
ఓటమి ఎరుగని తల్లి
-శింగరాజు శ్రీనివాసరావు
కడుపు సంచి ఖాళీగా వున్న దేహాన్ని
గర్భసంచి బరువు సమం చేసింది
బక్కచిక్కిన శరీరపు ఒడిలోకి
చచ్చుబడిన పిండం ప్రాణం పోసుకుంది
నవ్వే బిడ్డకు నడకలేని కాళ్ళు దిష్టి చుక్కల్లా..
దరిద్రానికి తోబుట్టువులా అవిటితనం..
అసంపూర్ణ పుష్పాన్ని చూసి ఆమె దూషించలేదు
నడవలేని కన్నయ్యవని మురిసి రొమ్ముపీకను నోటికందించింది
తరువుకు కాయ బరువు కాదని
తనయుడి భారాన్ని భుజాన వేసుకుంది
కదలలేని కాయం మోయలేనంత ఎదిగితే
నడుము వంచి గజమై అంబారీ ఎక్కించుకుంది
పోటిలో వెనుకబడితే బిడ్డను నిలదీసే
పరుగుపందెపు లోకానికి దూరంగా
ప్రేమభిక్షను పంచుతూ నడుస్తున్నది
ఓటమికి తలవంచని ఆ కన్నతల్లి
మాటే రాని పసిముద్దకు చదువుల శిక్షవేస్తూ
ర్యాంకుల కత్తులతో బాల్యాన్ని చంపివేస్తూ
గోరుముద్దల వయసుకు గోరీలు కడుతూ
అదే భవిష్యత్తని భ్రమపడే తల్లులున్న లోకంలో
ఒత్తిడికి తట్టుకోలేని బిడ్డ మరణాన్ని కౌగిలించుకుంటే
గర్భశోకాన్ని మిగుల్చుకునే కాస్ట్లీ తల్లికాదు ఆమె
కాటికి చేరేవరకు కన్నపేగును కాచుకోవాలని
కష్టాలకు ఎదురురీదుతూ సాగే ఓటమి ఎరుగని తల్లి..
*****

నేను భారతీయ స్టేట్‌బ్యాంకులో డిప్యూటిమేనేజరుగా బాధ్యతలు నిర్వహించాను. పదవీ విరమణ అనంతరం సాహిత్యం మీద అభిలాషతో 2016 సంవత్సరం నుంచి కవితలు, కథలు వ్రాయడం మొదలుపెట్టాను. నా మొదటి కవితను మరియు మొదటి కథను ప్రచురించినది “ఆంధ్రభూమి వారపత్రిక”. మొదటిసారిగా “నేలతల్లి” కథకు ఆంధ్రభూమి దినపత్రికలో ద్వితీయ బహుమతి లభించింది. ఇప్పటి వరకు సుమారు 50 కథల పైగా వివిధ వార, మాస పత్రికలలోను, అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యాయి. అందులో 20 కథలకు బహుమతులు లభించాయి. రెండు వందల వరకు కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో 30 కవితల వరకు బహుమతులు పొందాయి.
