మరణదుఃఖం

ఆంగ్లం: డబ్ల్యు. ఏచ్. ఆడెన్

తెలుగు సేత: ఎలనాగ

అన్ని గడియారాలను ఆపేయండి
టెలిఫోన్ తీగను తెంపేయండి
రుచికరమైన బొమికను నోట్లో పెట్టుకున్న
కుక్కను మొరగనివ్వకండి
పియానోల శబ్దాన్ని ఆపు చేయండి
బ్యాండుమేళపు ధ్వనిని తగ్గించి
శవపేటికను బయటికి తీసుకురండి
ఏడ్చేవాళ్ళను ఇవతలికి రానీయండి

విమానాలు దుఃఖంతో పైన చక్కర్లు కొడుతూ
“అతడు చనిపోయాడు” అనే సందేశాన్ని
ఆకాశంలో రాయనీయండి
కపోతాల తెల్లని మెడల చుట్టూ
కట్టండి మెడపట్టీలను
ట్రాఫిక్ పోలీసు నల్లని చేతితొడుగులను
తొడుక్కోనివ్వండి

అతడు నా ఉత్తరదక్షిణాలుగా
తూర్పుపడమరలుగా ఉండేవాడు
నా పనిదినాలుగా నా ఆదివారపు విశ్రాంతిగా కూడా.
ఇంకా నా చంద్రునిగా నా అర్ధరాత్రిగా
నా సంభాషణగా నా పాటగా కూడా!
ప్రేమ శాశ్వతంగా బతికివుంటుందని అనుకున్నాను
కానీ నా భావన తప్పు అయింది

ఇప్పుడిక నక్షత్రాలు అవసరం లేదు, వాటిని ఆర్పేయండి
చంద్రుణ్ని మూట కట్టి సూర్యుణ్ని బద్దలు కొట్టండి
సముద్రపు నీటిని పారబోసి అడవిని ఊడ్చి, నిర్మూలించండి
ఇప్పుడిక దేనితోనూ మునుపటంత ఉపయోగం ఉండదు

*****

Please follow and like us:

3 thoughts on “మరణదుఃఖం(ఆంగ్లం మూలం: డబ్ల్యు. ఏచ్. ఆడెన్ తెలుగు సేత: ఎలనాగ)”

  1. హృదయాన్ని కదిలించే ఎలనాగ సార్ గారి కవిత ఎక్స్ లెంట్ హృదయ పూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐💐💐💐💐💐💐💐🙏

  2. ఎంతో నిర్వేదంతో కూడిన దుఃఖపు ఆనవాళ్ళు కవితలో ప్రతిధ్వనిస్తున్నాయి. అనువాదంలో కూడ మంచి పదాలను వాడారు. అభినందనలు సర్

Leave a Reply

Your email address will not be published.