వ్యాధితో పోరాటం-10

కనకదుర్గ

          నాకు ప్రెగ్నెంసీ అని తెలిసేటప్పటికి శ్రీని ఇండియన్ కొలీగ్స్ అందరూ వెళ్ళిపోయారు. కొంత మంది ఇండియాకెళ్ళారు, కొంత మంది అమెరికాలోనే వుండాలని నిర్ణయించుకుని పర్మనెంట్ ఉద్యోగాలు చూసుకొని వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి పోయారు. జోన్ అంటుండేది, “నీ డెలివరీ అయ్యాక మీకెప్పుడైనా అవసరమొస్తే అపుడు నేను బేబిసిట్ చేస్తాను.” అని. డా. రిచర్డ్ ఈ.ఆర్. సి.పి కి రమ్మంటే జోన్ ని టెస్ట్ అయ్యి వచ్చేదాక పాపని చూసుకుంటావా అని అడిగితే, తప్పకుండా వస్తాను అని మేము హాస్పిటల్ కి రెడీ అవుతుంటే వచ్చేసింది. నేను వదిలి పెట్టడానికి బాధ పడ్తుంటే, ” కొన్ని గంటలకే ఇంత ఇదయ్యిపోతే ఎట్లా? నేను బాగా చూసుకుంటాను. మీరెళ్ళి రండి.” అని పంపించింది.

          చైతు స్కూల్ కి వెళ్ళాడు. వాడికి ముందే చెప్పాము. “నువ్వేం వర్రీ అవ్వకమ్మా, నేను జోన్ కి హెల్ప్ చేస్తాను మిల్లీని చూసుకోవడానికి.” అని చెప్పాడు. మిలేనియంలో పుట్టింది చెల్లి అని దానికి ముద్దుగా, ’మిల్లీ,’ అని పేరు పెట్టాడు. అందర్ని అలాగే పిలవమంటాడు.

          హాస్పిటల్ కి వెళ్ళాక అనస్తీషీయా ఇచ్చారు. టెస్ట్ అయ్యాక రికవరీ రూంలోకి వచ్చాక గానీ నాకు కొంచెం మెలుకువ వచ్చింది. డాక్టర్ రిచర్డ్ వచ్చి సంతోషంగా అంతా నార్మల్ గానే వుంది అని చెప్పారు. అపుడే నా నొప్పి గురించి డాక్టర్ కి చెబితే బ్లడ్ టెస్ట్ చేసి నొప్పికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇంకా మత్తు వదలలేదు. ఇంట్లో నొప్పితో నిద్ర లేదు, పాప రాత్రిళ్ళు లేవడం, చాలా అలసటగా కూడా వుందేమో బాగా నిద్ర పట్టేసింది. రెండు, మూడు గంటలయ్యాక కానీ మెలుకువ రాలేదు. మెలుకువ వచ్చాక ఇంటికి వచ్చాము. జోన్ మేమొచ్చేదాక ఉంది. జోన్ కి పిల్లలంటే చాలా ఇష్టం, తన దగ్గర వదిలి పెట్టడానికి నేను ఒక్కనిముషం కూడా ఆలోచించలేదు. పొద్దున హాస్పిటల్ కి వెళ్ళక మునుపు బ్రెస్ట్ పంప్ తెచ్చి పాపకి పాలు తీసి బాటిల్స్ లో ఫ్రిడ్జ్ లో పెడితే తీసి తాగించింది. కానీ నొప్పికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చినపుడు పాపకి పాలు పడుతుంటే, మానేసి తనకి డబ్బా పాలు అలవాటు చేయమన్నారు డాక్టర్ రిచర్డ్. లేకపోతే పాపకి పాల ద్వారా ఈ మందు తనలోకి పోయి ఎక్కువ నిద్ర పోయే అవకాశం వుంటుంది, అది ఒక్కటే కాదు ఆ మందు వల్ల ఎలాంటి ప్రభావం వుంటుందో అని భయం నాకు.  పోనీ వేసుకోకుండా వుందామంటే నొప్పి తట్టుకోవడం కష్టం అయిపోయ్యింది.

          పాపకి పాలు ఇవ్వలేకపోతున్నాననే బాధతో పిడియాట్రిషియన్ కి ఆ రాత్రి ఫోన్ చేసి అడిగితే ఆ డాక్టర్ విసుక్కోకుండా చాలా ధైర్యం చెప్పింది. “మిస్ దుర్గా, ఏం పరవాలేదు. మీకు ఆరోగ్యం బాగా లేకపోయినా, ఇన్ని రోజులు నొప్పి భరిస్తూ, మందులేసుకోకుండా పాలు ఇచ్చారు బేబికి. బేబికి ముఖ్యంగా కావాల్సిన మొదటి కొన్ని రోజుల్లో వచ్చే హెల్థీ మిల్క్ ఇచ్చారు. ఇపుడు మీ ఆరోగ్యం పై శ్రద్ద వహించడం ముఖ్యం. బేబీకి ఫార్ములా పాలు పడితే తప్పేమీ లేదు. ఆరోగ్యంగా పెరుగుతుంది.  మీ ఓపికకి మెచ్చుకోవాలి, పాన్ క్రియాటైటిస్ లాంటి జబ్బుతో వచ్చే భయంకరమైన నొప్పిని భరించడం అంత ఈజీ పని కాదు తెల్సా! ఏం ఆలోచించకండి. బేబి బాగుంటుంది, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఆల్ ద బెస్ట్!” అని చెప్పింది.

          ఆమె మాటలు విన్నాక నాకు మనసు కొంచెం కుదుటపడింది.

          మర్నాడు లైట్ గా ఇడ్లీ తిని మందు వేసుకుని, మధ్యాహ్నం పడుకున్నాను. చైతు స్కూల్ నుండి వస్తాడని తలుపు లాక్ చేయకుండానే పడుకుంది. పాపకూడా నిద్ర పోయింది.

          చైతు వచ్చి తిని హోం వర్క్ చేసుకుంటున్నాడు.  సాయంత్రం లేచాను, కాస్త నొప్పి కంట్రోల్ అయినట్టనిపించింది. చాలా రోజుల తర్వాత, ’హమ్మయ్య, నొప్పి తగ్గేదాక ఈ మందులు వేసుకుంటూ మ్యానేజ్ చేయొచ్చు.’ అనుకున్నాను.

          పాపకు పాలు పట్టి, చైతుని హోం వర్క్ గురించి అడుగుతుంటే డోర్ బెల్, ఫోన్ ఒకటేసారి మ్రోగాయి. చైతు తలుపు తీయడానికి వెళ్ళాడు, నేను ఫోన్ ఎత్తి మాట్లాడాను.  హాస్పిటల్ నుండి డాక్టర్ డేవిడ్ మాట్లాడుతున్నారు.

          ” హలో డాక్టర్,ఈ.ఆర్.సి.పి టెస్ట్ రిపోర్ట్ నిన్నే చెప్పారు కదా!” అన్నాను.

          “హౌ ఆర్యూ ఫీలింగ్ టుడే?”

          “డాక్టర్ రిచర్డ్ పేయిన్ కిల్లర్ ఇచ్చారు. అది వేసుకుంటే రిలీఫ్ గా వుంది.”

          “ఇంట్లో ఎవరున్నారు? మీ హస్బెండ్ ఇంటికొచ్చారా?”

          “ఇపుడు వస్తారు. ఎందుకు?”

          “నిన్న బ్లడ్ వర్క్ చేసారు కదా! అమెలైజ్, లైపేజ్ లెవెల్స్ ఎక్కువున్నాయి.”

          “అవునా? కానీ …” విపరీతమైన నిరాశ మనసునిండా ఆవరించింది.

          “బేబిని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా?”

          జోన్ లోపలికి వచ్చి పాపని ఎత్తుకుని నా పక్కన నిల్చుంది. ఏంటి విషయం అన్నట్టు చూస్తుంది నా వైపు.

          “ఒన్ మినిట్ డాక్టర్..” అని జోన్ కి విషయం చెప్పాను.

          “లెవెల్స్ ఎక్కువుంటే వెళ్ళాలి కదా!  ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బేబి!”

          నాకు ఏడుపొస్తుంది.

          పిల్లల్ని వదిలి వెళ్ళాలా?

          “డాక్టర్ డేవిడ్ పేయిన్ కిల్లర్ వర్క్ అవుతుంది కదా! నేను ఇంట్లో వుండి ట్రై చేయవచ్చా?”

          ” దీనికి ట్రీట్మెంట్ నీకు తెల్సు కదా! నోటి నుండి ఏం తీసుకోకుండా, ఐ.వి ఫ్లూయిడ్స్ తో పాటు పేయిన్ కిల్లర్స్ ఇవ్వాలి. పాన్ క్రియాస్ కి రెస్ట్ కావాలి. ఇంట్లో వుంటే కష్టం.”

          “ఓ.కే హజ్బెండ్ రాగానే వస్తాను.”

          “బేబిని చూసుకోవడానికి ఎవరైనా….”

          “మా ఫ్రెండ్ చూసుకుంటానంది.”

          “డాక్టర్ రిచర్డ్ వెళ్ళిపోయారు. మీరు వచ్చినపుడు నేను వచ్చి చూస్తాను.”

          “ఓకే. సీ యూ సూన్,” అని ఫోన్ పెట్టేసాను.

          శ్రీని వచ్చాక పిల్లల్ని ఇంట్లో వదిలి పెట్టి హాస్పిటల్ కి వెళ్తున్నపుడు నేను పడిన ఆవేదన మాటల్లో చెప్పలేను.

          అలా వచ్చి పడ్డాను ఈ మేన్ లైన్ హాస్పిటల్లో.

          ప్రస్తుతానికి నొప్పి తగ్గింది. కానీ మళ్ళీ రాదనే గ్యారంటీ లేదు…

          జోన్ పొద్దున తన పనికి వెళ్తుంది. ఒంటి గంటకి పాపను చూసుకోవడానికి వస్తుంది. శ్రీనివాస్ పొద్దున చైతుని స్కూల్ కి పంపించి పాపని చూసుకుంటాడు, జోన్ వచ్చేవరకు.

          రేపు డాక్టర్ రిచర్డ్ వచ్చాక తర్వాత ఏం చేస్తారో, మనసులో వున్న ప్రశ్నలన్నీ అడిగి, డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా వుండాలి అనుకున్నాను.

          మర్నాడు డా. రిచర్డ్ వచ్చినపుడు నాకున్న సందేహాలన్నీ అడిగాను. అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పారు.

          “మళ్ళీ అటాక్ రాదనే అనుకుందాము. ఒకవేళ వస్తే అపుడు ఇక్కడ చేసే పరీక్షలు కొన్ని వున్నాయి. అవి చేసి చూద్దాము. ఏదైనా తెలుస్తుందేమో! బట్ లెట్స్ హోప్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఒన్ అండ్ యూ గెట్ టు స్పెండ్ నైస్ టైం విత్ యువర్ ఫ్యామిలి! రెండు వారాలయ్యాక వచ్చి నా ఆఫీస్ కి వస్తే చెక్ చేస్తాను. ఆల్ ద బెస్ట్ దుర్గా!” అని చెప్పాడు. ఆ తర్వాత ఒకసారి బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ చూసి, అన్నీ బాగానే వున్నాయని, ఇంటికి వెళ్ళొచ్చని డిస్చార్జ్ చేసి వెళ్ళిపోయాడు.

          నేను శ్రీనికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పాను. ఎప్పుడెపుడు ఇంటికి వెళ్దామా, పాపని ఒక్క నిమిషం వదలకుండా వుండాలని వుంది.

          శ్రీని వచ్చాడు పాపని తీసుకొని. చైతు స్కూల్ కి వెళ్ళాడు. నర్సులకి, టెక్ లకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి, నర్సులు కొంత మంది దగ్గరగా వచ్చి కౌగిలించు కున్నారు. ఇక్కడ నచ్చిన మనుషులను స్నేహంగా ’హగ్’ చేస్తారు.

          నర్స్ డిస్చార్జ్ ఇన్స్ ట్రక్షన్స్ ఇచ్చి, వీల్ చేయిర్ వాళ్ళని పిలిచింది. అన్నీ ప్యాక్ చేసి రెడీగా వుంచాను. శ్రీని రాగానే 10 నిమిషాల్లో కిందకి వచ్చి కార్లో పాపని బేబి కార్ సీట్లోనే పడుకోబెట్టి పైకి తీసుకొచ్చాడు, అలాగే కార్లో బేబి కార్ సీట్ ని పెట్టి నేను తన పక్కనే కూర్చొని తననే చూస్తూ ఇంటికి చేరుకున్నాము.

*****

(సశేషం)

Please follow and like us:

2 thoughts on “వ్యాధితో పోరాటం- 10”

Leave a Reply to Ch.chandana Cancel reply

Your email address will not be published.