దుఃఖపుమిన్నాగు

-డా.కె.గీత

దుఃఖం
జీవితం అడుగున పొంచి ఉన్న మిన్నాగు
ఎప్పుడు నిద్రలేస్తుందో దానికే తెలీదు
ఎప్పుడు జలజలా పాకుతుందో ఎవరికీ తెలీదు
ఎగిసిపడ్డప్పుడు మాత్రం
ఎప్పటెప్పటివో
నిశ్శబ్ద వేదనలన్నీ ఒక్కోటిగా తవ్వుకుంటూ
జరజరా బయటికి పాక్కొస్తుంది
దాని పడగ నీడలో
ప్రతిరోజూ నిద్రిస్తున్నా
ఏమీ తెలియనట్టే
గొంతు కింద
ఎడమ పక్క
సిరలు ధమనులు
చుట్ట చుట్టుకుని
బయట పడే రోజు కోసం
తపస్సు చేస్తుంటుంది
ఒక్కసారి
నెత్తుటి గంగలా
బయట పడ్డదా
దాని తాండవం
ఆపడానికి
యముడే దిగిరావాలి
దాన్నించి
తప్పించుకునేందుకు
కోరికల్ని
తప్పించుకోవాలట
అసలు
దుఃఖమే
ఆకాంక్షల
ఆశయాల
ఆశల
వినాశిని-
ఉత్కృష్ట జీవితాన్ని
కాలరాసి కాటేసే
వినోదిని-
దుఃఖం
కాలమంతా విషాన్ని చిమ్ముతూన్నా
శ్వాస చివరి వరకూ
దాన్ని కౌగిలించుకునే
జీవితాన్నించి
తప్పించుకుందుకు
మళ్లీ దాన్నే ఆశ్రయించాలి!

*****

Please follow and like us:

One thought on “దుఃఖపుమిన్నాగు (కవిత)”

Leave a Reply

Your email address will not be published.