ఎండి తుమ్మ గజ్జెలు

-గుమ్మల సాయితేజ

ఆడుతున్న 

మా అయ్య చెప్పిన 
ఎండి తుమ్మ గజ్జెలు కట్టి ఆడుతున్న 
 
నవ్వుతున్న 
నవ్వుతూ ఆడుతున్న 
కొత్త బొబ్బలెక్కిన 
పెయ్యి ఏడెక్కిన
కంట్లో నీళ్లు బయటికొస్తే
చెమట అనుకోని 
తుడుసుకుంట 
 
ఆ డముకు డముకు సప్పుల్ల  
నా ఏడుపును కలిపేసి
 
పండ్లు ఇకిలిచ్చి 
కండ్లు సిన్నంగ చేసి 
నడుం మీదో చేయి 
నెత్తి మీదో చేయి పెట్టి 
 
భరతనాట్యం అయ్య 
పిల్ల తిని చాలా రోజులైందయ్య 
అని పాన్ పరాగ్ ఉమ్మేసుకుంటా చెప్తున్న 
 
మా అయ్య 
మొహం చూసి నవ్వుతున్న 
నవ్వుతూ ఆడుతున్న 
 
మూగవోయిన చేయి చూపించి 
పైసలు ఇచ్చిన 
పెద్దనాన్న , మామయ్య , పెద్దమ్మలను చూసి 
పొర్లు దండాలు పెడుతున్న 
తమ్ముని చూసి
 
అయ్యా .. అవ్వా .. అని
చెల్లెకు ప్రాక్టీసు చేయిస్తున్న అమ్మను
పాణం తీసే పెద్దపెద్ద పాములను 
కడుముల పెట్టుకున్న అక్కను చూసి 
 
కుంకుమ , పసుపులతో , కొత్త బట్టలతో  
అలంకరించుకున్న రాయిని చూసి 
దాని సుట్టు కూర్చున్న అవ్వ , తాతలను చూసి 
మూగవోయిన.. నేను మోసవోయిన 
 
నన్ను చెక్కిన అయ్య , అవ్వల అనాలో 
బతుకు రాసిన రాయిని అనాలో 
ఇంకా ఇంకా ఉత్సాహాన్ని ఇస్తున్న ఆ డముకు సప్పుల్లనాలో 
ఏ ఒక్క రోజైన పుస్తకాల సంచి భుజానేసుకుని 
మా దోస్తు సుప్రియ తో బడికి పోతననే ఆశననాలో తెల్వక , 
అసలు ఎవరిననాలో తెల్వక  
మూగవోయిన.. నేను మూగవోయిన 
 
అయిన సరే , నిరీక్షిస్తూనే ఉంటా 
కాలం ఎప్పుడూ ఒకే తీరు ఉండదని 
ఎండి తుమ్మ గజ్జెలు కావు ఇవి ఎండి గజ్జెలు అని 
భరత నాట్యం కాదిది బతుకు నాట్యం అని 
చెమట కాదిది నాయిన, నా ఆవేదనని 
రాయిని కాను నేను అరుంధతి అని 
మూగదాన్ని కాదు నేను మాట్లాడలేకపోతున్న అని 
పాన్ పరాగ్ కాదు నువ్వు ఉమ్మేస్తున్నది నీ రేపటి జీవితాన్నని 
మా అయ్య అవ్వ లకు అందరికి అర్ధం అయ్యేవరకు 
నిరీక్షిస్తూనే ఉంటా 
అప్పటివరకు ఆడుతూనే ఉంటా
 
అవే ఎండి తుమ్మ గజ్జెలు కట్టి ,
మళ్ళీ మళ్ళీ బతుకు నాట్యం ఆడుతూనే ఉంటా 
ఆడుతూనే ఉంటా 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.