నారి సారించిన నవల-42

కె. రామలక్ష్మి – 2

                      -కాత్యాయనీ విద్మహే

          గత సంచికలో రామలక్ష్మిగారి  లభ్య నవలలో 1967 లో వచ్చిన  ‘ఆడది’ మొదటి నవల అని చెప్పుకొన్నాం. కానీ అప్పటికి లభించని ‘మెరుపు తీగ’ నవల ఇప్పుడు లభించింది. అది  1960 నవంబర్ లో యం. శేషాచలం అండ్ కంపెనీ ప్రచురించినది. అందువల్ల ఇప్పటికి అది మొదటి నవల. అంతే కాదు అప్పుడు లభించని నవలలు కొన్ని ఇప్పుడు లభించటమే కాదు, అసలప్పటికి ఉన్నాయని కూడా తెలియని రామలక్ష్మి మరికొన్ని నవలలు దొరికాయి. ఈ కొత్త సమాచారంతో కలిపి చూస్తే రామలక్ష్మి నవలలు లభిస్తున్నవి 30. వాటిలో 1960వ దశకపు నవలలు ఆరు. 1970వ దశకపు నవలలు ఎనిమిది. 1980వ దశకపు నవలలు ఆరు. 90వ దశకంలో రెండు ఉన్నాయి. 2000 లలో వచ్చినవి ఆరు. మరొక రెండు నవలలు ప్రచురణ కాలం లభించటం లేదు. అయిదు నవలలు అలభ్యాలు. ఇవికాక రెండు అనువాద నవలలలో ఒకటి లభ్యం. ఇదీ ప్రస్తుతపు అంచనా. దశకాల వారీగా నవలలను పరిశీలిస్తే వస్తువులో గానీ దృక్పథంలో గానీ వచ్చిన పరిణామాన్ని గురించిన ఒక అవగాహన కలుగుతుంది. 

          1960 లోనే రామలక్ష్మి ఒంటరి స్త్రీల జీవితాలను కేంద్రంగా చేసుకొని  ‘మెరుపు తీగ’ నవల వ్రాయటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. నలభై దాటుతున్న వితంతువు రామాబాయమ్మ, అనాధాశ్రమంలో పెరిగి టీచర్ గా పనిచేస్తున్న లలిత ఆ విధమైన స్త్రీలకు ప్రతినిధులు. రామాబాయమ్మ భర్త తన పేరు మీద పెట్టి పోయిన భూములను, ఆస్తులను మరిది జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్వహించుకొంటూ నిలబెట్టుకొనటం ఒక ఎత్తయితే, భర్త వల్ల నిర్లక్ష్యానికి గురై బిడ్డతో ఒంటరిగా వున్న మరదలు చనిపోతూ చేతిలో పెట్టిన సీత బాధ్యత తీసుకొని పెంచటం మరొక ఎత్తు. తన ఆస్తికి ఆ అమ్మాయే హక్కుదారవుతుందని గ్రహించి అది చేయిదాటి పోకుండా ఉండాలని సీత తన కోడలని మరిది, తోడికోడలు చేస్తున్న ప్రచారాలను గమనిస్తూనే, తరచు ఇంటికి రాకపోకలు సాగిస్తున్న మేనల్లుడిని కాదు అననట్లుగా ఉంటూనే ఆ సంబంధం ఎట్టి పరిస్థితులలోను సీతకు చెయ్యకూడదని, తద్వారా తన మీద, తన ఆస్తిపాస్తుల మీదా మరిదికి పెత్తనం ఇయ్యకూడదని స్థిరనిర్ణయంతో ఉండటం, సమయం వచ్చినప్పుడు చెప్పగలగడం   ఆమె వ్యక్తిత్వంలోని మరొక విలువ. 

          లలిత సీత తండ్రి చేసుకొన్న రెండవ పెళ్లి భార్యకు పుట్టిన బిడ్డ. తండ్రి చేసుకొన్న రెండవ పెళ్లి వలన ఒంటరి అయిన తల్లి మరణించినా సీతకు మేనత్త అండ లభించింది. లలితకు తల్లి మరణిస్తే తండ్రి ఆమెను ఆనాధశరణాయలయంలో పెట్టాడు. నా అన్న వాళ్ళ ఆప్యాయత అనురాగం కరువైన ఒంటరి జీవితంలో ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ రామాబాయమ్మ మేనల్లుడు రామేశం మాయలోపడిమృత్యువు సరిహద్దు వరకు వెళ్లి వచ్చిన స్త్రీ ఆమె. ఈ నవలలో మెరుపు తీగ ఆమే. పతికి సీతకు మధ్య అపార్ధాలకు , అవి తొలగటానికి కూడా తానే కారణమై వాళ్లిద్దరూ దగ్గరయ్యాక నిష్క్రమించిన పాత్ర లలిత. మెరుపు వస్తుంది. పోతుంది. నిలిచేది కాదు. 

          ఊళ్లోకి వైద్యుడుగా వచ్చిన పతికి సీతకు మధ్య ఒకరిపట్ల ఒకరికి కలిగిన ఇష్టం, దానికి రామాబాయమ్మ ఆమోదం ,అది గిట్టని ఆమె మరిది సోమయాజులు కరణం మునుసబులతో కలిసి చేసిన కుట్రల ఫలితంగా పక్క వూరికి డాక్టర్ బదిలీ, అక్కడ లలిత పరిచయం సంగతి తెలిసి సీత ఆమె ఆకర్షణలో అతను తనను మరిచాడని, అపార్ధం చేసుకొని జబ్బు పడటం, ఆ ఉక్రోషంలో మేనత్త ఎవరిని తనకు మొదటి నుండి భర్త కాకూడదనుకొన్నదో, తనకు ఎవరి మీద మొదటి నుండీ తేలిక భావమే ఉందో ఆ రామేశాన్ని పెళ్లి చేసుకొనటానికి సిద్ధపడింది. డాక్టర్ తనవాడు కానప్పుడు ఆ జీవితం ఏమయితే ఏమన్న ఒకరకమైన విరక్తి తో , కసితో తీసుకొన్న నిర్ణయం అది. అపార్ధాలు తొలిగి ఆమె అతను దగ్గర కావటంతో నవల ముగుస్తుంది. 

          1960లో మెరుపుతీగ నవల వస్తే మళ్ళీ ఏడేళ్ల వరకు రామలక్ష్మి నవలలు కనబడవు. ఆడది నవల 1967-1968 లో వచ్చింది. ఆడది నవలలో రామలక్ష్మి పుట్టింటి నిర్లక్ష్యానికి, అత్తింటి తిరస్కృతికి గురై  దైన్యంలోకి , హైన్యంలోకి దిగజారే స్త్రీల జీవితంతో పాటు, చదువుకొని మంచి జీవన వృత్తులలో వుండి అంకితభావంతో, సమర్ధవంతంగా వృత్తి బాధ్యతలను నిర్వహించే స్త్రీల చైతన్యవంతమైన జీవితాన్ని కూడా చిత్రించింది. వాళ్ళు ఆర్ధికంగా స్వతంత్రులు. ఇంకా పెళ్లిళ్లు చేసుకోలేదు కనుక ఎవరి పెత్తనము లేని స్వేఛ్ఛా జీవులు. ఆధునిక యువతులు. చదువులు, ఉద్యోగాలు స్త్రీలకు స్వతంత్ర జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఇస్తాయని, అవే దైన్యంలో ఉన్న స్త్రీల పట్ల స్పందించి, వాళ్ళ పక్షాన నిలబడి పనిచేయగలిగిన సంసిద్ధతను ఇస్తాయని, అది స్త్రీలు తోటి స్త్రీలను సానుభూతి తో అర్ధంచేసుకొని అండగా నిలబడే సహోదరీత్వ సంస్కృతి అభివృద్ధికి దారి తీస్తుందని ఈ నవల ద్వారా సూచించింది రామలక్ష్మి. 

          హృదయం చిగిర్చింది నవల 1968 ఏప్రిల్ , మే నెలలలో ఆంధ్రపత్రికలో సీరియల్ గా వచ్చింది. 1978 జనవరిలో నవభారత్ బుక్ హౌస్ ప్రచురించిన రామలక్ష్మి నవల దారి తప్పిన తండ్రి నవలతో పాటు ఇది కూడా ప్రచురించబడింది. వితంతు సమస్య వస్తువు గా వచ్చిన నవల ఇది. పదహారేళ్ళకు పెళ్లయి, పద్దెనిమిది ఏళ్లకు తల్లి అయి, తల్లి ఆయేనాటికే భర్తను కోల్పోయిన స్త్రీకి బిడ్డను పెంచుకొంటూ నిస్సారమైన జీవితం గడిపెయ్యటమేనా నూరేళ్ళ జీవిత లక్ష్యం? అనే ప్రశ్న కేంద్రంగా ఈ నవలలో ఇతివృత్తం అభివృద్ధి చేయబడింది. చదువు కొనసాగిస్తే ఆ తరువాత ఏమి చెయ్యాలో ఆలోచించు కోవచ్చు అని ఇంట్లో వాళ్ళు చేసిన ప్రోద్బలంతో రమ కాలేజీలో చేరటంతో నవలలో కథ మొదలవుతుంది. ఆమె జీవితంలో ఏదో విషాదం ఉందన్న సూచన అందుతూ అంచ లంచెలుగా ఆమె ఒకబిడ్డ తల్లి అయిన వితంతువు అన్న వాస్తవం కథనం చేయబడు తుంది. కాలేజీలో తెలుగు లెక్చరర్ రామారావు రమను ఇష్టపడటం, రమ అతనిని తప్పించుకొనటానికి ప్రయత్నించటం ఆ క్రమంలో ఆమె పడిన వేదన హింస కొన్ని కీలకమైన ప్రశ్నలను ముందుకు తెస్తాయి. ఇరవైఏళ్ల వయసుకు సహజమైన ఆకర్షణలు, వాంఛలు. హృదయం రామారావు ప్రేమను కోరుతుంటాయి. పెళ్లయి భర్తను కోల్పోయిన స్త్రీగా  , ఒకబిడ్డకు తల్లిగా తనకు అందుకు అర్హత లేదనే న్యూన భావం, వేదన, అందుకు అవకాశం ఇయ్యగల సామాజిక సాంస్కృతిక వాతావరణం, సమ్మతి లేకపోవటంగురించిన దుఃఖం ఆమెను గొప్ప సంఘర్షణకు లోను చేస్తాయి. విషయం తెలిస్తే రామారావు ప్రేమ నిలుస్తుందా అన్నది లోలోపల ఆమెను తొలిచే సందేహం. అతను కాదంటే భరించలేను అన్నంత గాఢమైన ఉద్విగ్నతల మధ్య నలిగి పోయింది. 

          పెద్దలు కుదిర్చి చేసే పెళ్ళిళ్ళ నుండి ప్రేమించి పెళ్లి చేసుకొనటం వరకు ఆధునిక యువకులు ముందుకు వచ్చినా పెళ్లి చేసుకొనే స్త్రీ పవిత్రత గురించిన పట్టింపు వాళ్ళ సంస్కా రాలను వదలలేదు. రమకు తన హృదయం తెలియచేసి ఆమె మనసులో ఏముందో తెలుసుకొని చెప్పమని రమ రూమ్ మేట్ అయిన ఏ సరళతో చెప్పుకొన్నాడో, కాలేజీలో రమ కనబడక పోయేసరికి ఏ సరళను అడిగాడో ఆమె రమ పాపకు సుస్తీగా ఉందని వూరికి వెళ్లిందన్నసంగతి చెప్తే ఆ పాప రమ కూతురే అని తెలిసి ఆమెకు పెళ్లయిందా అని నిర్ఘాతపోయాడు రామారావు. నాకెందుకు చెప్పలేదు అంటూ సరళను రమతో కలిపి నిష్టూరమాడాడు. సరళ చెప్తున్న మాటలు వినకుండా వెళ్ళిపోయాడు. రెండు రోజులు అతను పడిన సంఘర్షణ, దాని నుండి పొందిన సమాధానం అతనిని నిజమైన సంస్కర్తగా మార్చింది. రమ వితంతువు, బిడ్డతల్లి అని తెలిసి రెండు రోజులు మతిపోయి తిరిగిన రామారావు రమ లేకుండా బతకలేనని తెలుసుకొని ఆమెను పెళ్లాడ టానికి నిర్ణయించుకొనటం అందులో తొలిఘట్టం. రెండవ ఘట్టం ఆమె పాపను తన పాపగా స్వీకరించటం. అది అంత సులభం కాలేదు కానీ సాధించాడు. 

          పెళ్లి అవటం ఒక ఎత్తు. ఆమె బిడ్డను తనబిడ్డగా స్వీకరించటం మరొక ఎత్తు. ఆ విషయంలో అతను సంసిద్ధుడయ్యే ఉన్నాడు. పెళ్లయి కాపురం మొదలయ్యాక రమ పాపను తెచ్చుకోవాలంటే అందులో అతనికి అభ్యంతర పెట్టవలసినది ఏమీ కనిపించ లేదు. పాపకు తండ్రి ప్రేమను అందించటానికే ప్రయత్నించాడు. అయితే పాపను తీసుకొని ఇద్దరూ బయటకు పోయినప్పుడు పరాయి బిడ్డకు తండ్రిగా తనను హేళన చేస్తున్నట్లు వినబడ్డ వ్యాఖ్యలను భరించటం అతనికి కష్టం అయింది. దానితో అతను మళ్ళీ సంఘర్షణలో పడిపోయాడు. పాపను మునుపటిలా దగ్గరకు తియ్యలేకపోయాడు. ప్రతి వెధవకూ బదులు చెప్పుకోలేను ..అని పాపను ఎవరికైనా పెంపకానికి ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందనుకొన్నాడు. తనతో పాటే పాప .. ఒకరే కావాలనుకొనటంకుదరదు అని రమ సమాధానం. ఇద్దరూ కావాలా వద్దా అన్నదొక్కటే అతను తేల్చుకోవాల్సిన విషయం అని ఖచ్చితంగా చెప్పింది. చివరకు అతను ఇద్దరూ కావాలన్న నిర్ణయానికి రావటం , కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించటానికి ఏర్పాట్లు చేసుకొనటంతో నవల ముగుస్తుంది. 

          రమ వంటి స్త్రీలకు భద్రత, స్నేహం పంచి నైతిక ధైర్యాన్ని ఇయ్యగల కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాల ప్రాధాన్యత ఈ నవలలో రమ బావ సుందరం , అతని భార్య జానకి, కాలేజీ స్నేహితురాలు సరళ మొదలైన వాళ్ళ ప్రవర్తనల ద్వారా సత్య సుందరంగా వ్యక్తం చేయబడింది. పునర్వివాహం అపరాధం కాదు హక్కు అని  ఆలోచించ గల  చైతన్య స్థాయి స్త్రీలలో అభివృద్ధి కావటం గురించిన ఆకాంక్ష రమ ముఖంగా ఎంత బలంగా వ్యక్తం అయిందో, వితంతు స్త్రీని పెళ్లాడటానికి , సంసారం సజావుగా సాగించటానికి సంస్కారాల స్థాయిని అభివృద్ధి పరచుకొనే సంసిద్ధత  పురుషు లలో ఎప్పటికప్పుడు బలం పుంజుకొనటం  గురించిన  ఆకాంక్ష రామారావు ముఖంగా అంత బలంగానూ వ్యక్తం అయింది ఈ నవలలో.   

          1968 డిసెంబర్ లో ఎం శేషాచలం & కో వారి ప్రచురణగా వచ్చిన నవలికలు చీకటిదారి , చిన్న వదిన. చీకటి దారి నవల ఒక జమిందారీ గ్రామం నుండి వచ్చిన భారతి కేంద్రంగా నడుస్తుంది. చిన్నప్పుడే తల్లి చనిపోయి చదువు ముగిసే సరికి తండ్రి కూడా చనిపోవటంతో ఆమె ఒక బోర్డింగ్ స్కూల్ లో ఉద్యోగంలో చేరింది. గొప్పింటి కుటుంబాల ఆడపిల్లలకు గొప్పింటి కోడళ్ళుగా గౌరవంగా, హుందాగా, అందంగా జీవితాన్ని మలచుకొనటానికి శిక్షణ ఇచ్చేదిగా ఉండాలని ఒక జమిందారిణి కట్టించిన బోర్డింగ్ స్కూల్ అది. ఎవరినో అనామకుడిని ప్రేమించి పెళ్లి చేసుకొంటానని హఠం చేస్తున్న భారతి ఊరి జమీందారు కూతురు శశి ఇలాంటి స్కూల్ లో ఉండటం వలన ప్రయోజనం ఏమైనా ఉంటుందేమొనని ఆమె తల్లి అన్న వచ్చి చేర్చి వెళ్లటంతో ఆమెను చూసుకొనే బాధ్యత అప్పచెప్పటంతో నవల కథలో కదలిక మొదలవుతుంది. మనుషు లలో మంచి చెడులను గుర్తించ గల వివేకం అభివృద్ధి చెందని జమీందారుల ఇంటి ఆడపిల్లల తొందరపాటు ప్రేమలు, మొండి తనాలు వాళ్ళను చీకటి దారులకు ఈడు స్తున్నాయని, వాళ్ళను కాపాడుకొనాలని చేసే ప్రయత్నాలు విఫలమై అకాలమరణాలకు కారణం అవుతున్నాయని ఇతివృత్త గమనం నిరూపిస్తుంది. శశి అన్న భారతిని ప్రేమించటం తల్లి ఆమోదంతో పెళ్లాడటం ఇందులో అవాంతర కథ.  

          1968-69 లలో ఆంధ్రపత్రికలో సీరియల్ గా వచ్చిన ‘ప్రేమించు ప్రేమకై’ నవల 1975 లో నవభారత్ బుక్ హౌస్ ప్రచురణగా పుస్తక రూపంలో వచ్చింది. ఈ నవల కూడా జమిందారీ స్థాయి సంపన్న కుటుంబ నేపథ్యంలో నడుస్తుంది. తల్లీ తండ్రీ చిన్నప్పుడే చనిపోతే మేనత్త పెంపకంలో పెరిగి చదువుకొని చిన్న ఉద్యోగం చేస్తున్నది లలిత.  మేనత్త పెంచి ప్రయోజకురాలిని చేసింది … ఇక తన బతుకు తాను బతకటమే అనుకొన్న లలిత మోహన్ ప్రేమలో పడటం, సినిమాలో పనిచేస్తూ  స్థిరమైన ఆదాయం లేక, వచ్చిన దానిని ఎప్పటికప్పుడు ఖర్చు చేసే  అతనికి చిన్న ఉద్యోగం ఏదైనా ఉంటే మేనత్తను పెళ్ళికి ఒప్పించవచ్చునన్నది లలిత ఆలోచన. ఆ మేనత్త  ద్వారా లలితకు వచ్చే  ఆస్తిపాస్తులు  ఏవీ లేవని తెలిసిన తరువాత మోహన్ ప్రేమ , పెళ్లి ప్రస్తావన వదిలేసి వీడ్కోలు చెప్పాడు. అదే సమయంలో మేనత్త మరణ వార్తతో పాటు ఆమె ఆస్తికి తానే వారసురాలు  అన్న విషయం తెలిసి మోహన్ తో తన జీవితం ఎలా ఉండేదా అని కాస్త ఆందోళన పడినా అంత వరకు రాలేదు కదా అని సమాధానపడింది. 

          మేనత్త ఆస్తితో పాటు మేనమామ ఆస్తి కూడా కలిసి వచ్చింది లలితకు. అతను ఆ ఆస్తుల వ్యవహారాలు తన స్నేహితుడు బలరామశాస్త్రికి అప్పగించి ఆమెకు గార్డియన్ గా నియమించి చనిపోయాడు. ఆ రకంగా మేనత్త మరణం తరువాత లాయర్ చేసిన ఏర్పాటు మేరకు లలిత ఆ గార్డియన్ రక్షణలోకి వెళ్ళవలసి వచ్చింది. మేనమామ కంటే రెండు మూడేళ్లు చిన్నవాడు, తనకన్నా ఇరవై ఏళ్ళు పెద్దవాడు అయిన బలరామశాస్త్రి పట్ల ఆమెకు, ఆమె పట్ల బలరామశాస్త్రికి మధ్య  ప్రేమ కలగటం, అది ఒకరికొకరు చెప్పుకోలేక ఎవరి కారణాల వల్ల వాళ్ళు వేదనకు గురికావటం జరిగింది. లలితకు తనకు ఉన్న వయో తారతమ్యాన్ని బట్టి తన ప్రేమ విషయం ప్రకటించలేని సంకోచంలో ఉన్న బలరాం మనసు మరింత పాడు చేయటానికి చేయవలసినదంతా చేసింది ఇంట్లోనే ఉండే అతని అత్త కూతురు సరళ. మోహన్ కు లలితకు ఉన్న పాతపరిచయాన్ని  వాడు కొంటూ ఆమె ఆడిన నాటకం సంగతి తెలిసి లలితను బలరాం దక్కించుకొనటంతో నవల ముగుస్తుంది. వాళ్ళ ప్రేమ వయసుని , ఆస్తులను బట్టి ఏర్పడింది కాదని నిరపేక్షం అని సూచించటానికి బలరాం భావగీతాలు పాడిన ఒక సందర్భాన్ని కల్పించింది రచయిత్రి. అతను పాడిన భావగీతం బసవరాజు అప్పారావుది. “ప్రేమించు సుఖముకై / ప్రేమించు ముక్తికై / ప్రేమించు  ప్రేమకై/ యే మింక వలయురా …. ” అన్న ముక్తాయింపు ద్వారా దానినే సూచించటం జరిగింది. 

          ఈ రెండు నవలలు ఈ జమిందారీ ఫాయిదా జీవితాలు సమకాలంతో, స్థలకాలాలతో సంబంధం లేనివిగా కనబడతాయి. 

          చిన్నవదిన నవల మధ్యతరగతి కుటుంబాలలోని ప్రేమలు, అహాలు, సర్దుబాట్లు మొదలైన వాటి చుట్టూ అల్లుకున్న ఇతివృత్తంతో సహజ కౌటుంబిక వాతావరణంలో ఆసక్తికర కథనంతో సాగిపోతుంది. తల్లి, తండ్రి ఇద్దరు అన్నల తరువాత ఆడపిల్ల శ్యామల. ఆమె దృష్టి కోణం నుండే ఈ నవల నడుస్తుంది. అందరి  ప్రవర్తనలకు పరిశీలకురాలు, వ్యాఖ్యాత కూడా ఆమె. చిన్నన్న పెళ్లితో మొదలై శ్యామల పెళ్లితో నవల ముగింపుకు వస్తుంది. సంసారాలు సంతోషంగా శాంతిగా సాగాలంటే మనుషులు సహన శాంత సానుకూల దృక్పథం పెంచుకోవలసి ఉంటుందని ఈ నవల చెప్తుంది. అందుకు అవరోధంగా ఉన్నది పెత్తనం మీద , ఆస్తి పాస్తుల మీద ఉన్న వ్యామోహం. అవి  సాటివాళ్ల పట్ల ఈర్ష్యాద్వేషాలుగా,  అనుమానాలుగా వ్యక్తం అవుతూ మానవసంబంధాలను చీదర చేసిపెడతాయి. తల్లి, పెద్దవదిన ఎప్పుడూ దేనికో ఒకదానికి ఘర్షణ పడుతూ వ్యతిరేక భావాలు కనబరుస్తూ ఒకరినొకరు దెప్పుకొంటూ, సాధించుకొంటూ అలా జీవితాన్ని చీదరగా చేసుకొంటుంటారు అని శ్యామల అవగాహన. తల్లి మరణంతో ఎమ్మె చదువు మధ్యలో ఆపేసి చిన్నన్న భార్యగా వచ్చిన లక్ష్మి వాళ్ళ కంటే భిన్నంగా , స్నేహ శీలిగా అర్ధం అయింది. చిన్న వదినగా ప్రేమ పాత్రురాలైంది. మనుషులను అర్ధం చేసుకొనటం, మార్దవంగా ప్రవర్తించటం ఇంట్లోకి ఆమె తెచ్చిన సంస్కారం. చిన్నన్న చిన్నవదిన పొలాలు చూసుకొంటూ వూళ్ళో వుండాలని నిర్ణయమైతే వాళ్ళతో పాటు పల్లెటూరు వచ్చిన శ్యామల ఆ వూళ్ళో డాక్టరు , కరణం కొడుకు అయిన మురహరిని ఇష్టపడి ఆ పెళ్లి జరిపించగల బాధ్యత చిన్నన్న చిన్న వదినలు మీద పెట్టి  కావాలనుకొన్నది సాధించు కొన్నది శ్యామల. 

          పెద్దలే పూనుకొని పెళ్లిళ్లు చేసే సంప్రదాయ కుటుంబ వ్యవస్థలో ఆడపిల్లల విషయంలో అందరూ పెత్తందారులే అవుతారు. పెద్ద వదిన తన తమ్ముడికి శ్యామలను ఇచ్చి చేస్తే బాగుంటుంది అనుకొన్నది. అది కాదన్నారని అందరినీ సాధిస్తుంటుంది. శ్యామల మురహరిని ఇష్టపడి పెళ్లి చేసుకొంటాననటం, ఆ  పెళ్లి విషయమై చెప్పి ఒప్పించటానికి లక్ష్మి రావటం ఇవన్నీ ఆమె దృష్టిలో సంప్రదాయం తప్పిన చేష్టలు. శ్యామలను వెనక్కు పిలిపించి తగిన సంబంధం చూసి చేస్తే సంప్రదాయం నిలబడ్డట్లు. కుటుంబ గౌరవం నిలబడ్డట్లు. శ్యామల మీద బాధ్యత తమకి కూడా ఉంది కనుక  సంబంధానికి భర్తను … ఒప్పుకోనివ్వను అన్న పంతం ఆమెది. ఆమె అభిప్రాయానికి అనుగుణంగా అన్నట్లు పెద్దన్న కూడా లక్ష్మి చొరవను నిరసిస్తూ శ్యామల తన వరుడిని తానే నిర్ణయించుకొనటం అప్రతిష్ఠ పనిగానే భావించాడు. నాలుగు తన్ని శ్యామలను లాక్కొచ్చి రెండు నెలల్లో ఇంకో సంబంధం చూసి చేస్తానని వీరంగం వేసాడు. సంప్రదాయ పరంగా చూసినా శ్యామల ఎంచుకొన్న వరుడి కులం, చదువు, సామాజిక హోదా ఇవన్నీఅభ్యంతర పెట్టవలసినవి కాకపోయినా అలా స్పందించటంలో తమ తమ పెద్దరికాలను నిలబెట్టుకొనాలనే తాపత్రయమే ప్రధానమైనది. 

          లక్ష్మి ఆ సమస్యను అర్ధం చేసుకొన్న తీరు వేరు. శ్యామల నోట ఆ మాటవిన్న మరుక్షణం ఆమె ఉద్రేక పడలేదు. నీ ఇష్టం వచ్చిన వాడిని చేసుకొంటానంటే పెద్దలు ఏమంటారో ఆలోచించాలన్నది. అయినా సరే నీ విషయం మీ అన్నతో మాట్లాడతానని హామీ ఇచ్చింది. పిల్లవాడి తండ్రిని అడిగి ఆయన సుముఖంగా వున్నాడు కనుక ఇక శ్యామల తల్లిదండ్రులను ఒప్పించటానికి వెళ్ళింది. గౌరవానికి భంగకరంగా శ్యామల ప్రవర్తించలేదని వాళ్లకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. తానొక నిర్ణయానికి వచ్చాక శ్యామల ఆ విషయాన్ని తనకు చెప్పటం బాధ్యతతో ప్రవర్తించినట్లు భావించింది. శ్యామల చేసిన మోసం ఏదీ లేదని నమ్మింది. అదే వాళ్లకు చెప్పింది మన గౌరవం మంట కలిపింది అనుకొనటం సరైంది కాదని చెప్పింది. శ్యామలను కాదనాలని హింస పెట్టటం తప్ప ఆ సంబంధం కాదనటానికి కారణమే లేదని వివరించింది. శ్యామల ప్రవర్తనను లభించిన స్వేఛ్ఛను ధైర్యంగా వినియోగించుకొనటంగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా అంత ధైర్యంగానూ పెద్దలకు చెప్పగలిగిన వ్యక్తిత్వంగా ఆమె అర్ధం చేసుకొన్నది. 

          పెళ్ళి విషయంలో స్వీయానిర్ణయానికి కట్టుబడిన శ్యామల, మురహరి మాత్రమే కాదు, వ్యక్తుల అభిప్రాయాలను, స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవించే ప్రజాస్వామిక సంస్కృతిని వ్యక్తిత్వంలో భాగం చేసుకొన్న చిన్నన్న, చిన్నవదిన కూడా ఆధునిక మవుతున్న కొత్త తరం మనుషులు. అదే సమయంలో కుటుంబ సంబంధాలను మానవీయంగా నిర్మించుకొనటం, నిలుపుకొనటం కూడా వాళ్ళ ఆకాంక్ష. శ్యామల పెళ్ళి విషయంలో బాధ్యత అంతా చిన్నకొడుకు కోడలు మీద పెట్టేసాడు తండ్రి. పెద్ద కొడుకుకు , కోడలికి ఆ పెళ్ళి ఇష్టం లేనిది కనుక తామెవ్వరం రామని చెప్పాడు. కోరిన వాడిని పెళ్ళి చేసుకొనటం ఎంత ఆనందంగా ఉందో శ్యామలకు తల్లీ తండ్రీ పెద్దన్న పెద్దవదిన రాక పోవటం అంత దుఃఖకరంగానూ ఉంది. ఈ ప్రతిష్టంభనను తొలగించ టానికి చిన్నన్న పన్నిన వ్యూహం పెళ్ళికొడుకుని తీసుకొని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళటం. శ్యామల మీరు లేకుండా పెళ్లి చేసుకోనన్నది .. పెళ్ళికొడుకు స్వయంగా పిలవటానికి వచ్చాడని…చెప్పటంతో గడ్డకట్టిన మనసులు కరగటం … పెద్దకొడుకు , కోడలు వెళదామన్న ఉత్సాహం చూపించాక అందరూ బయలుదేరటం … ఇదీ ఈ నవలకు అందమైన ముగింపు. 

           1960 వ దశకపు రామలక్ష్మి నవలలు ఒక రకంగా స్వంత వ్యక్తిత్వంతో స్వయం నిర్ణయాధికారంతో నిటారుగా తలెత్తి నిల్చునే ఆధునిక మహిళ రూపొందుతున్న క్రమాన్నిదృశ్యాదృశ్యంగా చూపిస్తాయి.

*****

(ఇంకా వుంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.