అదే పాట (కథ)

– కె. వరలక్ష్మి

          “ఏంటే సుజాతా, నీకేవైనా బుద్ధీ గ్నానం ఉన్నాయా అసలుకి ? టైమెంతైందో చూసేవా, ఇప్పుడా డ్యూటీ కొచ్చేది!” అరుస్తోంది అమ్ములు.

          ” ప్లీజ్ ప్లీజ్, అరవకే అమ్ములూ. ఒక్క అరగంటేగా ఆలస్యమైంది. డాక్టరుగారు విన్నాడంటే నా తలవాచిపోద్ది.”

          “అంటే… నువ్ రాలేదని డాక్టరు గారి కింకా తెలీదనా? అప్పుడే నాలుగుసార్లు అడిగేడాయన”

          చంపేవ్ పో… ఇప్పుడెలాగే ? “

          వీళ్ల మాటలు నాకు స్పష్టంగా విన్పిస్తున్నాయి. అంతే కాదు, కారిడార్లో ఉన్న ఇద్దరూ ఎదురుగా కన్పిస్తున్నారు.

          “ఎలాగేంటి, అనుభవించు” పర్సు, గొడుగు తీసుకుని టకటకా మెట్లు దిగి వెళ్ళి పోయింది అమ్ములు

          భయపడుతూ, భయపడుతూ డాక్టర్స్ రూంలోకి అడుగు పెట్టిన సుజాత నన్ను చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే మొహంలోకి నవ్వు తెచ్చుకుని –

          “మీరా మేడం, ఆయనింకా రాలేదా ?” అంది.

          “ఆయనీ రోజు సెలవు పెట్టేరు”

          సుజాత మొహంలో గొప్ప రిలీఫ్. “అమ్ములు చూడండి. ఎలా భయపెట్టేసిందో!”

          ఈ రూరల్ డిస్పెన్సరీలో సాంబశివరావు గారు సీనియర్. ఒక డాక్టరు, ఒక నర్సు, ఒక కాంపౌండర్ కమ్ బోయ్ తో నడిచే ఈ హాస్పిటల్ కి లేడీ డాక్టరు కావాలని ఊరి జనాలు కోరడంతో ఏడాది క్రితం నన్నిక్కడికి వేసారు. నాతో బాటు నర్స్ సుజాతని కూడా. సుజాత నాలా న్యూఎప్పోయెంటెడ్ కాదు. పదిహేనేళ్ల సర్వీసుందామెకి, డ్యూటీలో పెర్ఫెక్ట్ గా ఉంటుంది. అంతటి సర్వీస్ మైండెడ్ నర్స్ ని రేర్ గా చూస్తాం. ఏమైందో తెలీదు, ఈ మధ్య సుజాతలో నెల రోజులుగా గొప్ప మార్పేదో వచ్చింది. డ్యూటీ టైంలో తనలో తనే ముసిముసిగా నవ్వుకోవడం, టైం కాక ముందే వెళ్లి పోవడం, మరీ ఏ ఆపరేషనో ఉంటే ఎప్పుడింటికెళ్తానా అన్నట్టు ముళ్ళమీదుండడం, ఆలస్యంగా డ్యూటీకి రావడం, వెరసి సాంబశివరావుగారి చేత చీవాట్లు బాగా తింటోంది.

          రెండు నుంచి నాలుగు వరకూ రెస్ట్ టైం. పేషెంట్స్ ఎవరూ రారు.

          నేను భోజనం చేస్తూండగా కానిస్టేబుల్ కామేశ్వరావు సైకిల్ స్టేండ్ వేసి హాస్పిటల్లోకి వస్తూండడం కిటికిలోంచి కన్పించింది.

          యాక్సిడెంటో, మరే కేసో అయ్యుంటుంది.

          సమయానికి సాంబశివరావుగారు కూడా లేడు, తొందర తొందరగా భోజనం ముగించి చేతులు కడుక్కుందామని బైటికెళ్లేసరికి స్టోర్ రూం పక్క వరండాలో బల్ల మీద కేరియరుకి అటొకరు ఇటొకరు కూర్చుని తింటూ కన్పించారు కామేశ్వర్రావు, సుజాత

          వాళ్లు నన్ను చూడలేదు, సుజాత నవ్వుతూ కొసరి కొసరి వడ్డిస్తోందతనికి, సుజాతకి అతనేమౌతాడో నాకు అర్థం కాలేదు. కామేశ్వర్రావు ఏదో ఓ కేసు పని మీద తరచుగా హాస్పిటలుకి వస్తూ ఉంటాడు. కాని, సుజాతకి అతను బంధువని ఎప్పుడూ చెప్పలేదు

          నేను తిరిగి వస్తూండగా సుజాత నన్ను చూసింది, కొంత తొట్రు పడింది.

          అరగంట తర్వాత సుజాత రూంలోకి ఏదో పనున్నట్టు వచ్చి టేబుల్ మీద అవీ ఇవీ సర్దుతోంది. ఏదో చెప్పాలనుకుంటోందని నాకు అర్థమైంది.

          “ఆయన చాలా మంచివారు మేడమ్” 

          “ఎవరు, కామేశ్వర్రావా!” 

          “అవును మేడమ్. ఆయనకి నేనంటే ప్రాణం”

          “ఆహా! మరి అతని భార్యా పిల్లలనేం చేస్తాడట?”

          కామేశ్వర్రావుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో సారి అతని భార్యకి నెల తప్పినప్పుడు నేనే చెక్ చేసి కన్ఫం చేసాను. అప్పుడు సుజాత పక్కనే ఉంది.

          “ఇద్దరూ ఆడపిల్లలేనని మూడోసారికి ఆగేం మేడమ్” అని చెప్పేడు, తనంతటికి తనే.

          బహుశా ఈ సరికి ఆమెకి నెలలు నిండి ఉండచ్చు.

          “ఆయన జీతమంతా వాళ్లకే ఇచ్చేస్తారు మేడమ్. ఆ భార్య మహాతల్లి పరమగయ్యాళిదట, ఈయన్ని నానా హింసలూ పెడుతుందట, జీతం మొత్తం లాక్కుని సరిగా తిండి కూడా పెట్టదట, పైగా అనరాని మాటలంటుందట. ఒకోసారి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు, తన బతుకలా నరకమైపోయిందని “

          “ఇదంతా అతనే చెప్పేడా నీతో ?”

          “అవును మేడమ్. అతని వెన్నలాంటి మనసు చూసేక నాకు చాలా జాలేసింది మేడమ్ “

          “అందుకని అతనికి లొంగిపోయేవ్, అంతేనా?”

          “నాకు మాత్రం ఎవరున్నారు మేడమ్. ఈ వయసులో నాకింక పెళ్లి ఎలాగూ కాదు, అందుకే అతని ప్రపోజల్ని కాదనలేకపోయాను”

          తరతరాల నుంచీ స్త్రీల హృదయాల్ని కరిగించే విద్య మగవాళ్ళలో కొనసాగుతోంది.

          ఈ పిచ్చి సుజాతకి చాలా చాలా చెప్పాలన్పించింది. కాని, ఈ పరిస్థితిలో ఆమెకేం చెప్పీ లాభం ఉండదన్పించింది. అందునా వయసులో ఆమె కన్నా చిన్నదాన్ని. నా మాటను ఆమె మన్నిస్తుందా? కాలమే ఆమెకి అన్నీ నేర్పించాలి.

***

          సాంబశివరావు గారి కుటుంబం టౌన్ లో ఉంటుంది. వారంలో నాలుగైదు రోజులు ఆయన హాస్పిటల్ కి  అటెండ్ కాడు. ఈ మధ్యనే వాళ్ల అమ్మాయికి పూలు ముడిపించే ఫంక్షన్ చేస్తే వెళ్ళొచ్చాను. వాళ్లబ్బాయి ఎమ్సెట్ కోచింగ్ తో ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు.

          చక్కని సొంత ఇల్లు, అందమైన భార్య, చిన్నకుటుంబం. ముచ్చటేసింది.

          ఆ మాటే ఆయన్తో అన్నానో రోజు

          ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు.

          “ఏం చిన్నకుటుంబంలెండి. అన్నీ చింతలే. ముఖ్యంగా నా భార్య, ఉత్త అనారోగ్యం మనిషి, పిల్లల్నెలా పెంచాలో తెలీదు, ఏ బాధ్యతా పట్టించుకోదు. తప్పిజారి ఓ మాటంటే పడదు. వాళ్ళబాబు బాగా ఉన్నవాడు. ఆ గర్వం అంతా నా మీద వెలగబోస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్తానే కాని, సుఖం శాంతి అనేదే ఉండదు నాకు”. – నేను బిత్తరపోయాను.

          కొంత తేరుకున్నాక “అందుకేనా సర్ వారంలో నాల్గు రోజులు సెలవుపెట్టి ఇంట్లోనే గడుపుతారు” అన్నాను తమాషాగా ఆటపట్టించాలని

          “ప్రజ్ఞా ! నువ్వొద్దంటే మానేస్తాను. నాకు నువ్వంటే ప్రాణం, నీ కోసం ఏం చెయ్యమన్నా చేస్తాను” అన్నాడాయన ఉద్వేగంగా నా చేతి మీద తన చేతిని వేసి.

*****

Please follow and like us:

2 thoughts on “అదే పాట (కథ)”

  1. కె. వరలక్ష్మి గారి కథ ‘అదే పాట’ చదివాను. తమ మీద సానుభూతి కలిగేలా చేసుకుని, ఆడువారిని మాయమాటలతో లొంగదీసుకునే తత్వం చరిత్రహీనులైన మగవారిది. మధ్యవయస్కురాలైన సుజాతను వివాహితుడైన కామేశ్వరరావు లొంగదీసుకోవడం డా.ప్రజ్ఞ గమనించి బాధ పడుతుంది. కాని తన సీనియర్ అయిన డా.సాంబశివరావు కూడా అదే మాటల గారడీతో తనను లొంగదీసుకోవలని ప్రయత్నించాడు. కామేశ్వరరావు పాడిన ‘అదే పాట’ను సాంబశివరావు కూడా పాడుతున్నాడు. ఇటువంటి వారిని దూరంగా ఉంచాలి అన్న సందేశాన్ని రచయిత్రి చాలా సున్నితంగా, సుందరంగా ఈ కథలో తెలియజేసారు. కథ బాగుంది

    1. Thank you రంగారావు గారూ.
      అవునండి. మీరు చెప్పింది నిజం.
      కథను చక్కగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు. 🙏

Leave a Reply

Your email address will not be published.