ఎప్పటికీ నిండని కుండ

-పాపినేని శివశంకర్

‘చావదురా ఈ పాము / చప్పిడి దెబ్బలకు / భావించి వైరాగ్యమనే/ బడితెదెబ్బబడితె గాని’ అంటూ అప్పుడెప్పుడో మా అమ్మ పాడిందొక తత్త్వం.

ఇప్పుడైతే ‘నిండదురా ఈ కుండ / మెండైన సంపదల్తో’ అని పాడేదేమో.

కాకికి దప్పికైనప్పుడు అడుగున నీళ్లున్న కుండని గులకరాళ్లతో నింపి దాహం తీర్చుకొంది. కానీ,            

ఈ కుండలు నిండవు. ఎవరికుండా నిండటం లేదు. నువ్వు కొండల్ని పిండిచేసి కూరినా నిండదు. ఎన్నికార్లు, అద్దాల మేడలూ, అధికారాలూ ఆడంబర వైభవాలూ కుక్కినా నిండదు.

అది పుష్పక విమానంలాంటిది.
ఎన్ని చేర్చినా ఇంకో దానికి చోటుంటది.

అది పొట్టబూరటించిన సముద్రం లాంటిది. ఎన్నినదులు కలిసినా పొంగిపొర్లదు. ఎన్నిభూములు కొల్లగొట్టి దాచి పెట్టినా ఇంకో గజం స్థలం ఉంటది.

కుంభకోణాలూ, డొల్లకంపెనీలూ, మనీ లాండరింగులూ, నోట్ల కోట్ల దొంతరలూ ఎన్నైనా అందులో దాచుకోవచ్చుగాక. ఇంకచాలు అనదు. ఎన్ని ఐశ్వర్యనదులు లోపలకి వంపినా నీ దాహం తీరదు. నింపినకొద్దీ కుండ ఇంకా ఇంకా పెద్దదవుతుంది. వెలితి పెరుగుతూనే ఉంటది. 

నీ సామూహిక గీతాలన్నీ సమసిపోయాయేమో. నువ్వు మెల్లగా ఆర్థిక మానవుడుగా అవతరిస్తున్నావేమో. వస్తుప్రపంచం నీ వసుధైక కుటుంబం అయ్యుంటది. సంపదలాలస నిన్ను పరుగుపందెంలోకి నెట్టి ఉంటది.

నువ్వు ఆకుపచ్చదనాన్ని కుండీలో ప్లాస్టిక్‌ చెట్టుగా మార్చి దాని నీడలో సేదదీరు తుంటావు.  ద్రవాధునిక స్వేచ్ఛా శాపగ్రస్తుడివై ఏ తీరం చేరని పడవలో ఏకాకిగా విహరిస్తుంటావు. నువ్వు సమూహంలో ఒంటరిగా మసలుతుంటావు. 

కుండ నిండదుగాక నిండదు. వెలితి తీరదుగాక తీరదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.