ఒక్కొక్క పువ్వేసి-13

స్వాతంత్ర సంరాంగణ – ఉదాదేవి

-జూపాక సుభద్ర

          వీరాంగణ ఉదాదేవి ఝాన్సీరాణిలాగా చరిత్ర పుస్తకాల్లో, ప్రచారం లో  విస్తృతి చేయబడిన పేరుకాదు. భారత చరిత్ర పుస్తకాలకు తెలియని పేరు చరిత్రలకు వినబడని పేరు. బ్రిటిష్  సైన్యాలతో పోరాడకున్నా, ప్రాణ త్యాగం చేయకున్నా ఝాన్సీరాణి యుద్ధం చేసినట్లు అమరత్వం పొందినట్లు, వీరనారి గా చరిత్ర పుస్తకాల నిండా ప్రచారం.

          కానీ దళిత మహిళలు వివిధ కాలాల్లో, వివిధ రూపాల్లో, అన్ని సందర్భాల్లో దశల్లో, పోరటాల్లో, తిరుగుబాటుల్లో వెలువరించిన తను దేశాభిమానాన్ని, జాతి కోసం, సమాజం కోసం, దేశస్వాతంత్రం కోసం పోరాడిన వీరత్వాలను, ప్రాణత్యాగాలను అవాచ్యం చేయడం సమాజాభి వృద్ధి, చారిత్రకాభివృద్ధి కాదు. ఈ పోరాటంలన్నిట్లో వారి భాగస్వామ్యం వుంది. 1857 తిరుగుబాటు   ఉద్యమంలో బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించిన ఝల్కారీ బాయి, ఉదాదేవి మహావీరిదేవి లాంటి ఎందరో దళిత వీరాంగణల చరిత్రలు యింకా వెలికి తీయాల్సి వుంది. అయితే చరిత్రకారులు మనువాదులైతే ఈ మహిళల గాధలు, త్యాగాలు చరిత్రకు అందవనేది వాస్తవము.

          బ్రిటీష్ పాలన కంటే  ముందు చిన్న చిన్న రాజ్యాలుగా వున్న భారతదేశం, బ్రిటీష్ రాకతో, ఆక్రమణతో రాజ్యాలన్నీ బ్రిటీష్ పాలనలోనే కల్సి పోయినయి. రాజులు సునాయాసంగా లొంగిపోయినా రాణులు బేగం హజ్రత్ మహల్ లాంటి వాల్లు ధిక్కరించి ఎదురునిల్చేవాల్లు. ఆనాడు సైన్యంలో బహుజన కులాలను ఎక్కువగా సమీకరించే వాల్లు. దళిత మహిళల్ని రాణులకు సేవకులుగా, అంగరక్షకులుగా, మహిళా సెక్యూరిటీ గార్డులుగా వుండేవారు. భర్తలు సైన్యంలో వుంటే – ‘భార్యలు రాణి దగ్గర సేవకులుగా వుండేవారు. సేవకుల  శారీరక మానసిక దారుఢ్యాన్ని బట్టి వారికి యుద్ధ విద్యలు నేర్పించేవారు. అట్లా ఝాన్సీ రాణి సేవకురాలు జల్కారీ బాయి, హజ్రత్ మహల్  సేవకురాలు ఉదాదేవి చేరినారు. తర్వాత వారికి ఫిరంగులను ఉపయోగించడం, బెటాలియన్ కమాండర్స్ గా కూడా చేసినారు. ఉదాదేవి, బేగం హజ్రతమహల్ దగ్గర సేవకురాలిగా చేరి కమాండర్ గా ఎదిగి బ్రిటీష్ సైనికుల్ని ముప్పయారు మందిని మట్టుబెట్టిన యుద్ధనారి.

          ఉదాదేవి  పుట్టింది లక్నో దగ్గర అవద్. పాసీ కులానికి చెందిన దళిత మహిళ.  పందుల కాసుకునే కులం. భర్త పక్కా పాసి, ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ నవాబు వాజద్ సైన్యంలో పనిచేసేవాడు. ఉదాదేవి నవాబు భార్య  నజ్రత్ మహల్ దగ్గర సేవకురాలిగా, ఆంగరక్షకురాలిగా వుండేది, తర్వాత రాణి సైనికురాల్ల మండలికి కమాండర్గా ఎదిగింది. ఉదాదేవి పుట్టు పూర్వోత్తరాలు  తల్లిదండ్రుల పుట్టిన కాలం వివరాలు తెలియరాలేదు.

          బెటాలియన్ కమాండర్ గా శిక్షణ తీసుకొని యుద్ధ నిపుణతలో ఆరి తేరింది. కేవలం బతుకు దెరువు కోసమే దళిత మహిళల సైన్యంలో చేరలేదు. ‘మా జన్మ భూమిని విదేశీయుల నుంచి రక్షించాలనే  గొప్ప దేశభక్తి  వుంటే తప్ప బ్రిటీష్ సైన్యాలకు వ్యతిరేకంగా యుద్ధ సాహసాలు, ప్రాణాలోడ్డే సాహసాలకు సిద్ధపడ లేరు. అట్లాంటి దేశ భక్తి కలిగిన ఉదాదేవి ప్రధమ స్వాతంత్ర సంగ్రామం, సిపాయిల తిరుగుబాటుగా చరిత్రకెక్కిన ఉద్యమం లో శత్రు సంహారం చేస్తూ…ప్రాణాలొడ్డిన స్వాతంత్ర సమరయోధురాలు.  ఆమె పోరాటం, వీరత్వం, త్యాగం భారత సమాజానికి స్పూర్తి దాయకం.

          1857 తిరుగుబాటు యుద్ధ సమయాన లక్నో పట్టణంలోని సికందర్ బాగ్ దాడి జరిగినప్పుడు  చిక్కని దట్టమైన మర్రి చెట్టు పైకెక్కి ఉదాదేవి  ముప్పయారు మంది బ్రిటీష్ సైనికుల్ని కాల్చేసింది (16 నవంబర్ 1857). ఈఘటన వల్ల  భయకంపితులైన బ్రిటీష్ కెప్టెన్ డాసన్, కమాండర్ కోలిన్ కాంప్ బెల్ చెట్టుమీద కదలికల్ని పసిగట్టి షూట్ చేయగా ఎరుపు రంగు పొడువు జాకెట్టు వేసుకున్న వ్యక్తి కిందబడితే… ఆ  మనిషి ఒక మహిళ అని తెల్సి ఆశ్చర్య పోయారట. ఒక మహిళ మన ముప్పైయారు మంది సైనికుల్ని మట్టు బెట్టిందా! యిట్లాంటి ఘటన జరగడం యిదే మొదటి సారి అనీ, రికార్డుల్లో పేర్కొన్నారు ఆమే ఉదాదేవి అని.

          బ్రిటీష్ కమాండర్ కొలీన్కాంప్ బెల్ నాయకత్వంలో లక్నోలోని సికందర్ బాగ్ పై దాడి చేసినపుడు వేలాది మంది దళిత మహిళలతో తల పడాల్సి వచ్చిందని అతని డైరీలు చెపుతున్నాయి. సికందర్ బాగ్ మీద జరిగిన దాడిలో ఎదురు నిలిచిన మహిళలు’ కొందరు నల్లగా వున్నారనీ, కొందరు అంటరాని వారనీ, కొందరు బలవంతులు బలహీనులని పిలుస్తారనే కవితలు కూడా వెలువడిన ఉదంతాలున్నాయి. ఉదాదేవి ధైర్య సాహసాలకు సంబంధించిన గాధలు, గీతాలు ఉత్తర భారతదేశమంతా వినిపిస్తుంటాయి. భారతదేశ 1857 తిరుగుబాటు చరిత్ర పుస్తకాల్లో లేకున్నా, రికార్డుల్లో, ఉదాదేవీ ప్రస్తావన, ఆమె మర్రిచెట్టు మీద నుంచి బ్రిటీష్ వాల్లని మట్టుబెట్టిన ఘటన తర్వాత వెలువడిన రచనల్లో ఉదాదేవి పేరు వుంది. అయినా చాలా సంవత్సరాల వరకు  బహుజన పరిశోధనల మూలంగా ఆ ఉదాదేవి చరిత్ర బైటకొచ్చింది. స్వాతంత్ర పోరాటంలో దళిత మహిళలు లక్షలాదిగా పాల్గొన్నారని బ్రిటీష్  ప్రభుత్వ గెజిట్స్, ప్రచురణలు, డైరీలో, సెన్సెస్ లో రికార్డు చేయబడినాయి. వీరి రికార్డుల్ని, స్థానిక ప్రచారంలోని గాధలు, గీతాల పునాదిగా బహుజన కులాల మహిళల చరిత్రలు వెలుగు చూస్తున్నవి. బహుజన పరిశోధకుల పరిశ్రమవల్ల.  దీంతో రాజకీయ ప్రాతినిద్యాల్లోనే కాదు దళితుల వర్తమాన సామాజిక జీవితంలో కూడా భాగమైంది.

          ఉదాదేవి చరిత్ర పుస్తకాల్లో, స్వాతంత్ర పోరాట  చరిత్రల్లో  లేకున్నా, ఉత్తర భారతదేశ ప్రజలు ముఖ్యంగా దళిత సమాజాల్లో విస్తారంగా వుంది. ఉదాదేవి బొమ్మలు ఉత్తర ప్రదేశ్ చాలా ప్రాంతాల్లో ప్రతిష్టించారు. లక్నోలోని సికందరాబాగ్ లో ప్రతి సం॥ నవంబర్ 16న ఉదాదేవి వీరత్వ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. యితర రాజకీయ పార్టీలు కూడా ఉండేవి సభలు సమావేశాలు జరుపుతారు. ఉత్తర ప్రదేశ్ దళితుల ర్యాలీల్లో, పాసీ గూడెల్లో బస్తీల్లో ఉదాదేవి  వీరత్వాన్ని కొనియాడుతారు. పందులు కాసుకునే పాసి కులం మహిళ ఉత్తరప్రదేశ్లో  దళిత జాతి చిహ్నంగా మారిన బహుజన రాజకీయాలు కూడికల్లో విస్తారమైంది.  ఉదాదేవి స్మారక సమితి  ఆమె ఉత్సవాలు చేస్తుంటుంది .

          1857 ప్రథమ స్వాతంత్ర సమరంలో ఉదాదేవి వీరత్వాన్ని, ప్రాణ త్యాగాన్ని గౌరవ గాధగా చెప్తారు.’ రాకేష్ చౌదురి పాసీ యూత్ లీడర్ అన్నట్లు స్వాతంత్ర పోరాటంలో పాసీ కులం నుంచి వేలాది మంది వీరుల త్యాగాలున్నాయంటాడు. అట్లనే ఎస్సీ, బీసీ ఎస్టీ మైనారిటీ  మహిళల నుంచి కూడా లక్షలాది మహిళా త్యాగాలున్నాయని బ్రిటీష్ రికార్డులు చెపుతున్నా, స్థానిక ప్రచార గాధలున్నా, చరిత్ర విస్మరణకు గురయినారు బహుజన కులాల మహిళలు.

          నిజానికి ఉదాదేవి వీరమరణం జరిగిన  నవంబర్ 16 / 1857 బ్రిటీష్ రికార్డు స్పష్టంగా వున్నందు వల్ల ఆమె చరిత్ర పురాణ గాథ కాదు.  పుట్టిన గడ్డ రక్షణ కోసం బ్రిటీష్ సైన్యాన్ని మట్టు బెట్టిన వీరాంగణగా చరిత్రలో ఉదాదేవి పేరు నిలిచి ఉంటుంది. యింకా అనేక ఉదాదేవీలను  వెలికి తీయాల్సి వుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.