యాదోంకి బారాత్-8

-వారాల ఆనంద్

కరీంనగర్ – కాలేజీ చదువుల దశాబ్దం

          వ్యక్తుల పైనా శక్తులపైనా వ్యవస్తలపైనా కాలం తనదయిన భాషలో తనదైన రీతిలో ప్రభావం చూపుతూనే తుడిచి వేయలేని చరిత్రని లిఖించి వెళ్తూనే వుంటుంది. భారత స్వాతంత్రానంతర కాలంలో 70 వ దశకం అతి ముఖ్యమయినది. అత్యంత ప్రభావవంత మయినది. అనేక ఆటుపోట్లకు గురయిన కాలమది. మంచినీ చెడునీ ఒకే గవాక్షం గుండా చూసి సరి చేసుకుని ముందుకు దూసుకెళ్ళిన దశాబ్దమది. సరిగ్గా ఆ దశాబ్డంలోనే నా చదువులు స్కూలు నుంచి కాలేజీ దాకా సాగింది. అప్పటికి ఈ ఆటుపోట్లన్నింటినీ అర్థం చేసుకునే వయసూ కాదు నేపథ్యమూ లేదు. అరకొర చదువూ అందివచ్చిన పుస్తకాలూ, రేడియో వినిపించిన సంగీతమూ, అప్పటి కామెంటేటర్లు వినిపించిన క్రికెట్ కామెంటరీ లతో గడిచిన కాలం. కానీ పరోక్షంగా ఆ దశాబ్దపు ఆటుపోట్లు విద్యార్థులుగాఅప్పటికప్పుడు అర్థం చేసుకోలేకున్నా క్రమంగా పొరలు తొలగి తేటతెల్ల మయ్యాయి.

          1969 లో పెల్లుబికిన జై తెలంగాణా ఉద్యమ కాలంలో నేను 7 వ తరగతిలో వున్నాను. కరీంనగర్ ఖార్ఖానాగడ్డ స్కూలులో చదువు. మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్, తదితరుల పేర్లు వినడమే. కరీంనగర్ కు సంబంధించి ఎం.సత్యనారాయణ రావు, ఆంజనేయలు, కన్నయ్య తదితరుల పేర్లు తెలిసేవి. బందులు, నిరాహార దీక్షలు చూసాను అంతే తప్ప ఉద్యమ నేపథ్యం ఉధృతి పెద్దగా తెలీదు. కానీ ఆ ఏడు వార్షిక పరీక్షలు లేకుండానే 7 క్లాస్ పాసై 8 కు వచ్చింది మాత్రం గుర్తుంది. అప్పుడే స్కూలు మారి గంజ్ స్కూలులో చేరాను.  

          70 దశక మొదటి సంవత్సరాలల్లో గంజ్ స్కూలు చదువులు మావి. అప్పుడే దేశవ్యాప్తంగా ప్రధాన స్రవంతి రాజకీయాల్లో నెహ్రు కలలు ముగిసి, లాల్ బహదూర్ శాస్త్రి  ‘జై జవాన్ జై కిసాన్’ నినాదపు హోరు గడిచి ఇందిరా గాంధీ పాలన ఆరంభయింది. ఆమె తీసుకున్న  బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దులాంటి నిర్ణయాలతో దేశ ప్రజల మన్ననల్ని అందుకున్న సమయమది. పేదల పెన్నిధిగా జనం ఆమెకు నీరాజనాలు పలికారు. కానీ ఊహించని విధంగా ఆమె కుమారుడు సంజయ్ గాంధీ తెర మీదికి వచ్చి దేశ ఆర్ధిక రాజకీయ సామాజిక స్థితిగతుల పై తీవ్రమయిన ప్రభావాన్ని కలిగించారు. 1973-75ల మధ్య ఇందిరా గాంధీ ప్రభుత్వ పాలనా రీతి పట్ల దేశ రాజకీయ పార్టీలతో సహా తన స్వీయ కాంగ్రెస్లో కూడా ఒక నిరసన వాతావరణం ఏర్పడింది. అధ్యక్ష తరహా పాలన సాగుతున్నదని విమర్శలు మొదలయ్యాయి. డిసెంబర్ 1973 నుండి మార్చ్ 74 వరకు గుజరాత్ లో జరిగిన ‘నవ నిర్మాన్’ ఉద్యమం ఇందిర పాలను వ్యతిరేకం గా ఎగిసిన తొలి నిరసనోద్యమం. అది దేశమంతా పాకే పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం గుజరాత్ అసెంబ్లీని రద్దు చేసింది. ఫలితంగా ముఖ్యమంత్రి చిమన్ భై పటేల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడే ఇందిరా గాంధీ తన ఎన్నికలో తీవ్రమయిన అక్రమాలకూ పాల్పడ్డారని నిర్ధారిస్తూ అలహాబాద్ హై కోర్టు ఆమె ఎన్నికను రద్దు చేసింది. రాజ్ నారాయణ్ చేతిలో ఆమె పరాభవాన్ని చవిచూసింది. అప్పటికే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ప్రజా నిరసన ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఏకీకరణ లాంటి పరిణామాల్ని గమనించిన ఇందిరా గాంధీ 25 జూన్ 1975 రోజున దేశంలో అంతర్గత కల్లోలం నెలకొందని  ‘అత్యవసర పరిస్థితి’ INTERNAL EMERGENCY  ని ప్రకటించారు. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ రాజ్యాగంలోని 352 అధికరణను ఉటంకిస్తూ ఆదేశాల్ని జారీ చేసారు. ఫలితంగా దేశంలో అన్ని ఎన్నికలూ, పౌరహక్కులూ రద్దయ్యాయి. ఇందిరను వ్యతిరేకించే లెక్క లేనంత మంది రాజకీయ నాయకులను జైళ్ళల్లో బంధించారు. సంజయ్ గాంధీ కనుచూపు మేరకు పాలన సాగడం మొదలయింది. బలవంతంగా నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లతో పాటు అనేక అక్రమాలు జరిగాయి. ఈ స్థితి 21 నెలలు సాగి 21 మార్చ్ 1977 రోజున ముగిసింది.

          ఇదంతా మేము డిగ్రీ చదువుతున్న కాలంలోనే జరిగింది. ఆ పరిణామాలన్నింటినీ రేడియోలో వింటూ పేపర్లల్లో చదువుతూ ఉండడమే కాని ప్రత్యక్షంగా నా అనుభవంలోకి రాలేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని స్థితి. కానీ తెలంగాణా పరిస్థితి వేరుగా వుండేది అప్పటికే 70 ప్రాంతంలోనే ఉత్తర తెలంగాణలో వామపక్ష తీవ్ర వాదం మొదలయింది. పల్లెల్లో ఒక చలనం. విద్యార్థుల్లో కూడా క్రమంగా ప్రగతిశీల భావనలూ ఉద్యమాలూ ఆరంభయ్యాయి. పీ.డీ.ఎస్.యు., ఆర్.ఎస్.యు. లాంటి సంస్థలు గొప్పగా పని చేయడం మొదలెట్టాయి.

          ఈ నేపధ్యంలో మా ఇంటర్ డిగ్రీ చదువులు సాగాయి. విద్యార్థి ఉద్యమాల పట్ల అభిమానం, కొంత ఆరాధనా భావం వుండేది. కానీ ప్రధానంగా సాహిత్యం మమ్మల్ని కట్టి పడేసింది. కవిత్వంలో శ్రీ శ్రీ, వచనంలో చలం (దాదాపు అన్ని నవలలు,కథలు, మ్యూసింగ్స్..), రావి శాస్త్రి(అల్పజీవి), కొడవటిగంటి కుటుంబ రావు, గోపీచంద్ (అసమర్థుని  జీవయాత్ర..),బుచ్చి బాబు(చివరకు మిగిలేది..) లాంటి వారి ప్రభావంలో కొట్టుకు పోతున్న కాలమది. అప్పటికి నా చుట్టూ జరుగుతున్న అన్ని ప్రగతిశీలమయిన ఉద్యమాల సోయి ఉండింది. కానీ విద్యార్థి దశలో నాకు ముఖ్యంగా కరీంనగర్ లాంటి పట్టణ జీవితమే తెలిసి వుండడం, మధ్యతరగతి ఆర్ధిక స్థితిలో కొట్టు మిట్టాడుతూ వుండడం వల్ల ఉద్యమాలతో మమేకం కాలేక పోయానేమో అనిపిస్తుంది. దానికి తోడు మాటకు సంబంధించి ఒక న్యూనతాభావం ఎప్పుడూ తొలుస్తూనే వుండేది.

***

          నా కాలేజీ రోజుల్లో మా తరాన్ని సాహిత్యం సినిమాలతో పాటు ఎంగేజ్ చేసిన మరో అంశం క్రికెట్. వాస్తవానికి మా స్కూలు కాలంలో గంజ్ స్కూలుకు ఆట స్థలమే వుండేది కాదు. ఫలితంగా మా బాచికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తో పెద్దగా పరిచయం లేదు. ఎలాంటి ఫీల్డ్ గేమ్స్ లేకుండానే స్కూలు కాలం గడిచింది. కరీంనగర్ లో అప్పటికి కేవలం మల్టీ పర్పస్ స్కూల్ గ్రౌండ్, పోలీసు పరేడ్ గ్రౌండ్, ఎస్.ఆర్.ఆర్. కాలేజీ గ్రౌండ్ మాత్రమే ఉండేవి. పోలిస్ గ్రౌండ్ కేవలం పోలీసులకు ఉపయోగపడేది. కాదంటే ప్రతి స్వాతంత్ర గణ తంత్ర దినోత్సవ పరేడ్ లకు అందరినీ అనుమతించే వారు. ఆ స్థితిలో ప్రత్యేక ఆసక్తి వున్న వాళ్లకు తప్ప ఆ కాలంలో అందని ద్రాక్షలే.

          కానీ, మా ఇంట్లోనూ వెంకటేష్, దామోదర్ ఇండ్లల్లో అప్పటికి రేడియోలు లేదా ట్రాన్సిస్టర్లు వచ్చాయి. నేనయితే బినాకా, పురానీ ఫైల్మొంకా ఫాన్. దానికి పాదులు వేసింది మా నాన్నే. తానే నాకు ఇంకో అంశం కూడా పరిచయం చేసాడు. అది క్రికెట్ కామెంటరీ వినడం. వింటూ వుండడం వల్ల ఇంగ్లిష్ హిందీ మాట్లాడే సరళి (ఆక్సేంట్) తెలుస్తుందని ఆయన భావన. దాంతో పాటు పిల్లలు ఇతర అలవాట్లకులోను కారని కూడా కావచ్చు. అప్పటికింకా టీవీ మన దేశానికి రాలేదు. 1982 ఏసియాడ్ గేమ్స్ తర్వాత దేశంలో టీవీ పాపులర్ అయింది.  నేను చెవులు విప్పి రేడియో కామెంటరీ వినే కాలానికి భారతీయ క్రికెట్ లో మన్సూర్ అలీఖాన్ పటౌడీ, దిలీప్ సర్ దేశాయి, చందు బోర్డే  లాంటి వాళ్ళ కాలం ముగిసింది. అజిత్ వాడేకర్ కాలమది. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు స్పిన్ బౌలింగ్ లో భారత్ ది ప్రత్యేక స్థానం. అందుకు నలుగురు స్పిన్నర్లు బాధ్యత వహించే వారు. వారు బిషన్ సింగ్ బెది, బి.ఎస్.చంద్రశేఖర్, ఎరపెల్లి ప్రసన్న, ఎస్.వెంకట రాఘవన్. ఇక బాటింగ్ వరకు వచ్చేసరికి సునీల్ గవాస్కర్ యుగం అప్పుడే ఆరంభ మయింది. వాడేకర్, గవాస్కర్, సోల్కర్, గుండప్ప విశ్వనాథ్ ల ధమాకా కాలమది. వాడేకర్ నాయకత్వంలో అప్పుడే వెస్ట్ ఇండీస్ సిరీస్ గెలిచారు మన వాళ్ళు. గమ్మత్తేమి టంటే నాకు క్రికెట్ ఆడకుండానే కనీసం ఫీల్డు చూడకుండానే లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, గల్లి, స్లిప్, పాయింట్, సిల్లీ పాయింట్ లాంటి స్థానాలు తెలిసేవి. సింగల్ రన్, ఫోర్, సిక్సర్ లు తెలిసాయి. దానికి ప్రధాన కారణం అప్పటి రేడియో కామెంటేటర్లు. వారి మాటల్లో బంతితో పాటు పరుగెత్తే అద్భుత వేగం, భాషలో స్పష్టత ఉండేవి. వాటితో పాటు ఫీల్డుకు సంబంధించి రికార్డులకు సంబంధించి అనేక వివరాలు చిటికెలో చెప్పేవారు. అప్పటి రేడియో వ్యాఖ్యాతల్లో నరోత్తం పూరి, సురేష్ సరయ్యా, రవి చతుర్వేది, సుషీల్ దోషి, బాలు అలగాన్నాన్, ఆనంద్ రావు ఇట్లా పలువురు తమ రన్నింగ్ కామెంటరీలతో పరుగులు పెట్టించేవారు. మొదట్లో ఇంగ్లీష్ హిందీల్లో వారి వేగాన్ని అందుకోవడం కష్టంగానే వుండేది కాని మనసు పెట్టి క్రమంగా వింటూ వుండడంతో వారి వేగాన్ని అందుకోవడం అలవా టయింది. భారతీయ క్రికెట్ ఆట గాళ్ళతో పాటు విదేశీ ఆట గాళ్ళ పరిచయం వారి ఆట తీరు కూడా పరిచయం అయింది. టోని బ్లేయర్ లాంటి పేర్లూ తెలిసాయి.

          ఇక ఆట విషయానికి వస్తే కరీంనగర్ లో ప్రసాద్, పిన్నింటి అశోక్ లాంటి వాళ్ళు ఆడేవాళ్ళు. వేములవాడ మిత్రుల విషయానికి వస్తే మంగారి శివ ప్రసాద్, ఉపాధ్యాయుల సాంబశివుడు లాంటి దగ్గరి మిత్రులు సెలవుల్లో కొంచెం సీరియస్ గానే స్కూలు గ్రౌండ్ లో ఆడేవాళ్ళు. నేను, జింబో, పి.ఎస్.రవీంద్ర మొదలయిన వాళ్ళం సాహితీ సాంస్కృతిక అంశాల పట్ల ఆసక్తిగా వుండేవాళ్ళం.

***

          అట్లా మా చిన్నప్పుడే అంటే స్కూలు కాలేజీ కాలంలోనే రేడియో మా జీవితాల్లో ప్రధాన భూమికను పోషించింది. మరీ చిన్నప్పుడు బాలానందం బాలవినోదం కొంత ఆసక్తిని కలిగించింది. తర్వాతి కాలంలో సంగీతం హిందీ పాటలు, క్రికెట్ లతో పాటు రేడియో నాటికలూ వినేవాళ్ళం. ఇంకా ముఖ్యంగా ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ‘సంక్షిప్త శబ్దచిత్రం’ లో ఎన్ని సినిమాల్ని విన్నామో. ఇక తర్వాతి కాలంలో నేను బాగా ప్రభావితం అయిన కార్యక్రమం ‘నవలా స్రవంతి’. అందులోనే చివరకు మిగిలేది, ఏకవీర, కాలాతీత వ్యక్తులు లాంటి నవలల్ని విన్నాను. గొప్ప గొంతుకలు అంతే గొప్ప వాయిస్ కల్చర్ తో ఆ నవలల్ని చదివిన తీరు అద్భుతం. అట్లా చదువుల కాలంలో నన్ను ప్రభావితం చేసిన రేడియో అంటే ఇప్పటికీ నాకు వల్లమాలిన అభిమానం. 

***

కరీంనగర్ – కాలేజీ చదువులు-అనుభవాలు- ఒడిదొడుకులు

          జీవితంలో చదువులన్నాక ఎన్నో ఒడిదొడుకులు. మరెన్నో అనుభవాలు. విజయాలూ ఓటములూ. అందులోనూ నాలుగు అయిదు దశాబ్దాల క్రితం చదువుల సంగతి చెప్పనే అక్కరలేదు. ఇప్పటి ఆధునికత లేదు, సాంకేతికత తెలీదు. అంతా రొడ్డ కొట్టుడు వ్యవహారం. నోట్స్, మంచి రాత కోసం చూచి రాతలు రాస్తే, పరీక్షల్లో చూచి రాతలనే నఖలు కొట్టుడు అనే వాళ్ళు. అదంతా 70-80 దశాకాల్లోని మాట. అప్పుడు మాది ఇంటర్ డిగ్రీ కాలం. అప్పటి సంఘటనల్ని ఇప్పుడు ఆలోచిస్తే చిత్రంగానూ, ఒకింత ఆశ్చర్యంగానూ అనిపిస్తాయి.

***

          నాకు మొదటి నుంచీ బడే ప్రపంచం. ప్రైవేట్ ట్యూషన్ లు అలవాటు లేదు. మా నాన్న తన నాలుగు దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తి కాలంలో ఏ ఒక్క రోజూ ట్యూషన్ చెప్పలేదు. తను చెప్పక పోగా ఆ అలవాటుని నిరసించేవారు. క్లాసులో బాగా చెబితే, పిల్లలు బాగా శ్రద్ధగా వింటే ట్యూషన్ అవసరమే లేదని ఆయన అభిప్రాయం. ఎప్పుడయినా ఎవరికయినా సబ్జెక్ట్ లో అనుమానాలుంటే ఇంటికి వచ్చిన వారికి తీర్చే వారు. అదే సూత్రం నాకూ వర్తింప జేశారు. హై స్కూలు పూర్తి అయ్యే వరకు నో ట్యూషన్. మా దామోదర్, ప్రకాష్ లాంటి  ఇతర మిత్రులు గంజ్ స్కూల్లో కంపోసిట్ లెక్కలకు, సైన్సు కు ట్యూషన్ వెళ్ళారు. నేనేమో నాకు నేనుగా చదువుకోవడమే. దానివల్ల స్వతంత్రంగా చదువుకోవడమే అలవాటయ్యింది. కాని ఇంటర్ చదువుకు వచ్చే సరికి ఫిజికల్ సైన్స్ ఇబ్బంది వుండేది కాదు. జీవ శాస్త్రంలోనే కొంత ఇబ్బంది. జంతు శాస్త్రంలో ‘కప్ప’ (FROG) ప్రత్యేకంగా వుండేది. అది చెప్పేవాళ్ళు లేక సిలబస్ పూర్తి కాదేమోనని కొంత ఇబ్బందిగా వుండేది. ఆ స్థితిలో ఎస్.అర్.ఆర్.కాలేజీ అధ్యాపకుడు శ్రీ నాగ భూషణం సార్ కప్ప ట్యూషన్ చెబుతారని తెలిసి నేను వెళ్తానని నాన్నకు చెప్పాను. ఏ మూడులో వున్నారో తెలీదు కానీ వెళ్ళమన్నారు. ముఖరంపురాలో సార్ ఇల్లు.ఉదయం ఆరింటికో ఏమో క్లాస్ అని చెప్పారు. నేను వెళ్ళడం ఆరంభించాను. చలి కాలం. విపరీత మయిన చలిలో గడియారం కాడి నుంచి వెళ్ళాలి. నాన్న అది గమనించి ఉదయమే టీ కి డబ్బులు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో బస్ స్టాండ్ రోడ్డులో వున్న ‘గ్రాండ్ హోటల్’ అంటే టీ బిస్కిట్లకు ఫేమస్. ఉదయమే చలిలో గ్రాండ్ దగ్గర ఆగి టీ తాగి ట్యూషన్ వెళ్ళడం గొప్ప అనుభవం. ఎంతో పెద్ద వాళ్ళం అయిపోయినట్టు అనిపించేది. ట్యూషన్ కంటే గ్రాండ్ హోటల్ చాయ్ ఎంతో మధురంగా వుండేది. దేనికదే చెప్పుకుంటే సార్ బాగాచెప్పేవారు. అట్లా గ్రాండ్ నా మదిలో ఇప్పటికీ ఫ్రెష్ గా వుంది. దాంతో పాటు కరీంనగర్ లో ఇంకో పాపులర్ ఇరానీ హోటల్ ‘ఆల్ఫా హోటల్’’. అది క్లాక్ టవర్ నుంచి కార్ఖానగడ్డకు వెళ్ళే దారిలో వుండేది. దానికి రెండు పక్కల రెండు టేలాలు ఉండేవి. ఓకటి పాన్ సోడాలు అమ్మే తంబు టేలా. అప్పట్లో వీధి కొట్లాటలకు తంబు బాగా పాపులర్. ఇక మరో వైపు వున్న టేలా జనరల్ స్టోరు. దాన్ని ఇద్దరు అన్నదమ్ములు నడిపేవారు. ఒకరు న్యాలకొండ బాస్కర్ రావు, మరొకరు ప్రభాకర్ రావు. అక్కడ ప్రతి సాయంత్రం మా పెద్దన్నయ్య మోహన్, పెద్దబావ ఆదిరెడ్డి తదితరుల సిట్టింగ్ కు అది అడ్డాగా వుండేది. అట్లా మిత్రులు గా వుండి ఆ యిద్దరు అన్నదమ్ములకు మా ఇంటి అమ్మాయిలనే ఇచ్చి పెళ్లి చేసారు. అందులో మా మేనవదిన నాగమణిని భాస్కర్ రావు గారికి, ఉమక్కను ప్రభాకర్ రావు గారికి ఇచ్చారు. ప్రభాకర్ రావు తర్వాత ఆబ్కారీ శాఖలో ఇన్స్పెక్టర్ అయ్యారు. చిత్రంగా ఆల్ఫా హోటల్ వుండిన మూల అయిదు దారుల క్రాసింగ్. మామూలుగా ఎక్కడయినా నాలుగు దారుల కలయికతో ‘చౌరాస్తా’ అని పిలుస్తాం. కానీ ఆల్ఫా మాత్రం అయిదు దారుల కలయిక. ఒక దారి గడియారం వైపునకు వుంటే, రెండోది స్టేట్ బాంక్ వైపు, మూడోది సివిల్ ఆసుపత్రి వైపు, నాలుగోది కార్ఖానాగడ్డ వైపు, అయిదోది అస్లాం మస్జిద్ అండ్ కాపువాడ వైపు వుంటాయి. ఇప్పుడది ఎంతో బిజీగా వుండే ప్రాంతం. ఆల్ఫా హోటల్ లేదు కాని మధ్యలో రాజీవ్ బొమ్మ పెట్టి రాజీవ్ చౌక్ అని పిలుస్తున్నారు. హోటళ్ళ విషయం వచ్చింది కనుక అప్పుడు కరీంనగర్ లో ప్రధానంగా మూడు ఉడిపి హోటళ్ళు ఉండేవి. ఇంకోటి గంజ్ స్కూలు పక్కన వుండే శివరాం హోటల్ గా పాపులర్ అయిన సత్యనారాయణ భవన్, రెండోది ఆఫీస్ రోడ్డులో వున్న ఉడిపి హోటల్, దానికి కొంచెం పక్కన వెల్కం హోటల్ ఉండేవి. వాటిల్లో ఇప్పటిలాగే ఇడ్లి, వడ, దోశ పాపులర్. వీటికి తోడు రెండో మూడో మిలిటరీ హోటల్లు వున్నట్టు గుర్తు. అందులో ఒకటి ప్యాట బాల రెడ్డి తాత వాళ్ళ ‘రాజ్ మహల్ హోటల్’. అది ఆఫీస్ రోడ్డులోనే మొదటి అంతస్తులోవుండేది. బాలరెడ్డి తాత మా నాయనమ్మ సత్యమ్మను అక్క అని పిలవడమే కాకుండా తన పెద్ద కూతురు ఊర్మిళను మా పెదనాన్న సత్యనారాయణకు ఇచ్చి చేసారు. ఇక తన రెండవ కూతురు సులోచనను మా మేనమామ జనార్ధన్ గారికి ఇచ్చి పెళ్లి చేసారు. అట్లా రాజ్ మహల్ హోటల్ మా దగ్గరి వాళ్ళదే. ఇక మరోటి గడియారం దగ్గర వున్న ‘విజయ లక్ష్మి’ మిలిటరీ హోటల్. తర్వాతి కొంత కాలానికి ఆల్ఫా హోటల్ ముందు ‘ఉమా హోటల్’ అని మరొకటి ఆరంభమయింది.  ఇదీ ఇప్పటికీ నాకు గుర్తున్న అప్పటి కరీంనగర్ హోటళ్ళ వివరాలు.

          ఇక నా ట్యూషన్ విషయానికి వస్తే బాగానే జరిగింది. వార్షిక పరీక్షల్లో దాని ఫలితం కనిపించింది.         

          ఇక 74లో ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీలో చేరేనాటికి మొదట కొంత కాలం మెడికల్ వ్యామోహం వుండేది అది ముగిసిన తర్వాత డిగ్రీ చదువు మీద కొంత ఆసక్తి పెరిగింది. ఫోకస్ మొదలయింది. బాటనీ, జువాలజీలకు ట్యూషన్ అవసరం లేదు కానీ కెమిస్ట్రికి మాత్రం తప్పదనే భావన అందరిలో వుండేది. రసాయన శాస్త్రంలో భౌతిక రసాయన శాస్త్రం, కర్బన రాసాయన శాస్త్రం, ఇనార్గానిక్ కెమిస్ట్రీ లుండేవి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ ని కృష్ణమోహన్, జివిజి, సార్లు బాగా వేగంగా చెప్పెవారు. ఫిజికల్ రామానుజం గారు చెప్పేవారు. ఆర్గానిక్ కు వచ్చేసరికి కొంత ఇబ్బందిగా ఉండడంతో ట్యూషన్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం వాళ్లకు చెప్పే ఖయ్యుం సార్  వద్దకు వెళ్లాం. సబ్జెక్ట్ మొత్తం అరటి పండు వొలిచినట్టు చెప్పారు. సబ్జెక్ట్ తో పాటు ఆయన చెప్పిన జీవన విలువలు అలవాట్లు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ‘ఒక పని చేస్తూ అలిసిపోతే, అది మానేసి ఇంకోటి చేయాలి తప్ప అలసిపోయామని కాళ్ళు చేతులు చాపి కూర్చోవద్దని ఆయన అనేవారు’ అదిప్పటికీ గుర్తుంది. ట్యూషన్ ఫలితం డిగ్రీ ఫైనల్ లో గొప్పగా చూపిందనే చెప్పాలి.

          ఇట్లా నా చదువులు ట్యూషన్ లు సాగుతూ వుంటే వేములవాడలో నా మిత్రుల స్థితి భిన్నంగా వుండేది. 72- 74 నాటికి వేములవాడలో జూనియర్ కాలేజీలేదు. ఇంటర్ చదవా లనుకునే వాళ్ళంతా సిరిసిల్లా వెళ్లి చదవాల్సిందే. అందుకే మిత్రులు పి.ఎస్.రవీంద్ర, మంగారి శివప్రసాద్, కిరణ్ కుమార్ తదితరులంతా సిరిసిల్ల కాలేజీలో చేరారు. అప్పటికి దాదాపు అన్ని ఊర్లల్లో నఖలు నడుస్తూ వుండేది. కానీ సిరిసిల్లాలో అప్పుడు టం టం నర్సయ్య అనే ప్రిన్సిపాల్ ఉండేవాడు. అక్కడ మాస్ కాపీ జరిగేది. అది తెలిసి ఆంధ్రా నుంచి కూడా విద్యార్థులు సిరిసిల్లా కాలేజీలో పరీక్షలకు కూర్చునే వారు. 75 లో దేశం లో అత్యవసర పరిస్థితి. సిరిసిల్లా విషయం ఇంటర్ బోర్డుకు చేరింది. దాంతో ప్రత్యేక టీం ను స్క్వాడ్ గా వేసారు. బస్తాల కొద్దీ దొరికిన చిట్టీలు, గైడ్స్ చూసి బోర్డు ఆ ఏటి వార్షిక పరీక్షల్ని రద్దు చేసింది. తర్వాత సెంటర్ సిద్దిపేటకు మార్చారు. దాంతో విద్యార్థులందరి చదువులు అటకెక్కాయి. దాని ఫలితం మా మిత్రులందరి మీదా పడింది. సాంబశివుడు, రమేష్, రమేష్ చంద్ర లాంటి వాళ్ళు బయట పడ్డారు. శివప్రసాద్ పాలిటెక్నిక్ కు వెళ్ళాడు. వారంతా అతలా కుతల మయిపోయారు. భిన్న దారుల్ని ఎంచుకున్నారు. కొందరు కామారెడ్డి కాలేజీకి, మరికొందరు కరీంనగర్ కి, ఇంకొందరు హైదరాబాద్ కి వెళ్ళగా ఇంకొందరు బయట పడలేక చదువులు పోస్ట్ పోన్ చేసుకుని వేర్వేరు వృత్తుల్లో చేరిపోయారు. ఒక కాలేజీ వ్యవస్థలో జరిగిన తప్పు వలన ఎంతో మంది విద్యార్థుల జీవితాలు ప్రభావితం అయ్యాయి. మరిక సామాజికవ్యవస్థలో జరిగే పొరపాట్ల వళ్ళ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. 1969 తొలి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నేపథ్యంలో వార్షిక పరీక్షలు లేకుండానే పాస్ అయిన ప్రభావం నుండి కోలుకోక ముందే మా వేములవాడ మిత్రుల చదువుల మీద సెంటర్ రద్దు ప్రభావం తీవ్రంగా పడింది.

          ఆ తీరిక కాలం సాహితీ సాంస్కృతిక రంగం వైపు అందరినీ మరలించింది. అది ఒక రకంగా మంచే జరిగిందేమో…

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.