కనక నారాయణీయం -40

పుట్టపర్తి నాగపద్మిని

          పుట్టపర్తి  ‘ఒరే కృష్ణమాచారీ!! నువ్వు జాతక బ్రహ్మవు కదా!! పిల్లల జాతకాలూ నువ్వే కదా చూసింది!! ఈ పుణ్యం కూడా నువ్వే కట్టుకో!! ముహూర్తమదీ చూసి తెలిపితే ఇక మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం.’ అన్నారు.

          ‘ఇదిగో!! వదినగారికి  బొట్టు పెడతాను..’ అంటూ లోపలి నుంచీ పసుపూ కుంకుమా తీసుకు వచ్చి తంగమ్మకు తాంబూలం అందించింది.

          సంతోషంగా అందరూ వీడుకోలు పలుక్కుంటూ వున్నప్పుడే దేశికాచార్యులు అన్నారు,  ‘అవునూ!!  తెల్లగా వుందే, అమ్మాయి, మీ రెండో కూతురు కూడా పెళ్ళికి ఉందా??’

          కనకమ్మ చటుక్కున తలెత్తి చూసింది, భర్త వైపు!!

          ఆయన ఏదో వేరే కవితా లోకంలో ఉన్నట్టున్నారో లేదా వినబడలేదో మరి!! కానీ,యీ ప్రశ్నకు సుబ్రమణ్యం, వెంటనే సమాధానం ఇచ్చాడు, ‘అవును స్వామీ!! రెండో చెల్లెలు తరులత ఉంది. ఇంకా 18 ఏళ్ళే!! చదువుకుంటూ ఉంది.’

          కృష్ణమాచార్యులు కూడా అందుకున్నాడు. ‘ఔనౌను. రెండో కూతురు, తరులత కూడా కరుణదేవితో కలిసి పాడింది కదా!! వీళ్ళిద్దరూ, పుట్టపర్తి సిస్టర్స్ పేరుతో పాట కచేరీలు కూడా చేస్తూ ఉంటారు.సెవెంత్ ఫారం అనుకుంటా చదువుతూ వుంది. అక్కయ్యా, చెప్పండి,  దేశికాచార్యులవారు అడుగుతున్నారు.”

          కనకమ్మ అప్ప్పటికి తేరుకుని అన్నది,’ఔనండీ, మంచి సంబంధం కుదిరితే రెండో బిడ్డకు కూడా కల్యాణం జరిపించాలనే వున్నది. మీ బంధువుల్లో ఎవరైనా వుంటే చెప్పండి, ఏమండీ, అన్నయ్యగారు, తరులత కూడా పెళ్ళికి వుందా అని అడుగుతున్నారు!!’ అనేసింది.

          పుట్టపర్తి కనకమ్మ మాటలతో యీ లోకంలోకి వచ్చారు. ‘ఔను బావగారు, తరులత కూడా పెళ్ళికి ఉంది.’

          తంగమ్మ కనకమ్మను చూస్తూ ఆసక్తిగా అన్నది,’ తరులత, పేరే చిత్రంగా వుందే??

          ‘బెంగాలీలో తోరుదత్ అని ఒక యువ ఆంగ్ల కవయిత్రి ఉందండీ, చాలా చిన్న వయసులో మంచి కవిత్వం రాస్తున్నదట, ఆ పేరు స్ఫూర్తితో మా వారు, యీ పేరు పెట్టారు, అమ్మాయికి !!’

          ఈ సమాధానానికి దేశికాచార్యులు భళ్ళున నవ్వేసి అన్నారు, ‘బావుంది, ఎక్కడి బెంగాలీ కవయిత్రి పేరో చూసి, ఇక్కడ తెలుగు వారింట ఆ పేరు పెట్టుకోవడమా?? మన దగ్గర ఎన్ని పేర్లు లేవు?? వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఆండాళమ్మ శ్రీరంగ నాయకి పేర్లన్నీ ఎంత బాగుంటాయి?? ఆ పేర్లన్నీ వదిలేసి?’ మధ్యలోనే నవ్వుతో ఆగిపోయాడాయన!!

          ఆయన మాటలతో పుట్టపర్తి మొహం కాస్త వివర్ణమైంది.

          ఈ సంగతి గమనించి కృష్ణమాచార్యులకు అనిపించింది, ‘అమ్మో, ఇదెక్కడి ప్రశ్న, యీ సమాధానం, దీనికి మరో ప్రశ్న!! అటు పుట్టపర్తి స్వామి, ముఖం ముడుచుకుంటుంది కూడా!! ఏమవుతుందో తర్వాత??’ అందుకే వెంటనే  అందుకున్నాడు. ‘ఔను ఆచార్యుల వారూ!! అవన్నీ మనకూ తెలిసిన విషయాలే కదా!! ఏదో కొత్తగా వుంటుందని, ఈ పేరు పెట్టారు లెండి, ఇంతకూ, విషయమేమిటి?? ఎందుకని అడిగారు??’ అని అసలువిషయం ప్రస్తావించాడు.

          దేశికాచార్యులవారు ఇదంతా పట్టలేదు, ‘ఆ  ఆ..అంతే లెండి. ఏమీ లేదు, హంపీ  కామలాపురలో మా తమ్ముడు సింగరాచార్యులు, మా పెద్దయ్య కుమారుడు, తనకు పెళ్ళి కావలసిన కొడుకున్నాడు. వాళ్ళూ సంబంధాలు వెదుకుతున్నారు. గంపెడంత ఆస్తి!! మంచి అణకువతో వుండే పిల్ల కావాలట వాళ్ళకు!! ముఖ్యంగా సంగీతం వచ్చిన పిల్ల కావాలట!! అబ్బాయి, బళ్ళారి కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు. నిజానికి ఉద్యోగం చేయవలసిన పనే లేదు, బోలెడoత పొలం వుంది అన్నాను కదా!! దాన్ని సరిగ్గా చేసుకున్నా చాలు, కానీ ఇదిగో యీ కాలానికి తగ్గట్టు, బీ.కాం. చదివి, ఉద్యోగం చేస్తున్నాడు. పేరు రామానుజాచార్యులు. మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయి జాతకం అదీ ఇదిగో యీ కృష్ణమాచార్యులకే అందజేస్తే, మరో అడుగు ముందుకు వేయవచ్చు కూడా!!’    

          ఏ మాత్రం భేషజం లేని వారి మాటలతో, అక్కడున్న అందరి ముఖాల్లోనూ, ఆశ్చర్యానందాలు!! వారి మాట తీరెలా వున్నా మనసు వెన్న అని స్పష్టంగా తెలిసి పోయింది. పైగా విస్తరిస్తున్న పుట్టపర్తి కీర్తి, కుటుంబ పరిస్థితి, ఇవన్నీ వారిని ప్రభావితం చేశాయనటంలో సందేహమే మాత్రమూ లేదనిపించింది.

          కనకమ్మ అందుకుంది ముందుగా,’ తప్పకుండానండీ!!  పెద్ద మనసుతో మీరామాట అనటమే మా భాగ్యం!! ఏమండీ, తరులత గురించి కూడా వారు ప్రస్తావిస్తున్నారు.’

          పుట్టపర్తి చేతులెత్తి దేశికాచార్యులకు నమస్కరించారు, కృతజ్ఞతా పూర్వకంగా!!

          కృష్ణమాచార్యులన్నాడు, ‘అయ్యా!! నేను తప్పక తరులతమ్మ జాతకంతోమిమ్మల్ని స్వయంగా కలుస్తాను తొందరలోనే!! ఇక రాఘవ, కరుణాదేవి వివాహ లగ్న పత్రిక ఎప్పుడు రాసుకుందామంటారు?? 

          దేశికాచార్యులన్నారు, ‘త్వరలోనే రాసుకుందాం, నువ్వే చెప్పు. మాఘమాసంలో లగ్నం పెట్టుకుంటే బాగుంటుంది కదా!! ఏమంటావ్??’

          “నేనేమంటాను?? కల్యాణ కార్యభారం వహించే వాళ్ళు చెప్పవలె!! ఏమంటారు స్వామీ??’

          పుట్టపర్తి, అర్ధాంగి కనకమ్మ, సుబ్రమణ్యం కేసి చూస్తుండగా, ఆమె అందుకుంది, ‘అంతకన్నానా అన్నయ్య గారూ?? మీ మాటే మా మాట!!’

          ‘శుభస్య శీఘ్రం..ఇంక మేము బయలుదేరుతామమ్మా !!’

          కొడుకు కళ్ళలోకి చూసిన తంగమ్మ నవ్వు ముఖంతో కనకమ్మతో అన్నది,’మా కాబోయే కోడలిని కూడా పిలవండి. ఒకసారి చూసి, తనకీ చెప్పి బయలుదేరుతాం.’  

          కనకమ్మ కూడా ముసిముసి నవ్వులతో, ‘తప్పకుండా,’ అంటూనే, ఇంట్లోకి వెళ్ళి, కరుణా, తరులతలనిద్దరినీ వెంట బెట్టుకుని వచ్చింది. బిడియంగా తలవంచుకుని నిలబడ్డ కరుణాదేవి తల మీద ఆప్యాయంగా చేయి వేసి నిమిరి,”ఏమ్మా, మా ఇంటికి కోడలుగా వస్తావా??’అని అడిగింది.

          పక్కనే నిల్చుని వున్న తరులత అక్కయ్య కేసే చూస్తున్నది. తనకు ఇంతదాకా జరిగిన సంగతులేమీ తెలియదు. అప్పట్లో పద్ధెనిమిదేళ్ళ వయసంటే, పెళ్ళి చూపులంటే కూడా తెలిసే వయస్సు కాదు మరి! ఏదో అక్కయ్యకు తోడుగా నిల్చోడమొక్కటే తెలుసు. పైగా చిన్నప్పటి నుంచీ వాళ్ళిద్దరూ ఒక జట్టు మరి!

          ఇంకా తలవంచుకునే వున్న కరుణమ్మ, మౌనంగానే తల ఊపింది. 

          వాళ్ళిద్దరి వంకా ప్రేమగా చూస్తూ, వస్తాం మరి,’ అందామె!!

          పుట్టపర్తి దంపతులు ఇంటి బయటిదాకా వెళ్ళి వాళ్ళకు వీడుకోలు పలుకుతుండగా, నెమ్మదిగా కృష్ణమాచార్యులు, సుబ్రమణ్యం కూడా దేశికాచార్యులవారి కుటుంబంతో పాటు, వాళ్ళను కర్నూల్ బస్సులో ఎక్కించేందుకు వాళ్ళతో పాటే బస్ స్టాండ్ దాకా వెళ్ళి వస్తామంటూ బయలుదేరి వెళ్ళారు.

          వాళ్ళటు వెళ్ళగానే కనకమ్మ ముందుగా తళిహింట్లో, దేవుని మందాసనం దగ్గరకు వెళ్ళి, దీపాలు వెలిగించి, సంతోషంగా లక్ష్మీనారాయణ మూర్తుల ముందు చేతులు జోడించి, మొక్కు కుంది, స్వామీ, మమ్ములను ఇలాగే కాపాడుతూ వుండు, నీ కరుణా దృక్కులతో, అనుకుంటూ!!

          కరుణా, తరులతలు పెరట్లోకి వెళ్ళి కూర్చున్నారు.

          పడసాల్లో పుట్టపర్తి చెక్క కుర్చీలో గంభీరంగా కూర్చుని వున్నారు.

          కనకమ్మ అక్కడే ఇంకా వేసివున్న చాప మీద కూర్చుంటూ, ‘ఆ ఏడుకొండలవాడి దయతో యీ సంబంధం కుదిరింది. ఇప్పుడు వాళ్ళు తరులత గురించి కూడా మాట్లాడారు కదా!! ఇద్దరికీ సంబంధాలు కుదిరితే మంచిదే!! రెండు పెళ్ళిల్లూ ఒకేసారి చేయగలమా అనే ఆలోచన!’

          పుట్టపర్తి చేతులు పైకెత్తి ” ఆ పైవాడిదే భారం..’ అన్నట్టుగా చూశారు.

          ఇంతలో సుబ్రమణ్యం ఇంట్లోకి వచ్చేశాడు.

          పుట్టపర్తి “ఏమిరా, అంత తొందరగా బస్సు దొరికిందా??’ అని అడిగారు.

          వాళ్ళు ప్రస్తుతం వుంటున్న ఇల్లు మోచంపేట (అసలు పేరు మోక్షంపేట, ప్రజల నోళ్ళలో నాని నాని, మోక్షంపేట, మోచంపేటగా మారింది.) నుంచీ బస్ స్టాండ్ కనీసం ఇప్పటి భాషలో మూడు నాలుగు కిలోమీటర్లు వుంటుంది) ఇంతలో ఎలా వచ్చేశాడా అని పుట్టపర్తి సందేహం.

          ‘రెండో గాంధీబొమ్మ దగ్గరికి వెళ్తున్నామో లేదో బస్సొచ్చేసిందయ్యా!! దాని కండక్టర్ నాకు తెలిసిన వాడే!! పరుగెత్తుకుని వెళ్ళి బస్సు ఆపేయించాను. సీట్లు కూడా దొరికినయి. రాత్రికి 9 గంటలకల్లా చేరుకుంటారు క్షేమంగా !!’ అన్నాడు.

          ‘సరే ఐతే!! ఇంత వరకూ బాగానే వుంది, మరి తరులతమ్మ గురించి కూడా వాళ్ళేదో అడిగినట్టున్నారు కదా?? దేవుని దయవల్ల ఆ సంబంధమూ కుదిరితే, మంచిదే, పెళ్ళిళ్ళు చేయగలమా రెండూ ఒకే సారి??’

          ‘అయ్యా!! మీకెందుకు అంత ఆలోచన?? చెల్లెళ్ళిద్దరికీ మంచి సంబంధాలు మన ప్రయత్నం లేకుండానే వచ్చినప్పుడు తల తాకట్టు పెట్టైనా చేస్తాను. మీరేమీ ఆలోచించ వద్దు.’ అనేశాడు, పెద్ద కొడుకుగా తన బాధ్యతను తానే మోస్తాను అన్నట్టుగా!!

          తమ కడుపున పుట్టకపోయినా తలలో నాల్క వలె చిన్నప్పటి గురువు గారి ఇంటి బాధ్యతను తన బాధ్యతగా నిర్వహించే సుబ్రమణ్యంను తృప్తిగా చూస్తూ వుండిపోయారు పుట్టపర్తి దంపతులు. చిన్నప్పటి గురువు గారి అనుక్షణం తాము ఋణ గ్రస్తులమై పోతూనే వున్నామనిపిస్తూనే ఉంటుంది, ఇటువంటి సందర్భాల్లో!!

***

          తరువాత కొన్ని రోజులకే  కృష్ణమాచార్యుల అధ్వర్యంలో శ్రీమాన్ దేశికాచార్యుల వారి తండ్రిగారు బాణగిరి రామాచార్యులవారి సమక్షంలోనే హొసపేట కామలాపురంలో, చిరంజీవులు కరుణాదేవి రాఘవాచార్యుల పరిణయానికి సంబంధించి నిశ్చితార్థం, లగ్న పత్రిక పెట్టుకోవటం కూడా దివ్యంగా జరిగిపోయాయి. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి కాబోయే వియ్యంకుడు దేశికాచార్యులవారు ముందే చెప్పినట్టు, శ్రీమాన్ బాణగిరి శింగరాచార్యుల వారు కూడా రావటం జరిగింది. అక్కడే, వారి ఏకైక పుత్రుడు, రామానుజాచార్యుల పెళ్ళి సంబంధం కోసం చి.సౌ. తరులత జాతకాన్ని కూడా పుట్టపర్తి దంపతులు వారికి సమర్పించారు. ఈ సంబంధం గురించి తమకందిన మరొక ముఖ్యమైన విషయం పుట్టపర్తి దంపతులను మరింత ఆనందింపజేసింది.

( ఇందులోని 1959 నాటి కరుణాదేవి వివాహ లగ్న పత్రిక, ఇటీవల బయటపడిన నిధుల్లో ఒకటి.  దీన్ని కనుగొని, నాకు యీ ధారావాహిక కోసం అందజేసిన మా కరుణక్కయ్య  ప్రథమ పుత్రుడు, ఆంధ్రా బ్యాంక్ విశ్రాంత మేనేజర్  చి. బాణగిరి కృష్ణప్రసాద్ కు కృతజ్ఞతలు)

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.