కనక నారాయణీయం -36

పుట్టపర్తి నాగపద్మిని

           నట్టింట వెలసిన నవరత్న ఖచితమై

          నట్టి ఆసనమున మెట్టి కూర్చుండియు,

           పట్టు పీతాంబరముగట్టి, జగముల నేలు

           నట్టి కన్నతల్లి కమలాలయను మీరు..పిలువరె.. శ్రీలక్ష్మినీ..

           శ్రావణ వరలక్ష్మి పావన రూపము

           భావించి మది భక్తి భావమ్ముతో నిల్పి

           పూవుల షోడశ పూజల నొనరించి

           కావుమమ్మ మమ్ము కంబు కంఠియని..

          పిలువరె శ్రీ లక్ష్మినీ..మా యమ్మలారా..

          పిలువరె వరలక్ష్మి నీ..

        కళ్ళు మూసుకుని వింటూ ఉంటే, ఆనంద భైరవి రాగ మాధురంతా తొణికిసలాడు తున్న పాట, బహుశా కనకవల్లి స్వీయ రచనే అని గట్టిగా తోచింది. స్త్రీ సహజమైన అందమైన భావాలు, సంప్రదాయానుగుణమైన పదజాలం, ఎన్నుకున్న అనువైన రాగం – ఇవన్నీ చూస్తుంటే, కనకమ్మను యీ మార్గంలో కూడ రోత్సహించాలని గట్టిగా అనుకుంటూ, మధ్యాహ్నపు కునుకు నుండీ హుషారుగా లేచి, గట్టిగా అన్నారు,  ‘కనకా, కాఫీ!!’అని!!

        స్టీల్ లోటా (కప్పు) లో కాఫీ తో ఎదురుగా రెండవ  కూతురు తరులతా దేవి వచ్చింది. తెల్లగా బుట్టబొమ్మ వలె ఉండే తరులత అంటే, చాలా ముద్దు వారికి!! ఆమెను చూస్తుంటే, ఎక్కడో అమ్మను చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ‘తరులతను చూస్తుంటే మీ అమ్మను చూస్తున్నట్టుందిరా నారాయణా!! ‘ అని  తమ తండ్రిగారు శ్రీనివాసాచార్యుల వారు అన్న మాటలతో, తరులతా దేవిలో తన తల్లి పోలికలు ఎక్కువగా ఉన్నాయనే గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. తనను చూడగానే ఎప్పుడో దూరమైపోయిన అమ్మ జ్ఞాపకాలు చల్లగా మనసును తాకినట్టే ఉండి, ఏదో ఉపశమనం కలుగుతుంది. కనకవల్లికీ యీ సంగతి చూచాయగా తెలుసు. అందుకే భర్తతో ఇంటి విషయాలు చర్చించాలంటే,  ముందు తరులతను పంపి, తరువాత మెల్లిగా తాను రంగ ప్రవేశం చేసి, ఇంటి విషయాలు మాట్లాడే పద్ధతి  అమలు పరుస్తున్నది ఇటీవల!!

        ‘ఎట్లా ఉందట మీ అక్కయ్య హైద్రాబాద్లో??

        ‘బిఎస్సీ చదువుకుంటూంది కదా హైద్రాబాద్ లో అవ్వా వాళ్ళ ఇంట్లో??’

        పెద్దకళ్ళు గిరగిరా తిప్పుతూ పెద్దవాళ్ళలా చెప్పింది తరులత, ఆ మాత్రం నీకు తెలీదా?? అన్నట్టు!!

        ఫక్కున నవ్వేశారు పుట్టపర్తి. తెల్లమొహం వేసిన తరులతను చిన్నగా తలమీద మొట్టికాయ వేసి, అన్నారు.  

        ‘ఆఆ..నాకు తెలుసు కదా? బాగా చదువుకుంటూందటనా??

        ‘ఆ…చదువుకుంటూందయ్యా!! అక్కడ విమానాలు ఆకాశంలో చాలా పైన పోతూనే వుంటాయంట!! మొన్న సెలవులకు వచ్చినప్పుడు చెప్పింది. నాకు  కూడా ఒకసారి హైద్రాబాద్ కు పోయి ఆ విమానాలు చూడాలని…’ఆగిపోయింది తరులత.

        ‘ఆఆ..పోదువుగానిలే.. నీ సంగీత పాఠాలు బాగా జరుగుతున్నాయా??’

        ‘ఆ..కొండప్ప సారు బాగా చెబుతున్నాడు. మొన్న మీ అష్టాక్షరీ కృతి కూడా చెప్పినాడు.’

        ‘ఔనా?? ఏ పాట అది??

        ‘ఆడుకోరా కృష్ణా..ఆడుకోరా..వాడ వాడలదిరుగ వద్దురా..నా స్వామి..’

        ‘ఓహో..!! నీకు నచ్చిందా??

        ‘ఆ..బాగా..!! పాడేదా??

        పాట పాడాలంటే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది తరులతకు!! గొంతు కూడా సన్నగా తీగలా తియ్యగా వినిపిస్తుంది. కరుణ తరులత,  ఇద్దరూ కలిసి పాడుతుంటే, మెచ్చుకోనివాళ్ళు ఉండరసలు!! కరుణ గొంతులో గంభీరత నిండుగా వినిపిస్తే, తరులత గొంతులో మార్దవం తొణికిసలాడుతుందని, విన్నవాళ్ళు చెబుతుంటారు. తనకు ఇదివరకు వలె తీరిక దొరకటం లేదు. స్కూల్ కు తప్పనిసరిగా వెళ్ళి రావాలి. తరువాత, తన జపమూ, రచనలు, వేరే ఊళ్ళకు వచ్చే ఆహ్వానాలు..వీటీ మధ్య, ఇంటివైపు, పిల్లల వైపు దృష్టి పెట్టే సమయం తగ్గిపోతూంది. కానీ అన్నీ నిభాయించుకునే ఇల్లాలు కనకవల్లి ఉండగా, తనకు ఇబ్బందే తోచటం లేదసలు!!

        ‘అయ్యా..ఇప్పుడు పాడేదా??’ తరులత గట్టిగా అడిగేసరికి, ఆలోచనల్లో మునిగిన పుట్టపర్తి యీ లోకంలోకి వచ్చి పడ్డారు. 

        మళ్ళీ ఎప్పుడైనా వింటాలే!! తులజ, అరవిందు..?

        ‘బైట ఆడుకుంటున్నారయ్యా!!అని చెప్పి తుర్రున లోపలికి వెళ్ళిపోయింది తరులత.

        పుట్టపర్తి చిన్నగా నవ్వుకున్నారు. మెల్లిగా కాఫీ తాగుతూ!!   

        లోపలి నుండీ యీ సంభాషణ వింటున్న కనకమ్మ, తరులత అటు వెళ్ళగానే, మెల్లిగా లోపలికి అడుగు పెట్టబోతూ ఆగింది కాస్త ఆమె!! ఇప్పుడున్న గంభీర ముద్రలో వారిని ఇహలోకంలోకి రాక్కురావటమెలాగో నన్న ఆలోచన వల్ల!!

        కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తున్న భర్తను చూస్తుంటే, ఏదో రచన గురించి ఆలోచిస్తున్నట్టే ఉంది.  గంభీర ముద్రలో ఆయనను చూస్తుంటే, యీ సాంసారిక విషయాలకు దూరంగా తపో ముద్రలో ఉన్న అభిశప్త ఋషివలె కనిపిస్తారాయన!! అంతకు మించి, తనకు సంస్కృత, ప్రాకృత, తమిళ సాహిత్యలోక అద్భుత పరిచయం చేసిన గురుబ్రహ్మగా కూడ దర్శనమిస్తుంటారు.  వివిధ భాషా సాహిత్యాలలో ఆయన కున్న అభినివేశం, అధికారం చూస్తుంటే, మానవ మాత్రులకు ఇది సాధ్యమా?? అని ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాను ఆయనకు లిపికారిణిగా మారినప్పటి నుంచీ, ఆయన మరిన్ని రచనలను ఒప్పుకుంటూ, సులభంగా చేయగలుతున్నందుకు  ఆనందంగా అనిపిస్తుంది.

        అందరి సంసారాల వంటిది  కాదు తమ సంసారం!! రెక్కాడితే కానీ డొక్కాడటం  అన్నది సామెత!!ఇక్కడ సామెతను కాస్త మార్చవలె!! కలం పరుగులు తీస్తే తప్ప, కడగండ్లు లేకుండా సంసారం నడపలేని స్థితి!! రామకృష్ణా హైస్కూల్ లో ఇచ్చే జీతం డబ్బులు, 250 రూపాయలు, ఇంత సంసారం నడిపేందుకు ఎక్కడికీ చాలవు. అందుకే భర్త  కలం కదిపి, వెంకట్రామా, విద్యోదయా,  సాహిత్య అకాడమీ వంటి సంస్థల కోసం చేసే రచనలు, అప్పుడప్పుడు వెళ్ళి వచ్చే సన్మానాల  వచ్చే నూటపదార్లు,  అర్ధ నూట పదార్లు, చేదోడు వాదోడుగా, ఎట్లో సంసారం నడుస్తున్నది!!

        ఇటీవల తాను లిపికారిణిగా వెలువడిన వారిరచనల క్రమం ఆశ్చర్యం కలిగించేదిలా వుంది మరి!!

        శ్రీమదాంధ్ర మహా భాగవతం – మహాకవి పోతన (రాయల్ అండ్ కో వారి ప్రచురణ – 1954) సందర్భంలో, విద్యావతాం భాగవతే పరీక్షా..అన్నట్టు, భాగవతం మీద వారికున్న అధికారం – అబ్బుర పరచింది.     

        విజయ తోరణం – పేరుతో వెలువడిన రచనలో, యువత కోసం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రెండు అద్భుతమైన చారిత్రక కథలున్నాయి. అవి డిక్టేట్ చేస్తున్నప్పుడు, వారికి విజయనగర సామ్రాజ్య చారిత్రక పరిశోధకునిగా ఉన్న అపార జ్ఞానం అద్వితీయం అనిపించింది. ఆంధ్రప్రదేశ్ పాఠ్య గ్రంథాల కమిటీ గుర్తింపు పొందిన రచన ఇది. (1955) మొదటి కథ ఘనగిరిగా పిలువబడే పెనుగొండకు రాజైన దేవరాయలుకు సంబంధించినది. సవరం నారప్ప, బంగారు తిమ్మరాజు, హస్సేన్, పాత్రల మధ్య దేవరాయలు రాజ్యం ఎలా కల్లోలమయమైందనే కథావృత్తం. తరువాతి కథ రామరాయలులో అళియ రామరాయలు, సోలగుడు, అచ్యుతదేవ రాయలు- వీరి వల్ల ఏర్పడిన వివిధ నాటకీయ పరిస్థితుల వల్ల కృష్ణదేవరాయలు, ఎంతటి మనస్తాపానికి గురయ్యాడో పుట్టపర్తి వర్ణించిన తీరు – వ్రాస్తుంటే, తనకు కళ్ళనీరు తెప్పించింది. 

        సమర్థ రామదాసు, మరాఠీ నుండి తెలుగు అనువాదం చేస్తున్నప్పుడు, (1956) వారి మాతృ భాష మరాఠీయా?? అని సందేహం వచ్చింది.

        కర్మయోగులు (1956) రచన కూడా రెండు పెద్ద కథల సంకలనం. కాపయ నాయకుడు, జంబుకేశ్వరుడు అనే ఇద్దరు సాహస వీరులు కర్మయోగులుగా చరిత్రలో నిలిచిపోయిన నాటి నేపథ్యం – భర్త నోట వింటుంటే, వారి కథాకథన కౌశల్యం – నోట మాట రాకుండా చేసింది. ముస్లిం పాలనలో ఆంధ్ర రాజుల లో అనైక్యత వల్ల ఎదురైన పరిణామాలను ఎదుర్కొని, ఓరుగల్లులో కాకతీయ వైభవ కాంతులను దశదిశలా విసరింప జేసిన వాడు – కాపయ నాయకుడు. ఇక జంబుకేశ్వరుడు, తన శరణుజొచ్చిన బహాదుద్దీన్ అనే ముస్లిం పాలకునికి పెద్ద మనసుతో అభయమిచ్చి, ఢిల్లీ నవాబు శత్రుత్వాన్ని కొని తెచ్చుకుని వెనుదిరుగక, తన ప్రాణాలు కోల్పోయి, అంత:పుర  స్త్రీల ఆత్మార్పణకు కారణమై చరిత్రలో అమర వీరునిగా నిలిచిపోయిన వాడు.

        1957 లో ప్రచురితమైన వారి కావ్యం ‘సిపాయి పితూరీ’ వ్రాత ప్రతి తయారు చేస్తు న్నప్పుడు వారి దేశ భక్తి ప్రపూరితమైన పద్యాలు, వంద సంవత్సరాల నాటి సన్నివేశాలను, కళ్ళముందు నిలిపాయి.

        వ్యాపారంబని సొడ్డువెట్టుకుని యన్నాకాంక్షులై నాలుగున్

        కూపారంబులు దాటి పైబడి మతిజ్ఞుల్గాని రాజన్యు ‘లే

        మో పోనిమ్మ ‘ను భంగి నక్క వినయం బుల్సూపి కౌటిల్య లీ

        లా పాశంబుల గట్టినారు ధర ఎల్లన్ ఆంగ్లులాత్మంభరుల్!!

        ఇటు వంటి పద్యాలెన్నెన్నో!! ఆంగ్ల పరిపాలనలో మ్రగ్గిపోయిన దేశాన్ని బానిస సంకెళ్ళ నుండి విముక్తం గావించేందుకు, సైనికులు ముస్లిం హిందూ తేడాలు మరచి పోరాడే నిర్ణయం తీసుకుని సంగ్రామ భేరీ మ్రోగించారు. కానీ మళ్ళీ ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకుని, దాన్ని సిపాయిల తిరుగుబాటుగా చరిత్రకెక్కించిన ముష్కరుల కూట నీతిని పద్యకావ్యంగా హృద్యంగా ఆవిష్కరించారు వారు. దీనిని ఆదర్శ గ్రంథమాల, హైద్రాబాద్ వారు ముద్రించారు.

        సరస్వతీ సంహారం – పేరు వింటే చాలా విచిత్రంగా ఉంది కదా!! (1957)  సరస్వతీ పుత్రుడైన పుట్టపర్తి యీ అనువాద రచన వ్రాయడమేమిటి?? నిజమే!! కానీ, బీచి అనే కన్నడ నవలాకారుడు రచించిన నవలలో సరస్వతి – ఒక ఇంటి కోడలు. ఒట్టి మూర్ఖుడైన ఆమె భర్త వల్ల ఆమె పడిన కష్టాలూ, కన్నీళ్ళ వేదనామయ గాధే – యీ నవల. అనువాదం వలెకాక, నేరుగా తెలుగులోనే వ్రాయనడిందా అన్నట్టే ఉంది మరి!!

        ఇంకా ఎన్నెన్నో వైవిధ్య  భరితమైన రచనలు!!ఇన్నిటి మధ్య వారికి కుటుంబ బాధ్యతలు గుర్తుకు  రాకపోవటంలో ఆశ్చర్యం లేదేమో కానీ, ఆడపిల్లల తల్లిగా, ఎదుగుతున్న వారిద్దరినీ ఒక అయ్య చేతిలో పెట్టి, అత్తగారింటికి సాగనంపవలసిన బాధ్యతను వారికి కూడా గుర్తు చేసి తీరవలె!! అందుకే ఆ పని యీ రోజు చేసి తీరవలెనని కంకణం కట్టుకుని, వారున్న గదిలోకి ప్రవేశించింది శ్రీమతి కనకవల్లి.      

        ‘ఏమండీ!!’

        ‘..చెప్పూ!!’

        ‘ఆడపిల్లలిద్దరూ పెద్దవాళ్ళౌతున్నారు. పెళ్ళీడు వచ్చేస్తూంది. కరుణ అక్కడ హైద్రాబాద్ లో బీ.ఎస్సీ.  రెండో   సంవత్సరంలో ఉంది. ఇదిగో, తరులత కూడ చూడండి, చెట్టంత ఎదిగింది. ఇద్దరికీ పెళ్ళిల్లు చేసి, మన బాధ్యత తీర్చుకోవలె కదా!! ఇక్కడున్న వైష్ణవ కుటుంబాలకు మనమంటే ఏదో చిన్న చూపు. వాళ్ళ ఆర్థిక స్థితి గతులు మనకంటే ఎక్కువని కాబోలు!! అప్పటికీ నేనప్పుడప్పుడు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వస్తూ, ఆ మాటా యీ మాటా మాట్లాడుతూ,పెళ్ళీ సంబంధాలేవైనా వుంటే చెప్పమని అడుగుతూనే వుంటాను. ఇంత వరకూ ఎవ్వరూ ఏమీ చెప్పనే లేదు. మీరు కూడా కాస్త దృష్టి పెట్టవలె!! ‘

        పుట్టపర్తి యీ మాటలతో, కాస్త ఇహలోకంలోకి వచ్చి పడినట్టే అనిపించి, కనకవల్లి మళ్ళీ, గొంతు సవరించుకుంది. 

 ***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.