వ్యాధితో పోరాటం-11

కనకదుర్గ

          శ్రీని లోపల పని చేసుకుంటున్నాడు. వంట చేస్తున్నట్టున్నాడు. “నీకు ఇడ్లీ పెట్టనా ఈ రోజుకి?” అని అడిగాడు కిచెన్ నుండి.

          “సరే,”అన్నాను. పాపని చాలా మిస్ అయ్యాను. దాన్నే చూస్తూ కూర్చున్నాను.

          నా తల్లి ఎంత ముద్దుగా వుందో? ఎంత కావాలనుకుని కన్నాను కానీ అది కడుపులో వున్నపుడు చిన్ని ప్రాణాన్ని ఎంత బాధ పెడ్తున్నాను కదా, నా కిచ్చే మందులు దానికి వెళ్ళేవి, పాపం నార్మల్ గా, ఆరోగ్యంగా పెరగాల్సిన పిల్ల నా వల్ల ఎంత అవస్థ పడుతుందో కదా! అనుకుని తప్పు నిర్ణయం తీసుకున్నానేమో? ముందు అనుకున్నట్టుగా ఒక పాపని పెంపకానికి తీసుకుని పెంచుకుంటే అయిపోయేదేమో! ఈ డాక్టర్లను నమ్మి తీసుకున్న నిర్ణయం వల్ల ఆ చిన్ని ప్రాణాన్ని హింస పెట్టినదాన్నావుతున్నానేమో అని కుమిలిపోని క్షణం లేదు. అంటే డాక్టర్లు కూడా దాదాపు 4-5 ఏళ్ళు నొప్పి రాలేదు, కాబట్టి తగ్గిపోవచ్చు లేదా, కొన్నేళ్ళకి ఒకసారి వస్తుందేమో అనుకున్నారేమో!

          గైనకాలజిస్ట్స్ ని చాలాసార్లు అడిగింది, ’ఒక్కసారి మీ పేషంట్ ఫైల్స్ లో పాన్ క్రియటైటిస్ వచ్చిన పేషంట్ ప్రెగ్నెంట్ అయితే తనకి నార్మల్ డెలివరీ జరిగిందా? ఏమైనా ప్రాబ్లెమ్స్ వచ్చాయా? వస్తే ఎలా ట్రీట్ చేసారు? చూసి చెప్పమని అడిగాను చాలా సార్లు. కానీ వాళ్ళు, ’అలాంటి పేషంట్స్ ఎవ్వరూ ఎక్కువగా వచ్చినట్టు గుర్తులేదు. వచ్చినా కూడా అంత సీరియస్ కేసులేమి కాలేదు. అలా అయితే నువ్వడగగానే గుర్తొచ్చేవి! సో డోంట్ వర్రీ! చక్కగా ఎంజాయ్ యువర్ ప్రెగ్నెంసీ. ఎవ్విరీధింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్రైట్!’ అని చెప్పారు.

          కానీ ఆరో నెలలో ఒకసారి అటాక్ వచ్చింది, ఐ.వి పెట్టి నొప్పికి ఇంజెక్షన్స్ ఇచ్చినపుడు చాలా భయపడిపోయాను. నాకంటే ఎక్కువగా లోపల ఎంతో ధీమాగా అమ్మ నన్ను కాపాడుతుంది అనే నమ్మకంతో ప్రశాంతంగా పెరిగే చిన్ని ప్రాణం ఈ అటాక్ తో ఎంత అల్లాడిపోయిందో! నొప్పికి ఇంజెక్షన్స్ ఇచ్చేపుడు లోపల పాపకి ఈ మందులిస్తే ఎమన్నా అవుతుందా? పెరుగుదల మీద ప్రభావం వుంటుందా అని ఏడుస్తూ అడిగేదాన్ని! డాక్టర్లు, నర్సులు,’ పాపకి ఈ మందుల వల్ల ఏం అవ్వదు. నీకు నొప్పి కంట్రోల్ అయితే పాపకి కూడా రిలీఫ్ గా వుంటుంది. ఈ మందు వల్ల నిద్ర ఎక్కువ పోతుందేమో అంతే. నొప్పి తగ్గాక ఈ మందులివ్వడం ఆపేస్తే తను మళ్ళీ నార్మల్ గా వుంటుంది. మేము తన హార్ట్ బీట్ చెక్ చేస్తూనే వుంటాము,’ చెక్ చేసినపుడు నాకు వినిపించేవారు కూడా!  ’నీ బేబీ చాలా స్ట్రాంగ్ బేబీ చూడు తన గుండె చప్పుడు ఎంత స్ట్రాంగ్ గా వుందో!’ అనేవారు.

          అపుడు 3 రోజుల్లో నొప్పి తగ్గింది. నొప్పి తగ్గకపోతే చెస్ట్ దగ్గర సెంట్రల్ లైన్ పెట్టి న్యూట్రిషన్ ఇస్తామన్నారు. బేబి లోపల పెరుగుతుంది, నాకూ న్యూట్రిషన్ వస్తుంది అని చెప్పారు. దీన్నీ టోటల్ పెరంటరల్ న్యూట్రిషన్ (టి.పి.ఎన్) అంటారు. నాకు అదంతా వింటే భయం వేసింది. ఎపుడు, విననివి, కననివి మనకి చేస్తామంటుంటే చాలా భయం వేసేది. అవసరం పడితే తల్లిని, బిడ్డని సురక్షితంగా వుంచి డెలివరీ చేయడానికి పనికి వస్తాయి ఇవన్నీ. ఇంతకు ముందు ఇవన్నీ వుండేవి కాదుగా. సైన్స్ ఇంతగా డెవలప్ అయినందుకు సంతోషించాలి కానీ నాకు మళ్ళీ నొప్పి రాదేమో, అంతా నార్మల్ గా అయిపోతుందేమో, అయిపోతే బావుండు అనే ఆశయితే వుంటుంది కదా! 5వ రోజు ఇంటికి పంపించారు. ఒక న్యూట్రిషనిస్ట్ ని చూడమన్నారు. ఆమె చెప్పిన డైట్ తీసుకుంటే నొప్పి రాకుండా, బరువు కూడా పెరుగుతుందని అన్నారు.

          పాన్ క్రియాటైటిస్ జబ్బున్న వారు కొవ్వు పదార్థాలు అస్సలు తినకూడదు. మరి లోపల పాప పెరగాలంటే సరైన ఆహారం తినాలి. రోజుకి ఎన్ని కాలరీస్ తినాలి. ఏది తింటే ఎన్ని కాలరీలొస్తాయి అనే ఒక లిస్ట్ తయారు చేసి ఇచ్చింది. నెలకోసారి వెళ్ళి చూపించుకోవాలి. కొవ్వు తక్కువ వున్న పాలల్లో నెస్లే వారి కార్నేషన్ బ్రేక్ఫాస్ట్ పౌడర్ కలుపుకొని పొద్దునే త్రాగేసేదాన్ని.  లంచ్ కి అన్నీ కూరలు కలిపి సూప్ చేసుకొని, సూప్ తో పాటు ఎగ్ వైట్స్, తినాలి, ఉడకబెట్టిన కూరల్లో ఎక్కువ కారాలు, మసాలాలు ఏమీ లేకుండా సింపుల్ గా కూరలు చేసుకొని అన్నం కొంచెం కూరలెక్కువ, ఇడ్లీ గురించి చెబితే అది కూడా తినమంది. అలాగే అరటిపండు పీనట్ బటర్, (వేరుసెనగలతో చేసిన బటర్) స్నాక్ లా మళ్ళీ సాయంత్రం ఒకసారి పొద్దున తాగిన పాలే తాగాలి, రోజు ఏదైనా ఒక స్వీట్, కొవ్వు తక్కువ వున్నవి, తినమని ఇచ్చింది. నేను మామూలుగా తినే దానికన్నా వెరైటీ ఆహారం తినే అవకాశం, లోపల పాప బాగానే పెరుగుతుంది, అన్న తృప్తి కలిగాయి. మామూలుగా చైతన్యని శని, ఆదివారాలు ఎక్కడికైనా తీసుకెళ్ళడం, సంతోషంగానే వున్నాము. రెండు నెలలు బాగానే గడచి పోయాయి.

          శ్రీని ముందుకన్నా ఎక్కువగా వంటలు చేయడం మొదలుపెట్టాడు, సూప్ చాలా బాగా చేసేవాడు. ముందు శని, ఆదివారాల్లో మాత్రమే చైతుకిష్టమైన వంటకాలు చేసేవాడు.

          అంతా బాగానే వుంది అనుకుంటుండగా నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా వుంటుందో అప్పటి దాకా తెలియదు. అందుకని ఏదో వేడి చేసిందేమో, నీళ్ళు ఎక్కువగా తాగితే, మజ్జిగ ఎక్కువ తాగితే తగ్గిపోతుందేమో అనుకున్నాను. కానీ అది తగ్గుముఖం పట్టకపోయేసరికి గైనకాలజిస్ట్ దగ్గరకి వెళితే బేబి సరిగ్గా తిరగటం లేదు అని చాలా సేపు అక్కడ అబ్జర్వేషన్ లో పెట్టారు. యూరిన్ టెస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ అని యాంటీబయాటిక్స్ రాసారు. ఐ.వి పెట్టి కొన్ని గంటలుంచుకొని మళ్ళీ టెస్ట్ చేసి ఇపుడు బేబి కొద్దిగా తిరుగుతుంది. ఏం పరవాలేదు అని చెప్పి పంపించేసారు. కార్లో వచ్చి కూర్చొని మ్యూజిక్ ఆన్ చేయగానే పొట్టలో పాప గంతులేయడం మొదలుపెట్టింది. పాప కదలిక మొదలైనప్పట్నుండి ఎపుడు మ్యూజిక్ పెట్టినా బాగా తిరుగుతుండడం గమనించాము. చైతు, ’అమ్మా బేబీస్ పుట్టక ముందు క్లాసిక్ మ్యూజిక్ వినిపిస్తే పుట్టాక చాలా యాక్టివ్ గా, చాలా షార్ప్ గా వుంటారటమ్మా. చాలా మంచి మ్యూజిక్ వినిపించాలి మనం బేబికి,’ అనేవాడు. వాడికి తమ్ముడు కావాలి అని చాలా కోరికగా వుండేది, ఎందుకంటే వాడి ఫ్రెండ్స్ కి తమ్ముళ్ళున్నారు, వాళ్ళిళ్ళకి ఆడుకోవడానికి వెళితే వాళ్ళని ఆడించేవాడు. క్యాథరిన్ ఫ్యామిలీతో చైతు కిండర్గార్టెన్ లో వున్నపుడే పరిచయం అయ్యింది. మెల్లి మెల్లిగా మంచి ఫ్రెండ్స్ అయ్యాము. వాళ్ళింటికి మేము వెళ్ళడం, మా ఇంటికి వాళ్ళు రావడం జరిగేది. చైతు వాళ్ళ చిన్న బాబుని బాగా ఆడిస్తాడని, వాడొస్తే నాకు హెల్ప్ అవుతుంది అని అనేది. 3వ నెల తర్వాత స్కానింగ్ చేసినపుడు బేబి జెండర్ కొంత మంది అడగరు, కొంత మంది చెప్పమంటారు. మేము చైతు పుట్టినపుడు వాళ్ళు చెబుతాము అన్నా మేమే వద్దన్నాము. కానీ ఈ సారి నాకే తెలుసుకోవాలని వుండింది. స్కానింగ్ తర్వాత అమ్మాయిలా వుంది అన్నది. చైతుని అడిగింది, నీకెవరు కావాలి, చెల్లెలా, తమ్ముడా? అని. వాడు వెంటనే తమ్ముడన్నాడు.  ఆవిడ వాడ్ని నిరాశ పరచకూడదని, “వెరీ షై బేబీ, ఇట్ కెన్ బి ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్. సో డోంట్ పేయింట్ ద బేబీస్ రూం పింక్ జస్ట్ నౌ, ఓకే! కంగ్రాట్స్! ” అని చెప్పి వెళ్ళింది.

          కార్లో వచ్చేపుడు,’ సరిగ్గా కనిపించలేదన్నది కదా! సో బాయ్ కూడా కావొచ్చు.” అన్నాడు చైతు.

          నేను, ” ఒకవేళ చెల్లి పుడితే నువ్వు దాంతో ఆడుకోవా? నువ్వు దానికి అన్నవి కావా?” అన్నాను.

          వెంటనే “ఎందుకు కాను, అది బాయ్ అయినా, గర్ల్ అయినా నా తమ్ముడు, చెల్లెలే. ఐ లవ్ దెమ్ నో మాటర్,” అన్నాడు.

          “దట్స్ గుడ్! నాకు తెల్సు నీకు తమ్ముడు కావాలని. కానీ ఆడపిల్లయినా, మగ పిల్లవాడయినా, ఆరోగ్యంగా వుండాలి. నువ్వు పుట్టక ముందు మేము ఆడపిల్ల పుడుతుందేమో అనుకున్నాము. కానీ నువ్వు పుడితే మేమేమి బాధ పడలేదు. ఎవ్వరయినా ఒకేరకంగా ప్రేమగా చూసుకోవాలి.”

          “నాకు తెలుసమ్మా!”

*****

(సశేషం)

Please follow and like us:

One thought on “వ్యాధితో పోరాటం- 11”

Leave a Reply

Your email address will not be published.