మా కథ (దొమితిలా చుంగారా)- 42

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

         ప్రభుత్వం టీవీలో మేం ఆందోళనకారులమనీ, సైగ్లో-20 ప్రజలు ఉగ్రవాదులనీ ప్రచారం చేస్తోంది. మమ్మల్ని అవమానిస్తున్నారు. ఈ దుష్ప్రచారానికి మేం టీవీలో జవాబివ్వలేం. రేడియో ద్వారా జవాబివ్వకుండా ఉండడానికి గాను సైన్యం 1975 జనవరిలో ఒక వేకువజామున మా ట్రాన్స్ మిటర్ల మీద దాడిచేసి నాశనం చేసింది. వాళ్ళ స్థలంలో ఒక్క మేకును గూడా సవ్యంగా ఉంచలేదు.

         వాళ్ళక్కడి నుంచి ప్రతిదీ ఎత్తుకుపోయారు. రేడియోలు, పరికరాలు, రికార్డ్లు … ఏవీ ఉంచలేదు. ఆ రికార్డ్ లు ఎంత విలువైనవో తెలుసా? అవి జానపద కళారూపాల నిధులు, వాట్లో ప్రాచీన సంగీతం, సమకాలీన సంగీతం, మా నాయకుల ఉపన్యాసాలు …. ఎన్నో ఉండేవి.

         అప్పుడు వాళ్ళు రేడియో స్టేషన్లో పనిచేసేవాళ్ళనీ, యూనియన్ నాయకుల్నీ, ఇతరుల్నీ అరెస్టు చేసి తీసుకుపోయారు.

         కాని కార్మికులు ఐక్యంగా, దృఢంగా నిలబడ్డారు. “మీరు మా ట్రాన్స్ మిటర్ను మాకిచ్చేవరకూ మేం పనిలోకి దిగం” అని ప్రకటించారు. సమ్మెకు పిలుపిచ్చారు. మా గని ప్రాంతంలోని ఐదు బలమైన యూనియన్లతో కలిపి ఒక సమ్మె కమిటీ రూపొందించ బడింది.

         ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు పడరాని పాట్లు పడ్డారు. లొకటేరియోల యూనియన్ అయిన ‘అక్టోబర్ 20 యూనియన్’ అంతకుముందెంతో కాలం నుంచీ ప్రతియేటా కొత్తగా ఖనిజం దొరికే ప్రాంతం చూపమని అడుగుతోంది. ఇన్నేళ్ళూ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న ప్రభుత్వం సమ్మె పిలుపు వచ్చాక అక్టోబర్ 20 యూనియన్ దగ్గరికి ఒక దూతను పంపింది. వాళ్ళడిగినట్టే ప్రతి ఏటా కొత్త ప్రదేశం చూపుతానని, కాని వాళ్ళు ఈ సమ్మె నుంచి విరమించుకోవాలని షరతు పెట్టింది. కార్మికులకు సందిగ్ధ పరిస్థితి వచ్చిపడింది. ‘ఎన్నో రోజులుగా పోరాడుతున్న డిమాండు ఒప్పుకుంటున్నారు గదా … ఏం చేద్దాం ?

         ఐతే విప్లవ భావాలు, కార్మికవర్గ ఐక్యత అంత సులభంగా విచ్ఛిన్నమయ్యేవి కావు. మేం మా పాత డిమాండ్లకు మరొక కొత్త అంశం కలిపాం. “సమ్మె ఐపోగానే ఐదు యూనియన్లూ కలిసి అక్టోబర్ 20 యూనియన్ కార్మికులకు విశాల గని ప్రాంతాలు సాధించి పెట్టాలి” – ఈ ఆలోచన బాగా పనిచేసింది.

         ఎక్కువ జీతాలు, స్కాలర్షిప్పులు వగైరా ఆశలు చూపి కూడ కొందరిని కొనెయ్యడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఆరకంగా వందమందిని కూడగట్టగలిగారు. కాని ఆ వెంటనే వాళ్ళ పేర్లన్నీ ఒక నల్లబల్ల మీదకెక్కించబడేవి. “ఫలానా కార్మికుడు తన వర్గానికి ద్రోహం చేసి పరాయివాళ్ళ బూట్లు నాకడానికి కిరాయికి పోతున్నాడు” అని రాసి వుండేది. కార్మికులందరూ కోపోద్రిక్తులయి అక్కడ పేర్లున్న వాళ్ళ కోసం వెతికేవాళ్ళు. ఇలా వాళ్ళు కూడా పనికిపోవడం మానేశారు.

         కార్మికుల దీక్షను చవిచూసి ప్రభుత్వం “సరే – తిండికి మాడితే తెలిసొస్తుంది” అని సైన్యంతో మమ్మల్ని చక్రబంధంలో పడేసింది. వాళ్ళు మమ్మల్నెటూ కదలనివ్వలేదు. ఇలా చుట్టిముట్టి లొంగదీయొచ్చునని వాళ్ళనుకున్నారు. కూరగాయలు, తిండి పదార్థాలు లోపలికి రానివ్వలేదు, సమాచార సంబంధాలు తెంచేశారు.

         అప్పుడు హత్యాకాండలో చనిపోయిన ఒక వ్యక్తి కొడుకు నాదగ్గరకొచ్చి “అక్కా – ఊరి చుట్టూ సైనికులు ప్రతి ఐదు గజాల కొకరున్నారు. కానైతే వాళ్ళు రాత్రిళ్ళు నిద్ర పోతున్నారు. నేను ఆ మధ్య ఖాళీలోంచి వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు బైటికిపోతాను. చప్పుడు కాకుండా కడుపు మీద పాకి పోతాను …” అన్నాడు. అందుకే చిన్న పిల్లలు పాల్గోవడం అవసరమనుకుంటాను నేను. నేనా కుర్రాడితో “ఏమన్నా పిచ్చెక్కిందా ఏం? చూశారంటే వాళ్ళు చంపి పారేస్తారు….” అన్నాను.

         ఆ కుర్రాడు నాతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడుగాని మరో ముగ్గురు పిల్లలతో కలిసి బయటికి వెళ్ళిపోయి సైగ్లో – 20 పరిస్థితి గురించి బైటి వాళ్ళకి చెప్పాడు.

         మొత్తానికి మా సమస్య దేశంలోని ప్రజలందరి దృష్టికీ వచ్చింది. యూనివర్సిటీ విద్యార్థులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఇతర గని కార్మికులు మాకు మద్దతిచ్చారు. క్రమంగా దేశమంతటికీ సమ్మె విస్తరించడం మొదలైంది. అంత వరకూ బిర్రబిగిసి ఉన్న ప్రభుత్వం, ఏమైనాసరే ట్రాన్స్ మిటర్లు ఇవ్వనని మొండికెత్తిన ప్రభుత్వం ఈ సమస్య ఏదోరకంగా పరిష్కరించబడాలి గనుక, చర్చల కోసం ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది.

         అలా వచ్చిన ప్రతినిధి బృందం, ఆందోళనకారులుగా డిఐసి గుర్తించిన మా యాభై మందితో మాత్రమే మాట్లాడదలుచుకుంది. కార్మికులిక తమకు తోచింది చెప్పసాగారు. ఒక కార్మికుడు “మాకు అతి ముఖ్యమైన ట్రాన్స్ మిటర్ ను మీరు మూసేశారు. రేడియోలు, మరేమీలేని మధ్యయుగాల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళదలుచుకున్నారు మీరు. మమ్మల్ని అజ్ఞానంలో ముంచదలుచుకున్నారు మీరు” అన్నాడు.

         అప్పుడా ప్రతినిధి వర్గంలో ఒకరు “కాని మీకు టెలివిజన్ ఇచ్చాం గదా – అదింకా అత్యాధునిక పరికరం. రేడియో, రికార్డ్స్ కాలం ఎప్పుడో చెల్లిపోయింది. ఎన్నెన్ని కొత్తవి వస్తున్నాయి?! మీరు ముందుకు పోవడానికే మీకు టి.వి. పంపామని అర్థం చేసుకోరేం?” అన్నాడు. “మీరు ప్రతిదాన్నీ గోరంతలు కొండంతలు చేసి చూస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఒక మిలిటరీ వ్యతిరేక మనస్తత్వం, మిలిటరీ వ్యతిరేకత అనే జబ్బు రాజ్యమేలుతోంది. గతంలో కార్మికవర్గానికి వ్యతిరేకంగా సైన్యం కొన్ని పనులు చేసిన మాట నిజమే. కాని ఇప్పుడు మేం మీతో మాట్లాడుతున్నాం, చర్చిస్తున్నాం, మేం జాతిని ముందుకు నడిపించదలుచుకున్నాం…..” ఆయన మాట్లాడే పద్ధతి చూస్తే రేడియో స్టేషన్ల మూసివేతకు పూర్తి బాధ్యత మాదే అని తేల్చేసేటట్టున్నాడు. బన్ జెర్ చర్యల్ని ఖండించడం మేం చేసిన తప్పులని చెప్పాడాయన.

         ఇక నేను “మీరు గనుక నన్ను మాట్లాడనిస్తే ….” అని మొదలు పెట్టాను. “సరే … సరే …. చాల మంచిది. ఈ గందరగోళంలో ఒక స్త్రీ అభిప్రాయాలు విషయాన్ని సరిగా వివరించొచ్చు…” అని ఒకాయన నవ్వాడు.

         “కార్మికుల భార్యలను అత్యధిక సంఖ్యలో సంఘటిత పరచిన సైగ్లో-20 గృహిణుల సంఘం తరఫున నేను మాట్లాడుతున్నాను. కార్మికుల లాగానే స్త్రీలం కూడా మా సంస్కృతికీ, మా జనానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రభుత్వ చర్యల్ని తిరస్కరిస్తున్నాం. మీరు దొంగల్లాగా వచ్చి మా నాలుగు ట్రాన్స్ మిటర్లనూ నాశనం చేశారు. మీ ఈ దురాగతాల్ని మేమింక సహించం. మేం ఎంతో రక్తం వెచ్చించి, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కూడబెట్టుకున్న మా ఆస్తుల్ని మాకు తక్షణమే తిరిగి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.

         ఇక మీరు చెప్పిన అంకెలు చూద్దాం. మీరు ఆ పుస్తకాల్లో చూసి నల్లబల్లమీద ఏవేవో అంకెలు వేసి బన్ జెర్ ప్రభుత్వం బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు. చేపడుతున్న దనీ, మేమే అడ్డుకుంటున్నామని అన్నారు. అయ్యా, మేం అంకెల మీద బతకం. వినండి, మేం అంకెల మీద బతకం, వాస్తవాల మీద బతుకుతాం.

         ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ చర్య మాకు మేలు చేసిందో దయచేసి నాకర్థమయ్యేట్టు చెప్పండి.

         మొట్టమొదట బన్ జెర్ ఎవరూ ఎన్నుకోకుండానే అధికారంలోకి వచ్చాడు. చెప్పాలంటే తుపాకి బలం మీద గద్దెనెక్కాడు. ఎంతోమంది ప్రజల్నీ, మా పిల్లల్నీ, మా భర్తల్ని చంపేశాడు. యూనివర్సిటీని మెషినగతో మట్టేశాడు. అనేకమంది జనాన్ని నిర్బంధాలపాలుజేశాడు. మా వనరులన్నీ విదేశాలకు, ముఖ్యంగా బ్రెజిల్‌కు తరలించ బడుతున్నాయి.

         చెప్పండి, ఏ చర్య కార్మికవర్గానికి అనుకూలంగా ఉంది? ఆయన డబ్బు విలువ తగ్గించాడు. తర్వాత ‘ఆర్థిక సంస్కరణలు’ తెచ్చాడు, యూనివర్సిటీలో జోక్యం చేసు కున్నాడు. విద్యా సంవత్సరాన్ని అర్ధాంతరంగా ముగించాడు. తొలాతాలో రైతాంగాన్ని మూకుమ్మడిగా ఊచకోత కోయించాడు. యూనియన్లనూ, రాజకీయ పార్టీలను నిషేధించాడు. ఇప్పుడు ట్రాన్స్ మిటర్లు నాశనం చేయడానికి యూనియన్ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశాడు. ఇవన్నీ నిజం కాదా? దయచేసి జవాబు చెప్పండి. వీటిలో ఏ చర్య ద్వారా కార్మికవర్గానికి ప్రభుత్వం మేలు చేసింది? మీలో ఎవరు జవాబు చెప్తారు నాకు? …”

వాళ్ళందరూ నోరు మెదపకుండా కూచున్నారు.

         “ఇంకా కొనసాగించమంటారా? మాకు మిలిటరీ వ్యతిరేక మనస్తత్వం అబ్బిందనీ, మేం మిలిటరీ వ్యతిరేకత జబ్బుతో బాధపడుతున్నామనీ కదూ మీరన్నది? అది పచ్చి అబద్ధం. జనానికేం తెలుసో, జనం ఎందుకు పనికొస్తారో కూడా మీకు తెలియదు. మీ అభిప్రాయం ఎట్లా అబద్దమో చూపడానికి నేనో ఉదాహరణ చెప్తాను. ఒక మిలిటరీ ప్రభుత్వం, ఫాసిస్టు తరహా ప్రభుత్వం, బారెయెంటోస్ ప్రభుత్వం కార్మికుల జీతాల్లో కోత విధించింది. ఇంకో ప్రభుత్వం, అదీ మిలిటరీదే అయినా, మా డబ్బులు మాకిచ్చేసింది. అది జువాన్ జోస్ తారెస్ ప్రభుత్వం. మా భర్తలు ఆ ప్రభుత్వం కోసం ప్రాణమిచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు. వారెస్ కు వ్యతిరేకంగా అలజడి చెలరేగినప్పుడల్లా కార్మికులు తమ భార్యాబిడ్డల్ని వదిలేసి ట్రక్కుల్లో లాపాజ్ పరుగెత్తే వాళ్ళు. వాళ్ళప్పుడు సాయుధులేమీ కారు. కాని దగ్గర ఏదుంటే అది, చాకో కల్‌, డైనమైటో పట్టుకుని పరుగెత్తుతూనే ఉండే వారు. జనరల్ తారెస్ ప్రభుత్వాన్ని రక్షించడానికి ఇంత కష్టపడిన కార్మికులకు మిలిటరీ వ్యతిరేక జబ్బుందంటారా? ఆయన మిలిటరీ మనిషి కాదూ? తారెస్ తమకుసాయపడ్డాడు గనుక కార్మికులు ఆయన కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడ్డారు. మీరూ అలాగే ప్రజలతో సవ్యంగా వ్యవహరించి ఉండాల్సింది.

         సరే-మీరు కూడా కార్మికులకు ఓ ఐదువేల టీవీ సెట్లు పంచి పెట్టారు. మేమేమీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నిజమే, మా దేశం తప్పకుండా అభివృద్ధి చెందాలి. కాని టి.వి.తో ఏం జరుగుతోంది? అది మాకేం మేలుచేస్తోంది? టి.వి. మీద ప్రభుత్వం మా గురించి అన్యాయమైన విషయాలు చూపుతుంది. గని కార్మికుల గురించి టి.విలో ‘వాళ్ళు పిచ్చివాళ్ళు, సోమరిపోతులు, లాల్ గులామీలు … వాళ్ళు ఇది … వాళ్ళు అది’ అని అవాకులూ చవాకులూ పేలుతుంటారు. జవాబివ్వడానికి మాకు టి.వి. స్టేషన్ లేదు. మా గొంతును పూర్తిగా నొక్కే సేందుకు మాకున్న రేడియోల్ని కూడా నాశనం చేశారు.

         టీ.వీ. ఉన్నవాళ్ళు ఇప్పుడెలా అయ్యారో చూడండి. టీ.వీ. వాళ్ళకేం మంచి చేసింది? ఎంత మొరటు భాష వాడినా, మీరు దాన్ని అనాగరికమన్నా మా రేడియోలు మా గురించి, మా సమస్యల గురించీ, మా స్థితిగతుల గురించి చెప్పేవి. కాని మీరు మాకిచ్చిన టీ.వీల్లో చూపేదీ, చెప్పేదీ మా ప్రపంచం కాదు. మేం ఎన్నటికయినా చేరగల ప్రపంచం కాదు…. ఐనప్పుడు టీ.వీ. వల్ల మేం మరింత నిరుత్సాహపడి, దుఃఖించడంకన్న మరోప్రయోజనం ఏమిటి?

         ఓ టీవీ ఉండడం మంచిదే. విదేశాలను చూడడం మంచిదే. కాని తగరాన్ని ఉత్పత్తి చేయని దేశాలు, తగరం ధనంతో సంపన్నమవుతోంటే చూడడం ఎంత దురదృష్టకరం?! వాళ్ళకు వాళ్ళ పిల్లల కోసం అద్భుతాల ప్రపంచాలున్నాయి. మా పిల్లలకవి లేవు. విదేశీయుల్ని విలాసాల్లో ఓలలాడించడానికే – మా భర్తలు తమ ఊపిరితిత్తుల్ని పణం పెడుతున్నారని చూడడం ఎంత బాధాకరం!? వంటమనిషిగా, చాకలిగా, పిల్లల ఆయాగా, అరవ చాకిరీ చేస్తుండే మా స్త్రీలు టీవీ మీద వాళ్ళు చూపే సమస్త సౌకర్యాల్ని చూడడం ఎంత కష్టంగా ఉంటుంది! దాంట్లో కనబడే స్త్రీల వంటి స్త్రీలం కామా మేం? మేం వాళ్ళు చేసినంత పని చేయమా? మేమేమో దారిద్య్రంలో మునిగి పోతుంటే వాళ్ళు భోగాల్లో తేలియాడుతున్నారు.

         టీవీ వల్ల ఏం ఒరగబడుతోంది? అది మాకు విజ్ఞానానికో, వినోదానికో ఉపయోగపడే బదులు మమ్మల్ని మరిన్ని బాధలకు గురిచేస్తోంది. మేమేమీ నాగరికతకు వ్యతిరేకం కాదు. మా చేతుల్లో, మేం మాత్రమే వాడుకోవడానికి ఒక టీవీ ఛానెల్ ఉంటే ఎంత బావుండును! …. అది మా స్థితిగతుల గురించి, మా సమస్యల గురించి మాట్లాడాలి. అది మమ్మల్ని చైతన్యవంతుల్ని చేయాలి. గని కార్మికులకు ఒక టీవీ ఛానెలే ఉండి దాని ద్వారా గని కార్మికుల వ్యధార్థ జీవిత యదార్థ దృశ్యాన్ని దేశమంతటికీ ప్రదర్శించగలిగితే ఎంత బావుంటుంది ….! చాలా మందికి మా గురించే తెలియదు. చాల మంది బొలీవియన్లు ‘గనుల పిచ్చాళ్ళా, వాళ్ళు ఎప్పుడూ కోకో నములుతుండే మందుల బానిసలు కాదూ? వాళ్ళను సమర్థించడమా? …’ అంటుంటారు. కాని గని కార్మికులు గనుల పిచ్చాళ్ళు కారు, వాళ్ళు అజ్ఞానులు కారు, వాళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్న మూల స్తంభాలు …”

         నేనిదంతా వాళ్ళకు చెప్పి, జవాబు చెప్పమని రెట్టించాను. ఎవరూ నోరు మెదప లేదు. మేం ఆందోళనకారులమనీ, తాము ప్రజలతో మాత్రమే మాట్లాడుతామనీ ఒక్క ముక్క మాత్రం చెప్పారు.

         అలాగే వాళ్ళు మధ్యాహ్నం కార్మికుల్ని కలుసుకున్నారు. కార్మికులు వాళ్ళతో చాల మొరటుగా ఉన్నారు. ప్రభుత్వపు మనుషులు ప్రతిదాన్నీ నాశనం చేసే ఆటవికులని వాళ్ళన్నారు. ట్రాన్స్ మిటర్లు తిరిగి ఇచ్చేయవలసిందేనని నొక్కి చెప్పారు.

         కమిషన్ ప్రతినిధులు భయపడి లేచి వెళ్ళిపోయారు. మే ఒకటో తేదీన వాళ్ళు మా ట్రాన్స్ మిటర్లు మాకు ఇచ్చేశారు. కాని పయస్ 12 రేడియోను మాత్రం మరి కొన్నాళ్ళ పాటు మూసేశారు. గనుల్లో టీవీ సెట్లు పంచి పెట్టడం కొనసాగించారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.