వ్యాధితో పోరాటం-16

కనకదుర్గ

          రోజూ చైతన్య స్కూల్ కి, శ్రీని ఆఫీస్ కి వెళ్ళేలోగా అన్నీ పనులు చేసుకుని రిలాక్స్ అయ్యేదాన్ని. వాళ్ళు వెళ్ళేలోపే స్నానం చేసి, ఏదైనా తినేసి టీ.వి పెట్టుకుని కూర్చునే దాన్ని. మధ్యాహ్నం శ్రీని ఆఫీస్ నుండి లంచ్ టైమ్ లో వచ్చి తినడానికి చాలా హెల్తీ తిండి చేసి పెట్టేవాడు. తను కూడా లంచ్ చేసి వెళ్ళేవాడు. నాకు పనంతా శ్రీని పైనే పడినందుకు చాలా బాధగా వుండేది. కానీ డాక్టర్స్ చెప్పింది విని జాగ్రత్తగా వుంటే పాప ఆరోగ్యంగా పుడితే అంతే చాలు అనుకునేదాన్ని. కూర్చునే చోటే కూరలు తరగడం చేస్తాననే దాన్ని, చైతు, శ్రీని ఇద్దరూ వద్దని గొడవ పెట్టేవారు.

          చైతన్య కోసం లైబ్రరీ నుండి తెచ్చిన పిల్లల పుస్తకాలే చదివేదాన్ని, సరదాగా వుండేవి. ఇండియన్ షాప్ నుండి హిందీ కామెడీ సినిమాలు తీసుకొచ్చి పెట్టేవాడు శ్రీని. అవి మధ్యాహ్నం చూసేదాన్ని. ఒకోసారి సగం చూసి మళ్ళీ మర్నాడు మిగతాది చూసే దాన్ని. చైతువచ్చే లోపల కాసేపు పడుకునేదాన్ని. కళ్ళు మూసుకుంటే చాలు చిన్నప్పుడు అక్కా, తమ్ముడు, ఫ్రెండ్స్ తో ఆడుకున్న ఆటలే గుర్తొస్తూ వుండేవి. అమ్మా, నాన్నతో అందరం కలిసి సినిమాలకు వెళ్ళడం, ఎగ్జిబిషన్ కి వెళ్ళడం, ఎండాకాలం మధ్యాహ్నం పూట ఇంట్లోనే వుండి క్యారమ్ బోర్డ్ ఆడుకోవడం, పచ్చీసి, అష్టాచెమ్మా, చింతపిక్కల ఆట ఆడుకోవడం, గచ్చకాయలాట, వామనగుంటలాట ఎంత సేపయినా ఆడుతూనే వుండేవారం.

          ఆదివారం మధ్యాహ్నం అమ్మా, నాన్న, అక్కా, చింటూ, నేను కలసి ఆడేవారం. అది నలుగురు కలిసి ఆడే ఆట కాబట్టి కొన్ని గేమ్స్ అక్కా, చింటూ కొన్ని గేమ్స్, ఆ తర్వాత నేను కొన్ని గేమ్స్ ఆడేవాళ్ళం. చింటూ ఎపుడూ వాడే గెలవాలని అనేవాడు. అమ్మకి సరిగ్గా ఆడటం వచ్చేది కాదు ముందు. ఎపుడయినా వాడు, అమ్మ కలిసి ఆడాల్సి వస్తే ఓడిపోతామేమోనని అమ్మకి కాయిన్ ని ఎలా కొట్టాలో, స్ట్రయికర్ ఎక్కడ పెట్టి కొట్టాలో చెప్పేవాడు. గెలిస్తే చాలా సంతోషం, ఓడిపోతే చాలా గొడవ చేసేవాడు. వాడు అందరి కంటే చిన్నవాడు, చాలా ముద్దుగా వుండేవాడు అందుకని వాడిని ఎవ్వరూ ఏమి అనేవారు కాదు. అపుడు అసలు భోర్ కొట్టటం అంటే ఏమిటో తెలిసేది కాదు.

          దసరా సెలవులైనా, ఎండాకాలం సెలవయినా విపరీతంగా ఆడుకునేవారం. క్రికెట్ ఆడేవాళ్ళం, ఇందులో కూడా ఎపుడూ చింటూ బ్యాటింగ్ చేయాలని గోల పెట్టేవాడు. ఇంకొక బాల్ కొట్టాక ఇస్తాను అనేవాడు, మళ్ళీ ఇంకో బాల్, ఇంకో బాల్ అని సాగదీసే వాడు.  గోళీలు ఆడేవాళ్ళం, గోళీలు ఎక్కువ వస్తే అవి ఎన్ని సార్లో లెక్కపెట్టుకుని మురిసి పోయే వాళ్ళం. పిల్లలందరం కలిసి డొప్పాఅని ఆట ఆడేవాళ్ళం, ఒకరు 100 దాక లెక్కపెట్టి ఒక ఆకు తెంపుకురావాలి, ఈ లోపు మిగతావారంతా ఒకో చోట దాక్కోవాలి, కానీ పిల్లలంతా కలిసి ఒకే చోట దాక్కొని ఆకు తీసుకుని వెదకడానికి వచ్చే అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ అందరూ కల్సి ఒకటే సారి ’డొప్పా’ అని మళ్ళీ మళ్ళీపంపించేవారం. ఆ అమ్మాయికో, అబ్బాయికో విసుగొచ్చి నేనిక ఆడనంటే అపుడు వేరే వాళ్ళని పంపించే వారు. కుంటుడాట కూడా ఆడే వాళ్ళం.

          ఎంత సేపు ఆటలాడినా ఇంకా ఆడాలనే వుండేది. మా ఇంటి ముందర ఇల్లు ఖాళీ అయ్యాక కొన్ని మార్పులు చేయించడానికి ఇసక తెప్పించి పక్కకి పోసారు. పని చేసే వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోయాక పిల్లలందరం ఆ యింటి గోడ మీద ఎక్కి ఆ ఇసకలో దూకి ఎవ్వరు ఎంత దూరం దూకుతారో వాళ్ళు గెలిచినట్టు. ఇంటికొచ్చి స్నానాలు చేసేవారం.

          రాత్రి వెన్నెట్లో కూడా ఆటలే మళ్ళీ, లేదా బోంచేసి వచ్చి అందరం గుంపులు గుంపులుగా విడిపోయి సినిమా కథలు చెప్పుకోవడం, లేదా కబుర్లు చెప్పుకోవడం ఇంట్లోని పెద్దవాళ్ళు కూడా గేట్ల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఏ చీకూ చింతా లేని హాయిగా సాగిపోయిన బాల్యం.

          బెడ్ రెస్ట్ పై వున్నపుడు ఇవన్నీ చాలా గుర్తొచ్చేవి ఇవ్వన్నీ. అలాంటి బాల్యం నుండి, ఎంతో సింపుల్ గా పెరిగిన మధ్య తరగతి జీవితం ఎంత బాగుండేది. పుట్టిన రోజులు, పండగలు, పబ్బాలు, ప్రతీదీ సంతోషంగా అనిపించేవి.

          ఒకరోజు మధ్యహ్నం పడుకున్నపుడు కాంతం ఫోన్ చేసింది. కుశల ప్రశ్నల తర్వాత కాంతం మెల్లిగా తన సహజ ప్రవృత్తిని బయట పెట్టటం మొదలు పెట్టింది.

          “అవును, దుర్గా, వంట ఎవరు చేస్తున్నారు?”

          “ఇంకెవరు, శ్రీని చేస్తున్నాడు.”

          “మరి లాండ్రీ, షాపింగ్, క్లీనింగ్, అన్నీ తనే చేసుకుంటున్నాడా?”

          “చైతు కూడా సాయం చేస్తాడు. ఎందుకు?”

          “అమ్మో, నువ్వెలా శ్రీనితో అన్ని పనులు చేయించుకుంటావో తల్లి. నేనలా చేయించుకోలేను తెల్సా!”

          “మరి ఇక్కడ ఎవ్వరు లేరు కదా, కాంతం, బెడ్ రెస్ట్ పైన వున్నపుడు మరి నేను పని చేయకూడదు. అందుకని, తండ్రి, కొడుకు కల్సి చేసుకుంటున్నారు. నాకూ బాధగానే వుంది, వాళ్ళతో పని చేయించుకుంటున్నందుకు, కానీ ఏం చేయను చెప్పు. పాప హెల్తీగా పుట్టాలంటే, నేనూ డెలివరీ అయ్యే వరకు హాస్పిటల్ కి వెళ్ళకుండా వుండాలంటే మరి డాక్టర్లు చెప్పినట్టు చేయాలి కదా!” అన్నాను, నాకూ చాలా బాధగా అనిపించింది. తనకి డెలివరీ అయ్యి పాప 4 పౌండ్లు పుడితే నేనే ఆరోగ్యకరమైన తిండి తీసుకెళ్ళి ఇచ్చి పాపని కాసేపు ఎత్తుకుని కూర్చొని వచ్చేదాన్ని. ఆమె భర్త పాప పుట్టిన సంతోషంలో అన్నిపనులు చేసేవాడు. ఈవిడేమో ఇండియాకెళ్ళ లేదని అక్కడైతే బాబు పుట్టినపుడు తల్లి ఎలా కారం పొళ్ళు అవి చేసి పెట్టేది, తనని ఎలా ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదని తల్చు కుని, తల్చుకుని ఏడుస్తూ ఉండేది. అదీ కాక గర్భవతిగా ఉన్నపుడు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేది కాదు, తినాలనిపించడం లేదని రోజు పచ్చడి మెతుకులే తినేది. ఆయన పళ్ళు, పళ్ళరసాలు, స్వీట్స్ అన్ని తెచ్చిపెట్టేవాడు. ఇద్దరికీ అంతగా పడేది కాదు.

          ఆయన తను చెప్పినట్టు వినాలని ఆమె కోరిక, ఆయన తన పని, టీ.వి ఎపుడైనా ఫ్రెండ్స్ తో కలిసి టెన్నిస్ ఆడడం అంతే. కానీ ఆమె గర్భవతవ్వగానే చాలా సంతోషించి బాగానే చూసుకోవడానికి ప్రయత్నించేవాడు కానీ ఆమె తన వాళ్ళని తలుచుకునిఏడుస్తూ ఉండేది.

          ఇపుడు నా మీద అటాక్ చేస్తున్నది.

          “అయినా నాకు బెడ్ రెస్ట్ అని చెప్పినా ఆయన ఆఫీస్ కెళ్ళగానే ఏదో ఒక పని చేసే దాన్ని. నీలా వుండడం నా వల్ల కాదమ్మా! దుర్గా, నీకేదైనా అవసరమైతే ఫోన్ చెయ్యమని మా ఆయన చెప్పమన్నారు.” అని ఫోన్ పెట్టేసింది. అవును మరి మీరు వచ్చి నప్పట్నుండి మీకు ఏ సాయం కావలన్నా శ్రీని, నేను చేసేవాళ్ళం, నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోలేదు పర్వాలేదు అనుకున్నాను.

          ఆ తర్వాత నిద్ర పట్టలేదు. నేను అన్ని పనులు శ్రీని తో చేయించుకుంటున్నానా?  శ్రీని ఆఫీస్ నుండి వచ్చాక ఇక్కడ సూపర్ మార్కెట్ కెళ్ళి, కూరలు, సరుకులు, చైతన్యకి ఎపుడైనా బొమ్మలు కొనుక్కొచ్చేవాళ్ళం. తర్వాత తర్వాత, తనే ఆఫీస్ నుండి వచ్చేపుడు తీసుకుని వచ్చేసేవాడు. మిగతా ఆడవాళ్ళు భర్తలు ఆఫీసులకి వెళ్ళాక వీళ్ళంతా కలిసి వెళ్ళి షాపింగ్ లు చేసుకుని వచ్చేవాళ్ళు. నేనేందుకు వెళ్ళలేదో నాకు తెలియదు. ఇండియాలో కూడా శ్రీనియే అన్ని తీసుకొచ్చేవాడు. ఒకోసారి అనిపించేది నేనెందుకు వెళ్ళి తెచ్చుకోవడం లేదు అలా అయితే నాకూ అన్నీ తెలుస్తాయి కదా అని. ఏమో అలా శ్రీని మీద ఆధారపడడం అలవాటయి పోయినట్టుంది.

          ఇపుడు అవసరం పడింది కాబట్టి అన్ని పనులు చేసుకుంటున్నాడు. అది కూడా ఇపుడు నేను ఏమీ చేయకూడదు కాబట్టి చేస్తున్నాడు. లేకపోతే బయటి నుండి సరుకులు తేవడం తన పనే, వీకెండ్లోనే అపుడపుడు చైతుకిష్టమయిన ఐటమ్స్ వండేవాడు. సోమవారం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది.  క్లీనింగ్ అంతగా చేసేవాడు కాదు. నిజంగా నేను శ్రీనిని అంతగా పీక్కు తింటున్నానా? ఇద్దరిలో ఒకరికి జబ్బు చేస్తే, ఒంట్లో బాగా లేకపోతే మరొకరు చేయడం మామూలే కదా! మా చిన్నపుడు అమ్మకి ఒంట్లో బాగాలేక పోతే మా మేనత్తలు వచ్చి మమ్మల్ని చూసుకునేవారు, వంట పని, ఇంటి పని అన్నీ చేసుకునేవారు. మాకు కథలు చెప్పేవారు. పిండి వంటలు చేసిపెట్టేవారు. మరి మేము దేశం కాని దేశంలో ఉన్నాము. ఇండియా నుండి ఎవ్వరూ వచ్చేలా లేరు.

          నాకు రెస్ట్ లెస్ గా అవ్వడం మొదలు పెట్టింది. టైం చూసాను, ఒంటి గంట అయ్యింది. శ్రీని 12 గంటలకు వచ్చి వెళ్ళాడు. మెల్లిగా లేచి ఫ్రిడ్జ్ తీసి, కూరలు కొన్ని తీసి, కడిగి, తరగడానికి కూర్చున్నాను. నాలుగు రకాల కూరలు తరిగి, రెండు రకాల కూరలు ఫ్రిజ్ లో పెట్టి, మరో రెండు రకాల కూరలు స్టవ్ దగ్గర నిలబడి చేసింది. అవి కొద్దిగా చల్లారాక తీసిపెట్టి, క్లీనింగ్ చేసి పడుకుంది చైతువచ్చే వరకు. మళ్ళీ ఎందుకు చేసావని గొడవ పెడ్తారని. ఇలా పడుకున్నానో లేదో ఆ రోజు వరకు నొప్పులు రావడం కంట్రోల్ లో వుండింది కానీ పని చేయడం వల్లేమో సడన్ గా నొప్పులు ఎక్కువవ్వడం మొదలుపెట్టాయి. అది మానిటర్ ద్వారా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఆమె కాల్ చేయడం, “పొద్దున బాగానే వుంది ఇపుడేమయింది సడన్ గా, లేచి ఏమయినా పనులు చేసావా? పని చేయకూడదని చెప్పాము కదా.” అని అన్నది డా. ఆన్నా.

          చైతు బట్టలు మార్చుకుని వచ్చాడు బయటికి.

          “ఈ రోజు కొద్దిగా పని చేసా….”

          “ఆర్యూ క్రేజీ? డోంట్ యూ అండర్ స్టాండ్ వాట్వియ్ ఆర్ ట్రయింగ్ టు సే…. ఇది ఎంత డేంజరస్ అవుతుందో తెలుసా?  వెంటనే ఎక్స్ ట్రా బూస్టర్ షాట్ తీసుకో, ఇపుడే..”

          “ఓకే,” అని ఫోన్ పక్కకు పెట్టి బ్రెధిన్ పంప్ ద్వారా బూస్టర్ షాట్ తీసుకున్నాను. అది తీసుకోగానే వొళ్ళంతా మంటగా అనిపిస్తుంది కాసేపు.

*****

(సశేషం)

Please follow and like us:

2 thoughts on “వ్యాధితో పోరాటం- 16”

    1. Thanks, Padmavathi Rambhakta garu! I’m writing what I really went through in life. Thanks for reading, I appreciate it!.

Leave a Reply

Your email address will not be published.