అంతస్సూత్రం

-పి.లక్ష్మణ్ రావ్

మండుతున్న అగ్ని కొలిమి పై
భూతలాన్ని పెనంగా పెట్టి
చంద్రుడ్ని అట్టుగా‌‌
పోస్తుంది అమ్మ !
 
అట్టు మధ్య 
చిన్నచిన్న రంధ్రాలే
చంద్రునితో జత కలిసే తారలు !
 
ముఖస్తంగా చంద్రుడు
వెన్నెలై మెరుస్తున్నా
క్రింద అమావాస్య చీకటి
దాగి వుందనేది నర్మగర్భం !
 
అట్టుని 
అటూ ఇటూ తిరగేయడమే
శుక్ల పక్షం, కృష్ణ పక్షం !
 
ఓ చిన్నారీ !
వెన్నెల కురిపించే చంద్రునికే
చీకటి వెలుగులున్నట్లు
జీవితంలో
కష్టసుఖాలు సమానమే తండ్రీ !
 
నోరూరించే అట్టులోనూ
దాగివున్న రహస్యమదే!
 
ఒకవైపే వుంటే మాడిపోద్ది
రెండు వైపులా తిరగేస్తుంటేనే
రుచులు పంచుతాది !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.