చిత్రం-39

-గణేశ్వరరావు 

 
 
          షెరాన్ రూథర్ ఫర్డ్ రూప చిత్రకళను అధ్యయనం చేశారు. ఈ తైలవర్ణ చిత్రంలోని వనిత, కెన్యా ప్రాంతంలోని ఒక తండా నాయకుడి భార్య, తన ఫోటో తీస్తున్నప్పుడు, చిత్రం గీస్తున్నప్పుడు ఆమె విరగబడి నవ్వుతూనే ఉందట. ఈ చిత్రంలో కూడా ఆమె నవ్వు మొహాన్ని చూడొచ్చు. తన ఫోటో తీసిన షెరాన్ కు ఆమె తన మెడలోని పూసల దండ బహూకరించింది. ఆ పూసల దండలోని రంగులనే వాడి షెరాన్ ఈ చిత్రాన్ని చిత్రించారు.
 
          ఆ పూసల దండ వెనక పెద్ద కథ వుంది, ఎన్నో అర్థాలు ఉన్నాయి. దక్షిణ కెన్యా మాసై స్త్రీలు ఐదు దశాబ్దాలుగా – 19వ శతాబ్దంలో యూరోపియన్లు రాకముందు – చేత్తో ప్రకృతి వనరులైన – బంక మన్ను, కర్ర పుల్లలు, గవ్వలు, ఎండు గడ్డి, ఎముకలు, ఇత్తడి వగైరాలతో పూసల హారాలు చేసుకని ఆభరణాలుగా వాడే వారు. ఇప్పుడు గాజు పూసలను కూడా వాడుతున్నారు. వాళ్ళు మెడలో వేసుకున్న దండ బట్టి, వాళ్లకి పెళ్లయిందా, లేదా అని తెలుసుకోవచ్చు. వీళ్ళ సంస్కృతి లో రూప సౌందర్యం ఒక భాగం. రంగు లేని రూపం వుండదు. మెరిసిపోయే రంగులు వీరికి ఇష్టం. ఒక్కొక్క రంగూ కొన్ని గుణాలకి చిహ్నం – సాహసం, బలం , ఐక్యతలకు ఎరుపు (మాసై ప్రజలు ప్రతీ రోజూ అసాధారణమైన సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు, దానికి ఇది ప్రతీక ), శక్తి, జీవనోపాధి, ఆకాశంలకు నీలం ( వానలు అక్కడి వారికి, పశువులకి ఆధారం అవుతాయి కనుక ) భూమి, ఉత్పత్తి, పోషణలకు ఆకుపచ్చ (వాళ్ళ భూమి రక్షణకు ఇది సంకేతం ) , స్నేహం, ఆతిథ్యం, ఆప్యాయతకు నారింజ , సంతానోత్పత్తి, అభివృద్ధికి పసుపు పచ్చ, పవిత్రత, ఆరోగ్యంకు తెలుపు, ఐక్యత , సంఘీభావంకు నలుపు రంగు ప్రతీకలు.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.