నా జీవన యానంలో- రెండవభాగం- 22

-కె.వరలక్ష్మి

          1994 ఆగష్టులో ఆరుద్ర సప్తతి ఉత్సవాలు జరిగాయి రాజమండ్రిలో. 29 వ తేదీ జరిగిన సభకు అటెండయ్యాను ఆనం కళాకేంద్రంలో..

          అప్పటికి ఏడాదిగా వాడుతున్న TB మందుల పవర్ తట్టుకో లేకపోతున్నాను. ఎలాగూ రాజమండ్రి వెళ్లేనుకదా అని స్వతంత్ర హాస్పిటల్ కి వెళ్లేను. మళ్లీ టెస్టులన్నీ చేసి ఇక మందులు ఆపేయచ్చు అన్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. ఆ మందుల ప్రభావం వల్ల చాలాడిప్రెస్డ్ గా ఉండేది,

          “దిగులు అనేది మనిషి అసమర్థ ఆలోచనల వల్ల, భయం అనే సుడిగుండం చుట్టూ తిరుగుతుండడం వల్ల పుట్టుకొస్తుంది”అంటాడు ఆస్టిన్ రిగ్స్.

          ఆ సంవత్సరం మొదలౌతూనే ప్రసిద్ధ రచయిత చాసో వాళ్లబ్బాయి ఇంట్లో తిరుపతి లో జనవరి 2న కాలం చేసారు. అంతకు ముందే 93 డిసెంబర్లో గౌతమీ గ్రంథాలయంలో జరిగిన ‘కథ 92′ ఆవిష్కరణ సభలో వారిని కలిసి మాట్లాడేను.

          1994 వరకూ జగ్గం పేటకి ఒక బస్టాండ్ అనేది ఉండేది కాదు. నాలుగు రోడ్ల జంక్షన్లో ఏ ఊరు వెళ్లేవాళ్లు ఆ వైపు రోడ్డులో ఎండనక, వాననక నిల్చోవాల్సిందే. 94 జూన్ 18న RTC కాంప్లెక్స్ ప్రారంభమైంది.

          1994 అక్టోబర్ 2న మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా ఇండియాలో నోబెల్ బహుమతితో సరితూగ గల శాంతి బహుమతిని ప్రధాని పి.వి. నరసింహారావు ప్రకటించారు. ఇక పై అమలులోకి వస్తుంది అని చెప్పారు.

          ఆ అక్టోబర్ 13న కర్నూలు మా చిన్నమ్మాయి ఇంటికెళ్లి వస్తూ హైదరాబాద్ లో ఆగేం నేనూ, మోహన్. ఎందుకంటే ఆ సంవత్సరం టిక్కెట్లు పెట్టి నిజాం బిల్డింగ్స్ పబ్లిక్ చూసే ఏర్పాటు చేసారు. పురానాహవేలీ, చౌమహల్, నిజాం బిల్డింగ్స్ మోడల్స్ చూసాం ఆరోజు. మర్నాడు అక్టోబర్ 14 న ఫలక్ నుమా పేలస్ చూసాం. అది కూడా గొప్ప అందమైన నివాస భవనం. అతిపెద్ద డైనింగ్ టేబుల్ తో సహా ఆ భవనం లోని ఉడెన్ వర్క్ చూసి తీరవలసినది. దసరా రోజులు. రోడ్లన్నీ జనప్రవాహంతో నిండిపోయి గొప్ప సందడిగా ఉన్నాయి. చేతుల్లో జొన్నకర్రలు, పిల్లలకి తల మీద చెమ్కీ టోపీలు, బూరాలు ఒకటే సందడి.

          డిశంబర్లో స్కూలు పిల్లల్ని విహారయాత్రకు తీసుకు వెళ్లాం. కాట్రావులపల్లి మీదుగా ద్వారపూడి వెళ్లి ప్రసిద్ధమైన అయ్యప్ప స్వామి ఆలయం సహా ఆలయాల సమూహం చూసి, కడియం మీదుగా కడియపులంక చేరుకుని ఫ్లవర్ గార్డెన్స్, పళ్ల తోటలు చూసి, ఒక తోటలో భోజనాలు చేసి, వేమగిరిలోని గోల్డ్ స్పాట్ ఫేక్టరీ చూసి, రాజమండ్రి మునిసిపల్ స్టేడియంలోని ఎగ్జిబిషన్  చూసి తిరిగివచ్చాం. వెళ్లిన దారిలో మళ్లీ వెళ్లకుండా ఆల్ రౌండ్  ప్రయాణం. ఆ రోజు హైలైట్ కడియపులంక కాలవలో ఫంట్ మీద అవతలి వొడ్డుకు వెళ్లి తిరిగి రావడం, ఆ నీటి మీద అలా కొంత దూరం ప్రయాణం చేస్తే బావుండునన్పించింది, ఫంట్ నడుస్తున్నప్పుడే ‘స్వాభిమానం’ కథకు బీజం పడింది.

          పిల్లలకు మాత్రం ఎగ్జిబిషన్ బాగా నచ్చింది.

          డిశంబర్ లోనే రంజని-ఎజి ఆఫీస్ వారి ‘మంచికథ’ సంకలనం అందింది. దాన్లో 91 లోను, 93 లోను రంజని అవార్డు పొందిన నా కథలు ‘గాజుపళ్ళెం’, ‘పిండి బొమ్మలు’ ఉన్నాయి. ఆ డిసెంబర్ లోనే ప్రఖ్యాత సినీనటి, గయ్యాళి పాత్రలకు ఏకైక నటిగా పేరు తెచ్చుకున్న శ్రీమతి సూర్యకాంతం గారు కాలం చేసారు.

          డిశంబర్ 22న ‘జనం’ కథ రికార్డింగ్ కోసం విశాఖపట్నం వెళ్లేను. 23న కళాభారతి లో శోభానాయుడు గారి శ్రీనివాస కళ్యాణం కూచిపూడి నాట్య ప్రదర్శన చూసాను. మా పెద్ద ఆడపడుచు రాణి, వాళ్లాయన గారు విజయవాడ  నుంచి వైజాగ్ వచ్చేరు. అప్పటికప్పుడు అనుకుని వాళ్ళిద్దరూ, నేను, మా అబ్బాయి రవీంద్ర ఒరిస్సా చూడాలనుకుని ఈస్ట్కోస్ట్ రాత్రి 10.30కి రిజర్వేషన్ లేకుండా ఎక్కేసాం డిశంబర్ 25న.  అంటే జనరల్ కంపార్ట్ మెంట్లో అన్నమాట, కిటకిటలాడే కంపార్ట్ మెంట్ లో ఎలా ఇరుక్కుని ప్రయాణం చేశామో ఆ పై వాడికే  ఎరుక.

          ఉదయం 6.30కి భువనేశ్వర్ లో దిగి, వెయిటింగ్ రూంలో స్నానాలు చేసి, స్టేషన్ ఎదుట ఉన్న సుధ హోటల్లో టిఫిన్స్ చేసాం. ఈ లోగా మా అబ్బాయి టూరిస్ట్ బస్ టిక్కెట్లు కొనుక్కుని వచ్చేడు. 8.30 కి బస్సెక్కేం. పాంధ్ నివాస్ దగ్గర మరో బస్సెక్కిం చారు.

          మధ్యాహ్నం 1 గం.కి పూరీ చేరుకుని జగన్నాధ స్వామిని, బలభద్రుని, వారి సోదరి సుభద్రను ఒకే పీఠం  మీద ఉన్న విగ్రహాలను దర్శించాం. గొప్ప ఆలయం, చాలా పెద్దగోపురం, నా చిన్నతనంలో ఇంటింటికో జగన్నాథుడి పేరు ఉండేది. ఎప్పుడెప్పుడు చూడగలమా అని ఎదురు చూసిన పూరీ ఆలయంలో అనుభూతి మాత్రం వేరుగా ఉంది. మన ఆంధ్రాబోర్డర్ దాటగానే ఒరిస్సా లో  ఉన్న ఆలయాల నిర్మాణం తో సహా ఏదీ మన సౌత్ లో లాగా లేదు, ఎడమ చేతిలో ఇత్తడి పళ్ళాలు పట్టుకుని కుడి చేతిలో మధ్యలో చీలిక ఉన్న వెడల్పైన వెదురు బెత్తాలు పట్టుకుని యాత్రికుల నెత్తిమీద, వీపు మీద చెళ్లుచెళ్ళు మని  వాయిస్తున్న పండాలను చూస్తే భయం, జుగుప్స కలిగాయి. దేవుడి మీది భక్తి ఎటో పారిపోయింది. నా మీద దెబ్బలు పడకుండా మా అబ్బాయి ఎక్కడికక్కడ తన చేతులు, భుజాలు అడ్డుపెట్టేడు. అక్కడ పెద్ద పెద్ద ఈగలు ఝుమ్మని ముసిరే తీపి పదార్థాలు, అన్నం కుండలు, పప్పుకుండలు- అవే ప్రసాదాలు. వాటికో నమస్కారం చేసి పూరీ సముద్ర తీరపు అందాలు కన్పించే  ఓ హొటల్లోకెళ్లి కూర్చుని భోజనం ఆర్డరిస్తే మా ముందు కప్పుల్లో ఉత్త అన్నం తెచ్చిపెట్టేడు, కూర, పప్పు, సాంబారు, పచ్చడి, పెరుగు లాంటి ఆధర్వులన్నీ విడివిడిగా కొనుక్కోవాలట. ఇదెక్కడి చోద్యం అని ఆశ్చర్యపోతూ అలాగే కొనుక్కుని తిన్నాం,

          2.30 కి అందర్నీ హడావుడి పెట్టి బస్సెక్కించేరు, 5 PM కి కోణార్క్ చేరుకున్నాం. ఓహ్! గొప్ప బృహదాలయం అది. రథాకారంలో ఎంతో అందంగా సముద్రపుటొడ్డున నిర్మించిన సూర్యదేవాలయం అది. శిల్పాలు, ఆలయం చాలా వరకు శిథిలమైపోయాయి. ఆలయం గోడల నిండా వివిధ కామభంగిమల శిల్పాలు. గర్భాలయంలో మూలవిరాట్టు లేదు. చరిత్రలో ఏం జరిగిందో ఆ కథంతా అందరికీ విదితమే కదా!

          ఆ ఆలయాన్ని దర్శించడం గొప్పఅనుభూతి, పూజారులు, పండాలు లేక మనసారా చూసేందుకు వీలైంది.

          7:30 PM కి భువనేశ్వర్ రైల్వేస్టేషన్ దగ్గర దిగి అక్కడికి దగ్గర్లో ఉన్న హోటల్ జజాటి (యయాతి) లో 350 రూ॥ కి రూమ్ తీసుకుని ఎక్సట్రా  బెడ్స్ కి డబ్బులు కట్టి అందరం ఒకే రూమ్ లో  సేదతీరాం. మర్నాడు ఉదయం మెలకువొచ్చేసరికి ఎనిమిది కావచ్చింది. ఆదరా బాదరా తయారై స్టేషన్ దగ్గరకెళ్ళేసరికి టూరిస్ట్ లింక్ బస్సు వెళ్లి పోయింది. 12 రూపాయలిచ్చి ఆటోలో పాంధ్ నివాస్ చేరుకున్నాం.

          మేం వెళ్లేసరికి అక్కడొక చిత్రమైన సీన్ నడుస్తోంది. టూరిస్ట్ బస్సులకి రెండు వైపులా ఇద్దరిద్దరు కూర్చునే సీట్లు మాత్రమే  ఉన్నాయి. పెద్దపెద్ద అద్దాల కిటికీల వల్ల ప్రయాణం లో తారసపడే ఊళ్లు, పరిసరాలు చూడడానికి వీలవుతోంది. ముందురోజు ప్రయాణంలో అందరూ భార్యాభర్తల జంటలు, ఒక్క నేను మా అబ్బాయి లాగే మరో సీట్లో మా వయసులోనే ఉన్న స్త్రీ పురుషులు ఉన్నారు. వాళ్ళు తల్లి, కొడుకులు కారని వాళ్ల బిహేవియర్ చెప్తోంది. అంతకు మించి కొంత ఓవర్ గా కూడా ఉంది వాళ్ల నడవడిక, ఈ రోజు వాళ్లను బస్సెక్కించు కోవద్దని మిగతా ప్రయాణీకులు పట్టుపడుతున్నారట. అందుకని బస్సు వాళ్లు వాళ్లని ఎక్కనివ్వలేదట. అందుకని ఆ అబ్బాయితో కలిసి ఆవిడ రోడ్డుపైన బస్సు కడ్డంగా బైఠాయించింది. కేకలు, గొడవ. మొత్తం మీద వాళ్లకేం చెప్పేరో వాళ్లెక్కకుండానే అరగంట ఆలస్యంగా మా బస్సు కదిలింది.

          ఆ రోజుల్లో ఆ టూరిస్ట్ బస్సుల్లో రోజుకి ఒక్కొక్కరికి 85 రూపాయలు, బస్సు ముందుగా భువనేశ్వర్ కి 20 కి.మీ॥ దూరం లో ఉన్న ‘నందన్ కానన్’ చేరుకుంది. అక్కడి జూలో చాలా వెరైటీ యానిమల్స్ ఉన్నాయి. తెల్లపులినీ, నల్లచిరుత పులిని మొదటి సారిగా నేను అక్కడే ప్రత్యక్షంగా చూసేను, ఆ జూలో రోప్ వే లో ప్రయాణించడం మరచిపోలేని అనుభూతి. చిన్న లేక్ మీదుగా ప్రయాణించి అందమైన బొటానికల్ గార్డెన్స్ చూసి వెనక్కి రావడం ఎంతో బావుంది. తర్వాత పక్కపక్కనే ఉన్న రెండు కొండల మీది కేవ్స్, గుహాలయాలు చూసాం. విపరీతమైన కోతుల రద్దీ అక్కడ. వెళ్లే వాళ్లంతా అక్కడ పెద్ద పెద్ద బస్తాల్లో పెట్టిన వేరుసెనగ కాయల్ని కొని పట్టుకెళ్లి ఆ కోతులకి సమర్పిస్తున్నారు. ఉత్తచేతుల్తో వెళ్లేవాళ్లని అవి కదల నివ్వడం లేదు. చిన్నపిల్లల నుంచి ముసలివాటి వరకూ వేలల్లో ఉన్నాయి. వేరుసెనగకాయల తుక్కు జనానికి మోకాలి వరకూ వస్తోందంటే ఊహించుకోవచ్చు. అప్పటికి మా ఊరికింకా కోతుల బెడద రాక నేను బిడ్డలకి పాలిస్తున్న కోతుల్ని అపురూపంగా చూస్తూ ఉండిపోయాను. బస్సు భువనేశ్వర్ చేరుకున్నాక 1972 లో నిర్మించిన అమరగిరి మీది బౌద్ధస్థూపం, లింగరాజాలయం, ఆ ప్రాంగణంలోని చిన్నవీ పెద్దవీ శివాలయాలు, లింగరాజాలయంలో పెద్దగా, గొప్పగా ఉన్న సిద్ధగణపతి విగ్రహం, భువనేశ్వరీ దేవి ఆలయం చూసి అలసి పోయి రూంకి చేరుకుని ఖాళీ చేసేసి స్టేషన్కి చేరుకున్నాక తెలిసింది 10.30 PM కి బయలుదేరాల్సిన కోణార్క రేపు ఉదయం 6 గంటలకి బయలుదేరుతుందని, ఇంకెక్కడా రూమ్ దొరక్క వెయిటింగ్ రూంలోని చల్లని నేల మీదే దుప్పట్లు పరుచుకుని పడుకున్నాం. డిశంబర్ 28  ఉదయం 6 కి ఎక్కిన కోణార్క సాయంత్రం 4.30కి విశాఖపట్నం చేరుకుంది.

          మమ్మల్ని చూస్తూనే మా గీత గబగబా అన్నం, చేపల పులుసు చేసింది. మూడు రోజులుగా మంచి తిండి దొరక్క అన్నం కోసం మొహం వాచినట్లై పోయిన అందరం వేడి నీళ్లస్నానాలు కానిచ్బి ఎంత తిన్నామో తెలీకుండా తినేసాం. ఒరిస్సాలో టిఫిన్స్  టైంలో రసగుల్లాలు, జిలేబీలు లాంటి స్వీట్స్ దొరకడం, మన ఇడ్లీలు దోసెలు కానరాక పోవడం నాకొక్క  దానికే నచ్చింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.