బొమ్మల్కతలు-6

-గిరిధర్ పొట్టేపాళెం

 

“తార”లనంటిన నా బొమ్మలు – “స్వర్ణ యుగం”

         స్కూలు పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో గుప్తుల కాలాన్ని నాటి “భారతదేశ స్వర్ణయుగం” గా చదివినట్టు ప్రతి మనిషి జీవితంలోనూ ఇలా ఒక కాలం తప్పకుండా ఉంటుంది. ఏ కాలంలో మన ఉత్సాహం, సంతోషం, జిజ్ఞాస, నైపుణ్యం అన్నీ కలిసి తారాస్థాయిలో ఉరకలేస్తూ ఉంటాయో, అదే మన కాలంలో “మన స్వర్ణ యుగం”. నా బొమ్మల లోకంలో ఆ యుగం తొలినాళ్ళదే. చూసేవాళ్ళు లేకున్నా బొమ్మ బొమ్మకీ రెట్టించిన ఉత్సాహంతో ఆగకుండా పరుగులేస్తూ పైపైకి దూసుకెళ్ళిన కాలమది.

         అవి నా ఇంటర్మీడియట్ కాలేజ్ మొదటి సంవత్సరం వేసవి శలవులు. ఎప్పటిలానే పరీక్షలు రాసి కావలి మా ఇంటికి రావటంతో ఆ రెండు నెలలూ ఖాళీనే. రెండవ సంవత్సరం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ముందే చదివెయ్యాలని టెక్స్ట్ బుక్స్ కొనుక్కున్నా అవి తెరిచే ఉత్సాహం అస్సలుండేది కాదు. దేనికైనా ప్రేరణ అవసరం. శలవుల్లో చదువుకి మాత్రం అది దొరకటం చాలా కష్టం. చదువు పక్కనబెట్టి ఏం చేద్దామా అని చూస్తుంటే ఇదుగో మేమున్నామంటూ ముందుకొచ్చేసేవి నా బొమ్మలు. ఇక వాటితో కూర్చుంటే రోజంతా తెలియకుండానే గడిచిపోయేది. ప్రతిరోజూ ఏం సాధించానో తెలీక పోయినా ఏదో సాధించేశానని సంతృప్తిగానే ఉండేది.

         దానికి ముందు పదవ తరగతి వరకూ శలవులకి వచ్చినపుడు అడపా దడపా బొమ్మలేస్తూ వచ్చినా వరసగా బొమ్మలు వేసిన కాలం మాత్రం ఈ రెండు నెలలే. వేసినవన్నీ పోర్ట్రేయిట్సే, అవన్నీ నాటి తెలుగు తారాలోకంలో ప్రముఖులవే, అన్నీ పెన్సిల్ తో వేసినవే. కానీ రేఖా చిత్రాలు కాదు. పెన్సిల్ తో వేసిన పెయింటింగ్స్. కొన్ని ఫ్రీహ్యాండ్ తో వేసినవి, కొన్ని అప్పుడే తెలుసుకున్న రహస్య చిట్కాతో వేసినవి. ఆశ్చర్యం ఏంటంటే పరిశీలించి చూస్తే రెండిట్లోనూ పట్టూ, పట్టు వదలని (విక్ర)మార్కూకనిపిస్తాయి.

         అది తెలుగు వారపత్రికలకు “స్వర్ణయుగ కాలం”. అందులో సినిమా పత్రికలూ వచ్చి చేరాయి. సినీతారల ముఖచిత్రాలతో, సెంటర్ స్ప్రెడ్ విశ్వరూపాలతో వారం వారం అందంగా ముస్తాబై వచ్చి పత్రికలన్నీ ఊరూరా బంకుల్లో తోరణాలు కట్టేవి. ఆ తారా తోరణాళ్ళోంచి కొందరు తారలు నా బొమ్మల్లోకి దిగివచ్చిన గురుతులే ఆనాటి నా బొమ్మలన్నీ. లైట్ అండ్ డార్క్ షేడ్స్ కి వేరు వేరు పెన్సిల్స్ అంటూ ఏవీ వాడింది లేదు, వాడింది కేవలం HB పెన్సిల్ మాత్రమే. లైట్ షేడ్ 6H తో మొదలయ్యి 5H, 4H, 3H, 2H, H ఇలా సంఖ్య తగ్గుతూ తర్వాత వచ్చి చేరే HB, అక్కడి నుండి డార్క్ షేడ్ తో మొదలయ్యి, 2B, 3B, 4B, 5B, 6B, 7B, 8B ఇలా సంఖ్య పెరుగుతూ ఇన్ని రకాల లైట్ అండ్ డార్క్ షేడ్స్ తో పెన్సిళ్ళు ఉంటాయని అప్పుడు తెలిసినా అన్ని ఊర్లల్లో అవి దొరకని కాలం, దొరికినా అన్నీ కొనే స్థోమత లేని కాలం.  

         ఎండా కాలం, ఇంటా బయటా మండే కాలం. పడమర ముఖం పెంకుటిల్లు, భగ భగ మండే ఎండ వేడి, మధ్యాహ్నం నుంచి పొద్దుగూకే దాకా రోజంతా ప్రతి నిమిషమూ పెద్ద పరీక్షే. బొమ్మ పొద్దునే మొదలు పెట్టినా పూర్తిచెయ్యాలనే దీక్ష మధ్యాహ్నం కొనసాగించక తప్పేది కాదు. మధ్యాహ్నం అయితే పెంకుల కప్పు వేడికి తాళలేక కుర్చీ, అట్టా ఎత్తుకుని సందులో గోడకింద నీడలో చేరేవాడిని. మా ఇంటి గోడకీ, పక్కింటి ప్రహరీ గోడకీ మధ్య సరిగ్గా కుర్చీ పట్టేంత సందు. పక్కింట్లోని తురాయి చెట్టు నీడ కూడా కలిపి ఇంట్లో కన్నా కొంచెం బెటర్ గా ఉండేదక్కడ. అదే ఎక్కువగా మధ్యాహ్నం  నా మల్టీ పర్పస్ ఎయిర్ కండిషనింగ్ ఏరియా; స్టడీ రూమ్ + ఆర్ట్ స్టూడియో. ఇంజనీరింగ్ ప్రిపరేషన్ హాలిడేస్ లోనూ అన్ని సబ్జెక్ట్స్ అక్కడ కూర్చునే చదివాను. డిస్టింక్షన్ మార్కుల ప్రభావం ఆ స్థల మహిమే.

         ఆ నాడు “తార”ల లోకాన్నంటిన నా బొమ్మల లోకంలోకి ఈనాడు తొంగిచూస్తే తృప్తిగా అనిపించేవీ, కళ్ళకి కట్టినట్టు మనసుకి కనిపించేవీ:
   . గమ్ముగా అస్సలు కూర్చోలేని స్వభావం
   . ఏదో చెయ్యాలన్న తపన
   . ఎందుకేస్తున్నానో కూడా తెలీకుండానే వేస్తూ పదునెక్కుతున్న బొమ్మలు
   . బొమ్మ బొమ్మకీ పెరుగుతున్న ఆత్మవిశ్వాసం
   . ఆ బొమ్మల వెనక పడ్డకష్టం
   . పడ్డకష్టం లోంచి లేచి ఎప్పటికీ పదిలంగా మదిలో నిలబడిపోయిన సంతృప్తి
   . ప్రతి బొమ్మలో నిక్షిప్తమైన అలనాటి జ్ఞాపకా(లా)లు

         ఎన్నో జ్ఞాపకాల మూటల్ని తమలో కలుపుకుని, నన్ను వదలక నాతోనే ఉంటూ, తెరిచి చూసిన ప్రతిసారీ నా  గతంలోకి నన్ను మళ్ళీ మళ్ళీ లాక్కెళ్ళే నా బొమ్మలు, ఇవే నాకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ “నిజమైన  నా నేస్తాలు”, తృప్తిగా నేను తరచూ తలుచుకునే “మధుర క్షణాలు”…

         “కళాకారుడు తన కళని పూర్తిగా ఆశ్వాదించేది చుట్టూ ప్రేక్షకులు లేనప్పుడే.” – గిరిధర్ పొట్టేపాళెం
 
Details
Portrait of “సుహాసిని” from the Telugu movie “మంచు పల్లకి”
Portrait of “దాసరి నారాయణ రావు”
Free hand Pencil on Paper
 
*****
(సశేషం)
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.