కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-5

 -డా. సిహెచ్. సుశీల

సి.హెచ్. వు. రమణమ్మ
         
 
          జాతీయోద్యమం, స్త్రీల హక్కులు, కులమత రహిత సమాజ నిర్మాణం వంటి విషయాల పట్ల అవగాహనతో, చైతన్యవంతమైన కథలు రచించిన నాటి రచయిత్రులు – ‘వర్గ పోరాటం ‘ శ్రమ జీవుల నుండి ధనిక వర్గం చేసే దోపిడీ వైపు కూడా దృష్టి సారించారు. ఎందరో కష్టజీవుల శ్రమను తమ బొక్కసంలో దాచుకొనే సంపన్న వర్గాల వైఖరిని నిరసించారు. భారతదేశంలో ప్రవేశించిన ‘కమ్యూనిజం’ యొక్క భావాల పట్ల ఆకర్షితులయ్యారని చెప్పాలి.
 
          ప్రకృతి వైపరీత్యాల వంటి అనేక కారణాల వల్ల పంటలు సరిగా పండక, గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రైతులు పల్లెలు వదిలి పట్టణ బాట పట్టారు. పట్టణాలలోని కూలీలు పనికి తగిన వేతనాలు పొందక, తమ కష్టనష్టాలను పట్టించుకోని యాజమాన్య పోకడలను ఎదిరించాలనే ఆలోచన కూడా లేక , ‘ మన కర్మమింతే ‘ అని సరిపెట్టు కుంటున్నారు. అటు వంటి పరిస్థితుల్లో తమకి అండగా నిలిచి, చట్టాల గురించి,హక్కుల గురించి తెలియపరచే చైతన్యశీలురను వారు దైవాంశసంభూతులే అని ఆరాధిస్తారు.
 
 ఆ చైతన్యశీలి ఒక స్త్రీ అయితే…!
 
          ఈ కథాంశంతోనే అద్భుతమైన కథను రచించారు శ్రీమతి సి.హెచ్. వు. రమణమ్మ జూన్, 1935 గృహలక్ష్మి పత్రికలో.
 
ఆదర్శప్రాయురాలు
 
          కమల, విమల కళాశాలలో స్నేహితులు. ఆస్తులు, అంతస్తులలోనే కాక మనస్తత్వాలలోనూ ఇద్దరికీ వ్యత్యాసముంది. పేదవారికి తనకు చేతనైనంత సాయం చేయాలని, చదువు పూర్తయిన తర్వాత ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులకు అండగా ఉండాలని, కమల ఆశయం. తన తండ్రి ఓడల వ్యాపారం చూసుకుంటూ మరింత విస్తరించాలని విమల ఆశ. 
 
          “పేదవాళ్ల ముఖం ఎలా చూడబుద్ధి అవుతుంది! కావడి బద్దల్లా వంగిపోయిన నడుములతో, అర అంగుళం లోపలకు పోయిన కళ్ళు, సన్నగా వెదురు వాసాల్లాగుండే అవయవాలతో, చెమటలు కారుస్తూ, నల్లగా మాగిపోయిన దేహాలతో దేవుడా అంటూ ఏడుస్తుంటే వాళ్లు” …అన్నదే పేదవారి పట్ల విమల అభిప్రాయం.
 
          పెళ్లి విషయంలో మాత్రం ఇద్దరి భావాలు ఒకటే… తమతమ ఆశలు, ఆశయాలు నెరవేరే వరకు వివాహం మాట ఎత్తవద్దని.
 
          అనుకున్న విధంగా కమల బి.ఏ. పూర్తి అయిన తర్వాత చెన్నపట్నం వెళ్లి ఎల్. టి. కూడా పూర్తిచేసి, ఒక ఆడపిల్లల బడియందు ఏలూరులో హెడ్ మిస్ట్రెస్ గా ఉండి, నెలకు 150 రూపాయల జీతం తెచ్చుకుంటూ, తల్లిదండ్రులను తమ్ముడిని పోషిస్తున్నది. నాలుగేళ్ళలో తన సంపాదనలో కొంత పొదుపు చేస్తూ, ‘అనాధలకు విద్యనందించి ఉపాధి కల్పించాలన్న’ తన చిరకాల స్వప్నం తీర్చుకోవడానికి తన ఊరు అయిన గుంటూరు చేరుకొంది.
 
          అక్కడ కొందరి సహాయంతో “శ్రీ భారత అనాధ శరణాలయం’ స్థాపించి తన కృషి తో సంస్థకు మంచి పేరు తీసుకొని వచ్చింది.
 
          అనుకున్నట్లే విమల తన తండ్రి వ్యాపారం చేపట్టి, వృద్ధి చేసి మరో రెండు ఓడలు కొన్నది. వేయి మంది కూలీలు కష్టపడి రాత్రింబగళ్ళూ ఓడల మీద సముద్రంలో పని చేస్తుంటే భాగ్యవంతురాలుగా పేరు తెచ్చుకున్నది.
 
          ఆశ్రమంలో అనాధలైన స్త్రీలు చాలా మంది చేరడంతో నిధుల కొరకు పెద్దల సహాయం కోరక తప్పలేదు కమలకు. ఆ పనుల నిమిత్తం విమల ఉన్న ఊరికి వెళ్ళింది. విమల పొందిన ఐశ్వర్యంతో పాటు కూలీల కష్టాలూ విన్నది. పీడిత – దోపిడీ దారుల అ‌మానత తెలుసుకుంది. కుటుంబాన్ని పోషించే ఆదాయంలేక, ప్రాణాలుగ్గపట్టుకొని పనికి పోతున్నారు. పోలేక ఉండే పరిస్థితి లేదు. యాజమాన్యం కూలీలవేతనం పెంచడం లేదని, దాని కోసం వారు సమ్మె చేయాలనుకుంటున్నారని విన్నది. ఒకరోజు చిన్న సభ పెట్టి, ‘కూలీలందరూ ఏకం అవ్వాలని, జీతాలు పెంచే వరకు పనిలోకి వెళ్ళరాదని, కూలీల కష్టం యజమానురాలు తెలుసుకునే వరకు పట్టుదలతో ధైర్యంతో ఉండాలని’ బోధించింది.
 
          నాలుగు రోజులు పనివారు పనిలోకి రాకపోయే సరికి విమల ఆశ్చర్యపోయింది.వారికి దన్నుగా నిలబడిన వ్యక్తిని కాల్చి పారేయాలనుకుంది. అది చేయలేక మధ్యవర్తిత్వానికి ఒప్పుకొంది. కూలీలు కమలను తమ తరుపున మాట్లాడమని కోరారు.
 
          కమల వెళ్ళింది విమల బంగళాకు. తమ చిన్నప్పటి సంగతులు గుర్తుచేసింది. విమలకు జ్ఞాపకం ఉన్నదో లేదో తెలియలేదు. అయినా తను వచ్చిన పని ఎత్తింది. కూలీలకు పని గంటలు తగ్గించవలసినదని, వేతనాలు పెంచాలని కోరింది. విమల ఒప్పుకోకపోవడంతో నిరాశతో తిరిగి వచ్చింది. అయినా తాను కానీ, కూలీలు కానీ ధైర్యాన్ని కోల్పోలేదు.
 
          కూలీలు కమల ఇచ్చిన ధైర్యంతో తమంతట తామే ఒక  చిన్న ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నారు. కొంత ఆర్ధిక సహాయం కమల చేసింది. పనివారు లేక విమల వ్యాపారం పడిపోయింది. అవమానంతో, అసహనంతో, ఆగ్రహంతో ఊగిపోయింది. గత్యంతరంలేక సంధి కోసం కమలకు కబురు పెట్టింది.
 
          కార్మికుల బాగు కోసం బంగళాకు వెళ్ళింది కమల. తన వెంట రాబోతున్న కూలీల ను బైటనే  ఉండ మన్నది. ఈ సారి విమల సామరస్యంతో మాట్లాడుతుంటే సంతోష పడింది. కానీ కసితో హఠాత్తుగా బాకును తీసి కమలను పొడవబోయింది విమల. అదే సమయంలో  ‘ఎవరో వచ్చినార’ని చెప్పటానికి లోపలికి వచ్చిన ఒక కూలీ ఆ దృశ్యాన్ని చూసి, తన భుజాన ఉన్న గొడ్డలిని వేగంగా విమల పైకి విసిరాడు. కుప్పకూలి పోయింది విమల. 
 
          తన దుర్మార్గపు చేతలు, కమల పట్ల కూలీల కున్న ప్రేమాభిమానాలు గ్రహించింది. పశ్చాత్తాప పడినా ఇప్పుడు తనేం చేయలేదు. అతి కష్టమ్మీద శక్తి ని కూడదీసుకుని కమల చేస్తున్న సేవలను ప్రశంసించి, శరణాలయానికి కొంత మొత్తం చెక్కు రాసి ఇచ్చి క్షమాపణలు కోరింది. 
 
          “కమలా, నీవు ఆదర్శ ప్రాయురాలవు” అని ఆఖరి మాటగా అన్నది.
 
          పేదల కష్టాలు, కార్మికుల శ్రేయస్సు గురించి ఆ రోజుల్లో ఒక రచయిత్రి కథ వ్రాయడం గొప్ప విషయమే. పెట్టుబడిదారీ వ్యవస్థకి ప్రతీక విమల. పేదల పక్షపాతి కమల. కార్మిక చట్టాలు, సమ్మెలు, కార్మిక – యాజమాన్యం సంబంధాలు, పారిశ్రామికాభి వృద్ధిలో కార్మికుల భాగస్వామ్యం మొదలైన వివరాలు నాటి స్త్రీల ఆలోచనా పరిధికి మించినవే. అయినా వారు అవగాహన పొందడమే కాక చైతన్య వంతంగా వ్యాసాలు,కథలు రచించారంటే తర్వాతి రచయిత్రులకు ఆదర్శప్రాయులయ్యారనే చెప్పాలి. 

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

5 thoughts on “కథామధురం-ఆ‘పాత’కథామృతం-5 సి.హెచ్. వు. రమణమ్మ”

  1. ఆ కాలం లో ఇంత సాహసొపేత కథను రచించి సమస్యలను ఎదుర్కొను దైర్యం స్త్రీ లో ఉంటుంది అని నిరూపించింది.. ఈ కథను మాకు అందించిన సుశీలగారికి , నెచ్చెలికి అభినందనలు

  2. చక్కని కథను అందించి , రచయిత్రి ని పరిచయం చేసిన సుశీల మేడమ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 👏👌💐🙏👏👌💐🙏👏👌💐🙏🤝🌹🤝

  3. కథాంశం సినిమాటిక్ గా నడిచినా ఒక విస్మృత రచయిత్రిని సేకరించి పరిచయం చేసినందుకు సుశీలగారికి ధన్యవాదాలు

  4. ఆ రోజులలోనే మహిళా నాయకురాలు, వ్యాపారస్తురాలు .. కార్మిక పోరాటం, పోరాటయోధురాలిని హతమార్చబోయిన పెట్టుబడిదారిణి. . భాషను కథ.. ధన్యవాదాలు మేడమ్ సుశీలగారూ! అభినందనలు నెచ్చెలి కి🌹🌹💐💐

Leave a Reply

Your email address will not be published.