కాళరాత్రి-14

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

          మమ్మల్ని బెర్కినాలో ఆహ్వానించిన క్రూరుడు డా॥ మెంజలీ చుట్టూ ఆఫీసర్లు మూగారు. బ్లాకల్‌టెస్ట్‌ నవ్వుతున్నట్లు నటిస్తూ ‘‘రెడీగా ఉన్నారా?’’ అని అడిగాడు.

          మేము, ఎస్‌.ఎస్‌. డాక్టర్లూ అందరం రెడీగా ఉన్నాం. మెంజెలీ చేతిలో మా నంబర్ల లిస్టు ఉన్నది. బ్లాకల్‌టెస్ట్‌కి సిగ్నల్‌గా తలూపాడు.

          మొదట పోవలసిన వారు కపోలు, ఫోర్‌మెన్‌, వాళ్ళంతా శారీరకంగా బలంగా ఉన్నారు. తరువాత మామూలు ఖైదీలు. వాళ్ళని మెంజలీ పట్టి పట్టి చూస్తున్నాడు. ఒక నంబరు రాసుకున్నాడు.  నా నంబరు తీసుకోకుండా ఉండాలి. నా ఎడమ భుజం (నంబరున్నది) చూపగూడదని ఆలోచించాను.

          నా ముందు యిక టిబి, యోసి మాత్రమే ఉన్నారు. వాళ్ళు దాటారు. మెంజలీ వాళ్ళ నంబరు రాసుకోలేదు. నన్నెవరో ముందుకు తోశారు. పరుగెత్తాను. నా బుర్రలో మోత ` నీవు మరీ పీలగా ఉన్నావు. బలహీనంగా ఉన్నావు. మంటలలో తోస్తాము అని. పరుగు అంతం కానట్లు, నేను ఏళ్ళ తరబడి పరుగెత్తుతున్నట్లనిపించింది నాకు. చివరికి చేరాను. పూర్తిగా అలిసిపోయాను. ఊపిరి సలిపాక టిబి, యోసీని అడిగాను. నా నెంబరు రాసుకున్నాడా అని. లేదని చెపుతూ, నేను చాలా వేగంగా పరుగెత్తాను గనుక నంబరు రాసే అవకాశం ఇవ్వలేదన్నారు.

          చాలా సంతోషమనిపించింది. యోసీని ముద్దులు పెట్టు కోవాలనిపించింది. అమ్మయ్యా! నా నంబరు రాసుకోలేదు. అంతే! ఇతరుల గురించి నేను ఆలోచించలేదు.

          నంబరు రాయబడిన వారు ఒక పక్కగా నిలబడ్డారు. ప్రపంచం వారిని వొదిలేసింది అని నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు.

          ఎస్‌. ఎస్‌. ఆఫీసరు వెళ్ళిపోయాడు. బ్లాకల్‌టెస్ట్‌ కనిపించాడు. మా అందరి అలసట అతని ముఖంలో కనిపించింది.

          ‘అంతా సవ్యంగా జరిగింది. ఎవరికేమీ హాని జరగదు, విచార పడకండి’ అంటూ యింకా నవ్వే ప్రయత్నమే చేస్తున్నాడు.

          మరీ వసి వాడిపోయిన ఒక యూదు ‘‘మరి నా నంబరు రాశారుగా సర్‌’’ అన్నాడు. తన మాట నమ్మనందుకు బ్లాక్‌ల్‌ టెస్ట్‌కి కోపం వచ్చింది.

          ‘‘నేను అబద్ధాలాడుతున్నానను కుంటున్నారా? ఎవరికీ ఏమీ కాబోటం లేదు. మీరెంతసేపు విచారంలో మునిగి తేలుతూ ఉంటారు, ఫూల్స్‌ మీరు’’ అన్నాడు.

          క్యాంపులో సెలక్షన్‌ ముగిసినట్లు గంట మోగింది.

          మా బ్లాక్‌ నం 36 వైపు పరుగెత్తుతుంటే నాన్న నా వైపు వస్తూ కనిపించాడు. ఇద్దరం సెలక్షన్‌ తప్పించుకున్నామని తెలుసుకున్నాము. మామూలుగా ఊపిరి పీల్చుకో గలిగాము. నాన్న నాకు సగం రేషన్‌ అందించాడు. డిపోలో బూట్ల రిపేరురు పనికి వచ్చే రబ్బరు దొరికితే అది యిచ్చి ఆ రేషన్‌ సంపాదించాడు.

          మేమిద్దరం విడిపోవాలి. పడకకు టైము గుర్తుచేస్తూ గంట మోగింది. గంటే యిక్కడ ఆర్డర్లు వేస్తుంది, మేము పాటిస్తాము. ఆ గంట మోత అంటే నాకు అసహ్యం. నేను మంచి ప్రపంచంలో జీవితాన్ని గురించి కలలు కన్నప్పుడంతా అక్కడ గంట ఉండకూడదు అని అనుకునే వాడిని ` గంట రహిత ప్రపంచం ఉండాలని ఊహ.

          కొన్ని రోజులు గడిచాయి. సెలక్షన్‌ గురించి మేము ఆలోచించటం లేదు. మామూలుగా పనిలోకి వెళ్ళాం. బరువు బండలు బండిలో ఎక్కించాం. మార్పు అంతా రేషన్‌ తగ్గటమే.

          రోజూ మాదిరి ప్రొద్దునే లేచాము. నల్లకాఫీ, రొట్టె తీసుకున్నాం. పనికి బయలుదేరు తుంటే బ్లాకెల్‌టెస్ట్‌ పరుగు పరుగున వచ్చాడు.

          ‘‘నా దగ్గర చాలా నంబర్లున్నాయి. చదువుతాను ఆ నంబరు గలవారు ఈ దినం పనికి పోరు. క్యాంపులోనే ఉండాలి’’ అన్నాడు. 10 నంబర్లు చదివాడు. అవే మెంజలీ రాసుకున్న నంబర్లు.

          ఆ పది నంబర్ల వాళ్ళు అతన్ని పట్టుకుని ‘‘మమ్మల్ని కాపాడండి. మేము పని చేయగలం, డిపోకి పోతాం. మేము బాగా పనిచేసే వాళ్ళం’’ అంటూ ప్రాధేయపడ్డారు.

          ‘‘క్యాంపులో ఉండిపోయి నందు వల్ల ఏమి హాని జరగదు. నేను రోజూ యిక్కడే ఉంటున్నాను. గదా!’’ అంటూ వాళ్ళను ఓదార్చబోయాడు.

          తన మాటలు వారిని ప్రభావితం చేయలేదని గ్రహించి తన రూముకెళ్ళి తలుపులు మూసుకున్నాడు.

          గంట మోగింది. మా పని కష్టమైనదని యిప్పుడు మేము ఆలోచించటం లేదు. చావుకు, నరకానికి దూరంగా ఉండ గలిగితే చాలనుకున్నాం. ఇంతలో నాన్న పరుగెత్తుతూ నా వద్దకు వచ్చాడు. రొప్పుతున్నాడు. మాట పెకలటం లేదు.

          ‘‘నన్ను, నన్ను, నన్ను క్యాంపులో ఉండమన్నారు’’ అన్నాడు. తన నంబరు రాసుకున్నట్లు తనకు తెలియ జేయనే లేదు. ‘‘ఇప్పుడేం చేద్దాం’’ అన్నాను ఆందోళనగా. నన్ను నాన్నే ఓదారుస్తున్నాడు. ‘‘మరో సెలక్షన్‌ చేస్తారట ఈ రోజు. ఇంకా ఆశ ఉన్నది’’ అన్నాడు. నేనేమీ అనలేక పోయాను.

          నాకెన్నో విషయాలు చెప్పాలని నాన్న తొందర పడుతున్నాడు. మాట రావటం లేదు. మరికొన్ని క్షణాలలో నేను పనికి పోవాలి.

          ‘‘ఇదిగో ఈ చాకు తీసుకో ఈ చెంచా గూడా. వాటితో నాకిక పని లేకపోవచ్చు. నీకు పనికొస్తాయి. ఈ రాత్రి పని తరువాత కలుద్దాం’’ అన్నాడు.

          కపో ‘‘పదండి’’ అని గదిమాడు. పనివాళ్ళం క్యాంపు గేటు వైపుకు మరలాము. నాన్న గోడకు చేరగిలబడి బ్లాక్‌ దగ్గరే ఉండిపోయాడు.

          నాన్న నాకింకా ఏదో చెప్పాలని పరుగెత్తి రాబోయాడు. అప్పటికే మా కవాతు దూరం కాసాగింది.

          గేటు దగ్గర మమ్మల్ని లెక్క పెడుతున్నారు. మిలిటరీ బ్యాండు వినిపిస్తున్నది. మేము గేటు దాటాం.

          నా పరిస్థితి నిద్రలో నడిచే వాడిలా ఉన్నది. రోజంతా టిబి, యోసి ధైర్యం చెబుతున్నారు. కపో నాకా రోజు తేలిక పనియిచ్చి ఓదార్చాడు. నన్ను అనాధగా చూస్తున్నారు. జాలి చూపుతున్నారు. నాన్న తానున్న పరిస్థితిలో గూడా సాయ పడుతున్నాడనిపించింది.

          ఈ రోజు త్వరగా గడవాలి అని నేను భావించ లేదు. ఒంటరి వాడిగా మిగిలిపోతాననే భయం పట్టుకుంది. ఇక్కడ ఇప్పుడిలా చనిపోతే ఎంత బాగుంటుంది అనే ఆలోచనే ఎంతసేపు. పని ముగిసింది. బ్లాక్‌ 36 వైపుకు పరుగెత్తాను.

          ఈ భూమ్మీద యింకా అద్భుతాలు జరుగుతున్నాయి. నాన్న సెకండ్‌ సెలక్షన్‌ పాసయ్యాడు. సజీవంగా ఉన్నాడు. నేనా చాకూ, చెంచా నాన్నకి తిరిగి యిచ్చాను.

          అకీబా డ్రమర్‌ మా నుండి వీడిపోయాడు సెలక్షన్‌ వల్ల. ఈ మధ్య తనకు శక్తి చాలటం లేదని మాతో చెపుతూ ఉన్నాడు. తన పని ముగిసింది అంటుంటే ధైర్యం చెప్పబోయాము.

          ‘‘నా పని అయిపోయింది, ఇక పోరాడలేను, నాకు నమ్మకం నశించింది’’ అంటూ శూన్య దృక్కులు ప్రసరిస్తూ మా మధ్య తిరుగాడాడు.

          అతనొక్కడే కాడు ఆ స్థితికి వచ్చింది. పోలండ్‌ రబీ పెద్దాయన ` టల్‌ముడ్‌ అంతా కంఠతా వచ్చు.  ఎప్పుడూ ప్రార్థిస్తూనే గడిపేవాడు. ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ, సమాధానాలు చెప్పుకుంటూ ఉండేవాడు.

          ఒకరోజు నా దగ్గరకు వచ్చి ‘‘అంతా ముగిసిపోయింది, దేవుడు మనతో లేడు’’ అన్న వెంటనే బాధపడ్డాడు. ‘‘ఎవ్వరికీ దేవుని లీలలు అర్థం కావు. మనం ప్రశ్నించగలమా? కాని ఈ వయసులో నేనేమి చేయలేక పోతున్నాను. నేను అతి సాధారణ వ్యక్తిని, సాధువును కాదు. ఇక్కడ జరుగుతున్నదంతా నా కళ్ళతో చూస్తున్నాను. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన దయ ఏదీ? ఆయన దయామయుడని ఎలా నమ్మగలం?’’ అన్నాడు.

          అకీ బాడ్రమర్‌ దేవునిలో నమ్మకం పోగానే మృత్యువుకు చేరువయ్యాడు. పోరాడే శక్తి కోల్పోయాడు. సెలక్షన్‌ జరిగినప్పటి నుండి ‘‘మూడు రోజుల్లో నేను పోతాను, నా కోసం కడిష్‌ చెప్పండి’’ అన్నాడు.

          అతనికి విశ్వాసం ఇచ్చాము. 3 రోజుల్లో చిమ్నీ పొగ చూడగానే పదిమందిమి చేరి అతని పేరుతో ప్రత్యేక ప్రార్థన ఏర్పాటు చేస్తామని, కడిష్‌ చెపుతామన్నాము.

          హాస్పిటల్‌ వైపు నడిచాడు, నిలకడగా ఉన్నాడు. వెనుదిరిగి మా వైపు చూడలేదు. అతన్ని బెర్కినా తీసుకుపోవడానికి ఆంబులెన్స్‌ సిద్ధంగా ఉన్నది.

          తరువాతి రోజులు మరీ గడ్డుగా మారాయి. ఆహారం కంటె దెబ్బలే ఎక్కువ తిన్నాము ` అతను వెళ్ళాక 3 రోజులలో మేము కడిష్‌ చెప్పడం మరిచాము.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.