రుద్రమదేవి-9 (పెద్దకథ)

-ఆదూరి హైమావతి

          పక్క ఊర్లోని తన స్నేహితుని పొలం కొలవను వెళ్ళిన  బాపయ్య రాత్రి పొద్దు పోడంతో అక్కడే పడుకుని తెల్లారి ఇల్లు చేరాడు. లక్ష్మీనరసు మామగారికి తన ఇంట్లో తల్లి ముత్యాలు నెలా హింసిస్తున్నదో ఇంకా ఇంట్లో జరిగే భయంకర విషయాలు, మీ అమ్మాయిని వెంటనే తీసుకెళ్ళండి లేకపోతే మీకు దక్కదు అని వివరంగా ఉత్తరం వ్రాసి , ఇంటికెళ్ళి ఆ తల్లి ముఖం చూడను ఇష్టపడక పక్క గ్రామంలో ని తన స్నేహితుని ఇంటికి వెళ్ళి పడుకుని తెల్లారాక వచ్చాడు. మగవారిద్దరూ ఇల్లు చేరేసరికి  ఉదయం పది గంటలైంది. 

          ఇంటికి దూరంగా జనం పోగై చెప్పుకుంటున్న విషయాలువిని ముందు ఇంటికి వచ్చిన బాపయ్య ..

          ” ఏమే రాక్షసీ! బంగారం లాంటి కోడల్ని నిర్ధాక్షిణ్యంగా చంపేశావుటే! నీవు ఏదో నాటికి ఇలా చేస్తావను కున్నానుకానీ , అది ఇంత త్వరగా అనుకోలేదు, లేకపోతే ఇల్లు వదిలివెళ్ళేవాడినే కాదు.” అని దుఃఖించాడు.

          ఆ తర్వాత కొంత సేపటికి ఇల్లుచేరిన లక్ష్మీనరసు  జరిగిన ఘోరం చూసి , నీళ్ళలో పడి ఉబ్బిపోయి చెడు వాసన వేస్తున్న  ముత్యాలు శవాన్ని చూసి  భోరు భోరున ఏడ్చాడు.”  నీవు ఆడమనిషివే కాదు , నీ కడుపున పుట్టినందుకు నాపై నాకే అసహ్యం వేస్తున్నది. ఇహ ఈ ఇంట్లో క్షణం ఉండను ” అని ఇల్లు, ఊరు విడిచి వెళ్ళిపోయాడు.

          ” అయ్యా! జరిగిందేదో జరిగి పోయింది కుళ్ళుతున్న శవాన్నిఉంచడం మంచిది కాదు, ఈమె తల్లి దండ్రులకు విషయం తెల్సి వచ్చే సరికి కనీసం రెండు రోజులైనా పట్టవచ్చు, అందువల్ల శవాన్ని ఖననమో, దహనమో చేసే ఏర్పాట్లు చేయటం మంచిది.” అని  ఊరివారు బాపయ్యకు చెప్పిన మీదట ఆయన ఆ ఏర్పాట్లు చేసి ఆ తర్వాత మనిషిని పంపి టెలిగ్రాం ఇప్పించాడు మల్లేశ్వరయ్యకు. 

          ఆ టెలిగ్రాం ఆయనకు ఆ రోజు చేరింది. అల్లుడు వ్రాసిన ఉత్తరం చదువుతుండ గా టెలిగ్రాం వచ్చి జరిగిన ఘోరానికి తల్లి మంగమ్మ, కడుపు మంటతో కంటికి కడి వెడుగా విలపిస్తుండగా, తండ్రి మల్లేశ్వరయ్య నిశ్చేష్టుడై లోలోపల పొర్లి పొర్లి ఏడవ సాగాడు.

          మల్లేశ్వరయ్య పక్కింటి మాధవుడు ఆ టెలిగ్రాం తీసుకుని చీరాల వచ్చి విషయం చెప్పి వెళ్ళాడు.

          రుద్ర తండ్రి భానుచంద్ర, తాత హనుమంతప్ప, వల్లభ బాబాయి, డాక్టర్ దయానిధి, ఇద్దరు పేరు మోసిన లాయర్లు, మరిద్దరు స్పందన సభ్యులు వెంటరాగా  రాజమం డ్రి చేరి అక్కడి నుండీ స్నేహితుల కార్లలో సఖినేటిపల్లి చేరారు. రాజమండ్రి నుండీ వచ్చిన డాక్టర్ దయానిధి స్నేహితులు ఇద్దరు కానిస్టేబుల్స్ ను కూడా తమతో తెచ్చారు.అంతా పంచాయితీ చావడి వద్ద కార్లు దిగి, అక్కడ ఊరి పెద్దలందరితో మాట్లాడారు. తామంతా ఎవరో దేనికోసం వచ్చారో వివరించారు చావిడి వద్ద  ఉన్న పెద్దలంతా  మరికొంత మందిని కూడదీసి, విషయమంతా వివరించారు. ముత్యాలు మరణం గురించి చెప్పి అంతా కంటనీరు  కార్చారు. మల్లేశ్వరయ్య, మంగమ్మ దంప తులు కంటికి  కడివెడుగా ఏడుస్తూండగా అంతా  ఓదార్చ ప్రయత్నించారు.

          రుద్ర కోపంతో ఎర్రపడ్డ ముఖంతో “పదండి వెళదాం .భానుమతమ్మకు తగినశిక్ష పడందే వదిలేది లేదు. వల్లభ బాబాయ్ !అందర్నీ రమ్మని ప్రార్ధిస్తున్నానని చెప్పండి” . అంది.                                                                   

          అంతా కలసి ఒక ఊరేగింపులా బయల్దేరారు. వీరందర్నీ దూరం నుండీ చూసిన భానుమతమ్మ ,కూతురు చెంచులక్ష్మీ, భయపడి పోయి ముఖ్యంగా పోలీసులనూ, నల్లకోట్లు వేసుకున్న లాయర్లనూ చూసి, పరిస్థితి విషమించిందనీ, తాము జైలు కూడు తినక తప్పదనీ అర్ధమైంది. పిల్లల్ని తీసుకుని  దొడ్డిదారిన  ఉడాయించారు.

          వారికోసం  ఇల్లంతా గాలించారు అంతా.  రెండు మూడు గంటలువేచి ఉన్నా వారెటు వెళ్ళిందీ  తెలీక, ఏంచేయాలాని  చర్చించసాగారు.

          ఇంతలో ఒక వ్యక్త్యి అక్కడికి వచ్చి “ అయ్యా! నాపేరు నారయ్య. నేను పక్కూరి పంచాయితీలో ఉద్యోగిని. మా కరణంగారు పంపారు. ఈ ఊరి కరణంగారున్నారా! ఆయన భార్యా పిల్లలూ  చేలకు అడ్డంపడి  మాఊరి మీదుగా పరుగెడుతున్నారు. ‘కరణం గారు క్షేమమేనా  ‘ అని కనుక్కురమ్మన్నారు , మా ఊరికరణం పంతులు ” అని అడగ్గానే అందరికీ విషయం అర్ధమైంది.   

          “చూడు నాయనా! ఈ ఊరికరణం గారూ, ఆయన కుమారుడూ ఇంట్లో లేరు. ఎక్కడికైనా పని మీద వెళ్ళారేమో  తెలీదు. వారి కోడలు మరణించింది, ఆమె మరణానికి కారణం గురించీ సమాచారం  సేకరించేందుకై  పోలీసువారూ, రాజమండ్రి నుంచీ పెద్దలూ వచ్చి ఉన్నారు. ఊరివారంతా  ఇక్కడ చేరి నిజం చెప్పను ముందుకు వచ్చారు. మీకెక్కడైనా గానీ ఈ కరణంగారు కానీ, వారికుమారుడు కానీ కనిపిస్తే రమ్మని చెప్పండి. మేము ఈ విషయం  తేల్చుకుని గానీ వెళ్ళం ” అని వల్లభ బాబాయి చెప్పారు.

          ” అయ్యో!ఆయమ్మ చనిపోయారా! ఈ మద్దెనేగా వివాహమైంది? పాపం పిచ్చమ్మ . కరణంగారి భార్య  భానుమతమ్మ గొప్ప గయ్యాళని  చుట్టుపక్కల  గ్రామాలకంతా తెలుసయ్యా! అందుకే మా కరణంగారి కుమార్తెను అడిగినా ఇవ్వమన్నారు. ఆయమ్మే ఏదైనా చేసి ఉండవచ్చును కూడానూ. కోడలు చనిపోతే మగవారిద్దరూ ఎక్కడికెళ్ళి పోయారు?” అన్నాడా మనిషి.

          ” నాయనా! నీకు గాని మీ కరణం పంతులుగారికి గానీ వారు కనిపిస్తే, వెంటనేరమ్మని చెప్పు, మేము విచారణ జరిపి వెళ్ళాలి, చూడు. కోడలు పిల్ల ముత్యాలు తల్లి దండ్రులు ఎలా విలవిలలాడి పోతున్నారో! ఈ సాయం చేయమన్నామని మీకరణం గారికి చెప్పు నాయనా!” వల్లభ బాబాయి రుద్రతాత, హనుమంతప్ప, రుద్ర తండ్రి భానుచంద్ర- .. చెప్పారు.

          ” అయ్యో ! బాబులూ! తప్పక చెప్తానయ్యా! ఇంత కట్టంలో సాయంచేయని వారు  ఎవరైనా మడిసే కాదు. వస్తాను, మాకరణం పంతులు గారికి విషయం విన్నవించుకో వాలి” అని అతడు వెళ్ళిపోయాడు. 

          మరునాడు ఆ ఊరి కరణం వారి కోసం వెతికించి ఎలాగో అందించిన సమాచారానికి లక్ష్మీనరసు వచ్చాడు. రెండు రోజులకే  చిక్కి సగమై బిక్కచచ్చి వచ్చాడు. రాగానే మామగారి కాళ్ళ పై బడి ఏడ్వసాగాడు.

          చూసి చూసి రుద్ర ” లేలే పెద్ద మాగాడివి! తల్లి దారుణంగా భార్యను చంపితే ముఖం చాటేసి వెళ్ళి పోయిన నీవూ ఒక మగాడివా? తల్లికి వెరిచే అమ్మకూచివి, దద్దమ్మవు నీకు పెళ్ళెందుకోయ్? అసలిలాంటివాడివి  బంగారం లాంటి ముత్యా లును ఎందుకు చేసుకున్నట్లు? ” అని  నిలదీసింది.

          లక్ష్మీ నరసు మామపాదాలు వదలి రుద్ర పాదాలు పట్టుకుని ” నాకు ఉరిశిక్ష విధిం చేలా చూడండి. నేను బ్రతికుండీ వ్యర్ధం.” అని మళ్ళా ఏడ్వసాగాడు.

          ముత్యాలు తండ్రి వచ్చి అతగాడ్ని లేపి ” నాయనా! నీదేం తప్పులేదు. నీవు నిజాన్ని మాకు తెలిపావు. ఇదో నీవు రాసిన ఉత్తరం. నీ ఉత్తరమూ, మాబిడ్డ పోయిందన్న టెలిగ్రామూ ఒకేమారు అందాయి. అసలు  మేమే విచారించకుండా పిల్లనిచ్చి కడుపు కాల్చుకున్నాం.” అన్నాడు.

          రుద్ర లేచివెళ్ళి ఆఉత్తరం అందుకుని ” ఇది చాలు బాబాయ్ ! వాళ్ళకు ఉరివేయిం చను.” అంటూ దాన్ని లాయర్లకు ఇచ్చింది. వారు  దాన్ని చదివి , అక్కడ చేరిన ఊరివారందరి వాగ్మూలాలూ రాసుకుని సంతకాలు చేయించుకున్నారు .

        “ఇహ మనం ఉండీ చేసేదేం లేదు. ఎటూ వారురారు. ఏం చేద్దాం?ఎప్పుడు వారు దొరికినా ఈ ఆధారాలతో జీవితాంతం జైల్లో వేయించవచ్చు. మేము కేసు ఫైల్ చేస్తాము. వెతికిద్దాం. దొరికాక చూద్దాం.” అన్నారు.

          ” ఇంత రాత్రిలో వద్దు, ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. రోడ్లు బాగాలేవు.”అన్నాడు మునసబు.

          “రేపు ఉదయం వరకూ చూద్దాం కరణంగారి కోసం. రాకపోతే రేపు ఉదయం రైలు. మీకు అందేలా మేమూ మీతో కలసి బైల్దేరుతాం. ఏమంటారు వల్లభరావు గారూ!” ఆయన స్నేహితుడు రాజమండ్రి నుంచీ వచ్చిన లాయరు అడిగారు.

          ఆ ఊరి మునసబుగారు అందరికి వేడి వేడి అన్నం , పప్పుచారూ, పెరుగూ, ఆవకా యా తెప్పించి భోజనాలు ఏర్పాటుచేశాడు. ముత్యాలు తల్లి దండ్రులకు బలవంతా న ఇంత తినిపించింది రుద్ర. అంతా ఏదో ఇంత తిన్నా మనిపించి ఎలాగో ఆ రాత్రికి అక్కడక్కడా కునుకు తీస్తూ ఊరివారు కొందరు తోడుండి, భానుమతమ్మ కోడలి పై చేసిన అఘాయిత్యాలు చెప్తుండగా వింటూ కడుపు చెఱువయ్యేలా ఏడుస్తున్న ముత్యాలు తల్లి దండ్రులను ఓదారుస్తూ రాత్రంతా గడిపారు.

          ఉదయాన్నేమునసబుగారు చేయించి తెచ్చిన ఉప్మా , కాఫీత్రాగి,”అయ్యా! ఆతిధ్యా నికి కృతఙ్ఞులం. ఎప్పటికైనా ఆ ఆడరాక్షసుల జాడ తెలిస్తే మాకు కబురు చేయండి , ఒక నిండు ప్రాణం తీసిన వారిని వదిలేది లేదు. కరణంగారు వచ్చినా వచ్చి మమ్మల్ని కలవమని చెప్పండి. నీవేం చేయ తలచావ్ లక్ష్మీనరసూ !” వల్లభ బాబాయ్ అడిగాడు.

          ” అయ్యా! నాకిక్కడ ఉండాలనే లేదు. మీరు మన్నిస్తే మీతో వచ్చి ఏదైనా పని చేసుకుంటాను. ఈఆస్థి నా కక్కరలేదు. మీరే ఎవరికైనా ఇచ్చేయండి. మానాయన గారు వస్తారని నాకు తోచదు. ఆయన ఏ కాశీకో వెళ్ళి ఉంటారు. కావున ఈ ఆస్థి వ్యవ హారమూ మీరు  మీకు తోచిన విధంగా  సరిచేసేయండి. ఎక్కడ  సంతకం పెట్టమం టే  అక్కడ పెడతాను. నేనీ ఊర్లో ఉండలేను మీతో వచ్చేందుకు  నాకు అనుమతివ్వండి. మీలాంటి మంచి మనుషులను చూస్తూ , మీ నీడన కూలిచేసుకు బ్రతుకు తాను.” అన్నాడు లక్ష్మీనరసు.

          “ఇతగాడు మనవద్ద ఉండటమూ మంచిదే! ఏనాటికైనా ఆ రాక్షసులు దొరికితే ప్రత్యక్షసాక్షి  మనవద్ద ఉండటం మనకు మంచిది. ” అన్నాడు వల్లభ బాబాయ్. లక్ష్మీనరసు ఆయన పాదాలు పట్టుకుని                  

 ” నాకు మీరేదిక్కు ” అన్నాడు.

*****

(ఇంకా ఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.