చరిత్రలో వారణాసి పట్టణం – 2

-బొల్లోజు బాబా

3. కాశీనగరప్రాచీనత

          కాశీకి ఉత్తరంవైపున ఉన్న వారణనదీ తీరం పై ఉన్న రాజ్ఘాట్వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలు కాశీ ప్రాచీనతను తెలియచేసాయి. ఈ తవ్వకాలలో BCE తొమ్మిదో శతాబ్దానికి చెందిన కోటగోడలు, కుండ పెంకులు, ఇతర వస్తువులు లభించాయి. అవి ముక్తేశ్వర భట్టారక అని పేరుకల ఆరవ శతాబ్దానికి చెందిన ఒక ముద్ర లభించింది. ఇది బహుశా కాశిలోని అవిముక్తేశ్వర ఆలయ ప్రధాన అర్చకుని ముద్ర/సీల్ కావచ్చును. దీని పై త్రిపుండ్రాలు, నెలవంక స్పష్టంగా గమనించ వచ్చును.

***

          సిద్ధార్ధ గౌతముడు గయలో బోధివృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధునిగా అవతరించాక, రెండు వందల మైళ్ళు నడుచుకొంటూ కాశీ సమీపంలోని ఒక గ్రామాన్ని చేరుకొని అక్కడ తన ఐదుగురు శిష్యులకు మొదటిసారిగా ధర్మోపదేశం చేసాడు. ఆ ప్రదేశమే కాశికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్ననేటి సారనాథ్. సారనాథ్ పన్నెండో శతాబ్దం వరకూ అతి పెద్ద బౌద్ధ క్షేత్రంగా ఉండేది.

          జైనమతం కూడా కాశీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. జైనమత ప్రభోధకులను తీర్థంకరులు అంటారు. వీరిలో ఏడవ తీర్థంకరుడైన సుపార్శ్వుడు; క్రీ.పూ. ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఇరవైమూడవ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు కాశీలో జన్మించినట్లు జైన రచనల ద్వారా తెలుస్తుంది.

          బుద్ధుని సమకాలీనుడైన జైనమహావీరుడు అనేక మార్లు కాశీని దర్శించి తన బోధనలను అందించాడు. కాశీలో పార్శ్వనాథునికి ఒక ఆలయం కూడా ఉండేది. ప్రముఖజైన రచయిత, జినప్రభసూరి “ఇద్దరు జైన తీర్థంకరులకు జన్మనిచ్చి, పవిత్ర గంగా జలాలతో ప్రకాశించే కాశి ఎవరికి నచ్చదు?” అని కాశీ గొప్పతనాన్నిస్తుతించాడు.

          బౌద్ధ, జైనాలు వేదాలను తిరస్కరించాయి. వేదాలను అంగీకరిస్తూ, జీవితానికి అర్ధాన్ని, మోక్ష మార్గాన్నిప్రభోదించటానికి సాంఖ్య, యోగ, మిమాంశ, వేదాంత, న్యాయ, వైశేషిక లాంటి అనేక దర్శనాలను వైదిక ధర్మం భిన్నజ్ఞాన మార్గాలుగా నిర్మించుకొంది. ఒకరితో ఒకరు వాదించుకొంటూ, చర్చించుకొంటూ వేదాల పరిధిలో ఈ దర్శనాల నీడలో తమ ఆథ్యాత్మిక జ్ఞానానికి పదును పెట్టుకొనే వారు. ఈ కార్యకలాపాలన్నింటికి కాశీ కేంద్రంగా ఉండేది. దేశం నలుమూలల నుంచి విద్యార్ధులు అధ్యయనం కొరకు, పండితులు గోష్టుల కొరకు కాశీ వచ్చేవారు.

          సంస్కృత వ్యాకరణకర్త పతంజలి, ఆది శంకరాచార్యుడు, రామానుజాచార్యులు, తులసీదాసు, కబీర్దాసు, వంటి మహా మహులందరు కాశీతో అనుబంధాన్నికలిగి ఉన్నారు. అంతేకాదు హిందూ ధర్మంలోని వివిధ శాఖలుగా నేడు గుర్తించబడుతున్న, మధ్వ, వల్లభ, తాంత్రిక గోరక్నాథ, యోగిని, అఘోర, వీరశైవ, కబీర్పంత్వంటి  పై కాశీ ప్రభావం ఉంది.

***

          Faxian (ఫాహియాన్-405 CE) సారనాథ్ వారణాసి మీదుగా వెళ్లానని తన రాతలలో ప్రస్తావించాడు.

***

          కాశీవిశ్వనాథుని ఆలయాన్ని ప్రధమంగా ఎవరు నిర్మించారు అనే దానికి నిర్ధిష్టమైన శాసన ఆధారాలు లభించవు. రాజ్ఘాట్ వద్ద లభించిన ఆర్కియాలజీ ఆధారాలను బట్టి క్రీస్తుపూర్వమే కాశిలో ఒక శివాలయం మనుగడలో ఉందని భావించాలి.

          విశ్వనాథుని ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్లు అయిదో శతాబ్దానికి చెందిన వైన్యగుప్తుని పేరు ప్రముఖంగా ఇటీవల వినిపిస్తుంది. వైన్యగుప్తుడు గుప్తవంశానికి చెందినరాజు. (507 CE). ఇతను వివిధ శాసనాలలో శైవునిగా, వైష్ణవునిగా, బౌద్ధాన్నిఆదరించిన రాజుగా చెప్పబడ్డాడు. ఇతను 500 CE – 508 CE మధ్య కాశీ విశ్వనాథుని ఆలయాన్నిపునర్నిర్మాణం చేసినట్లు బి.హెచ్.యు ప్రొఫసర్ Rana P.B. Singh ప్రతిపాదించారు కానీ, ఈ ప్రతిపాదనకు సరైన ఆధారాలు చూపించలేదు.

***

          ఏడో శతాబ్దంలో వచ్చిన హ్యుయాన్త్సాంగ్ వారణాసిని( Polonisse) ఇలావర్ణించాడు… వారణాసి మూడు మైళ్ళ పొడవు, ఒక మైలు వెడల్పుతో పశ్చిమం వైపున గంగానదిని కలిగిన నగరము. జనభా సాంద్రత ఎక్కువ. వివిధ ఘాట్లతో నగరపు అంచులు దువ్వెన పళ్ళవలె ఉన్నాయి.

          ఎక్కువ మంది ప్రజలు సంపన్నులు, మర్యాదస్తులు, విద్యాధికులు. వారి ఇండ్లలో విలువైన వస్తువులు ఉన్నాయి. వాతావరణం వ్యవసాయానికి అనుకూలం. అన్నిచోట్లా పచ్చని చెట్లు దట్టంగా విస్తరించి ఉన్నాయి.

          కాశిలో ముప్పైకి పైగా బౌద్ధారామాలు, మూడువేల మంది భిక్షుకులు ఉన్నారు. వందకు పైగా దేవఆలయాలు (Hindu), పదివేలకు పైగా దేవభక్తులు ఉన్నారు. వీరు ప్రధానంగా మహేశ్వరుని పూజిస్తున్నారు. కొంత మంది శిరోముండనం కావించుకొని, మరి కొందరు పిలకలతో, ఇంకొందరు దిగంబరంగా, మరికొద్ది మంది ఒంటి నిండా బూడిద పూసుకొని ఉన్నారు.

          వారణాసిలోని ప్రధాన మహేశ్వర ఆలయంలో రాగితో చేసిన 100 అడుగుల ఎత్తైన మహేశ్వర విగ్రహం, ఎంతో అందంగా సహజంగా, రాజసం ఉట్టిపడుతూ ఉన్నది.

          వారణాసికి ఉత్తర తూర్పుభాగాన అశోకుడు నిర్మించిన 100 అడుగుల ఎత్తైన ఒక స్థూపం ఉన్నది. ఇది అద్దంలా మెరుస్తూ గొప్ప పనితనంతో ప్రకాశిస్తున్నది. (1665 లో ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ ఈ స్తంభంపైకి 35 అడుగుల ఎత్తుతోను, భూమిలో కి మరో ముప్పై అడుగులపై బడి కూరుకుపోయి ఉన్నదని వర్ణించాడు. ఇది అప్పటికి లాట్భైరవ ఆలయంలో భైరవ స్థంభంగా పూజలందు కొంటున్నది. 1860 లో Sherring అనే చరిత్రకారుడు లాట్భైరవ స్థంభం అశోక స్థంభమని, లాట్భైరవాలయం ఒకప్పటి బౌద్ధారామమని గుర్తించాడు – రి. Banaras, City of Light by Eck, Diana P.no 250)

          వారణాసికి పదిలీల దూరంలో జింకల వనం పేరిట ఒక సంఘారామం కలదు (సారనాథ్- సారంగ=జింక. ఆరులీలు = 1మైలు ). అనేక అంతస్తులతో, అద్భుతమైన నిర్మాణ కౌశలంతో అలరారుతున్న దీనిలో 1500 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ 200 అడుగుల ఎత్తైన విహారం కలదు. దీని పైకప్పు బంగారు తొడుగు కలిగి ఉంది. వంద వరుసలలో గదులు నిర్మించబడి ఉన్నాయి. ప్రతి వరుస వద్ద ఒక బంగారు బుద్ధుని విగ్రహం కలదు. విహార మధ్యలో ఆరడుగుల ఎత్తైన బుద్ధుని కాంస్యవిగ్రహం జీవకళ ఉట్టిపడుతూ ఉంది.

***

ఆరోశతాబ్దం వరకూ కాశీలో శివుడు, విష్ణు, కృష్ణ, వాసుదేవ, బలరామ, స్కంద, సూర్య, శక్తి, దుర్గ, కాళి, చాముండ, చండిక,  వినాయక లాంటి భిన్న దేవతారాధన పద్దతులు ఉన్నట్లు పురావస్తు తవ్వకాలలో లభించిన విగ్రహాలు ద్వారా తెలుస్తున్నది.

          ఆరో శతాబ్దంలో గుప్తుల పాలన ముగిసేనాటికి వైష్ణవం, శైవం, శాక్తేయం, సూర్యారాధన లాంటి ప్రధాన ఆరాధనా విధానాలు రూపుదిద్దుకొన్నాయి.

***

          Hye Cho (హేషో) ఇతను బౌద్ధాన్నిఅధ్యయనం చేయటం కొరకు 724-727 CE ల మధ్య భారతదేశాన్నిసందర్శించిన చైనా యాత్రికుడు. కాశీ విశేషాలను హేషో ఇలా వర్ణించాడు….

          ఒక స్థూపం పై బుద్ధుని తొలి బోధనలు విన్న ఐదుగురు శిష్యుల ప్రతిమలను చూసాను. ( వారుకౌండిన్య, అశ్వజిత్, వష్ప, మహానమ, భద్రిక)

          ఒక భారీస్థంభం పై నాలుగు సింహ ప్రతిమలు ఉన్నాయి. ఆ స్థంభం చాలా పెద్దది. ఐదుగురు వ్యక్తులు పక్కపక్కన నుంచునేటంతటి వ్యాసం కలిగి ఉంది. (ఇదే నేటి మన దేశ రాజముద్ర. Hye Cho వర్ణించిన స్థంభం నేడు సారనాథ్ మ్యూజియంలో ఉన్నది).

***

          పదకొండు, పన్నెండు శతాబ్దాలలో కాశిని కేంద్రంగా చేసుకొని పాలించిన Gahadavala రాజులు వేయించిన శాసనాలు అనేకం కాశి సమీపంలో లభించాయి. గాహదవాల వంశీకులు తమని తాము గొప్ప శివభక్తులుగా చెప్పుకొన్నారు. ఈ వంశంలోని గోవింద చంద్ర (1114-1155) విష్ణువుని ఆరాధించగా, ఇతని ఇద్దరు రాణులు బౌద్ధాన్నిఆదరించారు. సారనాథ్  స్తూపానికి చివరి మరమ్మత్తులు చేయించినది ఈ రాణులే. చంద్రదేవ అనే గాహదవాల రాజు కాశీలో ఆదికేశవ విగ్రహాన్ని ప్రతిష్టించి, అనేక కానుకలు సమర్పించు కొన్నట్లు ఒక శాసనం ద్వారా తెలుస్తున్నది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.