చాతకపక్షులు  (భాగం-19)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

          మూడు నెలలు గడిచిపోయేయి.

          మేనమామ రమణ ఫోను చేశాడు. ఆయన ఏడాదిపాటు కంపెనీ పనిమీద జర్మనీలో వుండి ఇప్పుడు తిరిగి వచ్చేడు న్యూయార్కు‌కి.

          మామయ్య గొంతు వినేసరికి ప్రాణం లేచొచ్చింది గీతకి. 

          “బాగున్నావా?” అని ఆయన కుశల ప్రశ్నలేస్తూంటే, పూర్వపు రోజులు గుర్తొచ్చేయి. “హరి ఎలా వున్నాడు?” అని ఆడిగాడు.

          గీత క్షణం తటపటాయించి, “బాగానే వున్నారు” అంది.

          ఆయన మళ్లీ “వుద్యోగం బాగుందా?” అని సూటిగా అడిగినప్పుడు మాత్రం “పోయింద” ని చెప్పక తప్పలేదు.

          ఆయన అయ్యో అని, “నేను కూడా చూస్తాను. అతను ఇంటికొచ్చేక నన్ను పిలవమని చెప్పు” అన్నాడు.

          “నువ్వు కొత్తగా వచ్చినప్పుడు నేనిక్కడ లేను. లేకపోతే మాయింట్లో దిగేపని. ఇప్పుడైనా రండి. ఇక్కడ ఉద్యోగావకాశాలు ఎక్కువ. ఏదేనా చూసుకోవచ్చు” అని కూడా చెప్పాడు.

          “సరే. చెప్తాను” అంది.

          రాత్రి హరి వచ్చేక చెప్పింది మామయ్య పిలిచిన సంగతి. అతను ముభావంగా “ఆహా” అన్నాడు. ఆ తరవాత నట్టుతూ “మనల్ని న్యూయార్కు రమ్మన్నారు” అంది.

          హరి మళ్లీ ఊఁ అనేసి వూరుకున్నాడు. ఆఖరికి భోజనాల వేళ చెప్పింది, మామయ్య ఉద్యోగం విషయంలో సాయం చేస్తానన్నాడని.

          గీత భయపడినట్టే అయింది, “నా వుద్యోగం పోయిందని ఆయనకి చెప్పేవా?” అంటూ ఎగిరిపడ్డాడు.

          ఎప్పుడూ లేదు అతను అలా అరిచేసరికి గీతకి కళ్లనీళ్లు తిరిగేయి. లేచి వంటింట్లోకి వెళ్లిపోయింది. గిన్నెలు తీసి, ఫ్రిజ్‌లో పెట్టేసి, కంచాలూ, గ్లాసులూ డిష్‌వాషరులో పడేసి, తిన్నగా పడగ్గదిలోకి వెళ్లిపోయింది.

          హరికి బాధ అనిపించింది అలా తనమీద అరిచినందుకు. పాపం తనేం చేసింది, వున్నమాటే కదా చెప్పింది. లేచి పడగ్గదిలోకి వచ్చి, “నువ్వెళ్లు. నేను మరోసారి వస్తాను” అన్నాడు నెమ్మదిగా.

          ఇద్దరికిద్దరూ “నేనేం చెయ్యలేకపోతున్నానే” అన్న బాధతో గిలగిల్లాడుతున్నారు.

          “నేను ఒక్కదాన్నీ వెళ్లను. ఇద్దరం తరవాతే వెళ్దాంలెండి” అంది గీత అటు ఒత్తిగిలి.

          హరి, “సరే” అనేసి, మళ్లీ ముందు గదిలోకి వెళ్లిపోయేడు. దిగులు పడిపోతున్న గీతని చూస్తుంటే అతనికి చాలా బాధగా వుంది. తను ఎదురుగా లేకపోతే బాగుండుననీ, కనీసం నాలుగు రోజులయినా ఆ మామయ్యగారింటికో మరోచోటికో వెళ్లిపోతే బాగుండును అని హరి ఆశా, కోరికాను.

          హరి బాధపడుతున్నాడని గీతకి కష్టంగా వుంది. అతను కూడా వస్తే, ఉద్యోగం విషయంలో మామయ్య సాయం చేస్తాడు కదా అని గీత ఆశా, కోరికాను.

          హరి ఫోనుమీద అర్థరాత్రి దాటే వరకూ స్నేహితులందరితో మాటాడుతూనే వున్నాడు. వాళ్లు కూడా వెళ్లమనే సలహా ఇచ్చారు. “గీతకి వూరు చూపించినట్టూ వుంటుంది. మళ్లీ వుద్యోగంలో చేరితే ఎలాగా టైము దొరకదు కదా,” అన్నారు. “అక్కడ అవకాశాలు కూడా చూసుకోవచ్చు అన్నమాట కూడా నిజమే కదా” అన్నారు.

          హరి ఎటూ తేల్చుకోకుండానే, రమణ మళ్లీ ఫోను చేశాడు మర్నాడు వుదయమే.

          ఫోను తీసుకుని. తప్పనిసరిగా మాటాడాల్సి వచ్చింది.

          “మీ పెళ్లికి మేం రాలేదు కదా. ఇప్పుడయినా చూస్తాం, రండి ఇద్దరూ” అన్నాడు రమణ చనువుగా.

          “అలాగేలెండి, చూద్దాం.”

          “చూద్దాం అంటే కాదు. నాక్కూడా ఇప్పుడే కొంచెం తీరిక వూరు చూపించడానికి. తప్పకుండా రావాలి.”

          హరి ఆలోచిస్తూ, “అలాగేలెండి. టికెట్లు కొనుక్కుని ఫోను చేస్తాను. ఇదుగో. గీతకి ఫోను ఇస్తున్నా, వుండండి” అని చెప్పి గీతని పిలిచి “మీ మామయ్య” అంటూ ఫోను అందించాడు.

          గీత మరో రెండు నిముషాలు మాటాడి ఫోను పెట్టేసింది. హరి మళ్లీ అరుస్తాడేమో అనుకుంది కానీ, అతనేమీ అనలేదు. న్యూయార్కుకి టికెట్లు తీసుకున్నాడు.

          “పీటర్నీ, సూసన్నీ కూడా చూద్దాం” అంది గీత. ఇక్కడ అడుగెట్టగానే పరిచయమయిన తొలి జంట అని వాళ్లంటే ప్రత్యేకాభిమానం.

          “వాళ్లు విడిపోయారు. పీటర్ బెర్క్‌లీ వెళ్లిపోయాడు. సూసన్ ఎక్కడుందో తెలీదు”.

          గీతకి అయ్యో అనిపించింది. చూసింది ఒక్కపూటే అయినా ఆప్తులెవరికో అన్యాయం జరిగినట్టు బాధ పడింది. 

          న్యూయార్కులో రమణ airportకి వచ్చి ఎంతో ఆప్యాయంగా ఇద్దరినీ తీసుకెళ్లేడు ఇంటికి. గీత ఇక్కడ దిగిన రోజున తను లేనందుకు మరోసారి విచారం వెలిబుచ్చాడు. ఆయన భార్య ఎమిలీ కూడా ఎంతో ఆదరంగా మాటాడింది. వాళ్లబ్బాయి సిలికాన్‌వాలీలో సాఫ్టువేరు ఇంజినీరుట. గోడమీద ఆ అబ్బాయి, అతని భార్య, వారి పాప ఫొటోలు వున్నాయి. 

          న్యూయార్క్ మనదేశంలోలాగే కిక్కిరిసి పోయివుంటుంది. కార్లూ, జనాలతో. ఆపైన నభోమండలాన్నంటుతూ భవనాలూ …. రమణ గీతకీ, హరికీ statue of liberty, museum చూపించాడు గీతకి అవన్నీ చూస్తుంటే ఏదో మాయలోకంలో వున్నట్టు అనిపించింది.

          “బ్రాడ్వేలో పెపిన్ షో  చూద్దాం రేపు సాయంత్రం” అన్నాడు రమణ.

          “నాకు కాఫీ హోటల్లో ఇంగ్లీషే అర్థం కావడంలేదు. బ్రాడ్వేలో ఏం చూస్తాను?” అంది గీత.

          “అలా కాదులే. పూర్తిగా అర్థం కాదేమో కానీ చూడు అదొక ప్రత్యేకమయిన అనుభవం.” అంటూ అసలు ఆ నాటకాలు ఎలా మొదలయ్యాయో, వాటి విశిష్టత ఏమిటో వివరించి, పెపిన్ కథ కూడా చెప్పేడు.

          మొత్తం మీద వెళ్లడానికే నిశ్చయించుకున్నారు. ఎమిలీ కూడా కొంత వివరణ ఇచ్చింది. చూసిం తరవాత మాత్రం చాలా బాగుంది అనే అనిపించింది గీతకి. మన స్టేజి నాటకాల్లోలాగ ఈ నటులకి ఎంత దీక్ష వుండాలో అనుకుంది. ప్రతిరోజూ ఇదే తమ నటనకి పరాకాష్ఠ అన్నంత నియమనిష్ఠలతో ప్రదర్శించాలి.

          “నీమాట నిజమే మామయ్యా! బాగుంది మ్యూజికల్” అంది రమణతో.

          కథలో ప్రధానాంశం తనని బాగా ఆకట్టుకుంది. ఏదేశం, ఏకాలం అయినా సాహిత్యంలో విశేషం మౌలికమయిన విలువలు ఒకటే అవడం. “అధికారం, ధన కనక వస్తు వాహనాలు కాదు మనిషికి ఆత్మానందాన్ని ఇచ్చేవి” అన్న సందేశం అమెరికాలో వినిపిస్తుందని గీత కలలో కూడా అనుకోలేదు. “సాహిత్యంలోనూ, సంగీతంలోనూ సందేశం అదే అయినా మనం ఇంత దూరం వచ్చింది కూడా ఆ ధన కనక వస్తు వాహనాల కోసమే కదా. మనజీవితాల్లో ప్రతిఫలించే గొప్ప సదసత్సంశయం లేదా సంఘర్షణ ఇదేనేమో” అనుకుని నిట్టూర్చింది.  

          మర్నాడు రమణ హరిని వాళ్ల ఆఫీసుకి తీసుకెళ్లి వాళ్ల బాస్, విలియమ్స్‌కి పరిచయం చేశాడు. ముగ్గురూ లంచికి వెళ్లారు. విలియమ్స్ పరోక్షంగా యదాలాపంగా అడుగు తున్నట్టే అడుగుతూ హరి చదువూ, అనుభవం వివరాలు కనుక్కున్నాడు. తరవాత తాము షికాగోలో బ్రాంచి తెరవాలనుకుంటున్నామని చెప్పి, “మీకేమైనా ఆసక్తి వుందా?” అని అడిగేడు.

          హరి వివరాలు అడిగాడు.

          “ఇంకా ప్రాథమిక దశలోనే వుంది. మళ్లీ మాటాడుకుందాం ఆవిషయాలు. మీకార్డు ఇవ్వండి.” అని, “ఈరోజు సాయంత్రం ఆర్టు షో వుంది, రాకూడదూ?” అన్నాడు మాట మారుస్తూ.

          విలియమ్స్ వాళ్ల అబ్బాయి రాబర్ట్ ఒక తెలుగు టీచరు దగ్గర పెయింటింగు నేర్చుకుంటున్నాడనీ, ఆ సాయంత్రం  సర్టిఫికేట్ల ప్రదానం, ఆర్టు ఎగ్జిబిషనూ జరగ బోతున్నాయనీ రమణ వివరించేడు. 

          “తప్పకుండా వస్తాం” అన్నాడు హరి విలియమ్స్‌తో.

          మళ్లీ కలుసుకుందాం అని చెప్పి ఉభయపక్షాలూ శలవు పుచ్చుకున్నారు.

          హరి రమణకి కృతజ్ఞతలు చెప్పేడు.

          “నాదేముంది. నీ అర్హతలు ఆయనకి నచ్చినట్టున్నాయి” అన్నాడు.

***

          ఆ సాయంత్రం అందరూ ఆర్ట్ ఎగ్జిబిషనుకి వెళ్లేరు. అక్కడ కారిడర్‌లో విలియమ్స్, రాబర్టుతోనూ, భార్యతోనూ కనిపించాడు. రమణ బృందం అతని దగ్గరికి వెళ్లి, పరిచయాలు అయేక, అబ్బాయిని అభినందించారు.

          విలియమ్స్ రాబర్టు తెలివితేటలూ, సకలవిద్యలలోనూ ఆ కుర్రాడి నైపుణ్యం అరగంటసేపు వర్ణించాడు – సాకర్, పియానో, ట్రాక్ ఎండ్ ఫీల్డ్, పెయింటింగ్, ఇంకా లిటరేచర్ క్లబ్ అన్నిటిలోనూ తొలి రాంకులో మెరిసిపోతున్నాడుట.

          “వాడు పిల్లాడిలా నిష్పూచీగా ఆడుకోడం ఎప్పుడు? వాడికి బాల్యం అన్నది లేకుండా చేస్తున్నారు” అంది గీత హరితో చిన్నగా.

          “తల్లిదండ్రుల ఆశలు అలా వుంటాయి మరి. వాడికి గల అవకాశాలు పరిచయం చేస్తున్నారనుకో. ప్రతి రంగంలోనూ వేలు పెడితే, ఎందులో రాణిస్తాడో తెలుస్తుందని కావచ్చు” అన్నాడు హరి సమాధానాలు వెతుకుతూ.

          అందరూ మాటాడుకుంటూ బొమ్మలు వున్న గదిలో కొంచెం సేపు తిరిగేరు. పిల్లలు వేసిన బొమ్మలు ఓ పక్కనా, షీత్రో బెహన్జీ వేసిన బొమ్మలు మరో పక్కన అమర్చేరు. ఆవిడ వేసినవన్నీ ప్రకృతి దృశ్యాలు. ప్రతి చిత్రంలోనూ ఛాయామాత్రంగా ఏదో ఒక మూల, ఆకుల మధ్యనో, మబ్బుల మధ్యనో రెండు కళ్లు లీలగా గోచరమయేయి గీతకి. ఆ కళ్లలో వ్యథ హృదయ విదారకంగా వుంది. గీతకి చూస్తున్నకొద్దీ గుండెలు పిండేసినట్టు అనిపించసాగింది. గుండెల్లో నీరసం ఆవహించింది. 

          “నేను వెళ్లి హాల్లో కూర్చుంటాను” అంది బయటికి నడుస్తూ. .

          “ఏం? బొమ్మలు బాగులేవూ? ఇంకా అటువేపు మనం వెళ్లనేలేదు” అన్నాడు గీత మొహంలోకి తేరి చూస్తూ, మళ్లీ వెంటనే, “ఏమిటి అలా వున్నావు? ఒంట్లో బాగులేదా? సోడా తాగుతావా?” అన్నాడు కంగారుగా. 

          రమణ కూడా “ఏమిటి? ఏమయింది? రా, ఇక్కడ కూర్చో” అన్నాడు తలుపు దగ్గరున్న కుర్చీ చూపిస్తూ.

          గీత సిగ్గు పడిపోయి, “ఏం లేదు. ఒక్క క్షణం కళ్లు తిరిగినట్టనిపించింది అంతే. బాగానే వుంది, ఏంలేదు” అంటూ వాళ్లిద్దరినీ శాంతపరిచింది.

          ఇంతలో మీటింగు మొదలయిందని వచ్చి చెప్పాడు ఒక అబ్బాయి.

          విలియమ్స్, రాబర్టూ, తల్లీ మొదటి వరసలో కూర్చున్నారు, సర్టిఫికేట్లు పొందబోతున్న మరో ఎనిమిది మంది పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రులూ కూడా తమకి కేటాయించిన మొదటి రెండు వరసలలో సర్దుకున్నారు. ఆ వెనక మూడో వరసలో రమణా వాళ్లూ కూర్చున్నారు.

          జేమీభాయి స్టేజి మీదకి వచ్చి, సభాసదులకి నమస్కారం చేసి, సర్టిఫికేట్లు పొందిన పిల్లల సృజనాత్మక శక్తిని మెచ్చుకుని, వాళ్లని మనస్ఫూర్తిగా అభినందించి, కార్యక్రమం వివరించాడు. షీత్రో బెహన్జీ అనారోగ్య కారణాల వల్ల ఉపన్యాసం ఇవ్వబోవడం లేదనీ, స్టేజిమీదకి వచ్చి విద్యార్థులకి స్వయంగా సర్టిఫికేట్లు ఇస్తుందనీ చెప్పేడు. ఆ తరవాత,  ఎగ్జిబిషను హాల్లో రిసెప్షను వుంటుందనీ, అందరూ రిసెప్షనుకి వచ్చి పార్టీ జయప్రదం చేయవలసిందనీ కోరేడు. షీత్రో బెహన్జీ ఆటోగ్రాఫ్ చేసిన బొమ్మలు ఈ రోజు కొన్నవారికి తగ్గింపుధర అని  ప్రకటించేడు.

          తరవాత లోపలికి వెళ్లి, షీత్రో బెహన్జీని నడిపించుకు వచ్చేడు. ఆవిడ అతని మీద వాలి గాలిలో తేలిపోతున్నట్టు నడుస్తూ వచ్చింది.

          అయిదు నిముషాల్లో బహుమతి ప్రధానాలు అయిపోయాయి. వెంటనే జేమీభాయి ఆమెని నడిపించుకుంటూ లోపలి గదిలోకి తీసుకుపోయేడు.

          తిరిగొచ్చి మరోసారి అందర్నీ అభినందించి రిసెప్షనుకి పదమన్నాడు. అక్కడ గుమ్మం దగ్గర ఓ బల్లదగ్గర cash box వుంది. జేమీభాయి హడావుడిగా అటూ ఇటూ తిరుగుతూ, అందరితో కలివిడిగా మాటాడుతూ, ఒకొక బొమ్మ ప్రత్యేకత వివరిస్తూ అమ్మకాలు సాగించేడు. విలియమ్స్, రమణా చెరో బొమ్మా కొన్నారు.

          హరి సందిగ్ధావస్థలో పడ్డాడు. తాను బొమ్మ కొంటే విలియమ్సు‌ని “ఇంప్రెస్” చెయ్యడానికి పనికొస్తుందా లేదా  అన్న సందేహం ఒకటీ. రెండోది గీతకి ఇష్టమవునా కాదా అన్నది. ఎగ్జిబిషను హాల్లో గీత ప్రవర్తన తలపుకొచ్చింది. గీతకి ఆ బొమ్మలు ఇంట్లో పెట్టుకోడం ఇష్టం అవునో కాదో … చాలాసేపు ఆలోచించిన మీదట, కొనే వుద్దేశం విరమించుకున్నాడు.

          ఆనాటి అతిథులు దాదాపు అందరూ అమెరికనులే. వాళ్లు షీత్రో బెహన్జీ కళనీ, బోధనా శక్తినీ తెగ మెచ్చుకుంటున్నారు. తమ పిల్లలు ఆవిడ దగ్గర నేర్చుకున్నందుకు హర్షం వెలిబుచ్చారు. నాలుగు బొమ్మలు అమ్ముడు పోయేయి ఆ రోజు.

          కుకీస్, ఛీజ్ ముక్కలూ కొరుకుతూ, కోకు తాగుతూ మాటాడుకుంటున్నారు.

          “అద్భుతం, అమోఘం”

          “ఇంతటి నైపుణ్యం సామాన్యులకి రాదు. షీత్రో బెహన్జీ అసామాన్యురాలు.”

          “ఆవిడకి జేమీభాయి దొరకడం ఆవిడ అదృష్టం.” అని కొందరు మెచ్చుకుంటుంటే, ప్రతివాదనలు చేశారు కొందరు.

          “ఏం అదృష్టం? అపురూపంగా మూడో అంతస్థులో మూసిపెట్టేడు ఆవిడని, గడపదాటి అడుగు పెట్టనివ్వడు. పది రకాల మందులు. ఏదో నీరోలాజికల్ డిసార్డరు అంటారు. మా ఫ్రెండ్సు అతన్ని నల్లమందుభాయీ అంటారు. అందుకే మా అబ్బాయి చేర్తానంటే నేను ఒప్పుకోలేదు” అన్నాడు ఒకాయన. ఆయన మరో స్నేహితుడి కూతురు సర్టిఫికేటు పొందుతోందని వచ్చేడు.

          “అసలు ఆస్కూలు అతనే నడుపుతున్నాడుట. కరెస్పాండెన్సు కోర్సులు. ఇంటికి విడియోలు పంపిస్తాడు. ఫోనులో సలహాలు ఇస్తాడు. ఉత్తరాలకి అతనే జవాబులిస్తాడు. ఆవిడ మాట్లాడగా విన్నవారు కానీ చూసినవారు కానీ లేరు.”

          “ఆర్భాటం మాత్రం బాగానే చేస్తాడు. ఊరి పొలిమేరల్లో ఇల్లూ, ఊళ్లో స్టూడియో, కారూ, వ్యానూ, ఇంటర్నెట్లో పాఠాలూ, స్యూస్ లెటరూ, ఎగ్జిబిషన్లూ, … “

          గీతా, హరీ మొహాలు చూసుకున్నారు. ఇద్దరికీ మనసులో ఏవో అనుమానాలు వచ్చేయి కానీ ఆ మాట ఎవరితోనూ అనలేదు. అందరూ ఇళ్లకి బయల్దేరేరు.

          గీత రాబర్టుని మరోసారి అభినందించి, తను సర్టిఫికేటు అందుకుంటున్నప్పుడు తీసిన ఫొటో కాపీ కావాలని అడిగింది.

          విలియమ్స్ “మీ ఐడి ఇవ్వండి. ఈమెయిలు చేస్తాను” అన్నాడు.

          గీత ఐడి ఇచ్చి మరిచిపోవద్దని మరోసారి చెప్పింది.

***

          రాత్రి హరికీ గీతకీ కూడా నిద్ర పట్టలేదు ఒకంతట.

          హరి ఉద్యోగం గురించి మథనపడుతుంటే, గీతని చిత్ర గురించిన ఆలోచనలు వదలడం లేదు.

          అర్థరాత్రి దాటింది. “ఏమిటి ఆలోచిస్తున్నావు?” అని అడిగేడు హరి.

          “ఆలోచించినకొద్దీ ఆవిడ చిత్రేనేమో అనిపిస్తోంది.” అంది.

          “ఏమో మరి. “

          గీత కొంచెంసేపు మాటాడలేదు.

          “అవున్లెండి. నాకు మాత్రం చిత్రే అనిపిస్తోంది. తపతిమాటలు – ఆమెవయసూ, నీరోలాజికల్ కండిషనూ, అతను పదిహేనేళ్లు పెద్దవాడు .. ఇవన్నీ తలుచుకుంటే ఆ అమ్మాయిలాగే వుంది. చిత్రే అయితే ఇక్కడ ఆ అమ్మాయికి ఎలా వుంది? బొమ్మలు వేసుకోడం తనకి ఆనందం ఇచ్చే పనయితే, తన మటుకు తనకి సంతోషంగానే వుండాలి కదా. మరి సంతోషంగా వుందా?”

          “మరో కథ రాస్తావా?” అన్నాడు హరి నెమ్మదిగా.

          “ఏమో” అంది గీత…

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.