కనక నారాయణీయం -45

పుట్టపర్తి నాగపద్మిని

అమ్మరో కౌసల్య! అతివ సుకుమారియగు,

ఇమ్మహీజాత గైకొమ్మ వేవేగ

సమ్మతిని నీ సుతను సమముగా జూతువని

నమ్మి మదిలోన మా యమ్మనొప్పించితిని..అమ్మరో కౌసల్య…

          ఇలా పల్లవి వ్రాసుకున్న తరువాత, చరణాల కోసం కలం ఆగింది. ఇంతలో తరులత వచ్చింది బుంగమూతి పెట్టుకుని, ‘అమ్మా!!జడవేయమ్మా!! తలంటావు కదా!! బాగా చిక్కు పడింది. వేసుకోవటం రావటం లేదు. అక్కయ్య కసురుకుంది వేయమంటే!!’ అంటూ !!

          కనకమ్మ ‘ఇలారా!!’ అంటూ పిలిచి లాలనగా తలమీద ముద్దు పెట్టుకుని, జడ వేయటం మొదలెట్టింది. ఆలోచనలు సాగుతున్నాయి.

          ‘కరుణాదేవికి కాస్త తెలిసే వయస్సే కాబట్టి అత్తగారింట్లో సర్దుకుపోతుందనే అనిపిస్తూ ఉంది. ఈమెకింకా తీరామారా పద్ధెనిమిదే!! పెళ్ళి ఇంత తొందరగా కుదురు తుందనే తెలియదు. మంచే జరిగింది ఒక విధంగా!! కానీ ఇలా జడ వేసుకోవటం కూడా సరిగ్గా రాని పిల్ల అత్తగారింట్లో సర్దుకుపోవటమెలా చేస్తుందో?’ ఆలోచనలు ఆగటం లేదు. ఆ మాతృహృదయం, పెళ్ళి కుదిరినందుకు ఆనందించాలో, యీ వయసులో పరాయి ఇంటికి వెళ్ళిన చిన్నారి ఎలా నిర్వహించుకోగలదో!! అని తల్లడిల్లిపోతోంది కానీ, తన పెళ్ళినాటికి, కేవలం తనకు పదునాలుగేళ్ళే  అన్న సంగతి కూడా గుర్తుకు రాలేదు!! అదే సృష్టి  విచిత్రం!!

          అనుకోకుండా యీ సంగతి కూడా ఆమె మనసులో మెదిలి పెదవులమీద దరహాసం మెరిసింది. ‘సంసార సాగరంలో మునిగాక ఈత అదంతకదే వచ్చి తీరుతుందేమో!! ఆ రోజులు గుర్తుకు వస్తే తనేనా యీ సంసారాన్ని యీదింది? అనిపిస్తుందిప్పుడు!!  తనకసలు వంటే రాదు. ఈయనకు వంట గురించి ధ్యాసే లేదు కాబట్టి సరిపోయింది. ఎంతసేపూ తనకు వచ్చిన మటిక్కాయ కూర (గోరుచిక్కుడు కూర) చారుల తో రెండేళ్ళు గడిచాయి. వంటల గురించి పట్టింపు లేకున్నా, తనతో ఇంటికి వచ్చే తన విద్యార్థులకు పునశ్చరణ చేయించటం, తాను చెప్పే కావ్య పాఠాలను శ్రద్ధగా వినటమే ఆయనకు కావలసింది. పైగా ఎప్పుడూ సరస్వతీ సమర్చనమే!! మాట్లాడుకోవటమూ తక్కువే!!అమ్మ శేషమ్మ దగ్గరుంది కాబట్టి ప్రతి అవసరానికీ ఆదుకునేది. మరి వీళ్ళ సంగతో!! ఫిబ్రవరి 2 కరుణ పెళ్ళి. ఏప్రిల్ 15న తరులత పెళ్ళి. పెళ్ళిళ్ళ తరువాత కరుణ కర్నూలుకు, తరులత హంపీ కామలాపురానికీ వెళ్ళాలి. ఏ అవసరమొచ్చినా ఉత్తరాలు, టెలిగ్రాములే గతి. ఎంత లేదన్నా నాలుగైదు రోజులు పడుతుంది వెళ్ళటానికి!! ఎలా సర్దుకుపోగలరో ఏమో!! కరుణాదేవికిప్పుడు 21 సంవత్సరాలు. డిగ్రీ పూర్తై ఉంటే బాగుండునని ఆమె ఆరాటం. కానీ మంచి సంబంధాన్ని పోగొట్టుకోవటమంటే మాటలా?? ఈయనకు యీ పెళ్ళి వ్యవహరాలలో ఆసక్తి అంతంత మాత్రమే!! తరులతకిప్పుడు 18 వెళ్ళి 19 నడుస్తూ వుంది. ఆమెకు చదువు మీద అంత ధ్యాసలేదు. సంగీతం శ్రుతి శుద్ధంగా తీయగా పాడు తుంది. మాట నెమ్మది. అదీకాక ఆ ఇల్లు సమిష్టి కుటుంబం. కాబోయే వియ్యంకుల వారి అన్నయ్యకూ ఇద్దరు పెళ్ళైన కొడుకులున్నారు. కాబట్టి ఇంట్లో తరులత యీడు తోడి కోడళ్ళున్నారు. వాళ్ళతో కలిసిపోతే సరి. వాళ్ళే చూసుకుంటారీమెను!!’

          మరో  వైపు కూడా ఆలోచనలు పరుగులు తీశాయి – తరులత జడ అల్లికతో పాటూ!! ‘ వెనుకటి రోజుల్లో ఆడపిల్ల పుట్టినప్పటి నుండే పరాయి ఇంటికి వెళ్ళవలసి వుంటుందనే భావనే ఉండేదేమో!! ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బరువు దించుకోవటమే లక్ష్యం తల్లిదండ్రులకు!! వివాహ వ్యవస్థ పునాదులు చాలా గట్టివి. భార్యా భర్తల భద్రతాయుత సాంసారిక జీవన ఫలితమైన సంతానాన్నికూడా  భారతీయ సంస్కృతీ,సంప్రదాయాలకు అనుగుణంగా ఆడ మగ పిల్లలనిద్దరినీ పెంచే గురుతరమైన బాధ్యతను పోషించటం – ఆనువంశికంగా వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని సమర్థవంతంగ పోషించి, సమాజానికి బాధ్యతాయుత పౌరులనందించటమే – వివాహ వ్యవస్థ నిర్వచనం. స్వేఛ్ఛా జీవనం – స్త్రీపురుషులిరువురి జీవితాలకీ తద్వారా సమాజానికీ కూడా ప్రశ్నార్థకాలుగానే నిలుస్తా యని కూడా సంకేతాలు లభిస్తాయి. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇంటింటి రామాయణ మన్న తీరుగా, ప్రతి ఇంటిలోనూ యీ పెళ్ళిళ్ళ ముచ్చటలూ కోకొల్లలు. ముప్పు తిప్పలూ పడి ముచ్చటైన సంబంధం కుదిర్చినా ఆ తరువాత రకరకాల కారణాల వల్ల కడగండ్ల పాలయ్యే ఆడపిల్లల జీవితాలు ఆయా తల్లిదండ్రుల పాలిటి అగ్ని గుండాలు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే సమాధానం దొరకటం కష్టం. ఇదే జీవిత రహస్యం!!’ అని వేదాంత ధోరణిలో పడిపోయిందామె!!

          ఈ వేదాంత ధోరణిలోనే, మొత్తానికి తరులత జడ అల్లటమూ, ఆమె అక్కయ్య దగ్గరికి వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. ఇపుడు మళ్ళీ జనక పత్ని తల్లి హృదయం, కనకమ్మ కళ్ళ ముందు నిలబడి, పాట విషయం గుర్తు చేసింది. మనసులో తారట్లాడిన భావాలు, అక్షర రూపాన్ని దాల్చాయి!! ప్రస్తుత పరిస్థితికిఅనుగుణంగా పాట దానంతటదే ఊపిరి పోసుకుంది – ఇలా!! 

మా ఇంటిలో వెలుగు మా కంటిలో పాప

మాదు హృత్పేటికను మలయు రత్నమ్ము

మా మనోరథ ఫలము మా వంశ గౌరవము

మీ ఇంటికంపెదము, నెలతరో కోడలిగ..అమ్మరో..

 

తొలి జాముననెలేచి ఇలు దీర్చి పెద్దలకు

తలవంచి యువినీత లలితగతుల

పులుగడుగు ముత్తెమై పుట్టువెరుగని సీత

                            

తలలోని నాల్క వలె మెలగు మీ ఇంటనని..అమ్మరో.

ఆడుబిడ్డలతోను అలరించెడు విధమ్ము

ఈడు వారల గూడి యాడు విధముతోని

వాడవారల తోను తోడుగా నగు విధము  

ఈడులేని విధాన నేర్పించినానమ్మ..అమ్మరో..

పసితనపు చాపలము వశముగానేమైన

కసటు మాటలు బల్క కష్టపడబోకు

పసిబాలికయె గాని, పడతీ! ప్రౌఢాంగనా!!

వశవాక్కు గాదమ్మ దొసగులను మన్నించి..అమ్మరో..

          ఈ పాటలో, అత్తమామలతోనూ, ఆడపడుచులతోనూ, బావ మరదులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ తలలో నాలుక వలె కలిసి పోయే విధానాన్ని ‘ఈడు లేని విధాన ..’ నేర్పించానంటుందా తల్లి. ఇంత చేసినా, ఏదో చిన్నతనం మూలాన ఒకవేళ తప్పు చేస్తే, కన్నతల్లి వలె క్షమించి అక్కున చేర్చుకోవలె నీవే.. నా కుమార్తెను నీ చేతుల్లో పెడు తున్నాను. ఎన్నేళ్ళు పెంచినా, ఎన్ని గోములు పడినా, కన్నవారింటి నుండీ, మెట్టినింట అడుగు పెట్టవలసిందే కాబట్టి, మా కంటి యీ వెలుగు మీ ఇంటి దీపంగాపంపుతున్నాము. ఆదరించమ్మా..’ అన్న మాతృహృదయపు ఆర్ద్రతను దాదాపు పది చరణాలలో హృద్యం గా పాటగా మలచారు కనకమ్మ గారు.

          ఆమెలో ఒక విశిష్ట గుణముంది. పాట వ్రాస్తున్నప్పుడే దానికొక రాగం, తాళమూ  సమకూడిపోతాయి. ఇంట్లో భర్త, పిల్లల సంగీత సాధనల ప్రభావం శ్రోతగా ఆమెమీద బాగా పడిందనే చెప్పాలి. పట్టుదలగా తానూ నేర్చుకున్నది లేదు కానీ, ఇలా వింటూ ఉంటే, సంగీతమే ఆమెను వరించిందనవచ్చును. ఈ పాటను వ్రాస్తున్నప్పుడే పంతువరాళి  రాగ చాయలో పల్లవి చరణాలు ఊపిరి పోసుకున్నాయి. ఎన్నగాను రామ భజన, అప్ప రామ భక్తి ఎంతో గొప్పరా వంటి కీర్తనలలోని ఆర్ద్రత, ఆ రాగ ప్రభావమే!! తమ రచనకుఅనువైన రాగం ఏదో గుర్తించి దానిలో తన భావాలను పలికించినప్పుడే శ్రోత, లేదా పాఠకుడి మనసులోనూ  తన భావానికి అనుగుణమైన స్పందన వస్తుందన్నది  సంగీతజగమెరిగిన సత్యం. అందుకే త్యాగరాజాదుల కీర్తనలు అజరామరాలయ్యాయని కనకమ్మ ప్రగాఢ విశ్వాసం. 

***

          పుట్టపర్తి వంటి కింది తరగతి కుటుంబీకుల ఇళ్ళళ్ళో వివాహాది శుభ కార్యాలు కుదరటం మొదలు పూర్తయ్యేదాకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎంతగా అందోళన చెందట ముంటుందో కేవలం అనుభవైక వేద్యం. తీరా ఆ కార్యాలన్నీ సవ్యంగా జరిగిపోయాయో, ఇక ఆ ఆనందం బ్రహ్మనందానికి కాస్త చేరువలో ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఫిబ్రవరిలో కరుణాదేవి పెళ్ళీ, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఆనందకర వాతావరణంలో జరిగి పోయింది. ఆడపిల్ల అప్పగింతల సమయంలో కనకమ్మ తల్లిగారు శేషమ్మ, చెల్లెళ్ళు అల మేలమ్మ, విమలమ్మలు సంప్రదాయ పెళ్ళిపాటలు బోలెడు పాడారు. అన్నిటికన్నా ముఖ్యంగా కనకమ్మ వ్రాసిన అప్పగింతల పాట పాడుతూ ఉంటే కన్నీరు నిండని హృదయం లేదేమో!!  కారణం, అన్ని ఇళ్ళల్లొనూ యీ సందర్భం ఉండనే ఉంటుంది కదా!!  పాట వింటూ పుట్టపర్తికి కూడా కళ్ళు కన్నీటి చెరువులయ్యాయి. కనకమ్మ రచనే అని తెలిసి, మెచ్చుకోలుగా ఆమె వైపు చూసిన చూపుకే ఆ ఇల్లాలి మనసు పులకాంకురిత మైంది. అప్పటి కాలంలో భార్యా భర్తల ప్రేమలు,కేవల భావగర్భితాలే !! అప్పగింతల కంటూ పాటలేవీ అందుబాటులో లేని కారణంతో యీ పాటనే  పాడటం, అందరి నుంచీ, ప్రశంసలూ దక్కటం కనకమ్మకూ ఎంతో తృప్తినిచ్చిన విషయం. 

          పెళ్ళి తరువాత రంగయ్య సత్రంలో పనులన్నీ చక్కబెట్టుకున్న తరువాత, కడపకు వెళ్ళిపోవాలి. కానీ, బాగా పొద్దుపోవటం వల్ల బస్సులు దొరకవు. ఒక వాన్ లో తక్కిన వాళ్ళూ, పెళ్ళికూతురూ పెళ్ళికొడుకూ, పుట్టపర్తి దంపతులు  వెళ్ళటానికి కారును  ఒకదాన్ని తీసుకుని వచ్చాడు సుబ్రమణ్యం. కారులో పుట్టపర్తి దంపతులూ, కొత్త పెళ్ళి జంట కూర్చున్నారు. గట్టిగా మాట్లాడితే ప్రొద్దుటూరు నుండీ కడపకు మూడు గంటల ప్రయాణమే!! రాత్రి 11.30 కల్లా ఇంటికి వెళ్ళిపోవటమే కదా!! అని ధైర్యం!!

          ముందు వాన్, వెనుక కారూ రోడ్డెక్కాయి. 

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.