కాళరాత్రి-21

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

ఏప్రిల్‌ 10వ తేదీన

          ఇంకా క్యాంపులో 20వేల మంది ఖైదీలున్నారు. వారిలో పిల్లలు కొన్నివందల మంది సాయంత్రానికంతా అందరినీ ఒకేసారి తరలించాలని నిర్ణయించారు. తదుపరి క్యాంపు తగలబెడతారు.

          అందరినీ పెద్ద అపెల్‌ ఫ్లాట్‌లోకి తోలారు. గేటు తెరుచుకునేలోగా 5 మంది చొప్పున వరుసలు గట్టి ఎదురుచూడాలి. అకస్మాత్తుగా సైరన్లు మోగాయి. జాగరూకతగా. అందరం బ్లాక్స్‌ లోపలికెళ్ళాం. సాయంత్రం మమ్మల్ని తరలించడం సాధ్యం కాదు. మరుసటి రోజుకు మార్చారు.

          అందరినీ ఆకలి దహించి వేస్తున్నది. ఆరు రోజులుగా ఇన్ని గడ్డి పరకలు వంటశాలలో నేల మీద పడిఉన్న బంగాళ దుంప పెచ్చులు తప్ప మరేమి దొరకలేదు తిందామంటే.

          10 గం॥లకు ఎస్‌.ఎస్‌.లు మమ్మల్ని అపెల్‌ ఫ్లాట్‌కి తరలించారు.

          తిరుగుబాటుదారులు అదే అదను అనుకొని ఆయుధాలు ధరించి ప్రతిచోటా కనిపించారు. తుపాకి మోతల మధ్య గ్రెనేడ్లు పేలుతున్నాయి. పిల్లలం బ్లాక్‌ నేల మీద పడుకున్నాం.

          పోరాటం ఎక్కువ సేపు సాగలేదు. మధ్యాహ్నానికి అంతా సర్దుమణిగింది. ఎస్‌.ఎస్‌.లు పారిపోయారు. తిరుగుబాటుదార్లు క్యాంపును అదుపులోకి తీసుకున్నారు.

          6 గంటలకు మొదట అమెరికన్‌ ట్యాంకు బుకెన్‌వాల్డ్‌ గేటు ముందు నిలిచింది.

          స్వేచ్ఛాపరులుగా మేము మొదట చేసిన పని తిండి పదార్ధాల మీద పడటం. అదొక్కటే అప్పటి మా ఆలోచన. ప్రతీకారం గురించి గానీ, మా తల్లిదండ్రుల గురించిగానీ మేము ఆలోచించలేదు.

          ఆకలి తీరాక గూడా ప్రతీకారం గురించి ఒక్కరం కూడా ఆలోచించలేదు. మరురోజు కొందరు యువకులు బంగాళదుంపల కోసం, కొన్ని బట్టల కోసం వెళ్ళారు. అమ్మాయి లతో గడపాలని కూడా వెళ్ళారు. ప్రతీకారం గుర్తు చేసుకోలేదు. 

          బుకెన్‌వాల్డ్‌ స్వేచ్ఛ పొందిన మూడవ రోజు నేను చాలా జబ్బు పడ్డాను. విష ప్రయోగం మాదిరిగా. హాస్పిటల్‌కి తరలించారు. రెండు వారాలు చావుబ్రతుకుల మధ్య పోరాడాను.

          ఒకనాడు కొంచెం లేవగలిగాను. ఎదురు గోడకు ఉన్న అద్దంలో నన్ను నేను చూసుకోవాలనుకున్నాను. గెటో తరవాత మరల అద్దంలో చూసుకోలేదు.  

          అద్దంలో నా శవాకారం కనిపించింది. ఆ దృశ్యం నేన్నెటికీ మరువలేను.         

*****

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.