మరక మంచిదే! (కథ)

– లలితా వర్మ

” యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా
యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా
భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!”

          పూజగదిలో నుండి శ్రావ్యంగా, మంద్రంగా, అలలు అలలుగా చెవికి సోకుతున్న అత్తగారి సరస్వతీ ప్రార్థన, అంతులేని మధురానుభూతిని కలిగించింది నిఖిలకి. కొద్దిగా తెరచి వున్న తలుపు సందు గుండా తెరలు, తెరలుగా వస్తున్న అగరు ధూపం, కర్పూరం, సుగంధాలు ఆఘ్రాణిస్తుంటే మనసంతా ప్రశాంతతతో నిండిపోయింది. గత పది రోజులు గా ఆ అనుభూతిని పొందుతోంది నిఖిల. అంతకు ముందెప్పుడూ కలగని ప్రశాంతత. 

          అసలు పెళ్లయి ఎనిమిదేళ్లయినా నిఖిల అత్తవారింట్లో వున్న రోజులు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. తన చదువు పూర్తయి ఎమ్మెస్ చేయటానికి అమెరికా వెళ్తానంటే ఒంటరిగా పంపటం యిష్టంలేని తల్లిదండ్రులు , అక్కడ సెటిలయిన అబ్బాయి కోసం గాలించి , రమేశ్ కిచ్చి పెళ్లి చేసి పంపించారు. ఈ ఎనిమిదేళ్లలో వాళ్లు ఇండియాకొచ్చింది రెండు సార్లు మాత్రమే. ఒకసారి రమేశ్ తండ్రి పోయినప్పుడు, మరోసారి రమేశ్ చెల్లి పెళ్లికి,
అప్పుడైనా ఏదో మొక్కుబడిగా రావడం, చుట్టం చూపుగా ఉండిపోవడం తప్ప, తనిల్లు, తనవాళ్లు అనే భావనే లేదు నిఖిలకి.

          నిఖిల పుట్టింటి వాతావరణం, అత్తవారింటి పద్ధతులు చాలా భిన్నంగా వుంటాయి.
పుట్టింటి వారిదంతా పాశ్చాత్య పోకడలే ! బంధు గణంలో చాలా మంది విదేశాల్లో స్థిర పడిన వారే అవడంతో వారికి ధీటుగా అత్యంతాధునిక జీవన విధానం అలవాటు చేసు కున్నారు వారు. అబ్బాయి అమెరికాలో స్థిరపడ్డాడని ఆ సంబంధం చేశారు నిఖిల తల్లిదండ్రులు. అత్తవారితో అంటీ ముట్టనట్టుండటం, వారి బంధువుల్ని దూరంగా పెట్టడం, తల్లి ద్వారా నేర్చుకున్న నిఖిల, చక్కగా సాధించుకుంది.

          రమేశ్ కీ మొదటి నుండీ అమెరికాలో స్థిరపడాలనే కోరిక వుండటం, నిఖిల పుట్టింటి పద్ధతులు బాగా నచ్చడంతో, నిఖిల ప్రయత్నం సుసాధ్యమయింది. యశస్ పుట్టి నప్పుడు కూడా, నిఖిల అమెరికాకి తల్లినే పిలిపించుకుంది. మాట వరసకైనా కొడుకు తనని పిలవక పోవటం బాధపెట్టినా, వాళ్ళు సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది యశోద.

          ఇప్పుడైనా నిఖిల అత్తవారింటికి రాకపోయేదే! కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రావలసొచ్చింది.

          అత్త యశోదకీ ఆ విషయం తెలుసు.

          నిఖిల తమ్ముడి పెళ్లికని న్యూయార్క్ నుండి బయలు దేరారు, నిఖిల, రమేశ్, కొడుకు యశస్ తో. తీరా ఇండియాలో అడుగు పెట్టేటప్పటికి “కరోనా వైరస్” కలకలంతో అధికారులు విదేశాల నుండి వస్తున్న వారిని, విమానాశ్రయంలోనే పరీక్షలు చేసి, పద్నాలుగు రోజులపాటు క్వారెంటైన్ లో వుండాలని సూచించి పంపించారు. అప్పటికే తమ్ముడి పెళ్లికని వొచ్చిన బంధువులు కొంత మంది పుట్టింట్లో వుండటంతో, అక్కడికి రావడం సేఫ్ కాదని, ఆ పద్నాలుగు రోజులూ అత్తవారింట్లోనే వుండమని తల్లి ఫోన్ లో చెప్పడంతో తప్పని సరై , తన కర్మకి ఏడ్చుకుంటూ అత్తవారింటికెళ్లింది నిఖిల.

          కోడలి స్వభావం తెలుసు యశోదకి. అయినా కూతురిలా ఆదరించింది. కొడుకునీ, మనవడినీ చూసి మురిసిపోయింది.

          “అమ్మా! మా దగ్గరికి రావొద్దు, మా గదిలో మేముంటాం” అని కొడుకు చెప్తుంటే

          “ఏం ఫరవాలేదు కన్నా! ముందు వేడి వేడి నీటితో తలారా స్నానాలు చేసి రండి”
అని పురమాయించి వాళ్ల సరంజామానంతా ఓ గదిలో పెట్టించి, వాళ్లు స్నానాలు చేసి రాగానే వేడి వేడి భోజనం కొసరి కొసరి వడ్డించింది. వేడినీళ్ల స్నానం, కడుపునిండా భోజనంతో, జెట్ లాగ్ తో ఆదమరిచి నిద్రపోయిన కొడుకు, కోడలు మనవడిని చూసి తృప్తిగా నిట్టూర్పు విడిచింది యశోద.

***

          ప్రక్కనే ప్రశాంతంగా నిద్రిస్తున్న యశస్ ని, ప్రక్క మంచం పైన పడుకున్న రమేశ్ ని తృప్తిగా చూసి, యశస్ తల నిమిరి, బాత్రూమ్ లో కెళ్లి అరగంటలో పనులన్నీ ముగించుకుని, స్నానం చేసి పూజ గదిలో కెళ్లి దేవుడికి దండం పెట్టుకుని, వంట గదిలో అత్తగారి దగ్గర కెళ్లింది నిఖిల. అప్పటికే చట్నీ మిక్సీ పడుతుంది యశోద.

          “ఇడ్లీ వెయ్యమంటారా అత్తయ్యా” అని అడిగిన నిఖిలతో

          “అబ్బాయి, మనవడు లేచారా? అడిగింది యశోద.

          “లేదత్తయ్యా”

          “అయితే వాళ్ళు లేవగానే వేసేద్దాం లేమ్మా చల్లారి పోతాయి కదా”

          “వాళ్ళు లేచాక మళ్ళీ వేసుకోవచ్చు లెండి! అసలే మీకు డయాబెటిస్! ఇంతసేపు తినకుండా వుండకూడదు.

          “సరే అయితే మనిద్దరికీ సరిపడా వెయ్యి” అంటూ హాల్లో కెళ్ళి టివీ ఆన్ చేసింది యశోద.

          పది రోజులుగా కోడలి ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పుతో యశోద సంతోషంగా వున్నా, ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ గురించిన ఆందోళన ఎక్కువైంది. అయినా యశోద ధ్యానం చేసుకుంటూ, ఆత్మవిశ్వాసంతో వుంటూ, ప్రభుత్వం, డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తల గురించి విని, ఆచరిస్తూ ఆందోళనను దూరం చేసుకోగలిగింది. పిల్లలు కూడా తగు జాగ్రత్తలు తీసుకునేలా చూస్తూ, ఏ పూటకాపూట వేడిగా వండుకుని తినేలాఅలవాటు చేసింది.

          టీవీలో వార్తలు చూస్తున్న యశోద దగ్గరికి “గుడ్ మార్నింగ్ గ్రానీ” అంటూ వొచ్చాడు యశస్. మనవడ్ని ప్రక్కనే కూర్చోబెట్టుకుంది యశోద. ఇంతలో టీవీలో అడ్వర్టయిజ్మెంట్ మొదలైంది.

          “మరక మంచిదే” అంటూ

          “గ్రానీ! మరకమంచిదే! ఏంటది అడిగాడు యశస్.

          చిన్నగా నవ్వి అంది యశోద,

          “ఎదుటివారికి మేలు చేస్తే అది మరకైనా మంచిదే అవుతుంది కన్నా”

          ‘అవును! ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నా ఆర్తిని తొలగించింది. కళ్లారా పిల్లల్ని చూసుకోగలుగు తున్నాను. కడుపునిండా వండి వడ్డిస్తున్నాను. కోడలు తన యిల్లనే భావాన్ని పెంచుకుంది. కరోనా మహమ్మారి అయినా…తనకి మంచిదే!

          కానీ! కానీ! మనుషులు మనుషుల్లా మారటానికి యింతటి శిక్ష తగునా తల్లీ! ఈ ఉపద్రవాన్ని అరికట్టవా మాతా! అంటూ మనసులో ఆ జగన్మాతని ఆర్తిగా ప్రార్థిస్తూనే వుంది యశోద.

*****

Please follow and like us:

2 thoughts on “మరక మంచిదే! (కథ)”

Leave a Reply

Your email address will not be published.