ఒక్కొక్క పువ్వేసి-20

ఎన్ని చట్టాలొచ్చిన్నా చచ్చిపోని కౄరత్వాలు

-జూపాక సుభద్ర

         భారత పాలక పార్టీ ఎంపీ ‘సతి’ ఆచారాన్ని కీర్తిస్తున్నాడంటే ఈ దేశం ఎటు బోతుంది? ఏమవుతుందనే ఆందోళన అలజడిగుంది. ఆధునిక భారతదేశాన్ని మల్లా మధ్య యుగాలకు మళ్లించే కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు రాకమానవు. యెప్పుడో రెండువందల యేండ్లనాడు నిషేధింపబడిన ‘సతీ సహగమనాన్ని’ తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా! నిజంగా “మహిళలు ఎదగాలి, సాధికారత రావాలి” అని ఉపన్యాసాలిచ్చే భారత పార్టీనాయకులు ‘సతి’ ని కీర్తించే ఆ ఎంపీని యెందుకు సస్పెండ్ చేయలేదు? అంటే భర్తలు చనిపోతే బతికున్న భార్యల్ని కూడా చంపేస్తారా! ఏంటీ దుర్మార్గపు ఆలోచనలు. జాతీయోద్యమంలో ఎన్ని పోరాటాలు, సంస్కరణోద్యమాలు జరిగితే సతి నిషేధింపబడింది!

         పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాలు జరుగుతుంటే రాజస్థాన్ చిత్తోర్ ఎంపీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్య వాదాలు చెప్తూ.. సతి విషయాన్ని యెందుకు ప్రస్థావించినట్లు? మేవార్ రాణి పద్మావతి గురించేందుకు ప్రస్తుతం చేయడం పద్మావతి అల్లావుద్దిన్ నుంచి రక్షణ పొందేందు సతీ సహగమనం చేసిందనీ ‘సతి’ వుండబట్టి – రక్షింపబడిందని చెప్పడం అబద్ధం కాదా ! ఆమెచచ్చి పోయింది ఎక్కడ రక్షింపబడింది? యీ మతోన్మాద మహిళా వ్యతిరేక భావ జాల ఉన్మాదంతోనే ‘పద్మావతి’ సినిమాని ఆగమాగం చేసి చివరికి ఆ కథా చరిత్రను బొక్కల్లేని మాంసం ముద్దగా నిలబెట్టిన చరిత్ర చూసినం. మన కళ్లముందే జరిగిన ఘటన

         మహిళలను సాటి మనిషిగా చూసే చూపు, రాజ్యాంగ పరంగా మహిళలకు రావాల్సిన హక్కులు తొక్కేయబడినయి. మానవ హక్కుల జాడేలేదు. సమానత్వాల మాటే లేదు. మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజీలో పెట్టినారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాతినిద్యాలే లేవు. చట్ట సభల్లో మహిళ ప్రాతినిద్యం 8%. మాత్రమే. మహిళల్ని అన్ని విధాలుగా అణచివేస్తూ.. మహిళల్ని దూరం బెడ్తున్నారు. ‘నస్త్రీ స్వాతంత్రమర్హతి’ అనే మనువాద సూత్రాలనే అమలు చేస్తున్నారు. యిదే పాలక పార్టీనాయకులు భర్తకు, పిల్లలకు వండి పెట్టడమే స్త్రీలకు గౌరవం అనీ, పతియే ప్రత్యక్ష్యదైవమనీ, మహిళలకు బైట యేం పని, రాత్రులు యేం పని, దళిత ఆడవాల్ల మీద అత్యాచారాలు జరిగితే వాల్లు ఆవారాలు, అదో లెక్కగాదువాల్లకని మాట్లాడినా, సతిని సమర్థించినా యిప్పటి దాకా ఒక్కరి మీద కూడా కేసు నమోదుకాలేదు. కనీసం పార్టీ కూడా నైతికంగా వారిని సస్పెండ్ చేయలేదు.

         ఇక ఈ ‘సతి సహగమనం’ అనే యీ దుర్మార్గం మహిళల హత్యలే. మహిళల్ని భర్త పేరుతో హత్యచేయడమే. అయితే ఈ దుర్మార్గ  ఆచారం వేల యేండ్ల నుంచి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల్లోనే వున్న దురాచారం. యిది ఫక్తు మనువు రాసిన మనుస్మృతి ఆచారం. యిది శూద్ర, దళిత, ఆదివాసీ, మైనారిటీల్లో లేని ఆచారం. బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య కులాల్లోని మగవాల్లు చనిపోతే వారి భార్యలు కూడా అదే చితిలో బతికుండగా కాల్చబడే ఆచార అమానవీయ ఆచారం. ఈ ఆచారాన్ని గ్లోరిఫై చేయడానికి ఆ మహిళలు కూడా సమ్మతించడానికి ఆమెను ‘దేవతా మూర్తి’ అని కీర్తింపచేసేది. చనిపోయిన భర్త పాడి ముందు పోతుంటే వెనక పల్లకిలో పసుపు, కుంకుమలతో, పట్టెడు నగలతో అలంకరించి వైభవంగా తీస్కపొయే వారట. మద్య మద్యలో మహిళల సందర్శనార్థం పల్లకి ఆపి పూజలు, కొబ్బరికాయలలో దేవతని అర్చన చేయించి రేపు వాల్ల భర్తలు చనిపోయినా యిట్లాంటి గౌరవాలు పొందుతారని అందుకు వారిని మానసికంగ సిద్దం చేసేవారు. దేవతని కీర్తించి భజనలు, పాటలు పాడేవారు. ఏ మహిళ అయినా భయపడి, బతకాలనే ఆశతో ‘సతి’ చేయనంటే వాల్లను దయ్యమనీ మానసికంగా హింసించే వారట, అడుగడుగునా ఆమెను అవమానించి బత్కలేని పరిస్థితులు కల్పించేవారట, నరకం చూపించేవారట కులంలో, కుటుంబంల. బతికుండి యింత కౄరత్వాలు భరించే బదులు ‘సతి’గా చచ్చిపోతేనే గౌరవం, పూజలందుతయి. కీర్తించబడ్తాం అని మహిళలు సతికి సిద్దపడేవారట.

         యివన్ని ఆ నాటి బ్రిటీష్ గెజిట్లో, పత్రికల్లో రికార్డు చేయబడినయి. ‘సతీసహగమనం’ దురాచారమ్మీద ముందుగా బెంగాల్లో బాగా చర్చ జరిగింది 1820 ప్రాంతంలో. బెంగాల్ సంస్కర్తల తోడ్పాటుతో అప్పటి బ్రటీష్ గవర్నర్ జనరల్  1829 లో’ బెంగాల్ సతీసహగ మనం’ వరకే నిషేధాలొచ్చినయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా’సతి’  మీద చర్చలు, వ్యతిరేకతలతో 1861 లో భారతదేశమంతా ‘సతి సహగమనం’ నిషేధింపబడింది.

         ఆ తర్వాత భారత దేశంకు స్వతంత్రమొచ్చినంక సతిదురాచారం రూపు మాపినది. అదియింకా లేదు పూర్తిగా రూపు నిర్మూలించ బడిందనుకున్నాము. కాని 1987లో రాజస్థాన్ లొ ఒక పద్దెనిమిదేండ్ల రూప్ కన్వర్ ‘సతీ’మరణం పొందిందనే వార్త ప్రపంచమంతా ఉలిక్కి పడింది. దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల ప్రభావంతో మా కాకతీయ విశ్వ విద్యాలయ విద్యార్థినిలము కూడా కటౌట్స్, నినాదాలతో దద్దరిల్లుతూ యూనివర్సిటీ నుంచి కలెక్టరాఫీసు దాకా వురేగింపు  తీసి మెమోరాండమ్ యిచ్చి’సతి’ మీద మా వ్యతిరేకతలు వినిపించినమ్. సతీ వ్యతిరేక గొంతులకు గొంతు కలిపినం. రాజస్థాన్ ప్రభుత్వమ్ మీద, రాజు పుత్ల మీద వత్తిడి పెరిగి 1987లో సతీ నిషేద చట్టమ్ వచ్చింది. సతిని ప్రోత్సహించినా, కారణమైనా వారికి ఏడేండ్లు శిక్షార్హులు జైలు, ముప్పయివేల జరిమాన చెల్లించాలి.

         ‘సతి’ కి వ్యతిరేకంగా రెండువందల యేండ్ల నుంచి యిన్ని పోరాటాలు, యిన్ని ఉద్యమాలు, యిన్ని సంస్కరణలు జరిగినా సతి నిషేధ చట్టాలు వచ్చినా యింకా తమ మహిళల్ని మండుతున్న కాష్ట్రంలో చంపాలనే ఆలోచనలు చచ్చి పోక పోవడమ్ ని మించిన కౄరత్వాలుండవేమో! ఆ రాజస్థాన్ ఎంపీని వెంటనే సస్పెండ్ చేయాలని మహిళలంతా డిమాండ్ చేయాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.