అక్షరం 

-మన్నెం శారద

అవసరం అలాంటిది ….
అర్జెంట్ గా రాయాలి. మరి ….
కాగితం. కలం తెచ్చుకున్నాను
ఏసీ వేసుకుని కాగితంమ్మీద కలం పెట్టేనా ….
ఒక్క అక్షరమూ పడదే …
 
అదిలించి బెదిరించినా … అట్టే సోకులు పడకు … అంటూ ఎకసక్కేమాడి
ఎగిరెగిరి పడ్డాయి …
 
తెల్లబోయి వాటి ఆట చూద్దునా ……..
ఓయమ్మో ….. అక్షరాలు ……తక్కువేమీ కాదు
 
కొన్ని అక్షరాలు …కుదురుగా కుదమట్టంగా …!
(అ, ఇ, ఉ, ఋ, ఎ,ఐ, ఒ etc )
 
మరికొన్ని….
పక్కనే చేరి సాష్టాంగ పడి కాళ్ళు పట్టుకుని లాగే
కుటిల బడా పెద్దల్లా ….
 
{అ..ఆ,ఇఈ,ఉఊetc}
 
కొన్నిఅక్షరాలు…
పక్కవాడి గొప్పతనాన్ని ఏ మాత్రం అంగీకరించ లేని
వక్రరాయుళ్ళా వెక్కిరించి వంకరబోతూ …
{కీ కూ కె కౌ కోetc}
 
కొన్ని మాత్రం కబుర్లు చెప్పి అందలాలెక్కి
ఊరేగే బడా రాజకీయ నాయకుల్లా….
మరికొన్ని పాపం ..వాటిని నమ్మిమోసుకు తిరిగే
అమాయకపు వోటర్లులా….
{ర్ణ.స్థ,గ్ర…etc}
 
ఇంకా కొన్ని ..తమ అస్తిత్వాన్ని కోల్పోయి
పక్కనేజేరి ..సగంగా మిగిలిన
పరాన్న భుక్తులుగా
{భ్య.త్వ,జ్నాetc}
 
కొన్ని గుంపులు గుంపులుగా జేరి…పదాలుగా మారి
కొన్ని అర్ధాల్ని సృష్టించుకుని
పేరాలుగా జేరి ….
జీవనయానం.. సాగించే తండాల్లా…..!
 
హమ్మో… .ఇప్పుడవి పేజీలయి
గ్రంధాలుగా మారి ..
వాస్తవమంటూ కాల్పనికమంటూ …
వాదిస్తూ అదంటూ ఇదంటూ …
పెద్దపీటే వేసుకుని …
అనుక్షణం
మన మట్టిబుర్రలకి …పదును పెడుతూ
వాదోపవాదాలకి దింపి తమాషా చూస్తున్నాయి
 
అమ్మో …అక్షరాలు …తక్కువేమీ కాదు….ముడుచుకు పోయిన మనసుల్ని ఉత్తేజపరచి మనో వైశాల్యాన్ని పెంచే మహా గురువులు!!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.