ్రీరాములు గారు, శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు ప్రసంగించారు. గీతగారు  కోవిడ్ కాలంలో అమెరికా నుండి రాసిన కవిత్వం “అసింట”. ఇందులో గీతగారు స్వయంగా రాసి, పాడిన లలితగీతాలు కూడా ఉండడం విశేషం. ఇవన్నీ ఇప్పటికే యూట్యూబ్ ఛానెళ్లలో విడుదల అయ్యి అత్యంత ప్రజాదరణ పొందినవి.

          ఈ రోజు విడుదలైన పుస్తకాలు స్థానికంగాను, అంతర్జాలంలోనూ అన్ని పుస్తక విక్రయ కేంద్రాల్లోనూ దొరుకుతాయని లేదా నెచ్చెలి ఎడిటర్ ని ఈ మెయిలు ద్వారా సంప్రదించవచ్చని నెచ్చెలి ఎడిటర్ డా.కె.గీత తెలియజేసారు.

మొత్తంగా రోజంతా  నిరంతరాయంగా జరిగిన నెచ్చెలి సమావేశాలు ఇటీవల హైదరాబాదులో జరుగుతున్న ఇటీవలి  సమావేశాల్లో అత్యంత విజయవంతంగా  జరిగినవని అందరూ కొనియాడారు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.