నా జీవన యానంలో- రెండవభాగం- 28

-కె.వరలక్ష్మి

        మట్టి-బంగారం కథా విజయంతో కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టేను. మట్టి-బంగారం కథ నవంబర్ 30, 1999 న ఇంటర్నెట్ లోను,  నవంబర్-డిసెంబర్ 99 అమెరికా భారతి లోను, తెలుగు యూనివర్సిటీ తెలుగు కథ 99 లోను, కథా సాహితీ వారి కథ 99 లోను మాత్రమే కాకుండా తర్వాత ‘అరుణతార’ మొదలైన అభ్యుదయ పత్రికలలోనూ, సంకలనాలలోనూ కూడా ప్రచురింపబడింది.

         2000 సంవత్సరం జనవరి రెండున హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో శతాధిక కవి సమ్మేళనం జరిగింది. మొదటి సెషన్ లోనే నేను, గీత పోయెమ్స్ చదివేం.

         జనవరి 6 నుంచి 9 వరకూ నెల్లూరులో జరిగే అజో-విభో సభలకు హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్లలేకపోయాను. 9న జరిగే కవిత్వ గోష్టిలో పాల్గొనడం పట్టాభి గారి ప్రతిభా మూర్తి సన్మానం చూడడం వీలుపడలేదు. జనవరి 11న మొదలైన మట్టి-బంగారం కథ గురించిన ప్రశంసలు ప్రఖ్యాత రచయితలు, స్నేహితులు, సాహితీ మిత్రులు అభిమానుల నుంచి ఉత్తరాలు, ఫోన్ సంభాషణ రూపంలో సంవత్సరమంతా వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

         ఆ మార్చి 11న చేరా (చేకూరి రామారావు) గారికి రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో ప్రతిభా వైజయంతి పేరిట సన్మానం జరిగింది. ఆ సభకి వక్తగా వచ్చిన కాత్యాయనీ విద్మహే నన్ను పలకరించి ఆ మధ్యాహ్నం బేతవోలు రామ బ్రహ్మంగారి ఇంట్లో చేరా గారూ, తనూ నా కథల గురించి మాట్లాడుకున్నామని ఆగష్టులో జరగబోయే వాళ్ళ కాకతీయ యూనివర్సిటీ సెమినార్ కి నన్ను తప్పకుండా వచ్చి పేపర్ సబ్మిట్ చేయమని చెప్పారు. ఆ సభలో ఎండ్లూరి సుధాకర్ నన్ను పలకరించి పాలు- మీ గొల్లల సొమ్మంతా బ్రాహ్మల పాలు’ అన్నాడు ఎందుకో. అప్పటి వరకు ఎవరిది ఏ కులమో ఎప్పుడూ మాట్లాడుకుని ఎరగం. ముఖ్యంగా నేను. అప్పుడప్పుడే అగ్ర, అణగారిన కులాల గురించి చర్చలు ప్రారంభమయ్యాయి.

         24, 25 మార్చి 2000 న కాకినాడ విమెన్స్ కాలేజ్ లో కథల పైన చర్చలు జరుగుతాయని, రమ్మని ఆహ్వానం వచ్చింది. అటు రాజమండ్రికి లాగే కాకినాడకీ మా ఊరు నుంచి బస్సులో గంట ప్రయాణం. ఉదయం వెళ్లి సాయంకాలం తిరిగి వచ్చేయొచ్చు. 25 మధ్యాహ్నం సెషన్లో తల్లావఝుల పతంజలి శాస్త్రి ‘తెలుగు కథ – ధ్వన్యాత్మకత’ పైన ; శిఖామణి ‘తెలుగుకథ – దళితోద్యమ ప్రభావం ’ పైన మాట్లాడారు. ఎండ్లూరి సుధాకర్ ‘తెలుగునవల- దళితవాద ఉద్యమం’ పైన మాట్లాడేరు. ఉదయం సెషన్ లో ఆవంత్స సోమసుందర్ ‘తెలుగుకథ – ప్రాచీనత’ పైన; కాళీపట్నం రామారావు ‘తెలుగు కథలో అస్పృశ్యత’ పైన; కప్పగంతుల మల్లికార్జున రావు ‘తెలుగుకథ –కొత్త ప్రయోగాలు’ పైన; పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘తెలుగుకథ- జాతీయోద్యమ ప్రభావం’ పైన; వల్లంపాటి వెంకటసుబ్బయ్య ‘తెలుగు కథాశిల్పం’ పైన మాట్లాడేరు. 26న ఉదయం కొత్తపల్లి రవిబాబు’ తెలుగులో అనువాద నవలలు- ఉద్యమ నేపథ్యం’ పైన; అంపశయ్య నవీన్ ‘తెలుగునవల- వామపక్ష ఉద్యమ ప్రభావం’ పైన; యండమూరి వీరేంద్రనాథ్ ‘పాపులర్ నవలా ప్రక్రియ’ పైన మాట్లాడేరు. మధ్యాహ్నం సెషన్ లో ఆలూరి విజయలక్ష్మి ‘తెలుగు నవల – మెడికల్ టచ్’ పైన; మృణాళిని ‘తెలుగు నవల – స్త్రీవాద దృక్పథం’ పైన మాట్లాడేరు. ఆ సభలు- ఆ చర్చలు తెలుగు కథారచన పైన ఆసక్తి ఉన్నవాళ్ళకి, ముఖ్యంగా నాకు ఎంతో ఉపయోగపడేలా కొనసాగాయి.

         ఆ సంవత్సరం జూన్ 27న హ్యమన్జనోమ్ ప్రణాళిక ఆవిష్కరణ గురించి న్యూస్ వచ్చింది. మానవుడు చంద్ర మండలం మీద కాలు మోపిన దానికన్నా గొప్ప విషయం అది అన్నారు.

         14 జూలై 2000న తెలుగు యూనివర్శిటీ వేసిన కథ 98, కథ 99 ఆవిష్కరణలు, జులై 16 న కథాసాహితి వారి కథ 99 ఆవిష్క రణలు జరిగాయి. హైదరాబాద్ తెలుగు యూనివర్శిటీలో, ఆ మూడు పుస్తకాల్లోనూ నా కథలు ఉండడం వల్ల నేనూ అటెండయ్యాను. యూనివర్శిటీ వాళ్ళ పుస్తకాన్ని మృణాళిని, కె.బి.లక్ష్మి విశ్లేషించారు. కథాసాహితి పుస్తకాన్ని కాళీపట్నం, వల్లంపాటి విశ్లేషించగా కథలు రాసిన రచయితలం కథల నేపధ్యాన్ని చెప్పేం. ఆ ప్రయాణంలో నేను అప్పటి బేగంపేట  రైల్వే స్టేషన్ లోకి దగ్గర్లో ఉన్న మా అబ్బాయి ఇంట్లో ఉన్నాను. అక్కడికి దగ్గర్లో ఉన్న స్వామి రామానంద తీర్ధ బిల్డింగ్ పక్కనే ఓ చిన్న గదిలో గ్రంథాలయం ఒకటి ఉండేది. ఉదయం సాయంకాలం  అక్కడికి వెళ్ళి మేగజైన్స్, పుస్తకాలు చదువుకొనేదాన్ని. అక్కడే 76 లో వచ్చిన స్నేహలతా రెడ్డి సంస్మరణ గురించి సంచిక చదివేను. అంతటి స్నేహలతకే తప్పలేదు మగవాళ్ళను గురించిన గుసగుసలు. అసలీ దేశంలో అందంగా ఉండడం అనేదే ఓ అసూయను రగిలించే విషయం. ఆడమగ అందరూ వాళ్ళ మీదే విభిన్న రీతుల్లో విరుచుకు పడతారు.  

         హైదరాబాద్ నుంచి గీత ఇంటికి మెదక్ వెళ్ళి నాలుగు రోజులున్నాను. అక్కడ ఇల్లుగల ముస్లిం అమ్మాయి “మీరు బలే సూపరున్నారు” అంది. “ప్రొద్దున్న మేడం ఎల్లేటప్పుడు బైట కొచ్చిండ్రు కదా! అక్కడ తన మోటారు సైకిలు తుడుసుకుంటున్న మా ఎదురింటి అబ్బాయి ‘ మేడం వాళ్ళమ్మ శానా అందముంది’ అన్నాడు అంది. పిల్లల ఎదుట, వాళ్ల తండ్రి ఎదుట ఎవరైనా అలా మాట్లాడితే చాలా వర్రీ ఫీలయ్యేదాన్ని. భయం కూడా. యాభై ఏళ్ళ ఆ వయస్సులో కూడా ఎక్కడికి వెళ్లినా రెప్ప వాల్చకుండా అందరూ నన్ను గమనించడం అనభవేకవేద్యమే. కొంత గర్వంగానూ, కొంత ఆనందంగానూ అన్పించినా భయం దాన్ని జయించేది. మరో పక్క గొప్పగొప్ప సౌందర్య మూర్తుల రూపాలు వచ్చి నా కళ్లముందు నిలిచేవి. వాళ్ళ ముందు నేనెంత అన్పించేది. ఒక సంస్కారంతో నడుచుకోవడం అన్నిటికన్నా గొప్ప అందం అని నాకు తెలుసు. ఆ స్పృహలో ఉండడం వల్ల నాకు నేను ఎప్పుడూ అందంగా కన్పించేదాన్ని కాదు.

         2000 ఆగష్టు 27న కాకతీయ యానివర్శిటీ సెమినార్ కి అటెండయ్యాను, ఖాజీపేట రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో సభలు జరిగాయి. ఆ హాల్ కి దగ్గర్లో ఉన్న గెస్ట్ హౌస్ లో మా అందరికీ రూమ్స్ ఇచ్చారు.రూమ్స్ కి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో లంచ్ హాల్. చాలా సదుపాయంగా ఉన్నాయి.  కాత్యాయనీ విద్మహే ఆర్గనైజేషన్లో సభలు ఎంతో బాగా జరిగాయి. సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు రచయితలు చాలా మంది అటెండ్ అయ్యారు.

         అబ్బూరి ఛాయాదేవి గారూ, నేనూ ఒక రూమ్ లో ఉన్నాం. పెద్ద కారిడార్ లో ఇంచు మించు అందరం రాత్రి ఒంటిగంట వరకు మేల్కొని కబుర్లు చెప్పుకొన్నాం. ఛాయాదేవి గారు, పి.సత్యవతి గారు అందరూ ఎన్నెన్నో కబుర్లు మగవాళ్ళ హ్యాబిట్స్ గురించీ, వారి వారి స్వీయానుభవాల గురించి చెప్పేరు. ఉన్నట్టుండి కొండేపూడి నిర్మల ‘ఈవిడ ఇప్పుడే ఇలా ఉన్నారు పదేళ్ల క్రితం ఎలా ఉండి ఉంటారో’ అంది నన్ను గురించి. ‘ఈవిడ చాలా అందంగా ఉంటారని ఓ ప్రఖ్యాత రచయిత నాతో ఎప్పుడో అన్నాడు’ అంది పాటిబండ్ల రజని. “సడన్గా రామాయణంలో ఈ పిడకల వేట ఏమిటి?” అన్నాను నేను. ఛాయాదేవి గారితో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్ అన్నట్టు ఉండేది. అరమరికలు లేని స్నేహ తత్వం వారిది. వారితో కలిసి ఒకే రూమ్లో ఉండటం నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. “ఎవరైనా జన్మలో ఒక్కసారే ఒక్కర్నే ప్రేమించడం అంటారేమిటి, అదేదో రూల్ లాగా. ఇంక బ్రతుకులో మళ్ళీ ప్రేమనేదే పుట్టదా ఏమిటి” అన్నారు నాతో ఏదో సందర్భంలో.

         అంత రాత్రి వరకు మేల్కొని ఉన్నా.  తెల్లవారుతూనే లేచి కారిడార్ లో వాకింగ్ చేసాం. డి. కామేశ్వరి గారు అందరికన్నా ముందే లేచారు. రెండో రోజు సెక్షన్స్ కూడా అద్భుతంగా జరిగాయి. “నేనెలా, ఎందుకు రాయడం మొదలు పెట్టాను” అనే విషయం మీద వ్యాసం సమర్పించేను నేను. మేమంతా సమర్పించి చదివి, వినిపించిన వ్యాసాలతో కాకతీయ యూనివర్సిటీ తర్వాత ఓ బుక్ తెచ్చింది. 28న మా సభ జరుగుతుండగా హైదరాబాదులో వామపక్షాలు కరెంటు చార్జీలు తగ్గించమని చేసిన చలో అసెంబ్లీ కార్యక్రమం పోలీసు కాల్పుల్లో నలుగురు మరణించగా ఇంకొందరు గాయపడ్డారు.

         ఆ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రకటించబడింది 29న. దూరం నుంచి వచ్చిన నా లాంటి వాళ్ళకు ఆ రోజు ప్రయాణం వీలు పడలేదు. మర్నాడు బయలుదేరాల్సి వచ్చింది. నేను ఇంటికొచ్చేసరికి నా కోసం ఒక పెద్ద గందరగోళం, అయోమయం ఎదురు చూస్తోంది.

         ఎలక్షన్స్ కి డేట్ అనౌన్స్ చేశారు. మా ఊరి పంచాయతీ సర్పంచి సీటు బీసీ లేడీస్ కి రిజర్వ్ అయ్యిందట. ఏప్రెల్4న మా పెద్దనాన్న గారి మూడో కొడుకు రాంబాబు అన్నయ్య ఓ పదిమందిని వెంటబెట్టుకుని హడావిడిగా వచ్చాడు. అంతకు ముందే మోహన్ గారు స్కూల్ కెళ్ళాడు. అతనికి ఎక్కడ ఏం జరిగిందోనని హడలిపోయాను. అసలు సంగతేంటంటే సర్పంచి సీటుకి నన్ను నిలబడమని అడగడానికి వచ్చారు. నేను చేతులు జోడించేశాను. “అమ్మో రాజకీయాలే. నాకస్సలు ఆసక్తి లేదు. ససేమిరా” అని చెప్పేసాను. మర్నాడు మా పెదనాన్న గారి పెద్ద కొడుకు ఎన్నడూ లేనిది ఫోన్ చేసి ఆప్యాయంగా మాట్లాడుతూ “ఎన్నికల్లో నువ్వు తప్పకుండా నిలబడాలమ్మా” అన్నాడు. “వదినను  నిలబెట్టండి అన్నయ్యా” అన్నాను. “అబ్బే, దానికి సంతకం కూడా రాదు దానికి నీ పక్కన నిలబడడానికి కూడా అర్హత లేదు” అన్నాడు. వాళ్ళింటికి ఎదురుగానే మా స్కూల్ ఉండేది. ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్లంటే గొప్ప చులకనగా మాట్లాడేవాడు. భార్యల వెనుక కూడా ఈ మగాళ్లు ఎలా మాట్లాడుతారో! అనుకున్నాను, చాలా సార్లు. ఎన్నికల్లో  పోటీ చేసి ఓడిపోయిన మరొకాయన తానే నా పేరు సజెస్ట్ చేశానని అన్నాడు. వీళ్లంతా కలిసి హైదరాబాద్ లో ఉన్న మా పెద్ద తమ్ముడికి ఫోన్ చేసి చెప్పేరట. మా తమ్ముడు ఆర్థికంగా బాగున్నాడు, కాబట్టి నా తరపున తను ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాడు అని మరో ప్రచారం జరుగుతోందట. కాంగ్రెస్ తరపున M.P గారు ఒకరోజు, తెలుగుదేశం తరపున M.L.A ఒకరోజు జనాన్ని వెంటబెట్టుకుని వచ్చి తప్పకుండా తమ పార్టీ తరఫున నిలబడమని, వెనక తాము ఉంటామని ఊళ్లో నా అంత చదువుకున్న బి.సి. లేడీస్ ఎవరూ లేరని మరీ మరీ చెప్పి వెళ్ళేరు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.