ఏనుగు సలహా

-కందేపి రాణి ప్రసాద్

          నల్లమల అడవికి రాజుగా కేసరి అనే సింహం ఉన్నది చాలా తెలివి కలది. తోటి జంతువులపట్ల దయా స్వభావం కలది. అడవిలోని జంతువులను సమానంగా చూస్తుంది. చేస్తే మంచి సహాయం చేస్తుంది తప్ప ఎవరిని చెడగొట్టాలని మోసం చేయాలని ఆలోచించదు. ఇన్ని మంచి లక్షణాలున్న కేసరికి ఒక్క బలహీనత ఉన్నది. తన మంత్రు లతో ఎవరు ఏమీ చెప్పినా నమ్మేస్తుంది ఏనుగు, ఎలుగుబంటి, నక్కలు మృగరాజు దగ్గర మంత్రులుగా పని చేస్తున్నాయి.
 
          కేసరి మంచితనంతో అడవి అంత క్రమశిక్షణగా ఉండేది. కేసరి ఒకరోజు తన మంత్రులతో చర్చిస్తూ బాగా పనిచేసే ఉద్యోగులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించా లనే తన మాట చెప్పింది. మంత్రులందరూ ‘ చాలా బాగుంటుంది’ అని అంగీకరించారు. రాజ్యంలో అలాంటి వాళ్ళ జాబితాను తయారు చేసే భాధ్యత నక్కకు అప్పగిస్తున్నాను. రాజ్యంలో మిగతా ముఖ్యమైన విషయాలను మీరు చూసుకోవాలి అంటూ కేసరి మిగతా మంత్రులైన ఏనుగు ఎలుగుబంటిలను తీసుకుని వెళ్ళింది.
 
          ఒక వారం తర్వాత నక్క కొంత మంది ఉద్యోగుల జాబితా తీసుకొని సింహం వద్దకు వచ్చింది. సింహం ఆ జాబితా తీసుకున్నది. ఆ జాబితాను మరోసారి పరిశీలించమని ఏనుగు కిచ్చింది.
 
          ఏనుగు జాబితాను పరిశీలించాక ఏదో అనుమానం వచ్చింది. ఆ జాబితాలోని జంతువులలో ఒకటి రెండు తప్ప మిగతావారు క్రమశిక్షణ గలవారు కాదు. ఎంతో మంది నిజాయితీ క్రమశిక్షణ గల ఉద్యోగులు ఉండగా నక్క ఈ జాబితా ఎలా తయారు చేసింది. ఈ అనుమానాన్ని ఏనుగు రాజు దగ్గర వ్యక్తం చేసింది “సరే ఈవిషయాన్నీ రేపు తెల్చేద్దాం” అని కేసరి ఏనుగుతో చెప్పింది.
 
          మర్నాడు కేసరి తన మందిరానికి మంత్రులను రమ్మని పిలిపించింది. అందరూ వచ్చాక నక్కను కేసరి అడిగింది. “ఏ ఏ ప్రతిభల ఆధారంగా వారిని ఎంపిక చేశావు”? నువ్వు ఎంపిక చేసిన వారి కన్నా ప్రతిభగల ఉద్యోగులు ఉన్నారు కదా!
 
          అప్పుడు నక్క ఇలా సమాధానం చెప్పింది. ప్రభూ! ఇప్పుడు నేను ఎంపిక చేసిన జాబితాలోని ఉద్యోగులంతా ఈ అడవిలోనే పుట్టాయి. నిజాయితీ ప్రతిభ గల ఉద్యోగులు చాలా మంది ఉన్నప్పటికీ నేను మన అడవిలో పుట్టి కేవలం ఉద్యోగం కోసం మన అడవికి వచ్చిన వారు. వారు వేరే అడవి నుంచి వచ్చారు కదా వారికెందుకు ఇంత గొప్పదనం ఆపాదించటం. మనం కేవలం మన అడవిలో పుట్టిన వారికే బహుమతులు ఇస్తే బాగుంటుందనుకున్నాను. వారి అడవిలో ఎక్కువ సౌకర్యాలుండటం వల్ల మాత్రమే బాగా చదువుకున్నారు. అంత మాత్రాన వాళ్ళను గొప్పగా ఎందుకు కీర్తించాలి. మన ప్రాంతం అని అభిమానం ఉండాలి కదా అందుకే వీరిని ఎంపిక చేశాను అన్నది నక్క.
 
          అదేమిటి నక్క గారూ! వారంతా మన అడవి వారే కదా! వాళ్ళను వేరే అడవిలో పుట్టారని ఎందుకు వేరుగా చూస్తున్నావు. మీ కొడుకులు, చెల్లెళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి వేరే అడవిలోనే ఉంటున్నారు కదా! అది తప్పు కదూ అని ఏనుగు అడిగింది.
 
          దానికి సమాధానంగా నక్క “ ఏమీ తప్పు లేదు. కేవలం ప్రతిభను ఆధారంగా చేసుకుంటే ఇక్కడ పుట్టిన వారికెవారికి బహుమతులు రావు. కీర్తి ప్రతిష్టలు పెరగవు వారికీ అలాగే జరగాలి” అన్నది.
 
          అదేమిటి నక్క గారూ! మన అడవిలోని విపరీత పరిస్థితుల్ని ఎలా తట్టుకోవాలో తెలియకే కదా ప్రక్క అడవి నుంచి వారిని పిలిపించింది. మనకు సహాయం చేయటానికి వచ్చిన వారిని తక్కువగా చూడకూడదు కదా! అని మరో మంత్రి ఎలుగుబంటి అడిగింది.
 
          అయితే ఏమిటి ఎలుగుబంటి గారూ! మన ప్రాంతం అనే అభిమానం ఉండాలి. ఈ అడవిలోనే పుట్టాము కాబట్టి మనమే ఎక్కువ, వారిని మనతో సమానంగా చూడకూడదు. అందుకే వారి పేర్లు జాబితాలో చేర్చలేదు” అన్నది నక్క కోపంగా.
 
          రాజు కేసరి మౌనంగా వీరి సంభాషణ వింటున్నది గానీ ఏమీ మాట్లాడలేదు “మహారాజా! మీరు నక్క మాటలు వినకండి అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు హెచ్చరిల్లుతాయి. ఎక్కడైనా ఎప్పుడైనా న్యాయం గెలవాలి. సమానత్వం పాటించాలి. అసమానత వల్ల జంతువుల మధ్య ద్వేషాలు పెరుగుతాయి. ఇప్పటి దాకా అన్నదమ్ముల్లా కలిసున్న వారి మధ్య ప్రేమలు తొలగిపోతాయి ఇలాంటి పనుల వాల్ల మనస్పర్థలు పెరుగుతాయి. ఇది నా అభిప్రాయం మహారాజా! మీరే ఈ విషయాన్నీ పరిశీలించండి” అన్నది ఏనుగు గంభీరంగా.
 
          రాజు కేసరి మంత్రులతో ఈ విధంగా అన్నది “ఏనుగు చెప్పిన విషయాలు సరైనవే అనిపిస్తున్నది. ఎక్కడ పుట్టారు అనే దానికన్నా ఎంత బాగా పని చేశారు అనే విషయమే పరిగణనలోకి తీసుకోవాలి. మనకు ముందు ఎంతో మంది ఈ అడవిలో పుట్టారు మన తర్వాత కూడా ఎంతో మంది పుడతారు. అది అర్హత కాదు వేరే అడవిలో పుట్టినా మన అడవి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడ్డారు. చేసిన పనికి నడిచిన నడతకు మాత్రమే విలువివ్వాలి జంతువుల మధ్య అసమానతలు తొలిగిపోతేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కుట్ర కుతంత్రాలు, అవినీతి, అక్రమాలు చేయడానికి మనం మనుష్యులం కాదు!
 
          తర్వాత నక్క వైపు తిరిగి ‘మొదటి తప్పుగా నిన్ను మన్నించి వదిలేస్తున్నాను. ఇలాంటి భావనలు మరోసారి మన అడవిలో కనిపించకూడదు. నీ మనసులో నుంచి ఈ భావనలు తిసెయ్యి. అప్పుడే నువ్వు మంత్రి పదవికి పనికొస్తావు” అన్నది సింహం.
 
          తర్వాత ఏనుగుతో “మంచి సలహా చెప్పావు. తప్పు జరగకుండా కాపాడావు. అడవి అభివృద్ధికి నీలాంటి వారి సలహాలు అవసరం” అంటూ ఏనుగును సభాముఖంగా మెచ్చుకున్నది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.