జీవితం అంచున -5 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

Care for one… that’s love.

Care for all… that’s nursing.

          కనీసం చిన్న పించ్ కూడా తెలియకుండా నర్సు “ఐ యాం సారీ డార్లింగ్” అంటూనే నా రక్త నాళంలో నుండి బోలెడు రక్తం తోడేసింది.

          మనం ఒకే ఫ్రెటర్నిటి అనుకుంటూ ఆవిడ వైపు ఆత్మీయంగా చూసాను.

          ఆలూ చూలూ లేకుండా బిడ్డ కోసం కలలని నవ్వుకుంటున్నారా…

          నా కంటి పలకరింపును ఆమె చిరునవ్వుతో అక్నాలెజ్ చేసింది.

          వాట్ ఎన్ ఆర్డర్ ఆఫ్ ది స్మైల్..!ఎంత నిర్మలమైన నవ్వు.

          నవ్వే పెదవులు మొహానికి పెట్టని ఆభరణం.

          వృత్తి పరంగా అవి నర్సులకు మరీ అవసరం.

          స్వభావసిద్ధంగా నవ్వు మొహమైతే ఇక ఆ నర్సుకి తిరుగుండదు.

          మందుల మాటెలావున్నా మృదువైన గొంతుతో  పలకరింపు, పున్నమి వెన్నెల లాంటి నవ్వు, రోగిని సగం అనారోగ్యం నుండి దూరం చేసేస్తాయి. క్రూరమైన మొహంతో, కటువైన మాటలతో నర్సును అస్సలు ఊహించలేము.

          ఇక్కడ నర్సులకు ప్రత్యేక సాధారణ యూనిఫారం అంటూ వుండదు. ఒక్కో హాస్పిటలులో ఒక్కో రంగు దుస్తులు.. ఆకుపచ్చ, లేత నీలం, ముదురు నీలం, గ్రే, పర్పల్, గులాబి, ఎరుపు, మెరూన్…  ఇలా ఏదో ఒక రంగులో ఆర్గనైజేషన్ కి సంబం ధించిన లోగోతో షర్టు, ప్యాంటు (స్క్రబ్స్) వేసుకుంటారు.

          వీళ్ళ వస్త్రాధారణ పైన ఒక ప్రసిద్ధమైన కోట్ … “Nurses are Angels in scrubs”.

          రిజిస్టర్డ్ నర్స్, ఎన్రోల్డ్ నర్స్, అసిస్టెంట్ నర్స్ ల మధ్య యూనిఫారం లో కొద్దిపాటి మార్పులు వుంటాయి.

          మన దేశంలో ప్రభుత్వాసుపత్రిలో నర్సులు ధరించే శ్వేత వస్త్రాలంటే నాకెంతో ఇష్టం. అవి వాతావరణానికి మరింత శాంతిని, ప్రశాంతతను చేకూరుస్తాయి. శ్వేత వస్త్రాలు ధరించకుండానే ఇక్కడి నర్సుల స్వచ్చమైన హావభావాలు, ‘డార్లింగ్’ అనే వారి తియ్యటి సంభోదన, రోగిలో ఎనలేని నమ్మకాన్ని, జీవితం పైన ఆశను కలిగిస్తాయి. 

          అంత బ్లడ్ దేనికని నర్సుని అడిగాను. వివిధ రకాల వ్యాక్సిన్ లకు సంబంధించిన ఏంటి బాడీలు వున్నదీ లేనిదీ విడివిడిగా పరీక్షించాల్సి వుంటుందని చెప్పింది.

          విద్యావంతురాలు కాని అమ్మ, కనీసం బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలని తెలియని అమ్మ, నాకు అన్ని వ్యాక్సిన్ లు క్రమబద్ధంగా వేయించి వుంటుందా అని నా సందేహం. నా ఎడం జబ్బ మీద రెండు టీకాల మచ్చలు వుంటాయి. ఏ ఏంటి బాడీల వెలితి వున్నా, తదనుగుణ వ్యాక్సిన్ లు తీసుకుని, అవి పెంపొందాక తిరిగి బ్లడ్ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ తీసుకోవాలి. నా అడ్మిషనుకి పాజిటివ్ రిపోర్ట్ అవసరం.

          పనిలో పనిగా నా పూర్తి బ్లడ్ పిక్చర్ కూడా అమ్మాయి చేయించమన్నది. కోర్సు పుణ్యాన ఆరోగ్య సంబంధిత పరీక్షలన్నీ జరుగుతున్నాయి.

          ఒంట్లో TB బాక్టీరియా ఉనికిని తెలిపే క్వాన్టిఫెరాన్ TB పరీక్ష కోసం అల్లుడు మరో డయాగ్నొస్టిక్ సెంటరుకి తీసుకెళ్ళాడు. ముంజేతి చర్మంలోకి ట్యుబర్కులిన్ ఇంజక్షన్ చేసి సరిగ్గా రెండు రోజులకు మళ్ళీ రమ్మన్నారు.

          కోవిడ్ బూస్టర్ డోస్ మరో ఆరోగ్య కేంద్రంలో వేయించాడు.

          పోలీసు క్లియరెన్స్, NDIS, బ్లూ కార్డుల కోసం నా పేరు మీద అప్లికేషన్లు సిద్దం చేసాడు. మూడింటి పైనా సంతకాలు చేసాను.

          ఫస్ట్ ఎయిడ్ కోర్సు చేసినట్టుగా సర్టిఫికెట్ వుంటే అడ్మిషన్ కి అదో ప్లస్ పాయింటే తప్ప తప్పనిసరి కాదు. ఎంచేతనంటే నర్సింగ్ కోర్సులో ఫస్ట్ ఎయిడ్ కూడా ఒక భాగం.

          దాదాపు ఓ పూటంతా పసిదాన్ని వేసుకుని అల్లుడు, నేను తిరిగాము.

          అసిస్టెంట్ నర్సింగ్ అడ్మిషన్ కి అర్హత సంపాదించటానికి ఇన్ని పరీక్షలా..?

          వీటిలో ఏమి పాజిటివో, ఏమి నెగెటివో, తిరిగి ఏమేమి టీకాలు వేయించుకోవాలో…

          డయాగ్నొస్టిక్ పరీక్షా ఫలితాల కోసం ఉద్వేగభరిత ఎదురు చూపులతో నాకు మాత్రం రక్తపోటు అధికమయ్యింది.

*****

(సశేషం)

Please follow and like us:

One thought on “జీవితం అంచున -5 (యదార్థ గాథ)”

  1. ఝాన్సీ గారి జీవితం అంచున యదార్ధ గాధలు లో 5 వ భాగం చాలా బాగా వ్రాశారు తాను ఏది వ్రాసిన సహజసిద్ధంగా ఉంటుంది. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఝాన్సీ గారికి 👏👌💐👏👌💐👏👌💐🌹🤝🌹

Leave a Reply

Your email address will not be published.