మిట్ట మధ్యాహ్నపు మరణం- 12

– గౌరీ కృపానందన్

          ఆనంద్ సూటిగా ఉమను చూశాడు. “ఎందుకు వదినా?”

          “నన్ను వదినా అని పిలవకు. ఉమా అనే పిలువు. ఇదేం నంబరు? పది బార్ ఎనిమిది?”

          “ఏదో అడ్రెస్ అయి ఉంటుంది.”

          “అక్కడికి వెళ్లి అడుగుదామా మాయ ఎవరని?”

          “నాకేమో అలా ఎవరూ ఉండరని అనిపిస్తోంది.”

          “లేదు ఆనంద్! హోటల్ గదిలో నిలువుటద్దం మీద వ్రాసి ఉంది కదా?”

          “ఒక వేళ మాయ ఎవరు అని కనుక్కున్నా మూర్తి మళ్ళీ ప్రాణాలతో వస్తాడా?”

          మూర్తి తండ్రి ఉమను అడిగారు. “ఉమా! నువ్వు ఈ ఇంట్లోనే ఉండబోతున్నావా?”

          “నేను ఈ ఇంటి కోడలినే కదా?”

          “అవుననుకో. కానీ….”

          “కొడుకే పోయిన తరువాత నాకు ఈ ఇంట్లో స్థానం లేదంటారా?”

          “అలా కాదమ్మా. ఈ ఇంట్లో ఉంటే అతని జ్ఞాపకాలు నిన్ను బాధ పెడతాయని.”

          “అందుకని నన్ను మా ఇంటికి వెళ్లి పోమ్మంటున్నారా?”

          “ఉమా! సూటిగా జవాబు చెప్పు. నువ్వు అతన్ని మరిచి పోవద్దా?”

          “ఎందుకు మరిచి పోవాలి?”

          “నేను కూడా నా కొడుకుని మర్చిపోవాలి. చిన్న వయస్సులో అతను పోయాడు. ముసలివాణ్ణి, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మళ్ళీ మళ్ళీ అతని జ్ఞాపకం వస్తే జీవించడం కష్టం అమ్మా. నా మాట విను. పెళ్లి చేసుకుని రెండు రోజులు అతనితో కాపురం చేశావు. అంతే! నువ్వు చదువుకున్న దానివి. ముందు ముందు జీవితం చాలా ఉంది నీకు. ఏదైనా ఉద్యోగం చెయ్యి. చదువుకో. ఇంకో పెళ్లి చేసుకో. మాఅందరికీ సంతోషంగా ఉంటుంది. అంత వరకూ నిన్ను చూస్తూ ఉంటే ఏదో తప్పు చేసినట్లు బాధ మనసుని కెలుకుతూ ఉంటుంది.”

          “మామయ్యా! ఆయన ఎందుకు హత్య చేయబడ్డారని తెలుసుకోవద్దా? కారణం ఏమిటో తెలుసుకోవాలని మీకు అనిపించడం లేదా?”

          “లేదమ్మా లేదు. అతన్ని మరిచి పోవాలనే అనిపిస్తోంది. హంతకుణ్ణి నా ముందు నిలబెట్టినంత మాత్రాన పోయిన నా కొడుకు తిరిగి వస్తాడా?”

          “మీ కొడుకు హత్య చేయబడటానికి ఒక కారణం వుండి ఉండాలి. ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలి.”

          “తెలుసుకుని ఏం చేయబోతున్నావు?”

          “అతన్ని హత్య చేయడానికి ఒక బలమైన కారణం ఉండాలిగా? నా భర్త ఎవరికైనా అపకారం చేశాడా? ఎవరో కావాలని కక్షతో చంపారా? నా భర్త దోషా , నిర్దోషా తెల్సుకోవాలి.”

          “ఉమా! మీ అమ్మగారు వచ్చారు చూడు.” క్రింది నుంచి పిలుపు వినిపించింది.

          ఉమ క్రిందికి వెళ్ళగానే ఆనంద్, అతని తండ్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

          “విచిత్రమైన అమ్మాయి” అన్నారు ఆయన.

          “అలా ఏదైనా కారణం ఉండి ఉంటుందా నాన్నా?”

          “ఛ.. ఛ.. మూర్తి రత్నం లాంటి వాడురా.”

          “మనకి తెలిసినంత వరకూ.”

          “అంటే?”

          “లేదు నాన్నా! ఆమె కోణం నుంచి ఆలోచిస్తే మనం మూర్తి గురించి ఏదో దాచిపెట్టి ఈ పెళ్లి చేసామని అనుకుంటోంది. ఆ సందేహాన్ని పోగొట్టడం మన కర్తవ్యం కాదా. తను ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండనీ. మనం అభ్యంతరం చెప్పవద్దు.”

          ఉమ చేతిలో చిన్న పెట్టెతో అక్కడికి వచ్చింది. “నా చీరలు, జాకెట్లు తెచ్చి ఇవ్వమన్నాను. అమ్మ తెచ్చింది. నన్ను చూడగానే మళ్ళీ ఏడుపు. క్రింద అత్తయ్య, అమ్మ ఇద్దరూ ఏడుస్తూనే ఉన్నారు. ఆనంద్! నేను ఈ గదిలో ఉండవచ్చా?”

          “నిరభ్యంతరంగా!”

          “మామయ్యా! మీకు అభ్యంతరం  ఉండదుగా?”

          “లేదమ్మా. ఎన్ని రోజులు ఉండబోతున్నావు?”

          “నా ప్రశ్నకు సమాధానం దొరికే దాకా.”

***

          “శాంతా! నీకు తెలుసా? మయుడు రావణాసురుడికి మామగారని ఒక పురాణంలో ఉంది.”

          మధ్యాహ్నం భోజనం చేస్తూ సంబంధం లేకుండా మాధవరావు ఇలా అనగానే అతని భార్య విస్తు బోయింది.

          “ఇదేమిటి? సంబంధం లేకుండా ఏమేమో మాట్లాడుతున్నారు. ఆ కేసు విషయమేనా? నిద్రలో కూడా దాన్ని గురించే కలవరిస్తున్నారు. ఏదైనా ఆచూకీ తెలిసిందా?”

          “ఇంత వరకు లేదు.  దివ్య, రామకృష్ణ ఇద్దరి గురించి కాస్త లోతుగా ఎంక్వయిరీ చేయాలి. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ రాగానే తెలుస్తుంది. D.C. క్రైమ్స్ కబురు పెట్టారు. ప్రెస్ వాళ్ళు విరుచుకు పడుతున్నారు. శాంతా! ఒక వ్యక్తిని పది సార్లు కత్తితో పొడిచి చంపాలంటే ఎంత ద్వేషం ఉండి ఉండాలి?”

          “చాలా ఎక్కువగా!”

          “అంతటి ద్వేషం ఉండటానికి ఎవరికి ఆస్కారం ఉందని కనిపెడితే ఈ కేసు తేలిపోతుంది.”

          సీరియస్ గా మాట్లాడుతున్న భర్త వైపు చూసింది. రేషన్ కార్డు తెచ్చుకోవాలన్న సంగతిని గానీ, గ్యాస్ సిలిండర్ అయిపోయిందని గానీ భర్త దగ్గర చెప్పడం సాధ్యం కాదు. చెప్పినా వినిపించుకోడు.

***

          సులేఖా స్టోర్స్ లంచ్ టైం కోసం షాపు తలుపులు మూస్తూ ఉండగా మాధవరావు అక్కడికి చేరుకున్నారు.

          ఇనస్పెక్టర్ ని చూడగానే షాపు యజమాని కంగారు పడ్డాడు.

          “సేల్స్ టాక్స్ అన్నీ సరిగ్గానే కడుతున్నాం సార్.”

          “ఆ విషయం అడగడానికి రాలేదు నేను. భయపడకండి.” తన దగ్గర ఉన్న షూ ప్రింట్స్ చూపించారు. “ఈ ఫోటో చూడండి.”

          అతను సందేహంగా చూసి, “ఏమిటిది?” అన్నాడు.

          “ఇది మీ షాపులో కొన్న షూ ప్రింట్స్.”

          “అయి ఉండవచ్చు.”

          “ఉండవచ్చు అంటే? మీరు షూ తయారు చేయరా?”

          “కాన్పూర్ నించి హోల్ సేల్ గా తెప్పించి మా పేరు వేయించి అమ్ముతాం. అంతే.”

          “ఈ షూ మీ షాప్ లో అమ్మబడిందే కదా?”

          “అవును సార్.”

          “దీన్ని చూసి మీకు తెలిసిన వివరాలు చెప్పండి.

          “కాస్త పాత మాడల్ అనుకుంటాను. ఆరేడు నెలల క్రితం అమ్మబడి ఉండొచ్చు. జెంట్స్ షూ, సైజు తొమ్మిది.”

          “ఆరు నెలల క్రితం పొడుగ్గా ఎవరైనా షూస్ కొన్న జ్ఞాపకం ఉందా మీకు?”

          “సాధారణంగా జ్ఞాపకం ఉండదు. కాని ఈ షూ రబ్బర్ సోల్. అందుకే జ్ఞాపకం ఉంది. ఇది స్పోర్ట్స్ షూ.”

          “నిశ్చయంగా తెలుసా?”

          “తెలుసు.”

          “ఆరునెలల క్రితం ఉన్న మీ బిల్లులను చూసి వివరాలు ఏమైనా చెప్పగలరా?”

          “బిల్లును చూస్తే ఏ వివరాలు తెలియవు సార్.”

          “ఎందుకైనా మంచిది. ఒకసారి చూడండి.”

          “బిల్లు పుస్తకాలు అక్కౌంటెంట్ దగ్గర ఉన్నాయి.”

          “అర్జంటు లేదు. నేను రెండు రోజుల తరువాత వస్తాను. ఈ లోపల చూసి ఉంచండి.”

          “దేని కోసం ఈ వివరాలు కావాలి సార్? నేను తెలుసుకోవచ్చా?”

          “పేపర్లో చదివే ఉంటారు. హనీమూన్ కోసం వచ్చిన భర్త హత్య.”

          “ఓ… అదా.”

          “నేను మళ్ళీ వస్తాను.”

          మాధవరావు నేరుగా D.C. ఆఫీసుకి వెళ్ళినప్పుడు, గది బైట ఆ ఫోటోగ్రాఫర్ ఎదురు చూస్తున్నాడు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.