ఇది అహంకారం కాదు

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

-పద్మావతి రాంభక్త

          “ఏమిటీ వ్యాపారంచేసే అమ్మాయా, బాబోయ్ వద్దు”

          “నూనె అమ్ముతుందా అసహ్యంగా, ఛీ.. అసలేవద్దు”

          పెళ్ళిసంబంధాలకు వచ్చిన వాళ్ళ దగ్గర ఈడైలాగ్లు వినీ వినీ అమ్మా నాన్నా నేను విసిగిపోయాం.

          “ఇవన్నీ నీకెందుకు, హాయిగా పెళ్ళిచేసుకుని ఒక ఇంటికి ఇల్లాలు కావల్సినదానివి” అంటూ మొట్టమొదట సణిగే అమ్మ

          “వద్దమ్మా. ఇటువంటి వ్యాపారాలు అవీ మనకెందుకు. క్యాంపస్ఇంటర్వ్యూలో ఉద్యోగం వస్తుంది కదా. అది చేసుకో. నువ్వు ఎలాగూ బ్రిలియంట్ స్టూడెంట్ వి, నీకు బ్రైట్ ఫ్యూచర్ వుంది.” అని మొదట్లో వారించిన నాన్న ఈ మధ్య బాగా ఎంకరేజ్ చేస్తున్నారు.

          అదేమిటి అమ్మాయి వ్యాపారం చెయ్యకూడదా? నేను నడిపేది ఆర్గానిక్స్టోర్. అందులో కోల్డ్ప్రెస్డ్ఆయిల్ ఫ్రెష్ గా అమ్మడానికి చైనా నుండి నాలుగు మిషన్లు రప్పించాను. నేను డైరెక్ట్ నూనెను అమ్ముతాను. లేక ఎవరైనా వేరుశెనగ పలుకులు, నువ్వులు తీసుకొచ్చినా వాళ్ళ కళ్ళెదుటే వాళ్ళు తెచ్చుకున్న దినుసుల నుండి నూనె తీసి ఇస్తాను.

          ఈ మధ్య అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి ఎంత ధరైనా వెచ్చించి ఫార్మర్స్ కూరగాయలు, అవీ ఆర్గానిక్ వి కొనడంలో ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దానినే నా వ్యాపారసూత్రంగా మలచుకున్నాను. దీని వెనుక చెప్పాలంటే పెద్ద కథే ఉంది.

***

          నా స్నేహితురాలు నీలిమ ఒకసారి వారాంతంలో కలిసినపుడు..

“వసుధా,

          మన సిటీకి దగ్గరగా ఉన్న గ్రామంలో రెండు ఎకరాలు లీజుకి తీసుకుందామను కుంటున్నాను” అంది.

          “ నీకెందుకే భూమి లీజుకి ? “ ఆశ్చర్యంగా అడిగాను.

          “వ్యవసాయం చేద్దామను కుంటున్నాను” అంది సింపుల్గా.

          “ ఏమిటీ ‘వ్యవ’  సాయమా? నన్నుసాయం చెయ్యమంటావా?” అన్నాను జోక్చేస్తూ .

          “ జోక్కాదు వసుధా, అయాం సీరియస్” అంది.

          “పెద్ద పెద్దవాళ్ళు అందునా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళే వ్యవసాయం చెయ్యలేక చేతులెత్తేస్తుంటే, నువ్వు వ్యవసాయం చేస్తావా? బాగా ఆలోచించుకునే మాట్లాడుతున్నావా? “ అన్నాను.

          “ నిజం వసూ, నేను చేస్తాను. చెయ్యగలను” అంది ధీమాగా. అప్పుడు నాకు తను ఈ విషయంలో ఎంత సీరియస్ గా  ఉందో అర్ధమైంది.

          అన్నట్టుగానే కొన్ని ఎకరాల భూమి లీజుకు తీసుకుంది నీలిమ. నేను కూడా సరదాగా తను ఏది ఎలా చేస్తోందో చూద్దామని తనతోపాటు అప్పుడప్పుడు వెళ్ళే దాన్ని. తను తీసుకున్న భూమి చిన్నచిన్న మడులుగా విభజించి కూరగాయలు, పాదులు వేసింది. ఆ గ్రామంలో కొందరు ఆడవాళ్ళను కూడదీసి వారి సహాయంతో మొదటవిడతగా కూరగాయలు పండించింది. వాటిని ఆటోల్లో వేసి ఒకరిద్దరిని వాటితో బజార్లకు పంపి అమ్మించేది.

          ఆ తరువాత కొన్నాళ్ళ వరకు తనని కలవడం కుదరలేదు.

          ఒకరోజు తనని బయట కలిసినపుడు “ నీలూ ఎలా నడుస్తోంది నీ వ్యవసాయం?” అని అడిగాను.

          “ అప్పుడు చూసావుకదా వసూ, రెండు మూడుసార్లు ఏదో నామమాత్రంగా డబ్బులు మిగిలాయి. ఒక రకంగా నోప్రాఫిట్నోలాస్ అనుకో. ఇప్పుడు నా పంధా మార్చాను” అంది నవ్వుతూ.

          “ అవునా, ఏమిటో చెప్పు . చాలా ఇంట్రెస్టింగా ఉంది” అన్నాను.

          “ముందు కూడా నేను చేసింది సేంద్రీయ వ్యవసాయమే కదా. కాబట్టి ఖర్చు ఒకపిసరు ఎక్కువే. షాపుల్లో కెమికల్బేస్డ్ ఎరువులు వేసి పండిస్తే దిగుబడి ఎక్కువ వచ్చి నాలుగు డబ్బులు కళ్ళ చూడచ్చు అనుకో, కానీ నాకు అది ఇష్టం లేదు. అందుకే ఒక పక్క ఎండుటాకులు, పాడైన కూరగాయలు కలిపి కంపోస్టింగ్చేస్తున్నాను. పశువుల గెత్తం అదీ కొని, మొక్కలకు వేసి పండిస్తున్నాను. వీటితోపాటు ఆవుపేడ, బెల్లం, సెనగపిండి మొదలైనవి కలిపి జీవామృతం కూడా తయారుచేసి వాడుతున్నాను” అంది.

          “ ఇవన్నీ నీకు ఎలా తెలుసు?” అడిగాను ఆశ్చర్యంగా.

          “మా చిన్నడాబా పై మొక్కలు సరదాగా పెంచుతున్నానని నీకు తెలుసు కదా? అలా ఒక గార్డెనింగ్ వాట్సాప్ గ్రూప్లో చేరాను. ఆ గ్రూప్ ద్వారా చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఎంతమంది సేంద్రియ పద్ధతులలో పండించిన ఆహారం పై ఆసక్తి చూపుతున్నారో కూడా అక్కడే గమనించాను. ఆకు కూరలు మామూలుగా కట్ట పదిరూపాయలైతే ముప్పై రూపాయలైనా సరే పెట్టి సేంద్రియ పద్ధతిలో పండించిన దానిని ఎగబడి కొనుక్కుంటున్నారు. ఆరోగ్యంకన్నా ముఖ్యమైనది ఏముంటుందని అందరూ గ్రహిస్తున్నారు. అయినా పురుగు మందులు చల్లిన కూరలను తిని , ఈ మధ్య క్యాన్సర్లాంటి జబ్బులు ఎక్కువవుతున్నాయి కదా” అంది.

          “అవును అందునా వాట్సాప్లో సర్కులేట్ అవుతున్న వీడియోలు చూస్తే ఏమీ తినబుద్ధి కావట్లేదు. దొండకాయలు, కాకరకాయలు మొదలైన వాటిని ఏదో పచ్చని ద్రావణంలో ముంచడం, పళ్ళకు తాజాగా ఉండడానికి ఏవో ఇంజక్షన్లు చెయ్యడం అన్నీ చూస్తున్నాను” అన్నాను.

          “ అవును, అందుకే మా ఇంట్లోకి సరిపడా పండిస్తూ, చిన్న మార్జిన్తోనే కొద్ది మందికైనా మంచి ఆహారం అందిద్దామని ఈ ప్రయత్నం” అంది.

          “ అదిసరే కానీ నీలూ మీ ఇంట్లో ఏమీ అనలేదా, ఆడపిల్ల వ్యాపారమేమిటి వ్యవసాయమేమిటి అని గొడవ చేసుంటారే. మా ఇంట్లోకన్నా మీ ఇంట్లో ఇంకా స్ట్రిక్ట్ కదా” అని అడిగాను.

          “ ఎందుకు గోలచెయ్యరే వసూ, మామూలుగా చేసారా గొడవ. ఎంత రచ్చచేసారో తెలుసా. పెద్ద మగరాయుడు బయలుదేరిందండీ వ్యాపారం చెయ్యడానికి అని నా మేనత్తలు మూతి మూడువంకర్లు తిప్పారు. కానీ మా పెద్దత్త కొడుకు లేడూ అదే మా పెద్దబావ, తనొక్కడే నాకు సపోర్ట్చేసి అందరినీ సమాధానపరచాడు. నాన్నతో కూడా ‘చెయ్యనీ మావయ్యా, మరీ తనకి కష్టమనిపిస్తే తనే మానేస్తుంది లెండి. అయినా తను చేసేది చాలా మంచిపని. ‘ఇట్స్నీడ్ఆఫ్దిడే’ “అన్నాడు. లోన్ కూడా తనే ఇప్పించాడు షూరిటీ సంతకం పెట్టిమరీ” అంటూ నీలిమ ఏదో ఆలోచనలో పడింది.

          “ ఏమిటి నీలూ ఆ దీర్ఘాలోచన” అంటూ తన భుజాలు పట్టుకుని కుదిపాను.

          “ ఏమీలేదే, దేనికైనా పదేపదే ఆడపిల్ల అంటూ గుర్తు చెయ్యడం మానరు కదా. మళ్ళీ చదివిస్తారు, అదీ పెళ్ళి కోసం. నానా తంటాలు టెన్షన్లుపడి తెచ్చుకున్న ఉద్యోగం కూడా పెళ్ళయ్యాక అత్తవారు వద్దంటే మానెయ్యాలి, చెయ్యమంటే చెయ్యాలి. ఆ మాత్రం దానికి అంత కష్టపడి ఎందుకు చదవాలి అనే నిరాసక్తత వచ్చేయదూ. ఆడదాని పరిస్ధితి ఇన్నేళ్ళైనా ఏమీ మారలేదు. మళ్ళీ ఎక్కడ చూసినా ఉమన్ డెవలప్మెంట్ అంటూ ఉపన్యాసాలు రాతలు”  అంది కోపంగా.

          “ అమ్మా తల్లీ, ఇక ఆపు నీ ఉపన్యాసం. ఇంతకీ ఈ మధ్య కొత్తగా ఏమైనా ప్రయోగాలు చేసావా” అడిగాను ఆసక్తిగా.

          నీలిమను చూస్తే నాకు భలే ముచ్చటేసింది. నా స్నేహితురాలు ఇంత చక్కగా ఆలోచించడమే కాక తన ఆలోచనలని అమలు పరుస్తుంటే ఆనందంగా ఉండదూ మరి.

          “ అవును, వసూ. చిన్నచిన్నఐడియాలతో కొన్ని మార్పులు చేసాను. ఇప్పుడు ఒక మడిని ఒకరు అద్దెకు తీసుకుని తమకు నచ్చిన కూరగాయలు అందులో పండించుకోవచ్చు. నేను ఒక పాతిక కూరగాయల పేర్లు వాళ్ళకు ఇస్తే, వాళ్ళు ఒక పన్నెండుదాకా కూరగాయలను ఎంపిక చేసుకోవచ్చు. ఆ పన్నెండు కూరగాయలు మేము మొక్కలు వేయడమో, విత్తనాలు చల్లడమో చేస్తాం. ఆ మడికి అద్దె చెల్లించినవారు ప్రతివారాంతంలో వచ్చి తమ కూరగాయలు వారే తాజావి కోసుకోవచ్చు లేదా పిల్లలతో పాటువచ్చి మొక్కలకు నీరు పెట్టడం వంటివి కూడా చెయ్యచ్చు. ఈ మధ్య చాలా మంది పిల్లలను తీసుకొచ్చి మొక్కల పని నేర్పిస్తున్నారు అంటే పిల్లలు విత్తనం మొలకెత్తే దశ నుండి పూలు కాయలు వచ్చే వరకూ చూస్తారు. వాళ్ళకి ఇది బాటనీ ప్రాక్టికల్స్ గా  కూడా పనికొస్తుంది. పర్యావరణ స్పృహ కూడా పసివారిలో పెరుగుతుంది కదా అని కొందరు తల్లిదండ్రులు శ్రద్ధగా తీసుకొస్తున్నారు.

          అలా రావడం కుదరని వారికి ఇంటికే కూరగాయలు డెలివరీ చేస్తున్నాం” అంది నవ్వుతూ.

          “ మొత్తానికి ఒకకొత్త హరిత విప్లవం తెచ్చేలా ఉన్నావు నీలూ, శభాష్. కంటిన్యూ” అంటూ షేక్హాండ్ ఇచ్చాను.

***

          నీలిమని కలిసిన ప్రతిసారి నాకు కూడా ఏదైనా కొత్తగా చెయ్యాలనే ఉత్సాహం కలిగేది.

          కానీ తను చేసిందే నేను కూడా చెయ్యడంలో అర్ధం లేదు, పోనీ తన దగ్గరే పార్టనర్షిప్  తీసుకుంటే ఎలా ఉంటుందా అనిపించింది. కానీ స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తే అనవసరంగా స్నేహం చెడిపోతుందని కూడా అనిపించింది. అటువంటి సందిగ్ధ సమయంలో నాకు ఒక దారి దొరికింది. మా బాబాయికి, అంటే నాన్న తమ్ముడికి డయాబటిస్ బాగా ఎక్కువై, మిల్లెట్స్ మాత్రమే తినమని డైట్ప్లాన్ఇచ్చారు. తెల్లన్నం అసలు తినద్దన్నారు. ఇక అప్పటి నుండీ మధ్యాహ్నం భోజనానికి పిన్ని కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు మార్చిమర్చి వండేది. కొన్నిసార్లు ఎవరెవరినో అడిగి వాటితో ఏవేవో వంటకాలు చేసేది. అప్పుడు నేను పిన్నికి తన మొబైల్లో యూట్యూబ్ వీడియోలు ఎలా చూడాలో నేర్పించాను. పాపం పిన్నిపెద్దగా చదువుకోలేదు కానీ, తెలుగు రాయడం చదవడం బాగానే వచ్చు.   తనకి నేను తెలుగు కీబోర్డులో టైప్చేసి వంటల వీడియోలు ఎలా వెతకాలో చెప్పాను.

          “ బోలెడన్ని రకాల వంటలు చక్కగా అరటిపండు ఒలిచినట్టు చేసి చూపిస్తున్నరే వసుధా. చాలా హాయిగా ఉందీ పద్ధతి. లేకపోతే వండిందే వండుతున్నావని మీ బాబాయి ఒకటే సతాయింపు. కానీ, పాపం ఆయన మాత్రం ఎంతకని ఒకే రకం తినగలరు” అంటూ తెగ సంబరపడిపోతూ నా గురించి అడిగినవారికి అడగనివారికి కూడా చెప్పడం మొదలు పెట్టింది.

          ఆ క్రమంలో నా మెదడులో ఏదో మెరిసింది.

          ఇంట్లో నాన్న తీరికగా కూర్చున్నపుడు నా ఆలోచనను చర్చించగానే ముందు వింతగా చూసి..

          “ఎందుకమ్మా మనకి ఇవన్నీ, హాయిగా ఏదో ఒక ఉద్యోగం చూసుకోకుండా” అన్నారు.

          “నాన్నా ప్లీజ్, నన్ను ప్రయత్నించనివ్వండి” అంటుంటే

          “అది అన్నదానికల్లా ఊకోట్టకండి. పెళ్ళి కావల్సిన పిల్ల. ఇలా ఇవన్నీ చేస్తోందని తెలిస్తే ఎవరు చేసుకుంటారు” అంటూ అమ్మ విరుచుకు పడింది.

          “ నాన్నా నాకు ఒక్క అవకాశమివ్వండి” అంటూ నాన్న ముఖంలోకి చూస్తే మెత్తబడినట్టే అనిపించారు.

          నాకు నాన్న సపోర్టు దొరికిందని అమ్మకు అర్ధమైపోయి..

          “ఇంకేం తండ్రీ కూతురూ వ్యాపారాలంటూ మీకు నచ్చింది చేసుకోండి. ఇక పిల్లకు పెళ్ళి చెయ్యకుండా ఇలాంటివి చేయిస్తున్నారని ఊరూవాడా ఏకమై నా ముఖం చూసి నవ్వడమే మిగిలింది” అంటున్నఅమ్మను చూసి..

          “ అమ్మా, ఎవరేమనుకుంటే మనకేం చెప్పు. మనం చేస్తున్నది తప్పు కానప్పుడు మనమెందుకు వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు పట్టించుకోవడం…” అంటూ కాసేపు మాట్లాడేసరికి అమ్మ కూడా కాస్త కన్విన్స్అయింది.

***

          బాంకులో లోన్తీసుకుని ఆర్గానిక్స్టోర్ ఓపెన్చేసాను. ఆ ఏరియా వాళ్ళందరికీ పాంప్లెట్స్ పంచి అందరినీ ఆహ్వానించాను. అమ్మచేతే రిబ్బన్కట్చేయించాను. నీలిమను అందరికీ పరిచయం చేసి తనే నాకు ఇన్స్పిరేషన్అని చెప్పాను. నీలిమ నా స్టోర్చూసి చాలా ఆనందపడింది.  స్టోర్ఓపెనింగ్కి అందరికీ చిన్నచిన్న పాకెట్లలో కొన్ని పప్పుపొడుల సాంపిల్పేకెట్లు కాంప్లిమెంట్గా ఇచ్చాను. మొదటి వారం కాస్త సేల్స్ తక్కువగా ఉన్నా ఆ తరువాత వ్యాపారం బాగా పుంజుకుంది.

          మిల్లెట్స్మినప్పప్పు మాత్రమే వాడి తాజా ఇడ్లీ రుబ్బు, దోశ రుబ్బు అమ్మడం మొదలు పెట్టాను. ఆల్రెడీ పెద్దపెద్ద స్టోర్స్లోనూ ఆన్లైన్లోనూ మామూలు ఇడ్లీ రుబ్బులు, దోశరుబ్బులు అమ్మడం నాకు తెలుసు. మా ఇంట్లో మేము ఊరువెళ్ళి వచ్చినపుడు గబగబా ఆ రుబ్బులు తెచ్చుకుని టిఫిన్స్చేసుకుంటాం.

          నా మిల్లెట్ఇడ్లీ దోశ రుబ్బులు బాగా క్లిక్అయ్యాయి. జొన్నలు రాగులు మొదలైనవి పిండి ఆడించి డ్రైపౌడర్కూడా షాపులో పెట్టాను. ఆ పిండిలో నీరు కలిపి దోశలు పోసుకోవడమే.

          ఈ రోజుల్లో భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలకు పొద్దున్న పోయి సాయంత్రం వస్తారు. వాళ్ళకి ఇలా పప్పు నానబెట్టుకోవడాలూ, రుబ్బుకోవడాలూ విసుగ్గా అనిపిస్తాయి కాబట్టి, వాళ్ళకి ఇలా రుబ్బు కొనుక్కోవడం చాలా తేలిక. ఆ పాయింట్నే నేను ఉపయోగించుకుని వాళ్ళ నాడి పట్టుకుని కావలసినవన్నీ నా స్టోర్లో పెట్టాను.

          అన్నిజంక్షన్స్లో బానర్లు కట్టి, బోర్డులు పెట్టి రేడియోలో చెప్పించి అడ్వర్డైజింగ్ కూడా బాగా చేసాను.

          విపరీతంగా సేల్స్ పెరిగింది. నాకు తోడుగా అమ్మానాన్నా కూడా కొన్ని చిన్నచిన్న పనులు అందుకుంటూ సహాయం చేస్తున్నారు. ఒక పది మంది అమ్మాయిలను స్టోర్లో నియమించాను. వాళ్ళు కస్టమర్స్కు కావలసినవి అందించడంలో సహాయపడతారు. షాప్ బయట ఆయిల్మిషన్ల దగ్గర ఒక పెద్దాయనను పెట్టాను. వచ్చిన వాళ్ళు వేరుశెనగలు వంటివి ఆయనకు ఇస్తే, ఆ మిషన్లో వచ్చిన తాజా నూనె వాళ్ళు తెచ్చుకున్న సీసాలోపట్టి ఇస్తారు. అలా నా వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది.

          ఇప్పుడు చుట్టాలకే కాదు అందరికీ నేనే హాట్టాపిక్.

          “ అమ్మో మన వసుధే. ఎంత వ్యాపారదక్షత, ఎంత తెలివి” అంటూ అమ్మ దగ్గర పొగుడుతుంటే అమ్మ నా దగ్గరే చెప్పి మురిసిపోతూ ఉంది. అలా కాస్తకాస్తగా విస్తరిస్తూ ఆన్లైన్ఆర్డర్లు కూడా తీసుకుంటూ, వెబ్సైట్కూడా క్రియేట్చేసాను. నా గురించి, నా స్టోర్గురించి న్యూస్పేపర్లలో కూడా ఆర్టికల్స్ వచ్చాయి.

          నా బిజినెస్ టర్నోవర్ఇప్పుడు లక్షల్లోకి చేరింది. లోన్తీర్చేసి ఇల్లు తనఖా నుండి విడిపించాను. నా డబ్బులతో ఒక మూడుబెడ్రూమ్ల ఫ్లాట్కొనుక్కున్నాను. షాప్కోసం మరొక బ్రాంచ్కూడా ప్లాన్చేస్తున్నాను. ఇప్పుడైతే విపరీతంగా పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. ఎంతో మంది పెళ్ళి కొడుకులు, వాళ్ళ కుటుంబాలు మా ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఇప్పుడు నేను ధైర్యంగా పెళ్ళికొడుకులను రిజెక్ట్చేస్తూ, నాకు నచ్చిన భర్తను ఎన్నుకునే పనిలో బిజీగా ఉన్నాను. నా ఆలోచనలను, నా పనులను, నన్ను గౌరవించేవాడు నాకు కావాలి. నేను చేసిన పనిని ప్రేమిస్తూ నాకు సహాయపడుతూ నా నీడలా నిలబడాలి. మేమిద్దరం జీవనగీతం ఆనందంగా ఆలపించాలి. ఏదో నాలుగు డబ్బులు కళ్ళజూసానని దీనిని మీరు అహంకారమనుకుంటే పొరపాటే, ఇది అహంకారం కాదు నా ఆత్మవిశ్వాసం.

*****

Please follow and like us:

13 thoughts on “ఇది అహంకారం కాదు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)”

  1. ఈ కథ లో పద్మావతి గారు, సామాజిక సృహ, బాధ్యత ని సంకల్పించి రాసారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక వ్యవసాయ విధానాలు, అవసరాలు వివరించిన తీరు అద్భుతము. ఈ రచన లో అంతర్గతంగా ఎన్నో సలహాలు సమాజానికి ఉన్నాయి. అతిశయోక్తి కాదునుకుంటే, ఈ కధానిక పాఠశాలలో పాఠ్యంశానికి అర్హమైనది.

  2. చాలా స్పూర్తి నిచ్చారు. చివరలో తనకు కావాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకుంటూ వెతుక్కోవడం బాగుంది 👏🏻👏🏻👏🏻

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు లక్ష్మీ రాఘవ గారు

    2. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు లక్ష్మీరాఘవ గారు

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు శారద గారు

    2. మీ ఆత్మీయ స్రందనకు ధన్యవాదాలు శారదగారు

Leave a Reply

Your email address will not be published.