నా జీవన యానంలో- రెండవభాగం- 30

-కె.వరలక్ష్మి

          మనుషుల రూపానికీ, నడవడికకీ సంబంధం ఉంటుంది అంటారు. అది నిజం కాదని కొన్నిసార్లు నిరూపితమౌతుంది. గొప్ప అందగాడైన షేర్ సింగ్ రాణా వాళ్ళ కుటుంబీకులెందర్నో చంపేసిందనే కోపంతో 2001 జూలై 25న పూలన్ దేవిని కాల్చి చంపేసాడు. గాయాల గురించి ఇసుకలోను, దయగురించి చలువరాతి పైన రాయాలన్నారు పెద్దలు.

          బైటికెక్కడికీ వెళ్ళొద్దని ఎంత నిర్ణయించుకున్నా కొన్ని తప్పని సరి ప్రయాణాలు చెయ్యాల్సి వచ్చేది. కాకినాడ నుంచి డా॥ఆలూరి విజయలక్ష్మిగారు ఫోన్ చేసి పిలవడం వల్ల నవంబర్ 25న CEDOW, చైతన్య మహిళా మండలి కలిసి నిర్వహించిన స్త్రీల పై హింస సెమినార్లో కుటుంబ హింస గురించి మాట్లాడాల్సి వచ్చింది. విజయవాడ నుంచి పి.సత్యవతి, నిర్మల తమ్మారెడ్డి కూడా వచ్చారు. లాస్ట్ బస్ వెళ్ళిపోవడం వల్ల నేను అక్కడి లోకల్ రచయిత్రి ఒకావిడ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది సత్యవతి గారితోబాటు. ఆ రచయిత్రికి ఎవర్నీ మెచ్చుకోవడం ఇష్టం లేదల్లే ఉంది. సభకొచ్చిన చాలా మందిని విమర్శించింది. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న ఓ రచయిత్రి స్నేహాల గురించి  అసహ్యం గా మాట్లాడింది. మగ రచయితలు, అభిమానులు అంతా తనతో ప్రేమలో పడిపోతున్నారని, సెక్స్ కోసం అర్రులు చాస్తున్నారని ఆ రచయిత్రి ఈమెతో చెప్పిందట. ఇలాంటి సిట్యుయేషన్ నాకు కొత్త. ఇలా తోటి రచయిత్రులు, దగ్గరలేని వ్యక్తి గురించి అలా మాట్లాడడం మరో రకం హింస కదా అన్పించింది.

          ఆ సంవత్సరం నాకు చాలా ఆనందం కలిగించిన విషయం మా గీత మొదటి పొయెట్రీ బుక్ ‘ద్రవభాష’ రావడం. 9.12.2001 న ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరణ జరిగింది.
నాలుగు రోజులు ముందే హైదరాబాద్ చేరుకున్నాం. వసంతా కన్నాబిరాన్, ఓల్గా,
నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు గీత కవిత్వం గురించి బాగా మాట్లాడేరు. నా చేత ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసింది. నేను నా బుక్ వేసినప్పుడు కలగని ఓ ప్రత్యేక మైన ఆనందం కలిగింది. 

          ఆ సంవత్సరంలోనే ఇంకొక మరచిపోలేని జ్ఞాపకం. కాకినాడ చుట్టాలింట్లో ఏదో ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తూ ఉంటే సూర్య కళామందిర్ లో అత్తలూరి పద్మిని గారి వీణ కార్యక్రమం బేనర్ కన్పించింది. రిక్షాని అటు మళ్లించి వెళ్లేను. పద్మినిగారు ఆప్యాయంగా పలకరించి కబుర్లు చెప్పేరు. బస్సు టైం వరకూ ఆ వీణావాదనలో మునిగితేలి లాస్ట్ బస్ లో ఇంటికి చేరేను.

2001 లో ప్రపంచాన్ని పట్టి కుదిపిన మరో సంఘటన సెప్టెంబర్ 11న న్యూయార్క్ లో ట్విన్ టవర్స్ కూల్చివేత.

          మా జగ్గంపేట మహిళా మండలిలో ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నా సీనియర్స్ ( మా ముందుతరం) మాటే చెల్లాలి. వాళ్లేమో ఎంత సేపు ముగ్గుల పోటీలు, వంటల పోటీలు పెడదాం అనేవాళ్లు. స్వామిజీలు, పూజలు, యాగాలు గురించే మాట్లాడ్డాలు. కొత్తగా ఏదైనా చెప్పబోతే ఒప్పుకునే వాళ్లుకాదు. అందుకని నేను వాళ్లతో పెట్టుకోకుండా నాకున్నంతలో దుప్పట్లు, ఇంటికి అవసరమయ్యే చిన్న చిన్న వస్తువులు లాంటివి కొని లేబర్ కాలనీకెళ్లి పంచి వచ్చేదాన్ని. ఇలాంటివి ఎప్పుడూ పైకి చెప్పొద్దు అనుకున్నా ఈ జ్ఞాపకాలలో అదీ ఒక విషయం కాబట్టి చెప్పక తప్పడం లేదు. ముఖ్యమైన అవసరాలకు చిన్న చిన్న ఆర్థికసాయాలు, బాగా చదువుతున్న పిల్లలకు ఫీజులు కట్టడం లాంటివి చేసేదాన్ని. స్కూల్ తీసేసేక ఏడవ తరగతి పబ్లిక్ లో స్కూల్ ఫస్ట్ వచ్చిన హైస్కూల్ విద్యార్ధులకు కేష్ ఫ్రైజ్, షీల్డ్ ఇచ్చేదాన్ని.

2002 లో అజో- విభొ వాళ్ళు పి.వి. నరసింహారావుగారికి జీవిత కాల సాఫల్య పురస్కారం ఇచ్చారు.

          2001 లోనే నా పని పెనం మీంచి పొయ్యిలో పడినట్లైంది. మోహన్ కి అర్థరాత్రి
బైట ఏదో తినడం వల్ల ఇంటికొచ్బి ఒకటే వామిట్స్, తెల్లవారు ఝాము నుంచి మోషన్స్ అయ్యి టాయిలెట్ లో ఫెయింటై పడి పోయాడు. ఆ తర్వాతి నుంచీ అతని శరీరం మీద అతనికి పూర్తిగా అదుపులేకుండా పోయింది. మనిషిని పెడితే రెండుమూడు రోజుల్లో చెయ్యలేం అని వెళ్లిపోయేవారు. ఇల్లంతా ఒకటే దుర్వాసన. అతని ఒళ్లంతా భరించలేని దుర్గంధం. మా అత్తగారే (అతని తల్లి) దూరంగా, కూతురింటికి పారిపోయింది.

          ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేనే ఆయాని, నేనే తోటీని అయిపోయాను. నేను బతికే ఉన్నానా అని నా మీద నాకే డౌటొచ్చేది. చేసీ చేసి తిండి నోటికి పోక నేను పేషెంటులాగై పోయాను. ఐదుగురు ఆడపడుచులు, నలుగురు నా తోడబుట్టిన వాళ్లు, మా అత్తగారి నలుగురు చెల్లెళ్ళ పిల్లలు, వాళ్లందరి పిల్లలు ఇటు అతన్నే చూసుకోనా, వచ్చిన వాళ్లకి వండిపెట్టనా? చూసుకోవడమంటే మామూలుగా చూసుకోవడం కాదు. ఉదయం , సాయంకాలం స్నానం చేయించి – అంత బరువైన మనిషిని బాత్రూం వరకు తీసుకెళ్ళలేక వరండాలో – పౌడరు ఒళ్లంతా పోసి, పక్క బట్టలు ప్రతిసారీ మార్చి, ఎక్కువై పోయిన జిహ్వచాపల్యానికి తగినట్టు కోరినవన్నీ తినిపించి, ఉతకడానికి వీలుకాని బట్టల్ని గోడ బైట పడేసి, రాత్రులు నిద్రలేకుండా జాగరణలు చేసి – ఏ జన్మలో చేసిన పాపమో అనే వేదాంతాన్ని మననం చేసుకుంటూ మరో నాలుగున్నర సంవత్సరాలు ఎలా బతికానో, ఎన్నిసార్లు చచ్చిపోయానో నాకు మాత్రమే తెలుసు.

చూడ్డానికొచ్చిన మా పెద్ద ఆడ పడుచు ‘జీవితం మీద విరక్తి వచ్చేసి, బతకాలని లేక ఇలా అయిపోయేడు’ అంది.

మరొకరైతే ‘ఏం దొబ్బిడాయని ? ఇల్లూ పిల్లల్ని పట్టించుకోకుండా జీతం మొత్తం తనే ఖర్చుపెట్టుకునేవాడు కదా !’  అని అడిగేవాళ్ళు.

          ఏలేశ్వరంలో స్కూల్ స్టాఫ్ అందరూ మంచివాళ్లు కావడం వల్ల మోహన్ ని తరచుగా టాక్సీలో తీసుకు రావద్దని, వారానికి ఒకరోజు తీసుకొస్తే హెడ్మాస్టరుగా తను పెట్టవలసిన సంతకాలు పెట్టించి తీసుకెళ్లొచ్చని చెప్పేరు. అలాగే చేసేదాన్ని. 2002 ఏప్రిల్ 2న స్కూలు వాళ్లు అతని సేలరీలోంచి నాలుగు వేలు చిన్న చిన్న అప్పులు తీర్చేమని, మిగిలినవి అంటూ 10 వేలు పంపేరు. అప్పుడు తెలిసింది నాకు అతని సేలరీ 14 వేలని. అతను జాబ్లో జాయినైంది మొదలు ఏనాడూ అతని సేలరీ గురించి చెప్పలేదు. నన్ను అడగనీయ లేదు.

          డబ్బు కోసం ఏమైనా చేసే క్రూరత్వం చూపించాడు నా దగ్గర. అతను లేవడం లేదని తెలిసి ఏలేశ్వరం నుంచీ, అనపర్తి నుంచీ, అప్పులిచ్చే ఫైనాన్సర్లు కొంత మంది వచ్చేసారు. 5 వేలకీ నెలకి 1000 రూ॥ వడ్డీ కట్టేడంట. ఒకక్కళ్ళ దగ్గరా ఇతని సంతకం, వేలి ముద్రలూ  ఉన్న స్టాంప్స్ పేపర్స్ కనీసం ఆరేసి ఉన్నాయి. వాళ్ళు ఎంతైనా  రాసుకోవచ్చు. అప్పటికే ఇతనికి మాట పడిపోయింది. బుర్ర పని చెయ్యడం మానేసింది. ఏదడిగినా అవునంటే అవుననీ, కాదంటే కాదనీ అంటున్నాడు. ఆ అప్పుల విషయాల్లో మనసుకి స్థిమితం లేకుండా పోయింది.

ఏప్రిల్ లో కొడవటిగంటి  కుటుంబరావుగారమ్మాయి శాంతసుందరి గారు ఢిల్లీ నుంచి ఉత్తరం రాసారు. నా జీవరాగం ‘బుక్ తన దగ్గర ఉందనీ, హిందీలోకి అనువదించడానికి పర్మిషన్ లెటరు పంపమనీ’. వెంటనే పంపేను.

          2002 మే నెలలో ఎండలు మా ప్రాంతంలో ఎంత ఘోరంగా కాసేయంటే ఒక విలయంలాగా పక్షులు చెట్ల నుంచి రాలిపడ్డాయి. కోళ్ళ ఫారాల్లో కోళ్ళు వేలల్లో చచ్చి పోయాయి. అరటి చెట్లు మధ్యకి విరిగి పోయాయి. చెరువుల్లో నీళ్లు మరిగిపోయి చేపలు చచ్చి తేలిపోయాయి. అనారోగ్యులు, పసిపిల్లలు ఎందరో ఎగిరిపోయారు. మా ఇంట్లో పేషెంట్ కోసం దళసరి దుప్పట్లు తడిపి గుమ్మాలకీ, కిటికీలకీ కట్టేదాన్ని. తడిగుడ్డతో తరచుగా వొళ్లుతుడవడం, చల్లని పాలు తాగించడం లాంటివి చేసేదాన్ని. అయినా ఒక్కోసారి సొమ్మసిల్లిపోయేవాడు.

          సెప్టెంబర్ లో కోనసీమ నుంచి ఆయుర్వేద వైద్యుడు పుల్లంరాజు గారు వచ్చారు. అప్పటి వరకూ వాడుతున్న ఇంగ్లీషు మందులు ఆపెయ్యమని పై పూతకు ఒక పసరు మందు, లోపలికి 3 రకాలు ఇచ్చారు. అవి వాడడం మొదలుపెట్టేను.

          అందరికీ రిటైర్మెంట్ కోసం ఫైల్స్ చేసిపెట్టీ, సలహాలు ఇచ్చీ మోహన్ సాయపడేవాడట. తన కోసం మాత్రం ఏమీ చేసుకోలేదు. నాకు గవర్నమెంటు రూల్స్ తెలీక జూన్ 1stన రిటైరైన అతనికి పెన్షను అదే వస్తుంది కాబోలు అని ఊరుకున్నాను. డిశెంబర్ లో అతని కొలీగ్స్ చూడడానికి వచ్చి చెప్తే గాని తెలీలేదు. వాళ్ళ సలహా మీద జగ్గంపేటలో ఉన్న సబ్ ట్రెజరీకి వెళ్ళి కనుక్కున్నాను. వాళ్లు కాకినాడ D.T.Oకి వెళ్ళి పేపర్స్ తెచ్చుకోవాలన్నారు. మర్నాడు ఉదయాన్నే అతని పనులన్నీ ముగించి మంచం పక్కన స్టూలు మీద మంచినీళ్లు తినుబండారాలు ఉంచి, పక్కింటి వాళ్లకి, ఎదురింటి వాళ్లకి చూస్తూ ఉండమని అప్పగించి కాకినాడ జిల్లా ట్రెజరీ కి వెళ్ళేను. ఏ టేబుల్ దగ్గర ఆగాలో అంతా అయోమయం. మొత్తానికి టేబుల్ కనుక్కుని వెళ్తే ఆయన అటెండర్ కి ఏదో చెప్పేడు. అటెండర్ నన్ను బైట వరండా చివరికంటా నడిపించి 400/- ఇమ్మన్నాడు. నేను పర్స్ లో 200/- వేసుకుని వెళ్లేను. అతను అడిగింది లంచం అని కూడా నాకు తెలీదు. సరే, ఏం చెయ్యను? వెనక్కి తిరిగి వచ్చేను.

మర్నాడు ఓ వెయ్యి రూపాయలు పట్టుకుని వెళ్లి ఆ ఆఫీసులో 400/- ఇచ్చేక పేపర్స్ ఇచ్చేరు. APGL ఆఫీసుకెళ్లి ఇంకెవరికో 200/- ఇమ్మన్నారు, ఇచ్చేను. మర్నాడు ఆటోలో కూర్చో బెట్టి మోహన్ ని ఊళ్లో ట్రెజరీకి తీసుకెళ్లేను. 11 కి వెళ్తే 1.30 కి వదిలేరు. మర్నాడు నేను వెళ్తే చాలన్నారు. తీరా వెళ్లాక నిన్న కొన్ని సంతకాలు మరచిపోయాం అని చేయుంచుకు రమ్మన్నారు. ఇంటికొచ్చి అవన్నీ చేయించి పట్టుకెళ్తే గ్రాడ్యుటీ + పెన్షన్ ఎమౌంట్ అంతా కలిపి 5లక్షల చిల్లరకి చెక్కు ఇచ్చేరు. పట్టుకెళ్ళి తన బేంక్ ఎకౌంట్ లో వేసేసాను. నాకెందుకో ఆ డబ్బు ఆనందాన్ని కల్గించలేదు. తీర్చ వలసిన అప్పులు ఇంకా ఎన్నున్నాయో తెలేదు. ఆశలు, కోరికలు అందరికీ ఉంటాయి. అవి తీరితే ఆనందమే, కాని పక్షాన అసంతృప్తి, ఆందోళనతో వర్రీ కావడంకన్నా  ‘అందని ద్రాక్షపళ్లు పుల్లన’ అని అనుకోవడం కూడా ఆనందమే. దానినే సైకాలజీలో రక్షణో పాయం అంటారు. డిఫెన్స్ మెకానిజమ్ లు అనబడే రక్షణోపాయాలు మనిషిని, మనసుని రక్షించగలవు. కొన్నిటిని ఎంత త్వరగా విడిచిపెడితే అంత మంచిది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.