కనక నారాయణీయం -43

పుట్టపర్తి నాగపద్మిని

         సుబ్బయ్య వ్రాసిన పుస్తకం తిరగేస్తున్నారు పుట్టపర్తి. సుబ్బయ్య, తాను మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుతున్నప్పటి రోజులలో (1955 ప్రాంతాలు) పుట్టపర్తి ఉపన్యాసం ఏర్పాటు చేసినప్పటి జ్ఞాపకాలను పంచు కున్న పంక్తుల పై వారి దృష్టి నిలిచి పోయింది. ఆ సంఘటన ఇప్పుడు మళ్ళీ కళ్ళముందు కదలాడినా, శిష్యోత్తముడి మాటల్లో చదవటం గొప్ప అనుభూతిగా తోచింది వారికి!!

         ‘అప్పుడు నేను మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఆంధ్ర సారస్వత పరిషత్తు సంఘ కార్యదర్శిగా నుండి, పుట్టపర్తి వారికి సన్మానం చేయవలెననుకొంటిని. ఆ విషయమును సారస్వత సంఘాధ్యక్షు లైన తెలుగు ప్రొఫెసర్ గారి తోనూ, కొందరు విద్యార్థులతోనూ సంప్రదించగా, వారందుకు తీవ్రముగా వ్యతిరేకించిరి. పెద్దరభస జరిగినది. ప్రొఫెసర్ గారు అంగీకరించక తప్పలేదు. అయిష్టముగనే తలయూచిరి. అప్పుడు పుట్టపర్తి వారు, తిరువాన్ కూరు యూనివర్సిటీలో రీడర్ గా పనిచేయు చుండిరి. సాయంత్రము 5 గంట లకు ప్రారంభమైన ఉపన్యాసము, రాత్రి 10 గంటలకు ముగిసినది. సభా భవనము శ్రోతల తో కిటకిటలాడినది. ఆ కళాశాలలో యే సభకూ అంత జనసమూహము కూడ లేదని తదనంతరము చెప్పుకొన్నారు. సభానంతరము, పుట్టపర్తి వారిని సమానము చేయ వ్యతిరేకించిన ప్రొఫెసర్ గారు, విద్యార్థులు, నా వద్దకు వచ్చి పశ్చాత్తాపమును ప్రకటిం చిరి. ‘ఒక అద్భుతమైన వ్యక్తిని మాకు పరిచయము చేసితివి. పుట్టపర్తి వారు ఇంత గొప్ప వారనుకోలేదు.’ అని నాకు ధన్యవాదము లు చెప్పిరి. ఆ సభలోనే కాదు. ఏ సభలోనైనా వారు, శ్రోతలను మంత్రముగ్ధులను చేయగలరు. అందుకు కావలసిన హంగులన్నియు వారికి గలవు. అనర్గళ వాగ్ధాటికి తోడు, మృదు మధురమైన కంఠ స్వరమున్నది. సంగీత పరిజ్ఞాన మున్నది. వారు బాల్యమందే పెనుగొండలో మహాలక్ష్మమ్మ అను సంగీత విద్వాంసురాలి కడ సంగీత నాట్య శాస్త్రములనభ్యసించినారు.’  

         ఇక్కడే ఆగిపోయింది పుట్టపర్తి దృష్టి. ‘తన నాట్య గురువు పేరు సుబ్బయ్య సరిగానే గుర్తు పెట్టుకున్నాడు కానీ, తాను సంగీతం నేర్చినది పక్కా హనుమం తాచార్యులవారి వద్ద కదా!! వారి పేరు కూడా ఉటంకించి వుంటే బాగుండేది. అప్పుడు సంగీతంలో అంత కఠిన సాధన చేసినందువల్లే, ఇప్పటికీ, తన కంఠంలోని నరాలు, ఆనాటి శిక్షణకు అనుగుణం గా పని చేస్తున్నాయంటే, ఆ నాటి శిక్షణ భావి జీవితానికి కూడా ఉపయోగకరంగా వుండేదని తేటతెల్లమౌ తున్నది. ఆ మాటకొస్తే విద్యార్థి మీద గురువులకు, సంపూర్ణాధికారాన్ని ఇచ్చే వారు ఆ నాటి తల్లిదండ్రులు!! ప్రాచీన కాలంలో గురుకులాలలో రాజాధి రాజులు కూడా తమసంతానాన్ని గురువుల సంరక్షణలో వదిలివేసే వారు. రాజకుమారుడైనా, విద్యార్థి దశలో, తక్కిన సామాన్య విద్యార్థులతో సమానంగానే వారితో వ్యవహరించేవారు ఆనాటి తపస్సంపన్నులైన గురువులు.

         కాలం మారింది. గురుకులాలు అంతర్ధానమైపోయాయి. కానీ తన చిన్న నాటి రోజులలో కూడా తల్లిదండ్రులు, గురువులకు ప్రాధాన్యతనిచ్చేవారు. వాళ్ళ శిక్షణ కఠినంగా వున్నా, ఆ పద్ధతి తమ చిరంజీవుల భవితకు, పూలబాట వేయగలదనే విశ్వసించేవారు.      

         అంత విశ్వాసంతో తల్లిదండ్రులు తమ సంతానాన్ని తనకు అప్పజెబు తున్నందు వల్ల గురువులు కూడా ఎంతో బాధ్యతాయుతంగా తమ విద్యార్థుల శిక్షణను నెరపుటుండ టం తనకింకా గుర్తే!!

         కర్ణాటక సంగీతంలో శిక్షణ పద్ధతి సరళీ స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, ఇలా వివిధ స్థాయిల నుండి పిళ్ళారి గీతాలు, స్వర జతులు ..ఇలా కొనసాగుతూ ఉంటుంది. విద్యార్థి, ఒక్కో స్థాయి దాటుతూ వెళ్తున్నా, ఇది వరకు ముగించిన భాగాలను కూడ నెమరు వేయించటం జరిగేది. మూలాలు మరచిపోకుండా వుండటం ముఖ్యం కదా!!

         విద్యార్థి కౌశలాన్ని బట్టి అతని ఆసక్తిని బట్టి గురువుగారికి కూడా తన పేరు ఇతగాడు నిలుపగలడన్న నమ్మకం కుదిరితే, తన విద్యనంతా సదరు విద్యార్థి కి నేర్పి, అతడు లేదా ఆ విద్యార్థిని రాణిస్తూ వుంటే తమ జీవితం సార్థకమైంద ని అనందించేవారు – అప్పటి గురువులు!!

         తన సంగీత నాట్య గురువులిరువురూ తనలోని పట్టుదలను, ఏకాగ్రతను, కళపట్ల ఆరాధనను గమనించే తమ పేరు నిలిపే విద్యార్థిగా తనను మలచేం దుకు ప్రయత్నిం చారేమో!! కానీ, తన విధి, తనను సాహిత్య లోకంలో ప్రవేశ పెట్టింది. తనతో నాట్యాన్ని అభ్యసించిన వారెవరూ తనకు గుర్తు లేరు కానీ, సంధ్యావందనం శ్రీనివాసరావు అనే విద్యార్థి సంగీతంలో తన సహాధ్యాయి. అతనిప్పుడు సువిఖ్యాత సంగీత విద్వాంసునిగా తమ గురువుగారైన పక్కా హనుమంతాచార్యులవారి కీర్తిని నిలుపుతున్నాడు. మరి తానో?? 

         పుట్టపర్తి తల విదిల్చి, బీడీ కోసం తన జుబ్బా జేబులోకి చేయి పోనిచ్చి, అగ్గిపెట్టె తో సహా బీడీని పైకి లాగి, బీడీ వెలిగించుకున్నారు. గుప్పు గుప్పున పొగ వదులుతూ, రింగు రింగులుగా పైకి వెళ్తూన్న పొగలోంచీ దృక్కులను సారించి చూస్తూ, ఆలోచనా తరంగా లలో ప్రయాణం సాగించారు.

         పుట్టపర్తి పెదవుల మీద చిరునవ్వొకటి వెలిసింది. ‘ఈ రోజెందుకో చిన్ననాడు అలవాటైన బీడీ అలవాటు జ్ఞాపకాలు మనసును చుట్టుముట్టు తున్నాయి. కారణమే ముంది? ఈ బీడి పెద్ద తంటానే తెచ్చింది తనకు!! తన చిన్ననాడు పొగ తాగటం హోదాకు గుర్తు. తెల్ల తెల్లని ఖరీదైన సిగరెట్లు కొని, విలాసంగా మునివేళ్ళతో అంటించి, గుండెల నిండా పొగపీల్చి, ముక్కుపుటాల గుండా రింగులు రింగులుగా పొగ వదల గల్గటం, ఒక గొప్ప విద్యగా తమ బృందంలోని నారాయణ చతుష్టయం దృఢ విశ్వాసం. తమ బృదంలోని నలుగురి పేర్లూ విచిత్రంగా నారాయణే కావటం, కాకతాళీయమో, మరేదో ఐనా, ఊరిలో మాత్రం, యీ నలుగురు నారాయణ నామధేయులూ, అమిత దుష్టులు గా ప్రసిద్ధి. అదీకాక, ఇప్పుడు అంటున్న టిన్స్ వయసులోకి వచ్చిన తమ నలుగురి అల్లరీ, ఇంట్లో వాళ్ళకు, ఊరిలో వాళ్ళకూ కూడా తల నొప్పిగా మారిందన్న మాట సత్యం. 

         కుక్కలతో సర్కస్ చేయించటం, తోటలలో దొంగతనాలు, కలర్ సోడాలు రైల్వే స్టేషన్లో అమ్మటం – ఇలా రకరకాల అల్లరులు!! ఆ సంగతులు తెలిసి, ఇంట్లో తండ్రిగారు శ్రీనివాసాచార్యుల వారితో బడితె పూజలు !! ఆ అల్లరుల మాట ఎలా వున్నా, ఇదిగో యీ బీడీ అలవాటే, సంగీత విద్యలో రాణించనీయ కుండా అడ్డుపడింది. సిగరెట్టు కొనేందుకు డబ్బులు లేకపోవటం వల్లా, బీడీల వల్లా, సిగరెట్లవల్లా అందే సుఖం లేదా హుషారు కాస్త హెచ్చు తగ్గులతో దాదాపు ఒకే స్థాయిలో వుండటం వల్లా, గోపురం బీడీలే తన మార్కు బీడీలుగా తప్పని సరి వస్తువులుగా మారిపోయాయి. విద్యార్థి దశలో బీడీల జోరు ఎక్కువవటం వల్ల అనారోగ్యం పాలు కావటం, తండ్రిగారి ప్రేమ, పినతల్లి లక్ష్మీదేవమ్మ వాత్సల్య ప్రభావంతో గండం నుంచీ బైట పడిన అనుభవం ఇప్పటికీ తాజా గానే వున్నది. తమ తండ్రిగారి వలె నశ్యం పీల్చే అలవాటున్నవారి వల్ల ఇబ్బందులు ఒక రకమైతే, పొగ తాగేవారి వల్ల చుట్టుపక్కలవారి ఇబ్బందులు మరో రకం. ఏది ఏమైనా, తన సంగీత నైపుణ్యానికి అడ్డుకట్ట వేసిన బీడీని ఇప్పటికీ వదులుకోలేక పోవటం, తన బలహీనతే ఐనా, బలహీనతలుండుట, మానవ సహజం కదా!! ఏ బలహీనతా లేకపోతే, మనిషికీ భగవంతుడికీ తేడా ఏముంటుంది?’

         చేతిలోని బీడీ ఆఖరి దాకా వెలిగి చెయ్యి చురుక్కు మంటంతో, ఆలోచన లకు అంతరాయం కలిగింది పుట్టపర్తికి!!

         వాతావరణంలో అలుముకుంటున్న తియ్యని వాసనలు, బీడీ వాసనను అధిగ మించాయి కూడా!!  ఇంట్లో  అత్తగారూ, కనకవల్లీ పెళ్ళి కోసం చేస్తున్న పిండి వంటల ఘుమ ఘుమలు, పుట్టపర్తిని తళిహింటి వైపు నడిపించాయి.

         అప్పటికే తల్లీ కూతుళ్ళిద్దరూ, కరుణ, తరులతల తోడ్పాటుతో, తయారు చేసిన  పదరపేణీలు లెక్కపెడుతున్నారు. పిండి వంటలు తయారు చేయటం ఒక ఎత్తైతే, వాటిని భద్రపరచటం ఇంకా గొప్ప ఎత్తు. తియ్యటి వాసనకు ఆకర్షింపబడే చీమలు, ఇతర కీటకాల నుండీ కాపాడాటం, కనీసం 15 రోజుల వరకైనా చెడిపోకుండా వుంచటం – ఇవన్నీ పాకశాస్త్ర ప్రమాణాలు.

         అల్లుడు రావటం చూసిన శేషమ్మ, ‘ఏమప్పా!! నీ శిష్యుడు, నీ గురించే పుస్తకం రాసినాడు. మాకు ఎంత గర్వంగా వుందో తెలుసా? ఇప్పటికిప్పుడు చదవాలనే వుంది కానీ, ఏదీ, కరుణాదేవి పెళ్ళి పదహైదు రోజుల్లోకి వచ్చేసింది కదా!! పిండి వంటల పనులూ, పొళ్ళూ, వంటివి చేసి పెట్టుకోవడం, ఇంకా కాలేదు తీరికగా చదవవలె!! కనకా! అల్లుడికి కాఫీ తెచ్చివ్వు.’ సంబరంగా కుమార్తెకు ఆజ్ఞ జారీ చేసింది శేషమ్మ. 

         అల్లుడికి కాఫీ ఇవ్వాలంటే, తనకు కూడా ఇవ్వాలని అర్థం. ఆమె కాఫీ గత ప్రాణి. కాఫీ గింజలు, కొనుక్కు వచ్చి, వేయించి, ఇంట్లో కొని వుంచుకున్నమిసిన్ లో వేయించుకుని పొడి చేసి, స్టీల్ డబ్బాలో ఘట్టిగా మూత పెట్టుకుని భద్రంగా వాడుకునే రకం.

         కనకవల్లికి అమ్మ అలవాటు తెలుసు కాబట్టి, అమ్మ వచ్చినప్పుడల్లా,తాజా కాఫీ పొడి తయారీకి మిషిన్ కూడా కొని పెట్టి వుంచింది ఇంట్లో!! ఆమె ఇంట్లోకి వచ్చినప్పటి నుంచీ, ఇల్లు కాఫీ పొడి పరిమళాలతో ఘుమఘుమలాడి పోతూ వుంటుంది.      

         కనకవల్లి రెండు స్టీల్ లోటాల్లో పొగలు కక్కుతున్న కాఫీతో వచ్చే వరకు, శేషమ్మ, రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేయవలసి రావటంలోని సాధక బాధకాల ను వివరిస్తూ వున్న శేషమ్మ, ‘ అల్లుడూ, ఇంతకూ మా వియ్యంకులు ఎప్పుడు వస్తున్నారట? ‘అని అడిగింది.  

         ‘ఔను, మా అయ్యకు ఉత్తరం రాయవలె! కనకా!! త్వరగా రాద్దాం యీ రోజే!!’ అనేసి, కాఫీ తాగుతూ, పెళ్ళిళ్ళ నిర్వహణా భారం మోసేదెలాగా? అని ఆలోచనలో పడ్డారు, పుట్టపర్తి. 

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.