ఆరాధనాగీతి

-సుభాషిణి ప్రత్తిపాటి

 
పాత పుస్తకాలు
తిరగేస్తుంటే నెమలీక జారిపడింది,
ఎన్ని దశాబ్దాల నాటిదో
ఇంకా శిథిలం కాలేదు
గుండెలో దాచుకున్న
తొలివలపులా ఇంకా
మెరుపులీనుతూనే ఉంది!
 
ఊరంతా
మారిపోతోంది
పాతభవనాలన్నీ రాళ్ళగుట్టలవుతుంటే
అల్లుకున్న నా జ్ఞాపకాలన్నీ
చెంపలపై చెమ్మగా జారసాగాయి!
అదిగో ఆ రంగువెలసిన
అద్దాలమేడ కిటికీ మాత్రం
తెరిచే ఉంది
అక్కడినుంచి ఒకప్పుడు
నన్ను తడిమిన పద్మనేత్రాలు
లేకపోవచ్చు
కానీ
ఆ ఆరాధనా పరిమళం మాత్రం
ఇప్పటికీ
నాకు నిత్యనూతనమే!!
మా కళాశాలకు
పాతబడిన విద్యార్థిగా
వెళ్లాను,
అన్నీ నవాంశలే అక్కడ,
కొత్త గదులు,చెట్లు
ఒక్కటిమాత్రమే
నన్ను హృదయానికి
హత్తుకుంది
పాత మిత్రుడిలా..
నా వేళ్ళు తడిమిన ఆ పుటలన్నీ
విశ్వభాషలో నన్ను
పలకరించాయి,
నన్ను సేదతీర్చాయి
చంటిపాపను చేసి లాలించాయి
తాదాత్మ్యతలో
కాలం తెలీనేలేదు.
సముద్రం వైపు
నడిచాను.
తీరం హంగులు దిద్దుకుంది గానీ…
అలల దాహమే ఇంకా
తీరినట్టు లేదు
నా బాల్యంలోలాగే
ఒకటే హోరు…
నా స్మృతుల్ని సజీవం చేసిన
ఆ గాలి, ఆ నీరు, మా ఊరు, నా పుస్తకాలు
అన్నీ ఆ సంధ్యవేళ
ఓ ఆరాధనా గీతికై నా గొంతులోంచి
మెల్లగా విశ్వంలో కలుస్తోంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.