మిట్ట మధ్యాహ్నపు మరణం- 20

– గౌరీ కృపానందన్

          ఉమ అతన్ని ఆశ్చర్యంగా చూసింది. అతను ఆమె జవాబు కోసం ఎదురు చూస్తున్న వాడిలా సూటిగా ఆమెనే చూస్తున్నాడు.

          అతనికి జవాబు చెప్పే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆనంద్ వెంటనే వస్తే బాగుండునని అనుకుంది ఉమ.

          “మీరు వెంటనే జవాబు ఇవ్వనక్కరలేదు. ఆలోచించి చెప్పండి. ఒక వారం, ఒక నెల…. ఒక్క సంవత్సరం అయినా నేను వెయిట్ చేస్తాను. మీరు వద్దు, ఇష్టం లేదు అన్నా కూడా నేను కోపగించుకోను. మీ మీద తప్ప నాకు ఇంకెవరి మీదా ఇలాంటి ఫీలింగ్ ఏర్పడదు. ఒట్టేసి చెబుతున్నాను. ఉమా! గతం తాలూకు సంఘటనలన్నీ ఒక పీడకలగా, గత జన్మగా అనుకోండి. ఈ రోజు నుంచి మీకు కొత్త జన్మ అనుకోండి. ఏమంటారు?”

          “మీరు ఎవరని కూడా నాకు సరిగ్గా తెలియదే?”

          “నా గురించిన అన్ని వివరాలనూ మీకు చెబుతాను. నా రూముకు ఒకసారి రాగలరా? వంటరిగా వద్దు. ఆనంద్ ని తోడు తీసుకుని రండి. నా మీద ఇంకా నమ్మకం ఏర్పడలేదని అనుకుంటాను. అది కూడా న్యాయమేగా. నేను మీకు ఇంకా అపరిచితుడిని. కానీ నాకు మీరు అపరిచితురాలు కాదు. మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీరు నాకు సన్నిహితురాలు అయ్యారు. మీ కోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా తయారుగా ఉన్నాను. ”

          “మీ పూర్తి పేరు?”

          “R.S. రాకేష్.”

          “ఎక్కడ జాబ్ చేస్తున్నారు?”

          “ఎక్కడా జాబ్ చెయ్యట్లేదు. మా నాన్నగారికి ఫ్యాక్టరీ ఉంది.”

          “ఎక్కడ?”

          “బెంగళూరులో. ఇక్కడ అంబత్తూరులో ట్రైనింగ్ తీసుకుంటున్నాను ముందు ముందు ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోవాలి కదా. అందుకే అందరిలాగా ట్రైనింగ్ తీసుకోవాలని అన్నారు. తరువాత అమెరికాకి వెళ్లి M.B.A. చేయమంటున్నారు. లా చదివింది వేస్ట్.”

          “మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు?”

          “ఇప్పుడు జర్మనీలో ఉన్నారు. వచ్చే ఏడాది వస్తారు. అక్కడ ఒక కంపెనీ విషయం గా కన్సల్ట్ చేయడం కోసం వెళ్ళారు. ఈ ఫ్యాక్టరీలన్నీ ఆయన నా కోసమే స్థాపించారు. యంత్రాలను ఎగుమతి కూడా చేస్తున్నాము,”

          “అమ్మగారు?”

          “అమ్మ లేదు. ఒక్కగానొక్క కొడుకుని. డబ్బు అంతస్తు విషయాల్లో మీకు పట్టింపులు ఉండవు అనుకుంటున్నాను. మీకు ఇంకా వివరాలు కావాలంటే అడగండి. చెబుతాను. మీ కోసం దీనిని కొని ఉంచాను. సరైన సంధర్బంలో మీకు ఇవ్వాలని. “చిన్న పెట్టె ఒకటి తెరిచి చూపించాడు. నీలపు రంగు వెల్వెట్ పెట్టెలో వజ్రపుటుంగారం మిల మిల మెరిసింది.

          ఉమ నవ్వింది. “ఇవన్నీ చూస్తే నాకు నవ్వు వస్తోంది.”

          “తెలుసు. దీనిని చూపించడానికి ఇది సరైన సమయం కాదు. ఐ యాం సారీ.” పెట్టెను మూసేసాడు. “ఉమా! నేను ఎదురు చూస్తుంటాను. మీరు ఎప్పుడు సరే అంటారో అంత వరకూ.”

          ఉమ మౌనంగా ఉండి పోయింది. ఇంకో పెళ్ళా? ఒక పెళ్లి చేసుకుని పొందిన చేదు అనుభవం చాలదా?

          “మీకు నా రూముకి రావడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఫ్యాక్టరికి రండి. అక్కడ మీకు ఏ హానీ కలుగదు.”

          “నాకు ఇబ్బందేమీ లేదు.”

          “మరి చెప్పండి.”

          అంతలో ఆనంద్ వచ్చాడు.

          “ఏమయ్యింది ఆనంద్! ఆలస్యం అయ్యిందే?”

          “పుస్తకాలు రిటర్న్ ఇచ్చి కాఫీ పొడి కొని తీసుకుని రావడంలో ఆలస్యం అయ్యింది.”

          రాకేష్ వైపు చూసింది ఉమ. “మీకు జవాబు చెప్పడానికి ముందు ఆ మాయను ఒక్క సారైనా చూడాలి” అన్నది ఏదో నిశ్చయించుకున్న దానిలా.

          రాకేష్ ముఖకవళికలు మారాయి. వెంటనే సంబాళించుకున్నాడు. “దానికేం? ఏర్పాటు చేస్తాను. పోలీసులు మీకు చూపిస్తారని అనుకుంటున్నాను.”

          ఆనంద్ అర్థం కాని వాడిలా అన్నాడు. “వెయిట్  ఎ మినిట్. మాయ అని నిజంగా ఒక స్త్రీ ఉందా?”

          “అవును ఆనంద్! ఈయనే కనిపెట్టారు. ఆమె మీ అన్నయ్యకి  వ్రాసిన ఉత్తరం కూడా నాకు ఇచ్చారు.”

          ఆనంద్ సన్నగా విజిల్ వేశాడు. “ఓహో విషయం ఇంత దూరానికి వచ్చిందా? నాకు అస్సలు తెలియలేదే? ఆమె ఎవరు?”

          “మీ అన్నయ్య స్నేహితురాలు.”

          “అన్నయ్యకి స్నేహితురాలా? ఇంపాజిబుల్!”

          “మీ అన్నయ్య చాలా బుద్దిమంతుడు అని అనుకుంటున్నారా ఆనంద్?” వ్యంగ్యం గా అన్నాడు రాకేష్.

          “అవును. ఖచ్చితంగా మా అన్నయ్య బుద్దిమంతుడే.”

          “హి ఈస్ ఇన్ షాక్ ఉమా.”

          “ఏం మాట్లాడుతున్నారు మీరు? కాస్త అర్థం అయ్యేట్టు మాట్లాడండి.”

          “ఇంటికి వెళదాం పడ ఆనంద్. అన్నీ చెబుతాను. అందరికీ రెండు ముఖాలు ఉన్నాయి. లోకం కోసం ఒక ముఖం. లోపల వికృతమైన అంతర్ముఖం.”

          “మూర్తి అలాంటి వాడు కాదు. ఏ గుడికి రమ్మన్నావస్తాను. కర్పూరం వెలిగించి దాని మీద ఒట్టేసి చెబుతాను” అన్నాడు ఆనంద్.

          “తొందర పడకు ఆనంద్!”

          “మాయా అన్న స్త్రీ నిజంగా ఉండి ఉంటే పోలీసులు ఈ పాటికి కనిపెట్టి ఉండరా?”

          “వాళ్లకి ఈ పాటికి లెటర్ చేరి ఉంటుంది. పరిశోధనలో ఉండి ఉంటారు.”

          “ఉత్తరమా?” ఆనంద్ మరింత ఆశ్చర్య పోయాడు. ఏదో మర్మం ఇందులో దాగి ఉన్నట్లు అనిపించింది.

          “నేను బయలుదేరుతాను.” బిల్లు కన్నా ఎక్కువ మొత్తాన్ని ప్లేటులో నిర్లక్ష్యంగా పెడుతూ లేచాడు రాకేష్.

          “ఆనంద్! మీ సిస్టర్ ఇన్ లా ని జాగ్రత్తగా చూసుకోండి.”

          “గుడ్ బై ఉమా! నన్ను అడిగితే ఈ విషయాన్నీ ఇలాగే వదేలేస్తేనే మంచిది. పోలీసులు చూసుకుంటారు. సరేనా?”

          తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఆనంద్ ఉమని ప్రశ్నలతో తొలిచేసాడు.

          “ఏమిటి ఉమా! నాకు తెలియకుండా చాలా విషయాలు తెలుసుకుంటున్నట్లు వున్నావు.”

          “ఆనంద్! నేను చాలా అయోమయంలో ఉన్నాను. మీ అన్నయ్య చనిపోయి నందుకు కారణం ఏమిటో దాగుడుమూతలు ఆడుతున్నట్లు ఉంది. ఇంకా ప్రశ్నలు, అడగాలి, వివరాలు సేకరించాలి అంటే భయంగా ఉంది. నేను ఎదుర్కో బోయే నిజం అంత అందంగా ఉండదని అనిపిస్తోంది. ఇప్పుడు నాకు తెలిసిన నిజాలు కూడా నాకు మంచిని చేస్తాయా, మనసుకి శాంతిని ఇస్తాయా అని తెలియదు. కాని చనిపోయిన వ్యక్తిని కళంకపరచడం సభ్యత కాదనిపిస్తోంది. కానీ ఒక వేళ అదే నిజమైతే?”

          “మూర్తి చాలా మంచి వాడు ఉమా.”

          “ఒక కోణంలో చూస్తే మూర్తి మంచి వాడే ఆనంద్.”

          “ఆ లెటర్ ఏమిటి? నాకు చూపించకూడదా?”

          “చూపిస్తాను. కాని ఒక్క నిబంధన. దీని గురించి ఎవరికీ చెప్పకూడదు. మీ అమ్మ, నాన్నగారితో ఎవరికీ చెప్పకూడదు. వాళ్ళు తట్టుకోలేరు.”

          “సరే.”

          “రాత్రి మీ అమ్మగారు గుడికి వెళ్ళాక చూపిస్తాను. ఆనంద్! రాకేష్ గురించి నీ అభిప్రాయం ఏమిటి?”

          “మంచివాడిలాగానే అనిపిస్తోంది. డీసంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. లా గ్రాడ్యుయేట్ అట.”

          “అతని నాన్నగారికి ఇండస్ట్రీ ఉందట. ఇతనే నిర్వహించ బోతున్నాడట.”

          “అతనికి నీ కేసులో ఎందుకింత ఇంటరెస్ట్ ఉమా?”

          ఉమ చటుక్కున, “తెలియదు” అంది.

          “నాకు తెలుసు” అన్నాడు.

          అదిరిపడినట్లు చూసింది ఉమ. “ఏం తెలుసు. విపరీతంగా ఏదైనా ఊహించుకోకు.”

          “లేదు ఉమా. అతను నిన్ను క్రికెట్ ఆడే రోజుల నుంచే గమనిస్తున్నాడు. అతనికి నువ్వంటే ఒకవిధమైన క్రేజ్.”

          “అతనే చెప్పాడు.”

          బస్సు నుంచి దిగగానే ఆనంద్ ముందుగా నడిచి వెళ్లి పోయాడు, ఉమతో కలిసి రావడం ఇష్టం లేనట్లుగా.

          ఉమ ఆలోచనలన్నీ రాకేష్ ఆక్రమించుకున్నాడు.’

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.