పౌరాణిక గాథలు -2

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

ధర్మోరక్షతి రక్షితః
మహాభారతకథలు

మహాభారత కృతి కర్త వ్యాసమహర్షి కథ

          మన దేశం భారతదేశం. ధర్మాధర్మాల్ని బోధించిన గ్రంథం.. వ్యాసమహర్షి చెప్పగా
విఘ్నేశ్వరుడు రాసిన గ్రంథం మహాభారతం. సంస్కృతంలో రచించిన ఈ గ్రంథాన్ని నన్నయ తెలుగులో అనువదించడానికి ఉపక్రమించి వెయ్యిసంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ అదే ప్రమాణాలతో.. అదే పవిత్రతతో.. అదే గౌరవంతో నిలిచి ఉన్నశ్రీమదాంధ్ర మహాభారతంలో మనం తెలుసుకోవలసిన ఎంతో మంది మహర్షులు,గురువులు,రాజులు, ధర్మాత్ములు, దానపరులు వీరులు, ధీరులు ఉన్నారు. వాళ్లందరిగురించి తెలుసుకోడం మన ధర్మం. ఆ ధర్మమే మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది.. ధర్మాన్ని రక్షిస్తుంది.

          మహాభారతం పెద్ద గ్రంథం కనుక దాన్ని చదివి తెలుసుకోలేము కనుక మనం కథలు కథలుగా చదువుకుందాం!

          మొదట మనం మహాభారతాన్ని రచించిన కారణజన్ముడు, పరమేశ్వర స్వరూపుడు, మహర్షుల్లో గొప్పవాడు అయిన వ్యాస మహర్షి గురించి తెలుసు కుందాం. ఆయన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మీకు ఇప్పుడున్న జ్ఞానం సరిపోదు. కాబట్టి, ప్రస్తుతం మహాభారతంలో వ్యాసమహర్షిని గురించి మాత్రమే తెలుసుకుందాం. ఆది కాలంలో విష్ణుమూర్తి ప్రజల్ని సృష్టించడం కోసం నాభి నుంచి బ్రహ్మని సృష్టించాడు. మిగిలిన సృష్టి మొత్తాన్ని బ్రహ్మకి అప్పగించాడు. విష్ణుమూర్తి ముఖం నుంచి వేదాలు ఆవిర్భ వించాయి. తన మనస్సు నుంచి అపాంతరతముడు అనేవాణ్ని సృష్టించి వేదాలన్నీ నేర్చుకో మని చెప్పాడు విష్ణుమూర్తి.

          అపాంతరతముడు విష్ణుమూర్తి చెప్పినట్లు చేశాడు. విష్ణుమూర్తి అతణ్ని
మన్వంతరాల్లో పుట్టి వేదాలు వ్యాపింపచేస్తాడని, విష్ణుతత్త్వం గ్రహించి ముల్లోకాల ధర్మాల్ని తెలుసుకుని గొప్ప ఋషి అవుతాడని, తరువాత కాలంలో వసిష్ఠుడికి మనుమడయిన పరాశరుడికి పుట్టి వేదాలు వ్యాప్తి చేసి, అందరి ధర్మ సందేహాలు తీర్చి లోకహితం కోసం శ్లోకాలుగా రాస్తాడని చెప్పాడు.

          పూర్వం పరాశర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ యమునానదీ తీరంలో దాశరాజు కూతురు సత్యవతి నడుపుతున్న నావ ఎక్కి, ఆమెని చూసి ఇష్ట పడ్డాడు. దివ్యదృష్టితో ఆమె జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని తన కోరిక ఆమెకి చెప్పాడు. వాళ్లకి వేదమయుడైన వేదవ్యాసుడు కలిగాడు. పరాశరుడు కుమారుణ్ని దీవించి సత్యవతికిచెప్పి తీర్థయాత్రలకి వెళ్లిపోయాడు.

          వేదవ్యాసుడు లోక కళ్యాణం కోసం తపస్సు చెయ్యడానికి బయలుదేరి తల్లికి నమస్కరించి “అమ్మా! మీకు అవసరమైనప్పుడు నన్ను తల్చుకోగానే నేను వస్తాను” అని చెప్పి వెళ్లిపోయాడు.

          వ్యాసుడు యమునానదీ తీరంలో పుట్టాడు కనుక కృష్ణద్వైపాయనుడనీ, వేదాలు విభజించాడు కనుక వేదవ్యాసుడనీ, పరాశరుడి కుమారుడు కనుక పారాశర్యుడనీ, సత్యవతి కుమారుడు కనుక సాత్యవతేయుడని పిలవబడ్డాడు. వ్యాసుడు ఒక ఆశ్రమం నిర్మించుకుని శిష్యులకి వేదం నేర్పిస్తున్నాడు.

          కొంత కాలం తర్వాత కురువంశానికి రాజయిన శంతన మహారాజు సత్యవతిని పెళ్ళిచేసుకోవాలని అనుకున్నాడు. సత్యవతి తండ్రి దాశరాజు తన కూతురికి పుట్టిన పిల్లలకే రాజ్యం ఇవ్వాలని ఒకషరతు పెట్టాడు.అందుకు శంతనమహారాజు అంగీకరించ లేదు.

          అతడి మొదటి కొడుకు భీష్ముడు తను పెళ్లి చేసుకోకుండా సత్యవతీ శంతనులకి పుట్టిన పిల్లలకే రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేసి వాళ్లకి పెళ్ళి జరిపించాడు. శంతన మహారాజుకి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు. వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యాక శంతనుడు మరణించాడు. వాళ్లల్లో చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధం చేసి మరణించాడు. భీష్ముడు విచిత్ర వీర్యుడికి పట్టాభిషేకం చేసి పెళ్లి కూడా జరిపించాడు.

          కొంత కాలానికి విచిత్ర వీర్యుడు కూడా మరణించాడు. అతడికి సంతానం లేదు. సత్యవతి భీష్ముణ్ని పెళ్లి చేసుకోమని చెప్పింది. కాని తను ప్రతిజ్ఞ చేశాను కనుక పెళ్లి చేసుకోను అన్నాడు భీష్ముడు. సత్యతి తన కుమారుడు వ్యాసమహర్షిని పిలిచి తన కోడళ్లకి సంతానం కలిగేలా చూడమని లేకపోతే వంశం నాశనం అయిపోతుందని చెప్పి బాధపడింది.

          వ్యాసమహర్షి అందుకు అంగీకరించి ఒక సంవత్సరం సత్యవతి కోడళ్లు అంబిక అంబాలికల్ని పవిత్రులుగా చెయ్యడానికి వ్రతం చేయించమన్నాడు. తరువాత సత్యవతి కోడళ్లని వ్యాసమహర్షి దగ్గరికి పంపించింది. వ్యాసుడి రూపం చూసి భయపడి కళ్లు మూసుకున్న అంబాలికకి పుట్టుకతో గ్రుడ్డి వాడయిన ధృతరాష్ట్రుడు పుట్టాడు. వ్యాసమహర్షి రూపాన్ని చూసి కదలిక లేకుండా నిలబడి పోయిన అంబాలికకి పాండురోగంతో పాండు రాజు పుట్టాడు.

          సత్యవతి అంబికకి భయపడవద్దని నచ్చచెప్పి వ్యాసమహర్షి దగ్గరికి మళ్లీ
పంపించింది. కాని అంబిక వ్యాసమహర్షి రూపానికి భయపడి తన దాసిని పంపించింది. దాసి వ్యాసమహర్షిని భక్తి శ్రద్ధలతో పూజించింది. ఆమెకి యమధర్మరాజు విదురుడిగా మహాజ్ఞానిగా పుట్టాడు. తరువాత కౌరవులు పాండవులు పుట్టడం పాండురాజు మరణించడం జరిగింది. వ్యాసభగవానుడు వచ్చి తల్లితో “రాబోయే రోజుల్లో అన్నీ కష్టాలే ఉంటాయి. సంసారం మీద ప్రేమ వదిలిపెట్టి కోడళ్లతో కలిసి తపస్సు చేసుకుని పుణ్యలోకాలకి చేరుకో” అన్నాడు.

          సత్యవతి వ్యాసమహర్షి చెప్పినట్లు తపస్సు చేసుకుని శరీరాన్ని విడిచి పెట్టింది. శాలిహోత్రుడి ఆశ్రమంలో ఉన్న కొలనులో స్నానం చేస్తే ఆకలి దాహం ఉండవని, అలా చెయ్యమని లక్క ఇంట్లోంచి బయటపడిన పాండవులతో చెప్పాడు. మత్స్యయంత్రం పడగొట్టిన తరువాత ద్రౌపదిని పాండవులు అయిదుగురికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఆలోచిస్తున్న ద్రుపదుడికి ద్రౌపది జన్మ వృత్తాంతం చెప్పి పాండవులతో ద్రౌపది పెళ్లి జరిపించాడు వ్యాస మహర్షి.

          ద్వైతవనంలో ఉన్న పాండవులు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల్ని ఓడించడం కష్టమని సందేహిస్తున్న సమయంలో ధర్మరాజుకి ‘ప్రతిస్మృతి’ అనే విద్య ఉపదేశం చేశాడు. అదే విద్యని ధర్మరాజు అర్జునుడికి ఉపదేశిం చాడు. అర్జునుడు తపస్సు చేసి దేవతల నుంచి అస్త్రాల్ని పొందాడు.

          కురుక్షేత్రంలో కౌరవ పాండవుల్లో జయం ఎవరికి కలుగుతుంది అని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు పాండవులే జయిస్తారని చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు సంధి చేసుకోమని లేకపోతే యుద్ధం తప్పదని చెప్పాడు. యుద్ధ సమయంలో ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలు తెలియచేసే శక్తి సంజయుడికి ఇచ్చి అతడి ద్వారా విషయాలు తెలుసుకోమని కూడా చెప్పాడు.

          అభిమన్యుడి మరణానికి బాధపడుతున్న పాండవుల్ని ఓదార్చాడు వ్యాసమహర్షి. అశ్వత్థామ నారాయణాస్త్రం వ్యర్థమయిందని బాధ పడుతున్న ప్పుడు నారాయణుడే శ్రీకృష్ణుడని అతడి అంశ అయిన అర్జునుడి మీద పని చెయ్యదని అతడి అజ్ఞానాన్ని పోగొట్టాడు. అర్జునుడు “యుద్ధం చేస్తుంటే తనకంటే ముందు ఒక మహాపురుషుడు శూలంతో రాజుని చంపుతున్నట్లు తను ఊరకే బాణాలు వేస్తున్నట్లు కనిపించింది” దానికి అర్థం చెప్పమని అడిగాడు. వ్యాసమహర్షి శంకరుడే కరుణించి అర్జునుడికి సహాయ పడ్డాడని చెప్పి అర్జునుడిలో శివభక్తి పెంచి శివుణ్ని మనస్సులో తల్చుకుంటూ యుద్ధం చెయ్యమని చెప్పాడు.

          కౌరవులు యుద్ధంలో మరణించినప్పుడు పుత్రుల మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు గాంధారి శపించకుండా పాండవుల్నికాపాడాడు. యుద్ధం తరువాత బంధుమిత్రులు, రాజులు పోయినందుకు బాధపడుతున్న ధర్మ రాజుకి రాజ్యాన్ని అనాధగా వదిలి బాధపడ్డం ధర్మం కాదని సుద్యుమ్నుడి చరిత్ర సేనజిత్తుడి మాటలు, ధర్మాధర్మాలు, ప్రాయిశ్చిత్త విశేషాలు, మరుత్తుడి కథ చెప్పి అశ్వమేథయాగం కూడా చేయించాడు వేదవ్యాసుడు.

          వ్యాసుడి ఉపదేశం ప్రకారం ధృతరాష్ట్రుడు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసు కుని గాంధారితో కలిసి ఉన్నాడు. పాండవులతో కలిసి ఉన్న ధృతరాష్ట్రుడికి దివ్యదృష్టితో చనిపోయిన వాళ్ళందర్నీ చూడగలిగేలా చేసి ఎవరెవరు ఎక్కడెక్కడికి చేరారో చూపించాడు.

          యాదవస్త్రీలని రక్షించడానికి అస్త్రం తీసిన అర్జునుడికి అస్త్రాలు పని చెయ్యలేదు. అర్జునుడు వేదవ్యాసుడి పాదాల మీద పడి తన అవమానం గురించి చెప్పి దుఃఖించాడు.

          “నాయనా! కృష్ణావతారం అయిపోయాక ఆయన ప్రభావం నీ మీద లేదు. కాలం మనది కానప్పుడు మనం ఏం చేసినా అది కలిసిరాదు. జ్ఞానమున్న వాడివి కనుక విషయాలు తెలుకుని నువ్వు కూడా సర్వసంగ పరిత్యాగం చేసి నీ వాళ్లతో కలిసి ఉత్తమ గతులు పొందు” అని చెప్పాడు.

          పాండవులు అందరు శరీరాలు విడిచిపెట్టాక పాండవుల కీర్తి విస్తరింప చెయ్యడానికి రాజుల చరిత్రలు ప్రజలకు తెలియ చెయ్యడానికి, దేవదేవుడి లీలలు, సర్వదేవతల జన్మలు వంటివి ఎన్నో తెలియపరుస్తూ సర్వజ్ఞుడు, సత్యదర్శి సర్వవిజ్ఞానభవుడు అయిన వేదవ్యాసుడు మహాభారతాన్ని పంచమ వేదంగా రచించి మనకి అందించాడు. వేదవ్యాసుడు నడిచి వెడుతున్నప్పుడు ఒక పురుగు భయంతో పరుగెడుతూ కనిపించింది.

          వ్యాసుడు ఆ పురుగుని “నీ బతుకే నికృష్టం కదా! బతికి ప్రయోజనం ఏముంది? చచ్చి పోవడమే సుఖం కదా! భయపడతావెందుకు? అనిఅడిగాడు.

          పురుగు “మహాత్మా! నేను పురుగుని కదా! నాకు అంత విషయ పరిజ్ఞానం ఎక్కడ ఉంటుంది? బతకడమంటే సుఖం, చావడమంటే భయం తప్ప ఇంకేమీ తెలియవు. అన్ని జీవులకి తెలిసేది ఇదే కదా?” అంది

          “నీకు శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలు వరుసగా వచ్చేలా నేను వరమిస్తాను, నువ్వు సన్మార్గంలో నడుచుకో” అన్నాడు వ్యాసుడు. ఆ పురుగు మహర్షి చెప్పి నట్లే నడుచుకుని క్షత్రియ జన్మలో వ్యాసుడికి కనిపించి పూజించింది. చివరికి బ్రాహ్మణుడిగా పుట్టి యజ్ఞాలు చేసి, తీర్థయాత్రలు చేసి ఇంద్రుడికి ప్రియ శిష్యుడిగా అయింది. ఇదంతా ఆ పురుగు మీద వ్యాసభగవానుడు చూపించిన దయ.

          విష్ణుప్రభావం వల్ల పుట్టిన వ్యాసమహర్షి బ్రహ్మ చెప్పగా వేదాల్ని నాలుగు భాగాలుగా చేసి ఋగ్వేదం పైలుడికి, యజుర్వేదం వైశంపాయనుడికి, సామవేదం జైమినికి,అధర్వణ వేదం సుమంతుడికి చెప్పి, వాళ్ల వాళ్ల శిష్యులతో వ్యాప్తి పొందేలా చేశాడు.

          చతుర్వేదాలు, అష్టాదశపురాణాలు, చతుర్దశ విద్యలు అన్నీ నేర్చుకుని, బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు చదివి అందరికీ చెప్పగలిగేలా చేశాడు వేద వ్యాసమహర్షి. పరమేశ్వరుణ్ణి ఆరాధించి పక్షి రూపంలో ఉన్న ఘృతాచి అనే అప్సరసయందు ఒక కొడుకుని పొందాడు. అతడి పేరు శుకుడు. పుడుతూనే అన్ని వేదాలు నేర్చుకున్న శుకుడు తండ్రి దగ్గర సమస్త విషయాలు తెలుసు కుని చివరికి యోగమార్గంలో అంతర్థాన మయ్యాడు.

          వ్యాస రచనలు వ్యాససంహిత, వ్యాసస్మృతి. వీటిలో నిత్యకర్మల గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇదర్రా మహాభారతంలో వేదవ్యాసమహర్షి కథ!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.