క ‘వన’ కోకిలలు – 13 : 

కశ్మీరీ కవయిత్రులు

   – నాగరాజు రామస్వామి

          కశ్మీర్ సాహిత్య భావుకతకు, కవిత్వ రచనకు మూల స్వరూపాన్ని కల్పించిన తొలితరం కవయిత్రులో ముఖ్యులు లాల్ దేడ్, హబా ఖటూన్, రూపా భవాని, ఆర్నిమాల్ ముఖ్యులు. 14వ శతాబ్దపు మార్మిక కవయిత్రిలాల్ దేడ్. హబా ఖటూన్ 16వ శతాబ్దానికి, రూపా భవాని 17వ శతాబ్దానికి, ఆర్నిమాల్ 18వ శతాబ్దానికి చెందిన తొలి కవయిత్రులు.

          కశ్మీరీ కవితా స్రవంతి రెండు పాయలుగా ప్రవహించింది. లాల్ దేడ్ ది ధార్మిక మార్మిక ధార, హబా ఖటూన్ది మత ప్రసక్తిలేని లౌకిక కాల్పనిక ధార. రూపా భవాని లాల్ దేడ్ ను అనుసరిస్తే, ఆర్నిమాల్ ప్రేమగీతాల రొమాంటిక్ రచయిత్రి హబా ఖటూన్ సాహిత్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది. ఈ నలుగురు వేరువేరు శతాబ్దాలలో జీవించినా, మరువ లేని వారి సాహిత్య పరంపర అనూచానంగా కొనసాగింది.

          కశ్మీర్ పూర్వ పురుష కవుల సాహిత్య సేవ గణనీయమే అయినా, నాలుగు శతాబ్దాల కాలంలో ఈ నలుగురు కశ్మీరీ కవయిత్రులు దేశ భాషా సంస్కృతులకు చేసిన దోహదం అపూర్వం. బౌద్ధం, సూఫీయిజం, శైవం వీరికవిత్వంలో అద్భుతంగా అల్లుకున్నవి. పర్షియన్, సంస్కృత భాషా మూలాలు ప్రాంతీయ పలుకుబడులతో మమేకమై, వీరి కవిత్వం కశ్మీర్ సాహిత్యాన్నే కాక, సంస్కృతిని సైతం ప్రభావితం చేశాయి. తదనంతర కాలంలో ఈసమ్మిశ్రమ భాష ‘కశ్మీరియత్’ గా రూపొందింది. హిందూ ముస్లిం కవి పండితుల సాహిత్య ఆదానప్రదానాల సామరస్య ప్రభావం వీరి కవితలలో కనిపిస్తుంది. కశ్మీరీ హైందవం, (త్రికా) శైవం, సూఫీ తత్వాల మేలు కలయిక వీరి కవిత్వం – పండితుల తాత్విక గీతమై, పామరుల పల్లెపాటై ప్రవహిస్తున్నది.

లాల్ దేడ్ (Lal Ded):

          లాల్ దేడ్ హిందూ కశ్మీర్ శైవ శాఖకు చెందిన తాత్విక మార్మిక కవయిత్రి. వక్స్ / వత్సన్ (Vakhs / Vatsun) అనే కొత్త కవిత్వ శైలిని సృష్టించిన సృజనకారిణి. 1320 లో శ్రీనగర్ లో జన్మించింది. 1392 లో మరణించింది. జనసామాన్యంలో ఆమెకున్న మరిన్ని పేర్లు లల్లా, లల్లేశ్వరి, లాల్ అరీఫా, యోగీశ్వరి, లాల్ శ్రీ. ఆమె జీవిత వృత్తాంతం లిఖిత చరిత్రలో కన్నా మౌఖిక వాజ్ఞమయం లోనే ఎక్కువ. నాటి ఈరానీ సూఫీ తాత్విక కవి సయ్యద్ అలీ హమ్దాన్తన కశ్మీర్ యాత్రా కథనాలలో ఆమె గురించి రాసిన కవితలే తొలి చారిత్రిక ఆధారాలు. ఆమె అడవులో తిరిగేయోగిని అని, భిక్షాటన పైనే జీవించే ఆధ్యాత్మిక జీవి అని, నగర వీధులలో నగ్నంగా తిరుగుతుండేదని అంటారు. కశ్మీర్ సాహిత్యం ఉత్తర భారత అపభ్రంశ ప్రాకృత భాషలో స్థిరపడుతున్న కాలంలో ఆమె 285 కవితలు వెలుగుచూచాయి. సంస్కృతం, ఇస్లాం, సూఫీ, సిఖ్ సంస్కృతుల ఛాయలు ఆమె కవిత్వంలో కనిపిస్తాయి. లాల్ దేడ్ కశ్మీర్  ఆది కవిగా ప్రసిద్ధం.

ఆమె కవితలు రెండు:

1. ఏకాకినై
ఎన్నెన్ని దిగంతరాలను తిరిగానో లెక్క లేదు.
ఆత్మను దాచిన ఆకాశం విచ్చుకుంది
హఠాత్తుగా
పంకం లోంచి ప్రఫుల్ల పద్మం పైకిలేచింది.

2. నా గురువు నాకో పదాన్ని ప్రసాదించాడు –
జ్ఞానభరిత పదం;
అది నన్ను నా లోకి మళ్లించిన అంతిమ చరణం.
అందుకే ఇప్పుడు
ఈ “లాల్” నడిరోడ్డ మీద నగ్నంగా నర్తిస్తున్నది.

హబా ఖటూన్ (Habba Khatoon):

          హబా కాటూన్ గొప్ప కశ్మీర్ ముస్లిమ్ కవయిత్రి, సన్యాసి, కశ్మీర్ నైటింగేల్. 1554 లో జన్మించి, 1609 లో మరణించింది. పల్లెటూరు రైతు కుటుంబంలో పుట్టిన ఆమె ఆ గ్రామ మౌల్వీ నుండి రాయటం, చదవటం నేర్చుకొంది. పాటలు అల్లి పాడుతండేది. ఆమె మొదటి పేరు జూన్ -Zoon – (చందమామ). కాలక్రమేణ ఆమె పేరుహబా కాటూన్ గా మారింది. ఆమె గొప్ప అందగత్తె. తోటలో పాటలు పాడుతున్న ఆమెను కశ్మీర్ రాజు యూసుఫ్ షాచక్ చూచి, ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. కాని, అక్బర్ చక్రవర్తి అతన్ని బిహార్ జైలులో జీవిత ఖైదీగా బంధించడం వల్ల ఆమె సన్యాసిగా మారి పోతుంది. విరహ గీతాలు పాడుకుంటూ కశ్మీర్ లోయలో తిరుగుతుండేది.

          కశ్మీర్ కవిత్వ సాంప్రదాయానికి ఆమె ఇచ్చిన ఉపాదానం “లోల్” అనబడే గీత ప్రక్రియ – ఆంగ్ల లిరిక్ కు సమానం. ఆమె పాటలు ఇప్పటికీ పాపులర్. అలనాటి కశ్మీర్ రాచరికపు ఆఖరు కవయిత్రి.

ఆమె రాసిన ఓ కవిత :

నా దేహం లోని అణువణువు బాధిస్తున్నది;
అతను నన్ను లాలసతో నింపేస్తున్నాడు.

అతడు నన్ను గోడ మీది నుండి చూచాడు;
నే నతన్ని మేలైన పట్టు శాలువతో కప్పేయాల్సింది.
కిటికీ గుండా చూచాడు నా నాజూకు మెడని;
నా హృదయంలో శూన్యం నిండుకుంది.
చంద్రుడు కుంకుతున్న మసక వెన్నెలలో
నింగి వెలుగై, పక్షి పాటై పలుకరించి మాయమయ్య్యాడు;
నాలో మంటలు చెలరేగాయి.
ఏటి గట్టు నుండి నన్ను తేరిపార చూచాడు;
గులాబి మొగ్గ కడసారి కన్నుమూసింది.

ప్రణయ జ్వాల నన్ను దహించి వేస్తున్నది;
అతను నన్ను లాలసతో నింపేస్తున్నాడు.

నసీమ్ శఫీ (Naseem Shafaie):

          నసీమ్ శఫీ శ్రీనగర్ లోని ఒక మధ్య తరగతి కుటుంబంలో 1952 లో జన్మించింది. ఆమె కశ్మీరీ భాషలోరాస్తున్న గొప్ప కవయిత్రి. ఉర్దూ భాషలో మాట్లాడు కోవటం ఇష్టపడే కశ్మీరీలను తల్లి భాషైన కశ్మీరియత్ వైపు మళ్ళించేందుకు పాటుపడు తున్నది. ఆమె కవిత్వం ఉర్దూలో కాకుండా కశ్మీరియత్ లోనే అధికం. సాంప్రదాయ కవిత్వంతో పాటు సమకాలీన వాతావరణానికి అనువైన విప్లవ కవిత్వం కూడా రాసింది. ఆమె రాసిన రెండు పుస్తకాలలో ఒకటైన Na Thsay Na Aks (Neither Shadow Nor Reflection, 2009) – “నీడనూ కాదు, ప్రతిబింబాన్నీ కాదు” – కవితా సంపుటికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఆమె దీనికి ఉర్దూ అనువాదం కూడా చేసింది. 44 కవితలు, 36 గజల్లు ఉన్న అదే గ్రంథం భారత కొరియాలు సంయుక్తంగా నిర్వహించిన ఠాగోర్ లిటరరీ అవార్డ్ ను గెలుచుకుంది. ఆమె కవిత్వం ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ, తమిల్, మరాఠీ, తెలుగు భాషలలోకి అనువదించబడింది. ఆమె జర్మని, ఇటలి, కొరియా, నేపాల్ లాంటి పలు అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సెమినార్లలోపాల్గొన్నది.

          “నీవు రూపు మార్చు కొని కృష్ణుడివై వస్తే, నేను మీరానై స్వాగతిస్తాను.  నీవు నా దేహాన్ని కాల్చినా, నేను రామనామాన్ని జపిస్తూనే వుంటాను.” అంటుంది కశ్మీరీ ఉర్దూ కవయిత్రి నసీమ్ షఫీ. ఆమె హిందూ ముస్లిం సాంప్రదాయాలను సమానంగా  గౌరవించింది. ప్రాంతీయ కశ్మీరియత్ భాషను ప్రోత్సహించింది. కశ్మీరియత్ లోనే కవిత్వం రాసింది. మతపరమైన భావాల కన్నా, కశ్మీరీ స్త్రీల సమస్యలు ఆమెను అమితంగా ఆకర్షించాయి. అందుకే ఆమె స్త్రీల పాలిటి ధీర వనితగా (Women Crusader) పేరు పొందింది. 

ఆమె రాసిన ఓ కవిత:

గులాబీని అడిగాను నీ సువాసన ఏదని,
అది అంది
శరత్తు దోచుకెళ్ళందని.
వసంతాన్ని అడిగాను నీ నుదుటి మీది ఈ ముడతలేమిటని,
అది అంది
అవి నా గాయాల మీద లవణ లేపనాలని.

అందుకే
ఆనాటి నుండి
అలనాటి పూల తోటను విడిచి పెట్టి
అగమ్య పథాలలో
అనాలోచితంగా తిరుగాడుతున్నాను.

జబీరా ఫజిలీలి(Zabirah Fazilili):

          జబీరా ఫజిలీలి కశ్మీర్ యూనివర్సిటీ ఇంగ్లీష్ పోస్ట్ గ్రాడ్యేట్. నిర్భయ యువ కవయిత్రి. ఆమెకు ఆమె కవిత్వ రచన ఆమెలోని భరింపరాని కోపాన్ని బయటకు వేళగక్కే  మాధ్యమం.

          ఆమె కవిత్వం మూడు సామాజిక అంశాల మేలు కలయిక: ఒక ముస్లిం, ఒక కశ్మీరీ, ఒక స్త్రీ. 

కవితోద్దేశం: కశ్మీర్ సమస్యపై విప్లవాత్మక భావాలను బాహాటంగా గొంతెత్తడం / అక్షరీకరించడం.

          తన కవిత్వం కశ్మీర్ పురజనులందరిని ఒకే తాటికి చేర్చడం. ప్రేమ, ప్రతిఘటన, విప్లవం నిండిన రచనల ద్వారా కశ్మీర్ లో శాంతిని, 

అభ్యుదయాన్ని సాధించడం. 

ఆమె రెండు కవితలు:

 1. నేను నా కలాలను విరిచేస్తుంటాను,
  నా రక్తమాంసాలు, నా దేహ ఖండాలు
  జీలం నది నీళ్ళలో తేలుతుంటవి;
  గొంతునొక్క బడిన నా నోట్ బుక్ ఆ నది!

  కలం విరిగినప్పుడల్లా బాంబు పేలిన శబ్దం;
  గంతలు కట్టబడిన ఈ భేషజాలన్నీ
  సరైన శస్త్ర చికిత్సలేనా?

  నేను నా గోళ్ళ రక్తాన్ని చిందిస్తూ
  నా కంటి రెపరెపలలో
  కొత్త ఉదయాలను హత్తుకుంటాను;
  నీవేమో నా ప్రతి ఆశ మీదా
  చీకటి రాత్రిని కప్పుతుంటావు.

 2. పదం: భయానకం
  ప్రదేశం: పాశవికం

  ఆమె గాయాన్ని వర్ణించడానికి 
  పర్యాయపదాలన్నీ వాడబడ్డాయి;
  ఆమె పుండు మీద నడచుకుంటూ
  ప్రపంచం కదలి పోతున్నది. 

  పదాలు భద్రపరచబడి ఉన్నవి
  మరో రోజు 
  విరిగిన వీపులను పూడ్చడానికి;
  దోచుకున్న వాడు దొరబాబులా
  ఠీవిగా తలెత్తుకు తిరుగుతున్నాడు. 

         ముందు ముందు, కవన బుల్బుల్ కమ్మని గీతమాధుర్యం కొశ్మీర్ లోయలో మరింత వైవిధ్య భరితంగా నిక్వణిస్తుందని ఆశిద్దాం.

                (*ఏ దేశ సాహిత్యమైనా నిత్య నిరంతర పరిణామ స్రవంతి. కశ్మీరీ  కవిత్వం ఇందుకు మినహాయింపు కాదు. స్థాలీపులాక న్యాయంగా ఓ నలుగురు కవయిత్రులను మాత్రమే ఎంచుకోవడం జరిగింది. కవుల కవన కౌశలాన్నిఆవిష్కరించే సరళ సాధనాలు వాళ్ళ కవితలే కనుక, వారి అనువాద కవితలను అనుసంధిచడం జరిగింది. 

        * దీనిలోని కవితలు కశ్మీరీ కవయిత్రుల ఆంగ్లానువాదాలకు ఈ వ్యాస రచయిత తెలుగుసేతలు)

*****                  

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.